Friday, January 13, 2023

శ్రీ మద్భగవద్గీత, ఉపనిషత్తుల సారాంశమే శ్రీ సాయి సత్ చరిత్ర –11 వ.భాగమ్

 


13.01.2023 శుక్రవారమ్

ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

ఓమ్ శ్రీ గణేశాయనమః

శ్రీ మాత్రేనమః


ఓమ్ శ్రీ సాయినాధాయనమః

 శ్రీ కృష్ణపరబ్రహ్మణేనమః

                                        

శ్రీ మద్భగవద్గీత, ఉపనిషత్తుల సారాంశమే శ్రీ సాయి సత్ చరిత్ర –11 వ.భాగమ్

ప్రేరణ ;  గీతాచార్యుడు శ్రీ కృష్ణపరమాత్మ, మరియు సాయినాధులవారు

ప్రేరణా స్థలమ్ … శ్రీ వేణుగోపాలస్వామి ఆలయమ్

సమన్వయ కర్త  ;  ఆత్రేయపురపు త్యాగరాజు

నిజాంపేట్, హైదరాబాద్

ఫోన్.  9440375411  &  8143626744

(డిసెంబరు 2022, వ.సం.లో ఫేస్ బుక్ లో ఒక సమూహంలో పోస్ట్ చేసిన యూ ట్యూబ్ వీడియోలో ఒకామె శ్రీ సాయి సత్ చరిత్ర పదవ అధ్యాయములోని ఒక విషయాన్ని ప్రస్తావిస్తూ తన స్వంత తెలివిని ప్రధర్శించింది.  కపట యోగుల గురించి శ్రీ సాయి సత్ చరిత్ర లోని ఒక పేరాని చదివి అజ్ణానంతో విమర్శ చేసింది. సాయిభక్తులందరూ ఖండించదగ్గ విషయం.  దానికి తగిన సమాధానం 18 అధ్యాయాలు పూర్తయిన తరువాత వివరంగా ప్రచురిస్తాను.)


శ్రీమద్భగవద్గీత అధ్యాయమ్ – 6 ఆత్మసంయమ యోగము (3)

శ్రీ సాయి సత్  చరిత్ర అధ్యాయమ్  -  11

వారు క్షమాశీలురు, క్రోధరహితులు, ఋజువర్తనులు, శాంతమూర్తులు, నిశ్చలులు, నిత్యసంతుష్టులు.  శ్రీ సాయిబాబా ఆకారములో కనిపించినప్పటికి వాస్తమునకు వారు నిరాకారస్వరూపులు, నిర్వికారులు, నిస్సంగులు, నిత్యమూర్తులు.

వారు తమ ఆసనము కొరకు ఒక గోనెసంచిని ఉపయోగించెడివారు.

శ్రీ సాయి సత్ చరిత్ర అధ్యాయమ్   -  14

షిరిడీ సంస్థానములో ఉన్న విలువయిన వస్తువులన్నీ రాధాకృష్ణమాయి సలహాచే భక్తులు తెచ్చి ఇచ్చిరి.  ఎవరయినా విలువయిన వస్తువులు తెచ్చి ఇచ్చినచో బాబా వారిని తిట్టెడివారు.  నానాసాహెబ్ చందోర్కర్ తో తన ఆస్తి అంతయు ఒక కౌపీనము, ఒక విడిగుడ్ద, ఒక కఫనీ, ఒక తంబిరేలు గ్లాసు మాత్రమే అనియు, అయినప్పటికి భక్తులు అనవసరమయిన, నిష్ప్రయోజనమయిన విలువయిన వస్తువులు తెచ్ఛుచున్నారని అనుచుండెడివారు.

శ్రీ సాయి సత్ చరిత్ర అధ్యాయమ్  -  35

అన్నీ బాబాయే చేయుచున్నను, దేనియందు అభిమానముంచలేదు.  ఎవరయినను నమస్కరించినను, నమస్కరించకపోయినను, దక్షిణ ఇచ్చినను, ఈయకున్నను తనకందరూ సమానమే.  బాబా ఎవరినీ అవమానించలేదు.  తనను పూజించినందుకు బాబా గర్వించెడివారు కాదు.  తనను పూజించలేదని విచారించేవారు కాదు.  వారు ద్వంద్వాతీతులు.

శ్రీ సాయి సత్ చరిత్ర అధ్యాయమ్  - 7

సన్మానములన్నచో వారికేమాత్రము ఇష్టము లేదు.

శ్రీమద్భగవద్గీత  అధ్యాయమ్ – 6 శ్లోకమ్ – 9

సుహృన్మిత్రార్యుదాసీన మధ్యస్థ ద్వేష్యబంధుషు

సాధుష్వపి చ పాపేషు సమబుధ్దిర్విశిష్యతే

సుహృదులయందును, మిత్రులయందును, ద్వేషింపదగినవారియందును, బంధువులయందును, ధర్మాత్ములయందును, పాపులయందును, సమబుధ్ధి కలిగి  యుండువాడు మిక్కిలి శ్రేష్టుడు.

శ్రీ సాయి సత్ చరిత్ర  అధ్యాయమ్ -  10

ప్రతి జీవియందు బాబా దైవత్వమును చూచేవారు.  స్నేహితులు, విరోధులు వారికి సమానులే.  నిరభిమానము సమత్వము వారిలో మూర్తీభవించినవి.  వారు దుర్మార్గుల అవసరములు కూడా తీర్చేవారు.  కలిమిలేములు వారికి సమానము.

శ్రీ సాయి సత్ చరిత్ర -  అధ్యాయమ్ – 32

సాయి దర్బారులోనికి అనేకమంది వచ్చి, వారికి తెలియు విద్యలను ప్రదర్శించి పోయెడివారు.  జ్యోతిష్కులు రాబోవు విషయములు చెప్పుచుండెడివారు.  యువరాజులు, గౌరవనీయులు, సామాన్యులు, పేదవారు, సన్యాసులు, యోగులు, పాటకాండ్రు మొదలగువారు  బాబా దర్శనమునకై వచ్చెడివారు.  గారడివాండ్రు, గుడ్డివాండ్రు, చొట్టవారు, నర్తకులు, నాధసాంప్రదాయమువారు, పగటివేషములవారు కూడా అచ్చట సమాదరింపబడుచుండిరి.


కుష్టురోగముచే బాధపడుతున్న భాగోజీషిండే బాబాకు సేవ చేస్తూ ఉండేవాడు.

(ఇంకా ఉంది)

(సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు, శ్రీ సాయినాధార్పణమస్తు)

 

No comments:

Post a Comment