Sunday, January 8, 2023

శ్రీ మద్భగవద్గీత, ఉపనిషత్తుల సారాంశమే శ్రీ సాయి సత్ చరిత్ర –10 వ.భాగమ్

 



08.01.2023 ఆదివారమ్

ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

ఓమ్ శ్రీ గణేశాయనమః

శ్రీ మాత్రేనమః


   ఓమ్ శ్రీ సాయినాధాయనమః

   శ్రీ కృష్ణపరబ్రహ్మణేనమః

                                      

శ్రీ మద్భగవద్గీత, ఉపనిషత్తుల సారాంశమే శ్రీ సాయి సత్ చరిత్ర –10 వ.భాగమ్

ప్రేరణ ;  గీతాచార్యుడు శ్రీ కృష్ణపరమాత్మ, మరియు సాయినాధులవారు

ప్రేరణా స్థలమ్ … శ్రీ వేణుగోపాలస్వామి ఆలయమ్

సమన్వయ కర్త  ;  ఆత్రేయపురపు త్యాగరాజు

నిజాంపేట్, హైదరాబాద్

ఫోన్.  9440375411  &  8143626744వ.

శ్రీమద్భగవద్గీత అధ్యాయమ్ – 6 ఆత్మసంయమ యోగము (2)

శ్లోకమ్ – 8

జ్ణాన విజ్ణాన తృప్తాత్మా కూటస్థో  విజితేంద్రియః

యుక్త ఇ త్యుచ్యతే యోగీ సమలోష్టాశ్మకాంచనః

పరమాత్మ ప్రాప్తినందిన యోగి యొక్క అంతఃకరణమునందు జ్ణాన విజ్ణానములు నిండియుండును.  అతడు వికారరహితుడు.  ఇంద్రియాదులను వశపఱచుకొనినవాడు.  అతడు మట్టిని, రాతిని, బంగారమును సమానముగా చూచును.  ఇటువంటివానిని యోగి, యోగారూఢుడని చెప్పబడును.

జ్ణానవిజ్ణానములు, నిర్వికారత్వము, ఇంద్రియములను జయించుట, మట్టిగడ్డ, ఱాయి, బంగారము వీనిని సమానముగా చూచుట యోగి లక్షణములు.

శ్రీ సాయి సత్ చరిత్ర అధ్యాయమ్ – 4

బాబా జ్ణానమూర్తులు.  నశించువస్తువులందభిమానము లేనివారు.  భోలోకమందుగాని, స్వర్గలోకమందుగాని, గల వస్తువులందభిమానము లేనివారు.  వారు ద్వంద్వాతీతులు.  నిరుత్సాహముగాని, ఉల్లాసముగాని ఎరుగరు.  బాబా స్వప్నావస్థయందయినను ప్రపంచవస్తువులను కాంక్షించెడివారు కాదు.

శ్రీ సాయి సత్ చరిత్ర అధ్యాయమ్  -  6

రాధాకృష్ణమాయి కృషిచే షిరిడీ యొక సంస్థానముగ రూపొందెను.  వివిధములయిన హంగులు, అలంకారములు పెరిగినవి.  అలంకరింపబడిన గుఱ్ఱము, పల్లకి, రధము, పాత్రలు, వెండిసామానులు మొదలగునవి బహూకరింపబడెను.  ఉత్సవమునకు ఏనుగులు కూడా వచ్చెను.   ఇవన్నియు ఎంత హెచ్చినప్పటికి సాయిబాబా వీనినేమాత్రము లక్ష్యపెట్టక యధాపూర్వము నిరాడంబరులై యుండెడివారు

శ్రీసాయి సత్ చరిత్ర అధ్యాయమ్ 8

బాబా కొన్ని ఇండ్లకు మాత్రమే భిక్షాటనకు పోయెడివారు.  మజ్జిగవంటి ద్రవపదార్ధములు, కూరలు మొదలగునవి రేకు డబ్బాలో పోసుకొనెడివారు.  అన్నము,. రొట్టెలు మొదలగునవి జోలెలో వేయించుకొనేవారు.  బాబాకు రుచి యనునది లేదు.  వారు జిహ్వను స్వాధీనమందుంచుకొనిరి.  అన్ని పదార్ధములను ఒకేసారి కలిపివేసి భుజించి సంతుష్టి చెందేవారు.  పదార్ధముల రుచిని పాటించేవారు కాదు.  వారి నాలుకకు రుచియనునది లేనట్లే కాన్పించుచుడెను.  ఫకీరు పదవే నిజమైన మహారాజ పదవియనీ, అదియే శాశ్వతమనీ, మామూలు సిరిసంపదలు క్షణభంగురాలనీ బాబా యనుచుండెడివారు.

ధనాపేక్ష లేశమాత్రము లేని నిరాసక్తుడు బాబా.  బాహ్యదృష్టికి వారు చంచలునిగను, స్థిరత్వము లేనివారుగను కన్పించినను లోన వారు స్థిరచిత్తులు.


శ్రీసాయి సత్ చరిత్ర అధ్యాయమ్  -  10

బాబా ఎప్పుడూ చింతారహితులై శాంతముగా ఉండేవారు.  సిరిసంపదలనుగానీ, కీత్రిప్రతిష్టలనుగానీ లక్ష్యపెట్టక భిక్షాటనముచే నిరాడంబరులై జీవించెడివారు.  అత్మజ్ణానమునకు ఆయన గని, దివ్యానందమునకు ఆయన ఉనికిపట్టు. 

మానవదేహముతో సంచరించినప్పటికి వారికి గృహదేహాదులయందు అభిమానము లేకుండెను.  శరీరధారులవలె కనిపించినను వారు నిజమునకు నిశ్శరీరులు, జీవన్ముక్తులు.

బాహ్యదృష్టికి ఇంద్రియ విషయములను అనుభవించువానివలె కన్పట్టినను ఇంద్రియానుభూతులలో వారికి ఏమాత్రము అభిరుచి ఉండెడిదికాదు.  అసలు ఇంద్రియానుభవముల స్పృహయే వారికి లేకుండెను.  వారు భుజించునప్పటికి దేనియందు వారికి రుచి ఉండెడిదికాదు.  వారు ప్రపంచమును చూచుచున్నట్లు కన్పించినను వారికి దేనియందేమాత్రము ఆసక్తి లేకుండెను.  కామమన్నచో వారు హనుమంతునివలె అస్ఖలిత బ్రహ్మచారులు.  వారికి దేనియందు మమకారము లేకుండెను.  వారు శుధ్ధచైతన్య స్వరూపులు.  కోరికలు, కోపము మొదలగు భావవికారములు శంతించి స్వాస్థ్యము చెందెడి విశ్రాంతి ధామము.

(ఇంకా ఉంది)

(సర్వం శ్రీకృష్ణార్పణమస్తు, శ్రీ సాయినాధార్పణమస్తు)


No comments:

Post a Comment