19.06.2020 శుక్రవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ సాయి సత్ చరిత్రలో నాకు కలిగిన
సందేహాలు –
బాబా
సమాధానాలు – 10 (3)
గురుభక్తి – 3 వ.భాగమ్
ఆత్రేయపురపు త్యాగరాజు, నిజాంపేట, హైదరాబాద్
ఫోన్. 9440375411 & 8143626744
మైల్ ఐ.డి.
tyagaraju.a@gmail.com
కర్మచేతను, మనసు చేతను, వాక్కు చేతను అన్ని వేళలయందు త్రికరణ శుధ్ధిగా
గురుదేవుని ఆరాధించవలెను. పొడవైన దండమువలె సాష్టాంగ దండ ప్రణామము చేసి, అభిమానమును
వదలి చరించవలెను.
--- గురుగీత
- శ్లో. 51
(శ్రీ సాయి సత్ చరిత్ర అ.43-44 సాయిబాబా పెక్కుసారులు మసీదులో ఈవిధమయిన మధుర వాక్యములు పలికిరి. “ఎవరయితే నన్ను ఎక్కువగా ప్రేమించెదరో వారు ఎల్లప్పుడు నన్ను దర్శించెదరు. నేను లేక ఈ జగత్తంతయు వానికి శూన్యము. నా కధలు తప్ప మరేమియు చెప్పడు. సదా నన్నే ధ్యానము చేయును. నా నామమునే యెల్లప్పుడు జపించుచుండును. ఎవరైతే సర్వస్యశరణాగతి చేసి, నన్నే ధ్యానింతురో వారికి నేను ఋణస్థుడను. వారికి మోక్షమునిచ్చి వారి ఋణము దీర్చుకొనెదను. ఎవరయితే నన్నే చింతించుచు నా గూర్చియే దీక్షతో నుందురో, ఎవరయితే నాకర్పించనిదే యేమియు తినరో అట్టివారిపై నేను ఆధారపడి యుందును. ఎవరయితే నా సన్నిధానమునకు వచ్చెదరో వారు నది సముద్రములో కలిసిపోయినట్లు నాలో కలిసిపోవుదురు. కనుక నీవు గర్వము అహంకారము లేశమైన లేకుండ, నీ హృదయములోనున్న నన్ను సర్వస్యశరణాగతి వేడవలెను.”)
(శ్రీ సాయి సత్ చరిత్ర అ.24 మనము గురుని స్మరించనిదే ఏవస్తునును పంచేంద్రియములతో ననుభవించరాదు. మనస్సును ఈ విధముగా శిక్షించినచో
మనమెల్లప్పుడు బాబాను జ్ఞప్తియందుంచుకొనెదము.)
బ్రహ్మ, విష్ణు శివాత్మకమగు ప్రపంచమంతయు ఒక్క గురుదేవుని స్వరూపమే అయి ఉన్నది. గురుదేవునికంటెను అన్యమైన శ్రేష్టవస్తువు
లేదు. కనుక గురుదేవుని
పూజింపవలెను. --- గురుగీత
– శ్లో 53
( శ్రీ సాయి సత్ చరిత్ర అ. 10 గురువొకడే దేవుడు. సద్గురువు చరణములను నమ్మి కొల్చినచో వారు మన యదృష్టమును బాగుచేయగలరు. వారిని శ్రధ్ధగా సేవించినచో సంసారబంధములనుండి
తప్పించుకొనగలము. )
(శ్రీ సాయి సత్ చరిత్ర అ.16 – 17 సద్గురువును భగవంతునివలె కొలువవలెను.)
(శ్రీ సాయి సత్ చరిత్ర అ.18 – 19 గురువే సర్వమును చేయువాడనియు, కర్తయనియు పూర్తిగా నమ్ముము. ఎవరయితే గురువుయొక్క మహిమను,
గొప్పదనమును గ్రహించెదరో, ఎవరయితే గురుని బ్రహ్మవిష్ణుమహేశ్వర
స్వరూపుడని ఎంచెదరో వారే ధన్యులు.)
నిజగురువునకు సేవచేయుటవలన కులము పవిత్రమగుచున్నది. గురువు తృప్తి చెందిన బ్రహ్మాది దేవతలందరు
తృప్తి చెందుచున్నారు. ఇది సత్యము.
--- గురుగీత - శ్లో. 300
(శ్రీ సాయి సత్ చరిత్ర అ.24 బాబా తన భక్తులకు వారివారి ఇష్టానుసారము సేవ చేయుటకు అనుమతించుచుండెను. అణ్ణా చించనీకర్, బాబా ఎడమచేతిని తోముతూ సేవ చేసెడివాడు. వేణుబాయి కౌజల్గి (మావిశీబాయి) కూడా బాబాకు సేవ చేస్తూ ఉండేది. ఆమె బాబా నడుమును మొలను వీపును తన రెండు చేతుల వ్రేళ్ళు అల్లి బాబా ఒళ్ళు పట్టేది.)
(శ్రీ సాయి సత్ చరిత్ర అ.7 భాగోజీ షిండే ప్రతిరోజు ఉదయము బాబా వారి కాలిన చేతి పట్టీలను విప్పి, నేతితో తోమి, తిరిగి కట్లు కట్టేవాడు. బాబా మహాసమాధి వరకు ఇది జరుగుచునేయుండెను. తన భక్తుడైన భాగోజీ యందు గల ప్రేమచే అతడొనర్చు ఉపాసనను బాబా
గైకొనెను. బాబా లెండీకి
పోవునప్పుడు భాగోజీ బాబా తలపై గొడుగు పట్టుకొని వెంట నడిచెడివాడు. ప్రతిరోజు ఉదయము బాబా ధునియొద్ద కూర్చొనగనే,
భాగోజీ తన సేవాకార్యము మొదలిడువాడు.)
(శ్రీ సాయి సత్ చరిత్ర అ. 35 బాలాజీ పాటి నెవాస్కర్ బాబాకు గొప్ప భక్తుడు. ఇతడు ఫలాపేక్ష లేకుండ చాలా మంచి సేవ చేసెను. ఇతడు షిరిడీలో బాబా యేయే మార్గముల ద్వారా పోవుచుండెనో వానినన్నింటిని తుడిచి శుభ్రము చేయుచుండెను. అతని యనంతరము ఈపని రాధాకృష్ణమాయి అతి శుభ్రముగా నెరవేర్చుచుండెను. ఆమె తరువాత అబ్దుల్లా చేయుచుండెను. బాలాజీ ప్రతి సంవత్సరము పంట కోయగనే దానినంతయు దెచ్చి బాబాకర్పితము చేయుచుండెను. అతడు బాబా ఇచ్చినదానితో తన కుటుంబమును పోషించుకొనువాడు. ఈ ప్రకారముగా నతడు చాలా సంవత్సరములు చేసెను. అతని తరువాత అతని కుమారుడు దానినవలంబించెను.)
( శ్రీ సాయి సత్ చరిత్ర అ. 42 … లక్ష్మీబాయి రొట్టె, పాలు భక్తి ప్రేమలతో బాబాకు పెట్టుచుండెను. బాబా మెచ్చుకొని ఎంతో ప్రేమతో తినుచుండెడివారు. అందులో కొంత తాను తిని మిగత రాధాకృష్ణమాయికి
పంపుచుండెను. ఆమె బాబా
భుక్తశేషమునే ఎల్లప్పుడు తినుచుండెను.)
(ఇంకా ఉంది)
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)
No comments:
Post a Comment