Wednesday, April 17, 2024

సాయి అనుగ్రహం అపారమ్ – 3 వ.భాగమ్

 




17.04.2024 బుధవారమ్

ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బందువులకు బాబావారి శుభాశీస్సులు

శ్రీ రామనవమి శుభాకాంక్షలు









శ్రీ సాయిలీల ద్వైమాస పత్రిక నవంబరు, డిసెంబరు 2023 సంచికనుండి గ్రహింపబడినది.

ఆంగ్ల మూలం :  డా.క్షితిజ రాణే

తెలుగు అనువాదం ఆత్రేయపురపు త్యాగరాజు, నిజాంపేట, హైదరాబాద్

ఫోన్. 9440375411,  8143626744


సాయి అనుగ్రహం అపారమ్ – 3 వ.భాగమ్

 

సద్గురు భావు మహరాజ్ గారు కూడా ‘సాయి నివాస్ ‘ లో భాద్రపద శుక్ల చతుర్ధి పుణ్యతిధినాడు జన్మించారు.  ఆయన 23.08.1925 వ. సంవత్సరంలో జన్మించారు. 

ఆ రోజుల్లో శ్రీ రాజారాం గారిది పెద్ద ఉమ్మడి కుటుంబం.  వారంతా చావడిలోనే నివసించేవారు.  అందువల్ల  స్వేచ్చగా మసలడానికి ఎవ్వరికీ చాలినంత చోటు ఉండేది కాదు.  ఆ సమస్య వల్ల సీతాబాయి తన ముగ్గురు పిల్లలతో హేమాడ్ పంత్ గారి ఇంటిలోనే ఉంటూ ఉండేది.  హేమాద్ పంత్ గారు మంచి జ్ణాన సంపన్నుడు, క్రమశిక్షణ గల వ్యక్తి.  అయినా గాని ఆయన ఎంతో దయ, సహృదయం గల సాయి భక్తుడు.  అందుచేత ఆయన సహచర్యంలో మనవళ్ళకి కూడా సాయిభక్తి అలవడింది.



అటువంటి ఆధ్యాత్మిక వాతావరణ ప్రభావం వల్ల దేవ్ బాబా, భావు మహరాజ్, బాల చంద్ర ముగ్గురూ ఎంతో క్రమశిక్షణ, మంచి నడవడికలతో ధర్మ బధ్ధంగా నీతి నియమాలకు కట్టుబడి జ్ణాన సంపన్నులయ్యారు.

బాబా అనుమతి ప్రసాదించిన తరువాత హేమాడ్ పంత్,  బాబాకు సంబంధించిన లీలలెన్నిటినో సేకరించి వ్రాసుకోవడం ప్రారంభించారు.  1918 వ. సంవత్సరంలో బాబా మహాసమాధి చెందిన తరువాత తాను సేకరించి వ్రాసుకున్న బాబా లీలలన్నిటినీ ‘శ్రీ సాయి సత్ చరిత్ర’ పేరుతో ఒక గ్రంధంగా రచించడం మొదలుపెట్టారు.  52 అధ్యాయాలను పూర్తి చేశారు.  గ్రంధం చివరగా ఉపసంహారం కూడా వ్రాసి సిధ్ధం చేసుకున్నారు.  కాని ‘శ్రీ సాయి సత్ చరిత్ర’ ప్రచురింపబడక ముందే 15.07.1929 లో హేమాడ్ పంత్ గారు కాలం చేశారు.  ఆ సమయంలో భావు మహరాజ్ వయస్సు నాలుగు సంవత్సరాలు.

హేమాడ్ పంత్ గారితో కలిసి ఉండటం వలన దేవ్ బాబా, భావు మహరాజ్ మనసులలో ఈశ్వర భక్తి, ఆధ్యాత్మిక సాధనలు అనే బీజాలు నాటబడ్డాయి.  ఆ బీజాలు రోజు రోజుకు మొలకెత్తి పెద్ద వృక్షమయింది.

శ్రీ సాయిబాబా, స్వామి సమర్ధ, జ్ణానేశ్వర్ మౌలి గార్లు తమతమ అదృశ్య శక్తితో దేవ్ బాబాకి తరచుగా మార్గదర్శకం చేస్తూండేవారు.  ఆయనకి వారి వల్ల అంతటి అదృష్టం లభించింది.  దేవ్ బాబా జ్ణానేశ్వరిని క్షుణ్ణంగా అధ్యయనం చేసి బాగా ఆకళింపు చేసుకున్నారు.  దానిమీద వ్యాఖ్యానాలు కూడా రాసి, ఆ ఆధ్యాత్మిక జ్ణాననసంపదను జన బాహుళ్యంలోకి వ్యాపింపచేయడానికి ఎన్నొ ఉపన్యాసాలను ఇచ్చారు.  జ్ణానేశ్వరి, అమృతానుభవం, వీటిలో వ్రాయబడిన జ్ణానసంబంధమయిన విషయాలలోని నిగూఢ రహస్యాలను నివృత్తి చేసుకోవడానికి శ్రీజ్ణానేశ్వర్ మౌలీగారు చాలా సార్లు ఆయనకు మార్గం చూపారు. 

దేవ్ బాబా పెద్ద సోదరుడు మాత్రమే కాదు, నా సద్గురు భావు మహరాజ్ కి ఆధ్యాత్మిక గురువు కూడా.  ఈ సందర్భంగా శ్రీ దేవ్ బాబా మాకు పరమ గురువు.

ఆ తరువాతి సంవత్సరాలలొ తమ తమ స్వధర్మాలను ఆచరిస్తూ సోదరులిద్దరూ ఆధ్యాత్మికంగా ఎంతో ఎత్తుకు ఎదిగారు.

(ఇంకా ఉంది)

(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)

No comments:

Post a Comment