Thursday, February 2, 2023

శ్రీ మద్భగవద్గీత, ఉపనిషత్తుల సారాంశమే శ్రీ సాయి సత్ చరిత్ర –13 వ.భాగమ్

 



02.02.2023 గురువారమ్

ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

ఓమ్ శ్రీ గణేశాయనమః

శ్రీ మాత్రేనమః


ఓమ్ శ్రీ సాయినాధాయనమః

 శ్రీ కృష్ణపరబ్రహ్మణేనమః   



శ్రీ మద్భగవద్గీత, ఉపనిషత్తుల సారాంశమే శ్రీ సాయి సత్ చరిత్ర –13 వ.భాగమ్

ప్రేరణ ;  గీతాచార్యుడు శ్రీ కృష్ణపరమాత్మ, మరియు సాయినాధులవారు

ప్రేరణా స్థలమ్ … శ్రీ వేణుగోపాలస్వామి ఆలయమ్

సమన్వయ కర్త  ;  ఆత్రేయపురపు త్యాగరాజు

నిజాంపేట్, హైదరాబాద్

ఫోన్.  9440375411  &  8143626744వ.

శ్రీమద్భగవద్గీత అధ్యాయమ్ – 6 శ్లోకమ్ -  29

సర్వభూతస్థమాత్మానమ్ సర్వభూతాని చాత్మని

ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శనః



సర్వవ్యాపమైన అనంత చైతన్యమునందు ఏకీభావస్థితిరూప యోగయుక్తమైన ఆత్మ కలవాడును, అంతటను అన్నింటిని సమభావముతో చూచువాడును అగు యోగి తన ఆత్మను సర్వప్రాణులయందు స్థితమై యున్నట్లుగను, ప్రాణులన్నింటిని తన ఆత్మయందు కల్పితములుగను భావించును. (చూచును)

(క్రింద ఇచ్చిన ఉదాహరణలను బట్టి బాబా ఒక యోగి అని కూడా మనం గ్రహించుకోవచ్చు)

శ్రీ సాయి సత్ చరిత్ర అధ్యాయమ్ – 13

బాబా అన్న మాటలు  --- “నేనందరి హృదయములను పాలించువాడను.  అందరి హృదయములలో నివసించువాడను.  నేను ప్రపంచమందుగల చరాచర జీవకోటినావరించి యున్నాను.  పురుగులు, చీమలు తదితర దృశ్యమాన చరాచర జీవకోటి యంతయు నా శరీరమే, నారూపమే.”


శ్రీ సాయి సత్ చరిత్ర అధ్యాయమ్ – 28

శ్రీ సాయి అనంతుడు.  చీమలు, పురుగులు మొదలుకొని బ్రహ్మపర్యంతము సకల జీవులందు వసించును.  వారు సర్వాంతర్యామి.

శ్రీ సాయి సత్ చరిత్ర – అధ్యాయమ్ – 15

ఈ అధ్యాయంలో బాబా, చోల్కర్ తో అన్నమాటలు.

“ఈ ప్రపంచంలో ఎక్కడికన్నా వెళ్లండి మీవెనువెంట నేనుంటాను.  మీ హృదయమే నా నివాసస్థలం.  నేను మీ అంతర్వామిని.  మీ హృదయాలలో ఉన్న నన్ను మీరు నిత్యం పూజించండి.  సర్వ జీవులలోను నేను అంతర్యామిగా ఉన్నాను.  యాదృచ్చికంగా ఇంటా, బయటా, అధవా మార్గంలో మీకెవరు కలిసినా వారిలో నేనే ఉన్నాను.  క్రిమికీటకాలలో, ఖేచరాలలో అన్ని ప్రాణులలో నేనే సర్వత్ర నిండి ఉన్నాను.  నిరంతరం నన్ను మీ ఆత్మగానే గ్రహించండి.  నన్ను ఇట్లు తెలుసుకున్నవారు గొప్ప భాగ్యవంతులు.”

శ్రీ సాయి సత్ చరిత్ర – అధ్యాయమ్ – 9

ఒకప్పుడు ఆత్మారాం తర్ఖడ్ భార్య షిరిడీలో ఒక ఇంటియందు దిగెను.  మధ్యాహ్న భోజనము తయారయ్యెను.  అందరికీ వడ్ఢించిరి.  ఆకలితో ఉన్న కుక్క ఒకటి వచ్చి మొఱగుట ప్రారంభించెను.  వెంటనే తర్ఖడ్ భార్య లేచి, ఒక రొట్టె ముక్కను విసరెను.  ఆ కుక్క ఎంతో మక్కువగా ఆ రొట్టె ముక్కను తినెను.  ఆనాడు సాయంకాలము ఆమె మసీదునకు పోగా బాబా ఆమెతో ఇట్లనెను.  “తల్లీ! నాకు కడుపునిండా గొంతువరకు భోజనము పెట్టినావు.  నా జీవశక్తులు సంతుష్టి చెందినవి.  ఎల్లప్పుడు ఇట్లనే చేయుము.  ఇది నీకు సద్గతి కలుగజేయును.  ఈ మసీదులో కూర్చుండి నేను ఎన్నడూ అసత్యమాడను.  నాయందిట్లే దయయుంచుము.  మొదట ఆకలితో ఉన్న జీవికి భోజనము పెట్టిన పిమ్మట నీవు భుజింపుము.  దీనిని జాగ్రత్తగా జ్ణప్తియందుంచుకొనుము.”

ఇదంతయు ఆమెకేమియు బోధపడలేదు.  కావున ఆమె ఇట్లు జవాబిచ్చెను.  “బాబా నేను నీకెట్లు భోజనము పెట్టగలను?  నా భోజనము కొరకే ఇతరులపై ఆధారపడియున్నాను.  నేను వారికి డబ్బిచ్చి భోజనము చేయుచున్నాను.”  అందులకు బాబా ఇట్లు జవాబిచ్చెను.  “నీవు ప్రేమపూర్వకముగా పెట్టిన ఆ రొట్టెముక్కను తిని ఇప్పటికీ త్రేనుపులు తీయుచున్నాను.  నీ భోజనమునకు ముందు ఏ కుక్కను చూచి రొట్టె పెట్టితివో అదియు నేను ఒక్కటియే  అట్లనే పిల్లులు, పందులు, ఈగలు, ఆవులు మొదలుగా గలవన్నియు నా యంశములే.  నేనే వాని యాకారముతో తిరుగుచున్నాను.  ఎవరయితే సకల జీవకోటిలో నన్ను చూడగలుగుదురో వారే ప్రియ భక్తులు.  కావున నేను వేరు తక్కిన జీవరాశియంతయు వేరు అను ద్వంద్వ భావమును భేదమును విడిచి నన్ను సేవింపుము”.

“జీవులన్నిటియందు భగవంతుని దర్శింపుము” అనునది ఈ అధ్యాయములో నేర్చుకొనవలసిన నీతి.

ఉపనిషత్తులు, భగవద్గీత, భాగవతము మొదలగునవి అన్నియు భగవంతుని ప్రతి జీవియందు చూడుమని ప్రబోధించుచున్నవి.

సాయిబాబా ఉపనిషత్తులలోని ప్రబోధములను, తమ ఆచరణరూపమున చూపి అనుభవపూర్వకముగా నిర్ధారణ చేసి ఉన్నారనియు స్పష్టమగును.

ఉపనిషదాది గ్రంధములలో ప్రతిపాదింపబడిన తత్త్వమును అనుభవ పూర్వకముగా ప్రబోధించిన సమర్ధ సద్గురుడే సాయిబాబా. 

శ్రీ సాయి సత్ చరిత్ర అధ్యాయమ్ – 7

బాబా ఎల్లప్పుడు పరిపూర్ణ వేదాంత తత్త్వమును బోధించుచుండువారు.

శ్రీ సాయి సత్ చరిత్ర – అధ్యాయమ్ – 42

ఒకనాడు సాయంకాలము బాబా మసీదులో తాత్యాతో కూర్చొనియుండగా లక్ష్మీబాయి షిండే వచ్చి బాబాకు నమస్కరించెను.  బాబా ఇట్లనెను. “ఓ లక్ష్మీ!  నాకు చాలా ఆకలి వేయుచున్నది.” వెంటనే ఆమె లేచి, “కొంచెము సేపాగుము.  నేను త్వరలో రొట్టె తీసుకొనివచ్చెద” ననెను.  ఆమె త్వరగా రొట్టె, కూర తీసుకుని వచ్చి బాబా ముందు పెట్టెను.  బాబా దానిని అందుకొని ఒక కుక్కకు వేసెను.  లక్ష్మీబాయి “ఇది యేమి బాబా!  నేను పరుగెత్తుకొని పోయి నా చేతులార నీకొరకు రొట్టె చేసితిని.  నీవు దానిని కొంచమైనను తినక కుక్కకు వేసితివి.  అనవసరముగా నాకు శ్రమ కలుగచేసితివి.”  

అందుకు బాబా ఇట్లు సమాధానమిచ్చెను.  “అనవసరముగా విచారించెదవేల?  కుక్క ఆకలి తీర్చుట నా ఆకలి తీర్చుటవంటిది.  కుక్కకు కూడా ఆత్మ కలదు.  ప్రాణులు వేరు కావచ్చును.  కాని అందరి ఆకలి ఒకటియే.  కొందరు మాట్లాడగలరు.  కొందరు మూగవానివలె మాట్లాడలేరు.  ఎవరయితే ఆకలితో ఉన్నవారికి భోజనము పెట్టెదరో వారు నాకు అన్నము పెట్టినట్లే.  దీనినే గొప్ప నీతిగా ఎరుగుము.”  ఇది చాలా చిన్న విషయమయినా బాబా మనకు గొప్ప ఆధ్యాత్మిక సత్యాన్ని బోధించారు.

శ్రీ సాయి సత్ చరిత్ర అధ్యాయమ్ - 23 

బాబా ఎవరిని న్రాదరించుట గాని, అవమానించుట గాని వారెరుగరు.  సమస్త జీవులలో వారు నారాయణుని గాంచుచుండెడివారు.

శ్రీ సాయి సత్ చరిత్ర అధ్యాయమ్ - 37

బాబా సర్వ భూతములయందు భగవద్భావాన్ని కలిగి ఉండేవారు.

శ్రీ సాయి సత్ చరిత్ర అధ్యాయమ్ - 23

ఈ ప్రపంచమంతయు దేవుడె ఆవరించి యుండుటచే వారికి ఎవరియందు శత్రుత్వముండెడిది కాదు.  వారు పరిపూర్ణ విరాగులైనప్పటికి సాధారణ గృహస్థులకు ఆదర్శముగానుండుటకై ఇట్లు చేయుచుండెడివారు.

(ఇంకా ఉంది)

(సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు, శ్రీ సాయినాధార్పణమస్తు)

No comments:

Post a Comment