Wednesday, May 3, 2023

శ్రీ మద్భగవద్గీత, ఉపనిషత్తుల సారాంశమే శ్రీ సాయి సత్ చరిత్ర –20 వ.భాగమ్

 


03.05.2023  బుధవారమ్

ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

ఓమ్ శ్రీ గణేశాయనమః

శ్రీ మాత్రేనమః


ఓమ్ శ్రీ సాయినాధాయనమః

శ్రీకృష్ణపరబ్రహ్మణేనమః

శ్రీ మద్భగవద్గీత, ఉపనిషత్తుల సారాంశమే శ్రీ సాయి సత్ చరిత్ర –20 వ.భాగమ్

ప్రేరణ ;  గీతాచార్యుడు శ్రీ కృష్ణపరమాత్మ, మరియు సాయినాధులవారు

ప్రేరణా స్థలమ్ … శ్రీ వేణుగోపాలస్వామి ఆలయమ్

సమన్వయ కర్త  ;  ఆత్రేయపురపు త్యాగరాజు

నిజాంపేట్, హైదరాబాద్

ఫోన్.  9440375411  &  8143626744వ.



శ్రీమద్భగవద్గీత – అధ్యాయమ్ – 9 రాజవిద్యా రాజగుహ్య యోగము

శ్లోకమ్ – 26

పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయఛ్చతి

తదహం భక్త్యు పహృతమ్ అశ్నామి ప్రయతాత్మనః

నిర్మల బుధ్ధితో, నిష్కామ భావముతో పరమ భక్తునిచే సమర్పింపబడిన పత్రమును గాని, పుష్పమును గాని, జలమును గాని, నేను ప్రత్యక్షముగా (స్వయముగా) ప్రీతితో ఆరగింతును.

 

శ్లోకమ్ – 27

యత్కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్

యత్తపశ్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణమ్

ఓ కౌంతేయా నీవు ఆచరించుచున్న కర్మను, భుజించెడి ఆహారమును, హోమముచేయు హవ్యమును, అర్పించు దానమును, ఆచరించు తపస్సును నాకే సమర్పింపుము.

(పైన చెప్పిన శ్లోకము యొక్క అర్ధాన్ని బట్టి మనం ఏమి భుజిస్తున్నా, త్రాగుతున్నా, మనము ఇచ్చే దానమును భగవదార్పణమస్తు లేక సాయినాధార్పణమస్తు అని మనసులో అనుకుంటే ఆ భగవంతునికి సమర్పించినట్లే.   మనము ఏమి భుజిస్తున్నా బాబా గారే భుజిస్తున్నారు, లేక ఏమి త్రాగుతున్నా బాబా గారే త్రాగుతున్నారు అనే భావంతో ఉండాలి )

శ్రీ సాయి సత్ చరిత్ర -  అధ్యాయమ్ – 9

తన భక్తుడేదైన తనకు సమర్పించవలెననుకొని, ఏ కారణము చేతనయినా ఆసంగతి మరచినచో, అట్టివానికి బాబా ఆవిషయము జ్ణాపకము చేసి, ఆ నివేదనను గ్రహించి, ఆశీర్వదించేవారు.

తర్ఖడ్ కుటుంబము ఉదాహరణ.

రామచంద్ర ఆత్మారాం తర్ఖడ్ గారి భార్య, కుమారుడు ఇద్దరూ కలిసి షిరిడీకి బయలుదేరారు.  బయలుదేరే సమయంలో కుమారుడు తాము ఇంటిలో లేని సమయంలో, బాబాకు ప్రతిరోజు పూజ చేసి నైవేద్యము పెట్టమని కోరారు.  తండ్రి కుమారునికి ఇచ్చిన  మాట ప్రకారం బాబాకు పూజ చేసి, నైవేద్యంగా కలకండను అర్పించారు. ఒకరోజు కలకండను నైవేద్యం పెట్టడం మరచిపోయి కచేరీకి వెళ్ళిపోయారు.  అక్కడ షిరిడీలో బాబా, ఆత్మారాముని భార్యతో “తల్లీ ఏమయినా  తినవలెనను ఉద్దేశ్యముతో బాంద్రాలోని మీ ఇంటికి వెళ్ళాను.  తలుపులకి తాళం వేసి ఉంది.  ఎలాగో లోపలకు ప్రవేశించాను.  కాని అక్కడ తినటానికి ఏమీ లేకపోవడం వల్ల తిరిగి వచ్చేశాను.” అన్నారు.  ఆ సమయంలో ప్రక్కనే ఉన్న కుమారునికి తన ఇంటిపూజలో ఏవో లోటుపాటులు జరిగాయని అర్ధం చేసుకొన్నాడు.

ఆత్మారాముని భార్య బాబాకు నైవేద్యంగా వంకాయ పెరుగు పచ్చడి, వంకాయవేపుడు కూర, పేడా తయారు చేసి పెట్టడానికి సంకల్పించినపుడు బాబా వాటిని ప్రీతితో అడిగి స్వీకరించారు.

1915 డిసెంబరులో గోవింద బాలారాం మాన్ కర్ అనే అతను షిరిడీకి వెళ్ళి తన తండ్రికి ఉత్తర క్రియలు చేయాలనుకున్నాడు.  ప్రయాణమవడానికి ముందు ఆత్మారాముని వద్దకు వచ్చాడు.  ఆత్మారాముని భార్య బాబా కోసం ఏమయినా పంపుదామని ఇల్లంతా వెదికింది.  కాని, ఒక్క పేడా తప్ప ఏమీ కనిపించలేదు.  ఆ పేడాని కూడా అప్పటికే బాబాకు నైవేద్యంగా సమర్పించేసింది.  తండ్రి మరణించుటచే గోవిందుడు విచారగ్రస్తుడై ఉన్నాడు.  కాని, బాబాయందున్న భక్తిప్రేమలచే ఆమె ఆ పేడాను అతని ద్వారా పంపించింది. బాబా దానిని స్వీకరించి తింటారనే నమ్మకంతో ఉంది.  గోవిందుడు షిరిడీ వెళ్ళి బాబాను దర్శించుకున్నాడు.  కాని, పేడాను తీసుకువెళ్లడం మర్చిపోయాడు.  అప్పుడు బాబా నాకేమి తెచ్చావని గోవిందుడిని అడిగారు. ఏమీ తీసుకురాలేదని గోవిందుడు సమాధానమిచ్చాడు.  వెంటనే బాబా “నీవు ఇంటివద్ద బయలుదేరేటప్పుడు ఆత్మారాముని భార్య నాకొరకు నీచేతికి మిఠాయి ఇవ్వలేదా?” అని అడిగారు.  బాలారాం మాన్ కర్ అంతా గుర్తుకు తెచ్చుకుని సిగ్గుపడి బాబాను క్షమాపణ కోరాడు.  బసకు పరుగెత్తి పేడాను తెచ్చి బాబా చేతికిచ్చాడు.  చేతిలో పడినవెంటనే బాబా దానిని గుటుక్కున మ్రింగారు.  ఈ విధంగా ఆత్మారాముని భార్య యొక్క భక్తిని బాబా ప్రీతిపూర్వకముగా స్వీకరించారు.  “నా భక్తులు నన్నెట్లు భావింతురో నేను వారినావిధంగానే అనుగ్రహింతును”  గీతా వాక్యము అధ్యాయమ్ – 4  శ్లోకమ్ – 11)

శ్రీమద్భగవద్గీత – అధ్యాయమ్ – 4  శ్లోకమ్ – 11

యే యధా మాం ప్రపద్యంతే తాంస్తధైవ భజామ్యహమ్

మమ వర్త్మాను వర్తంతే మనుష్యాః పార్ధ సర్వ శః

పార్ధా! భక్తులు నన్ను సేవించిన రీతికి అనుగుణముగా నేను వారిని అనుగ్రహింతును.  మనుష్యులందరును నా మార్గమునే అనుసరింతురు.

శ్రీ సాయి సత్ చరిత్ర – అధ్యాయమ్ – 13

“పూజా తంతుతో నాకు పనిలేదు.  షోడశోపచారములు గాని, అష్టాంగ యోగములు గాని, నాకు అవసరము లేదు.  భక్తి యున్న చోటనే నా నివాసము.”

(ఇంకా ఉంది)

(సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు, శ్రీ సాయినాధార్పణమస్తు)

 

 

 

No comments:

Post a Comment