Tuesday, April 4, 2023

శ్రీ మద్భగవద్గీత, ఉపనిషత్తుల సారాంశమే శ్రీ సాయి సత్ చరిత్ర –18 వ.భాగమ్

 



04.04.2023 మంగళవారమ్

ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

ఓమ్ శ్రీ గణేశాయనమః

శ్రీ మాత్రేనమః


ఓమ్ శ్రీ సాయినాధాయనమః

శ్రీకృష్ణపరబ్రహ్మణేనమః


శ్రీ మద్భగవద్గీత, ఉపనిషత్తుల సారాంశమే శ్రీ సాయి సత్ చరిత్ర –18 వ.భాగమ్

ప్రేరణ ;  గీతాచార్యుడు శ్రీ కృష్ణపరమాత్మ, మరియు సాయినాధులవారు

ప్రేరణా స్థలమ్ … శ్రీ వేణుగోపాలస్వామి ఆలయమ్

సమన్వయ కర్త  ;  ఆత్రేయపురపు త్యాగరాజు

నిజాంపేట్, హైదరాబాద్

ఫోన్.  9440375411  &  8143626744వ.

శ్రీమద్భగవద్గీత – అధ్యాయమ్ – 7 – జ్ణాన – విజ్ణానయోగము

శ్లోకమ్ 22

స తయా శ్రధ్ధయా యుక్తః తస్యారాధనమీహతే

లభతే చ తతః కామాన్ మయైవ విహితాన్ హి తాన్

అట్టి సకామ భక్తుడు తగిన భక్తిశ్రధ్ధలతో ఆ దేవతనే ఆరాధించును.  తత్పలితముగా నా అనుగ్రహము వలననే ఆ దేవతద్వారా ఆ భోగములను అతడు తప్పక పొందగలడు.


శ్రీ సాయి సత్ చరిత్ర అధ్యాయమ్ – 28

మేఘశ్యాముడు హరివినాయక సాఠేగారి వంటబ్రాహ్మణుడు.  అతడు అమాయకుడయిన శివభక్తుడు.  ఎల్లప్పుడు శివపంచాక్షరి జపిస్తూ ఉండేవాడు.  అతనికి సంధ్యావందనము గాని, గాయత్రి మంత్రము గాని తెలియదు.  సాఠేగారు అతనికి గాయత్రి మంత్రముతో సంధ్యావందనము నేర్పించారు. 


సాయిబాబా శివుని అవతారమని బోధించి షిరిడీకి ప్రయాణము చేయించారు.  స్టేషన్ వద్ద ఎవరో సాయిబాబా మహమ్మదీయుడని చెప్పగా, కంగారు పడి తనను అక్కడికి పంపవద్దని యజమానిని వేడుకొన్నాడు.  తన మామగారయిన దాదాకేల్కర్ కు పరిచయపుటుత్తరము వ్రాసి అతనిని షిర్డీకి పంపించారు.  మేఘశ్యాముడు మసీదులోకి అడుగు పెట్టగానే బాబా అతని మనసులోని సందేహాన్ని తెలుసుకుని అడుగుపెట్టనీయలేదు.  తన మనసులోని విషయములు బాబాకెట్లు తెలిసాయా అని ఆశ్చర్యపడ్డాడు మేఘశ్యాముడు.  కొద్ది రోజులు అక్కడే ఉండి తనకు తోచినట్లు బాబాను సేవించసాగాడు.  కాని అతనికి సంతృప్తి కలగలేదు.  ఆ తరువాత ఇంటికి పోయి అక్కడినుండి త్రయంబక్ వెళ్ళి అక్కడ ఒక సంవత్సరము ఆరు మాసములు ఉన్నాడు.  తిరిగి షిరిడీకి వచ్చాడు.  ఈ సారి దాదా కేల్కర్ కల్పించుకోవడం వల్ల బాబా అతనిని మసీదులో ప్రవేశించుటకు షిరిడీలో ఉండుటకు సమ్మతించారు.  మేఘశ్యామునకు బాబా ఉపదేశము చేయలేదు.  అతని మనస్సులోనే మార్పు కలుగచేయుచు చాలా మేలు చేసారు.  అప్పటినుండి అతడు సాయిబాబాను శివుని అవతారముగా భావించసాగాడు.  శివుని అర్చనకు బిల్వపత్రి కావాలి.  మేఘుడు ప్రతిరోజు మైళ్ళకొలది నడచి పత్రిని తెచ్చి బాబాను పూజిస్తూ ఉండేవాడు.  గ్రామంలో ఉన్న దేవతలనందరిని పూజించిన పిమ్మట మసీదుకు వచ్చి బాబా గద్దెకు నమస్కారం చేసుకున్న తరువాత బాబాను పూజిస్తూ ఉండేవాడు.  ఒకనాడు ఖండోబా మందిరం వాకిలి మూసి ఉండటం వల్ల ఖండోబా దేవుని పూజించకుండా మసీదుకు వచ్చాడు.  బాబా అతని పూజను అంగీకరింపక ఖండోబా వాకిలి తెఱచి ఉంది వెళ్ళమని తిరిగి పంపించేశారు.  మేఘశ్యాముడు మందిరానికి వెళ్లాడు. వాకిలి తెఱచి ఉండటంతో ఖండోబాను పూజించి తిరిగి వచ్చి బాబాను పూజించాడు.

ఒక మకర సంక్రాంతినాడు మేఘుడు బాబాను శివునిగా భావించుకుని, శివునికి అభిషేకమిష్టమని బాబాను గోమతీ నదీ తీర్ధముతో అభిషేకించాడు.

మేఘశ్యాముడు బాబాను రెండు చోట్ల పూజిస్తూ ఉండేవాడు.  మసీదులో స్వయంగా పూజిస్తూ వాడాలో నానా సాహెబ్ ఇచ్చిన పటాన్ని పూజిస్తూ ఉండేవాడు.

అతని భక్తికి మెచ్చిన బాబా అతనికి ఒకదృష్టాంతాన్ని చూపించారు.

ఒక వేకువఝామున మేఘుడు తన శయ్యపై పడుకుని ఉన్నాడు.  కళ్ళు మూసుకుని లోపల ధ్యానము చేసుకునే సమయంలో బాబా రూపాన్ని చూసాడు.  బాబా అతని మీద అక్షింతలు చల్లి “మేఘా త్రిశులాన్ని గీయి” అని చెప్పి అదృశ్యమయ్యారు.  మేఘుడు వెంటనే కళ్ళు తెఱచి చూశాడు.  బాబా కనిపించలేదు.  కాని అక్కడక్కడ అక్షింతలు పడి ఉండటం కనిపించింది.  ఆ తరువాత బాబా దగ్గరకు వెళ్ళి త్రిశులాన్ని గీయడానికి అనుమతి కోరాడు.  అపుడు బాబా “నామాటలు వినలేదా?  త్రిశూలాన్ని గీయమనే చెప్పాను.  అది వట్టి   దృశ్యము కాదు.  నేనే స్వయముగా వచ్చి చెప్పాను” అన్నారు.  అపుడు మేఘుడు “మీరు నన్ను లేపినట్లుగా భావించాను.  తలుపులన్నీ వేసి ఉండటం వల్ల అది దృశ్యమనుకొన్నాను” అన్నాడు. 

అపుడు బాబా “ప్రవేశించటానికి నాకు వాకిలి అవసరం లేదు.  నాకు రూపము లేదు.  నేనన్ని చోట్ల నివసించుచున్నాను” అని మేఘుడికి శివునిపై గల భక్తిని మరింత ధృఢపరిచారు.

వాడాకు తిరిగి వచ్చిన తరువాత మేఘుడు బాబా పటం దగ్గర గోడమీద త్రిశూలాన్ని గీసాడు.  మరుసటి రోజు ఒక రామదాసి భక్తుడు పూనానుంచి వచ్చి బాబాకు నమస్కరించి ఒక లింగాన్ని సమర్పించాడు.  అప్పుడే మేఘుడు కూడా అక్కడకు వచ్చాడు.  బాబా మేఘుడితో “చూడు శంకరుడు వచ్చాడు.  జాగ్రత్తగా పూజించుకో” అని ఆ లింగాన్ని మేఘుడికి కానుకగా ఇచ్చారు.

ఆ విధంగా బాబా మేఘునికి శివునిపై గల భక్తిని మరింత పెరిగేలా చేసారు. షిరిడీలొ ఉన్న ఖండోబాను అక్కడి ప్రజలు శివుని అవతారంగా భావిస్తూ పూజలు చేస్తూ ఉండేవారు. గ్రామంలో ఉన్న ఖండోబా మందిరానికి వెళ్ళి ఆయనను పూజించిన తరువాతనే తనను పూజించడానికి అనుమతిచ్చారు బాబా.  అంతే గాని ఖండోబా మందిరం మూసి ఉన్నందున ముందుగా తననే పూజించడానికి వచ్చాడు  కదా మేఘుడు అని బాబా అతనిని ప్రశంసించలేదు.  దీనిని బట్టి బాబావారి ఔన్నత్యం ఎంత గొప్పదో మనందరం గ్రహించుకోవచ్చు.

(ఇంకా ఉంది)

(సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు, శ్రీ సాయినాధార్పణమస్తు)




No comments:

Post a Comment