Saturday, February 25, 2023

శ్రీ మద్భగవద్గీత, ఉపనిషత్తుల సారాంశమే శ్రీ సాయి సత్ చరిత్ర –16 వ.భాగమ్

 


26.02.2023 ఆదివారమ్

ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

ఓమ్ శ్రీ గణేశాయనమః

శ్రీ మాత్రేనమః


ఓమ్ శ్రీ సాయినాధాయనమః

శ్రీకృష్ణపరబ్రహ్మణేనమః


శ్రీ మద్భగవద్గీత, ఉపనిషత్తుల సారాంశమే శ్రీ సాయి సత్ చరిత్ర –16 వ.భాగమ్

ప్రేరణ ;  గీతాచార్యుడు శ్రీ కృష్ణపరమాత్మ, మరియు సాయినాధులవారు

ప్రేరణా స్థలమ్ … శ్రీ వేణుగోపాలస్వామి ఆలయమ్

సమన్వయ కర్త  ;  ఆత్రేయపురపు త్యాగరాజు

నిజాంపేట్, హైదరాబాద్

ఫోన్.  9440375411  &  8143626744వ.

శ్రీమద్భగవద్గీత – అధ్యాయమ్ – 7 – జ్ణాన – విజ్ణానయోగము

శ్లోకమ్ – 21



యో యో యాం యాం తనుం భక్తః శ్రధ్ధయార్చితుమిఛ్చతి

తస్య తస్యాచలాం శ్రధ్ధాం తామేవ విదధామ్యహమ్

సకామ భక్తుడు ఏయే దేవతా వ్వరూపములను భక్తిశ్రధ్ధలతో పూజింప నిశ్చయించుకొనునో, ఆ భక్తునకు ఆయా దేవతలయందే భక్తిశ్రధ్ధలను స్థిరముగా కుదురుకొనునట్లు చేయుదును.

శ్రీ సాయి సత్ చరిత్ర – అద్యాయం – 11

డాక్టరు పండితుని పూజ

తాత్యాసాహెబ్ నూల్కర్ మిత్రుడయిన డాక్టర్ పండిత్ ఒకసారి బాబా దర్శనం కోసం షిరిడీకి వచ్చాడు. బాబాకు నమస్కరించిన పిమ్మట మసీదులో కొంతసేపు కూర్చున్నాడు.  అతనిని దాదాభట్ కేల్కర్ వద్దకు పొమ్మని బాబా చెప్పారు.  డాక్టర్ పండిత్ బాబా చెప్పినట్లుగానే దాదాభట్ వద్దకు వెళ్ళాడు.  దాదాభట్ అతనిని  సగౌరవముగా ఆహ్వానించాడు.

బాబాను పూజించటానికి పూజాసామగ్రి పళ్ళెంతో దాదాభట్ మసీదుకు వచ్చాడు.  డాక్టర్ పండిత్ కూడా అతనితో కూడా మసీదుకు వచ్చాడు.  దాదాభట్ బాబాను పూజించాడు.  అంతకుమునుపెవ్వరును బాబా నుదుటిపై చందనము పూయుటకు సాహసించలేదు.  ఒక్క మహల్సాపతి మాత్రమే బాబా కంఠమునకు చందనము పూస్తూ ఉండేవాడు.  కాని అమాయక భక్తుడగు డాక్టర్ పండిత్ దాదాభట్ యొక్క పూజాపళ్ళెమునుండి చందనము తీసి బాబా నుదుటిపై త్రిపుండ్రాకారముగా వ్రాసాడు.  

అందరికి ఆశ్ఛర్యము కలుగునట్లు బాబా ఒక్క మాటయిననూ అనకుండా ఊరుకున్నారు.  ఆనాడు సాయంకాలము దాదాభట్ బాబాను ఇట్లడిగాడు.  “బాబా మేమెవరమయినా మీనుదుటిపై చందనము పూస్తామంటే నిరాకరించేవారు కదా?  డాక్టర్ పండిత్ వ్రాయగా ఈనాడేల ఊరకుంటిరి?”  అందులకు బాబా ప్రసన్నముగా ఇట్లు సమాధానమిచ్చారు.  “నేనొక ముసల్మానుననీ, తానొక సద్మ్రాహ్మడుననీ ఒక మహమ్మదీయుని పూజించినచో తాను మైలపడిపోవుదుననే దురభిమానము లేకుండా  అతడు నాలో తన గురువును భావించుకుని అట్లు చేసాడు.  అతని నిష్కల్మష భక్తి నన్ను కట్టిపడవేసినది.  అతనికి నేనెట్లు అడ్దు చెప్పగలను”  దాదాభట్ ఆతరువాత డాక్టర్ పండిత్ ని ప్రశ్నించగా అతడు  బాబాను తన గురువుగా భావించి, తన గురువునకు ఒనరించినట్లు బాబా నుదుటిపై త్రిపుండ్రమును వ్రాసితినని అన్నాడు.

గమనించారు కదా.  డాక్టర్ పండిత్ కి అతని గురువు మీద ఎంతో భక్తి ఉంది.  బాబా అతని గురువు మీద అతనికి ఉన్న నమ్మకాన్ని ధృఢపరుస్తూ అతనిలో ఉన్న భావానికి అనుగుణంగా పూజను స్వీకరించారు.

దీనికి సంబంధించిన సంఘటనలు ఇంకా ఉన్నాయి. అన్నీ వివరిస్తే విస్తారమవుతుందనే ఉద్దేశ్యంతో ఒక్కొక్కటే వివరిస్తాను)

(ఇంకా ఉంది)

(సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు, శ్రీ సాయినాధార్పణమస్తు)

No comments:

Post a Comment