Wednesday, February 8, 2023

శ్రీ మద్భగవద్గీత, ఉపనిషత్తుల సారాంశమే శ్రీ సాయి సత్ చరిత్ర –14 వ.భాగమ్

 



08.02.2023 బుధవారమ్

ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

ఓమ్ శ్రీ గణేశాయనమః

శ్రీ మాత్రేనమః


ఓమ్ శ్రీ సాయినాధాయనమః

 శ్రీ కృష్ణపరబ్రహ్మణేనమః                                       


శ్రీ మద్భగవద్గీత, ఉపనిషత్తుల సారాంశమే శ్రీ సాయి సత్ చరిత్ర –14 వ.భాగమ్

ప్రేరణ ;  గీతాచార్యుడు శ్రీ కృష్ణపరమాత్మ, మరియు సాయినాధులవారు

ప్రేరణా స్థలమ్ … శ్రీ వేణుగోపాలస్వామి ఆలయమ్

సమన్వయ కర్త  ;  ఆత్రేయపురపు త్యాగరాజు

నిజాంపేట్, హైదరాబాద్

ఫోన్.  9440375411  &  8143626744వ.

శ్రీమద్భగవద్గీత అధ్యాయమ్ – 6 ఆత్మసంయమ యోగము శ్లోకమ్ – 32

ఆత్మౌపమ్యేన సర్వత్ర సమమ్ పశ్యతి   యోర్జున

సుఖం వా యది వా దుఃఖమ్ యోగీ పరమో మతః



ఓ అర్జునా ! సర్వ ప్రాణులను తనవలె  (తనతో) సమానముగా చూచువాడును, సుఖము గాని, దుఃఖమును గాని సమముగా (సమానముగా) చూచువాడును, (ఇతరుల సుఖదుఃఖములను తన సుఖదుఃఖములుగా భావించువాడును) అయిన యోగి పరమ శ్రేష్టుడు.

శ్రీ సాయి సత్ చరిత్ర అధ్యాయమ్ -  37

 బాబా సర్వ భూతములయందు, భగవద్భావాన్ని కలిగి యుండేవారు.

శ్రీ సాయి సత్ చరిత్ర – అధ్యాయం – 3

బాబా అన్న మాటలు – “ఈ దృశ్యప్రపంచమంతా నా స్వరూపం.  చీమలు, దోమలు, పురుగు, పుట్ర, రాజు, పేద, సకల చరాచర విశ్వమంతా నారూపం”.


భగవద్గీత లో శ్రీకృష్ణపరమాత్మ, శ్రీ సాయి సత్ చరిత్రలో బాబా చెప్పిన మాటలే కాక శ్రీ రామచంద్రులవారు చెప్పిన మాటలను కూడా సందర్భానుసారంగా ఇక్కడ వివరిస్తున్నాను.)

రామచరిత మానసమునందు భరతుని దృష్టిలో ఉంచుకొని సత్పురుషుల లక్షణములను తెలుపుచు, దేవదేవుడగు శ్రీరామచంద్రుడు ఇట్లు పలికెను.

“సజ్జనులు విషయవాసనాలోలురు గారు.  వారు సచ్ఛీలురు, సద్గుణసంపన్నులు.  ఇతరుల దుఃఖములను తమ దుఃఖములుగను, ఇతరుల సుఖములను తమ సుఖములుగను భావించెదరు.  వారు అన్నిటియందును, అన్ని చోట్లను అన్ని సమయములందును సమభావమును కలిగియుందురు.  వారి మనస్సులలో శత్రుభావము ఉండదు.  వారు అభిమానరహితులు, విరాగులు.  వారిలో లోభము, క్రోధము, హర్షము, భయము లేశమాత్రమును కూడ ఉండవు.  వారి హృదయములు కోమలములు.  దీనులయెడ దుఃఖితులపైనను దయ చూపుదురు.    వారు స్వయముగ అభిమానరహితులై ఇతరులను గౌరవించెదరు.  సజ్జనులు శాంతి, వైరాగ్యము, వినయము, ప్రసన్నత కలిగియుందురు.  వారిలో మృదుస్వభావము, సరళత, అందరియెడ మిత్రభావము, బ్రాహ్మణభక్తి ఉండును.  ఇదే ధర్మమునకు మూలము.  సోదరా! ఈ లక్షణములు గలవారిని సజ్జనులుగా భావింపుము.  వారు శమ, దమ నియమ నీతి మార్గములనుండి ఎన్నడును వైదొలగరు.  "

శ్రీ సాయి సత్ చరిత్ర అధ్యాయమ్ – 7 లోని విషయాలను గమనించండి.

బాబా ఒక్కొక్కప్పుడు ఇతరుల వ్యాధిని తమపై వేసికొని ఆ బాధను తామనుభవించేవారు.

1)     ఒకసారి షిరిడీ గ్రామంలో ప్లేగు జ్వరం వ్యాపించింది.  దాదాసాహెబ్ ఖాపర్డే, అతని భార్య, కొడుకు షిరిడీ సాయి సన్నిధిలో ఆనందాన్ననుభవిస్తుండగా, ఒక రోజు వారి కుమారుడికి జ్వరం తీవ్రంగా వచ్చింది.  తల్లి గుండెబ్రద్దలయేలా ఏడుస్తూ వారి ఊరయిన అమరావతికి తిరిగి వెళ్ళిపోవాలని తలచింది.  సాయంకాలం బాబా అనుమతి పొందాలని వేచి ఉండగా లెండీకి వెడుతూ బాబా వాడా సమీపానికి వచ్చారు.  ఆమె వారి పాదాలు పట్టుకుని బాలుని ప్లేగు జ్వరం గురించి విన్నవించింది.  బాబా ఆమెతో మృదుమధురంగా “ఆకాశమిప్పుడు మేఘాలతో నిండి ఉంది.  వర్షం పడగానే మేఘాలు కరిగిపోతాయి.  ఎందుకంత భయమంటూ తన కఫ్నీని నడుము వరకు పైకి తోసి కోడిగ్రుడ్లంత ప్రమాణంలో నిగనిగలాడుతున్న గ్రంధులను చూపించి, “చూడు, మీకొఱకు మీ సంకటాలను నేను అనుభవించాలి” అని అన్నారు.  యోగీశ్వరులు భక్తుల కోసం తామెన్నో దుఃఖాలను అనుభవిస్తారు.  వారి హృదయం మైనంకంటె మెత్తగా, నవనీతంవలె అతి మృదువుగా ఉంటుంది.  తమకెటువంటి లాభం లేకుండానే, భక్తులను ప్రేమిస్తారు.  భక్తులే వారి బంధువులు, స్నేహితులు.

2)     1910 వ.సం. ఘనత్రయోదశినాడు అనగా దీపావళి పండుగ ముందు రోజున బాబా ధునివద్ద చలి కాచుకొనుచు, ధునిలో కట్టెలు వేయుచుండెను.  ధుని బాగుగా మండుచుండెను.  కొంతసేపయిన తరువాత హఠాత్తుగా కట్టెలకు బదులు తన చేతిని ధునిలోపెట్టి నిశ్చలముగా ఉండిపోయిరి.  మంటలకు చేయి కాలిపోయెను.  మాధవుడనే నౌకరు, మాధవరావు దేశ్ పాండె ఇద్దరూ దీనిని చూచి వెంటనే బాబా వైపు పరుగిడిరి.  మాధవరావు దేశ్ పాండే బాబా నడుమును పట్టుకుని బలముగా వెనుకకు లాగెను. “దేవా! ఇట్లేల చేసితిర”ని బాబా నడిగిరి.  (మరేదో లోకములో ఉండినట్లున్న) బాబా బాహ్యస్మృతి తెచ్చుకుని “ఇక్కడకు చాలా దూరములో ఒక కమ్మరి స్త్రీ తన బిడ్డను ఒడిలో ఉంచుకుని కొలిమినూదుచుండెను.  అంతలో ఆమె భర్త పిలిచెను.  తన ఒడిలో బిడ్డయున్న సంగతి మరచి, ఆమె తొందరగా లేచెను.  బిడ్డ మండుచున్నకొలిమిలో పడెను.  వెంటనే నా చేతిని కొలిమిలోనికి దూర్చి, ఆ బిడ్దను రక్షించితిని.  నా చేయి కాలితే కాలినది.  అది నాకంత బాధాకరము కాదు.  కాని బిడ్డ రక్షింపబడెనను విషయము నాకానందము కలుగచేయుచున్నదని” జవాబిచ్చెను.

శ్రీ సాయి సత్ చరిత్ర, అధ్యాయమ్ – 10

బాబా ఒక్కొక్కప్పుడు శాంతి, దాంతి, ఉపరతి, తితీక్షాదులతో ఆత్మస్థియందుండి, భక్తులను ప్రసన్న చిత్తులను చేసేవారు.

(పైన ఉదహరించిన వాటిని బట్టి బాబా ఒక యోగి అని మనం గ్రహించుకోవచ్చు)

(ఇంకా ఉంది)

(సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు, శ్రీ సాయినాధార్పణమస్తు)

 



No comments:

Post a Comment