Monday, December 29, 2025

శ్రీ సాయిబాబా వారి ప్రేరణతో --- ఆయన లీలల రచన - 6 వ.భాగమ్



30.12.2025 మంగళవారమ్

సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు

శ్రీ సాయిలీల ద్వైమాసపత్రిక సెప్టెంబరు అక్టోబర్, 2025 సంచికలో ప్రచురింపబడిన బాబా లీలకు తెలుగు అనువాదం ఆరవ భాగమ్ ఈ రోజు మీకు అందిస్తున్నాను.

ఆంగ్ల రచయిత ; శ్రీ ధనేష్ జుకార్

తెలుగు అనువాదం ; ఆత్రేయపురపు త్యాగరాజు

నిజాంపేట, హైదరాబాద్,

ఫోన్. 9440375411, 8143626744

శ్రీ సాయిబాబా వారి ప్రేరణతో ---  ఆయన లీలల రచన - 6 .భాగమ్


ఇపుడు నేను మరొక స్నేహితురాలి గురించి  వివరిస్తాను.  ఆమె ఇంటిలో నేను శ్రీ సాయి సత్ చరిత్ర గ్రంధం ఉండటం గమనించాను.  ఆమె తన ఉన్నత విద్యాభ్యాసం కోసం విదేశానికి వెడుతూ తన కూడా శ్రీ సాయి సత్ చరిత్రను తీసుకు వెళ్ళింది.  ఆ గ్రంధాన్ని తన చెక్కబల్ల సొరుగులో భద్రంగా ఉంచుకుంది.  ఒక రోజు రాత్రి ఆమె ఉంటున్న భవనానికి అగ్నిప్రమాదం జరిగింది.  రెండు అంతస్తులను అగ్నికీలలు చుట్టుముట్టాయి


 నా స్నేహితురాలి బట్టలు, చదువుకునే పుస్తకాలు ఇంకా ఆమెకు సంబంధించినవన్నీ అగ్నిలో కాలి బూడిదయ్యాయి.  కాని బల్లసొరుగులో శ్రీ సాయి సత్ చరిత్ర మాత్రం భద్రంగా ఉంది.  సాయియొక్క అనుగ్రహం అత్యంత ముఖ్యమయినదానిని కాపాడింది.  ఆమె తన గ్రంధాన్ని ఇంటికి తిరిగి తెచ్చుకుంది.  ఎవరయినా ఆ గ్రంధాన్ని పరిశీలిస్తే పుస్తకం మొదటి పేజీలు మాత్రం మంటల వేడికి కాస్త నల్లగా మారాయి.  కాని పుస్తకం మొత్తం సవ్యంగా ఉండి పారాయణ చేసుకోవడానికి ఎటువంటి ఇబ్బంది లేని విధంగా ఉంది.

ఇంకా మరొక అధ్బుతమయిన సంఘటన గురించి వివరిస్తాను.  నా స్నేహితుని ఇంటిలో ఎన్నో సంవత్సరాలుగా పూజింపబడుతున్న సాయిబాబా ఫొటో ఉంది.  వారు తన ఇంటిని మరలా మరమ్మత్తులు చేయించిన కారణంగా పాత ఫోటోని తీసివేద్దామనుకున్నారు.  అందువల్ల కుటుంబ సభ్యులందరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చి ఆ ఫోటోని ఎవరికో ఇచ్చేశారు.  దాని స్థానంలో కొత్త ఫోటోను పెడదామనుకున్నారు.  కాని, వారి ఆశ్చర్యానికి అంతులేని విధంగా ఒక సంఘటన జరిగింది.  వారికి బాగా పరిచయం ఉన్నాయన వారి పాత ఫోటోను తీసుకువచ్చారు.  తాను దానిని ఒక పాత సామానులు అమ్మే దుకాణంలో కనిపిస్తే పట్టుకొచ్చినట్లు చెప్పాడు.  నా స్నేహితుడికి కన్నీళ్ళు ఆగలేదు.  తాము ఆ పాత ఫోటోని తీసేసి దాని స్థానంలో కొత్త ఫోటో కొని పెడదామనుకున్నారు కాని ఆపని చేయడం ఆలశ్యమవుతూ వస్తోంది.  కాని పాత ఫోటోయే మా ఇంటికి తిరిగి వచ్చింది.  దీనిని బట్టి బాబా మా ఇంటిని ఒక్క క్షణం కూడా వీడదలచుకోలేరని అర్ధం అయిందని నా స్నేహితుడు చెప్పాడు.   ఎంతో సిగ్గుపడుతూ వినయపూర్వకంగా సాయిబాబాను క్షమించమని వేడుకొని తిరిగి ఆ ఫోటోని పూర్వపు స్థానంలో యధాప్రకారంగా పెట్టారు.  దీనిని బట్టి సాయి ఎన్నటికీ మనలను వదలి వెళ్లరనే విషయాన్ని స్పష్టంగా తెలియచేశారు.

(ఇంకా ఉంది)

(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)

 

No comments:

Post a Comment