Sunday, April 14, 2024

సాయిబాబా దర్శనమ్

 




14.04.2024  ఆదివారమ్

ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంధువులకు బాబా వారి శుభాశీస్సులు

 మన బ్లాగులో బాబా అనుభవాలను ప్రచురించి దాదాపు సంవత్సరం అవుతూ ఉంది.  కుటుంబ 

బాధ్యతలు తప్పించుకోలేము కదా.  నాలుగు రోజుల క్రితం బాబా చూపించిన స్వప్న సందేశం 

ప్రేరణతో మరలా ప్రారంభించాను.  సాయి భక్తులు ఎదురు చూస్తూ ఉంటారని తెలుసు.  మరలా 

బాబా దయతో పునఃప్రారంభం.


సాయిబాబా దర్శనమ్

ఈ రోజు బాబా వారు చూపించిన ఒక అద్భుతమయిన లీల మనందరి కోసం

అంతర్జాలంలో సాయి విచార్ నుండి గ్రహింపబడింది.

 

ఆంగ్లం నుండి      తెలుగు అనువాదం, ఆత్రేయపురపు త్యాగరాజు, నిజాంపేట,

హైదరాబాద్, ఫోన్ నం. 9440375411,  8143626744

పి. వి. ప్రియాంకా , బెంగళూర్ వారి అనుభవం

బాబా ఏదో ఒక రూపంలో వస్తారని సాయి భక్తులు తాము అనుభూతి చెందిన అనుభవాలను వ్రాసిన పుస్తకాలను మేము చదివాము.  కాని మనకే స్వయంగా ఆ అనుభవాలు కలిగినపుడు సాయి భక్తులు అనుభూతి చెందిన అటువంటి అనుభవాలను అర్ధం చేసుకోగలుగుతాము.

నా స్వంత అనుభవం

క్రిందటి సంవత్సరం మా కుటుంబంలో ఎన్నో ఒడిదుడుకులు కష్టాలు కలుగుతూ ఉన్నాయి.  వాటికి పరిష్కారం చూపమని బాబాని మనస్ఫూర్తిగా వేడుకొంటున్నాము.  నేను పడుకునే గదిలో నా ప్రక్కనే ఉన్న బల్ల మీద చిన్నపాటి పూజాస్థలాన్ని ఏర్పాటు చేసుకున్నాను.  ఆ బల్ల మీద బాబా విగ్రహంతోపాటు ఇంకా కొన్ని దేవుళ్ళ విగ్రహాలను కూడా పెట్టుకున్నాను.  ఉదయం లేవగానే వాటికి నమస్కరించుకున్న తరువాతే నా దైనందిన కార్యక్రమాలను ప్రారంభించేదానిని.  డిసెంబరు 31వ.తారీకున ఎప్పటిలాగానే నిద్రనుండి లేచి దేవునికి నమస్కరించుకునే సమయంలో నాకొక అద్భుతం కనిపించింది.  


ఆశ్చర్యంతో నాకళ్ళు విప్పార్చుకున్నాయి.  బల్లమీద హిందీలో ‘ఓమ్’ అనే అక్షరం కనిపించింది.  నేను మా అమ్మని, అమ్మమ్మని పిలిచి చూపించాను. వాళ్ళు కూడా ఎంతో ఉద్వేగానికి లోనయ్యారు.  సాయిబాబాయే స్వయంగా వచ్చారని ఇక మా సమస్యలన్నీ తీరిపోయే సమయం ఆసన్నమయిందనే నమ్మకం కలిగింది.  అంతే కాదు, ఓమ్ గుర్తుతో పాటు బల్లమీద చిన్న చీటీ కనిపించింది.  దాని మీద ఊదీతో మా ఆరోగ్య సమస్యలన్నీ నివారింపబడతాయని వ్రాసి ఉంది.  బాబా ఫోటో వద్ద ఊదీ పొట్లం కనిపించింది.  సరిగ్గా పది రోజుల తరువాత ఊదీతో ‘సాయి’ అని వ్రాయబడిన అక్షరాలు కనిపించాయి.  మా అందరికీ ఎంతో ఆనందం కలిగింది.

2009 ఫిబ్రవరి 8 వ.తారీకునాడు మా అమ్మమ్మ నాగదిని శుభ్రం చేస్తూ  చూసుకోకుండా బల్లమీద కనిపించిన ‘ఓమ్’ ,సాయి’ అక్షరాలను కూడా తుడిచేసింది.  అది చూసి నేనెంతగానో ఏడిచాను.  దుఃఖం ఆగలేదు.  మనసుకు చాలా తీరని వ్యధ కలిగింది.  మా అమ్మ, అమ్మమ్మల మీద చాలా కోపం వచ్చింది.  బాబా స్వయంగా అక్షరాల రూపంలో దర్శనమిచ్చారు.  అటువంటి గుర్తులను అనాలోచితంగా చెరిపేశారు.  మరలా బాబా వస్తారా?  నిర్లక్ష్యం చేసినందుకు దూరమయిపోతారా?  నా బల్ల మీద ఉన్న విగ్రహాలన్నిటినీ తీసేశాను.  మరలా బాబా వస్తేనే వాటినన్నిటిని తిరిగి యధాస్థానంలో పెడతానని మా అమ్మతో చెప్పాను.  మా అమ్మ, అమ్మమ్మ ఇద్దరూ చాలా బాధపడి ఎంతగానో రోదించారు.  తప్పు చేసినందుకు చాలా బాధపడ్డారు.  తాను చేసిన తప్పును క్షమించమని కోరడానికి మా అమ్మమ్మ బాబా మందిరానికి, ఇంకా మిగతా దేవాలయాలకు వెళ్ళి ప్రార్ధించుకుంది.  మేమెవరం సంతోషకరంగా లేము.  ఆశ్చర్యకరంగా ఈరోజు అనగా ఫిబ్రవరి 11 వ.తారీకున ‘ఓమ్’ , ‘సాయి’ అనే అక్షరాలు తిరిగి బల్ల మీద ప్రత్యక్షమయ్యాయి.  చిన్న కాగితం మీద విగ్రహాలను తిరిగి మరలా బల్లమీద యధా స్థానంలో ఉంచమనే సందేశం కనిపించింది.  ఆ సందేశం వ్రాయబడిన కాగితం మీద గుట్టగా పోసినఊదీ ఉంది.  ఇంటిలో ఎటువంటి జిగురు లేదు.  అయినా కానీ ఆ కాగితం బల్ల మీద అతికించబడి ఉంది.

నాకు, మా అమ్మకి, అమ్మమ్మకి చాలా ఉత్కంఠ భరితంగా అనిపించింది.  చెప్పలేని సంతోషం కలిగింది.  మాకు తెలిసిన కొంతమంది స్నేహితులని ఇంటికి పిలిచి చూపించాము.  వారందరూ బాబా ఊదీ తీసుకుని ఆయన దీవెనలని పొందారు.  మేమంతా ఎంతగానో సంతోషించాము.  ప్రతీ క్షణం ఆయన అనుగ్రహాన్ని అనుభవిస్తూ ఉన్నాము.

బాబా మామీద ఇంతటి అనుగ్రహాని చూపిస్తూ ఉన్నందుకు ఆయనకు మా కృతజ్ణతలు తెలియచేసుకుంటున్నాము  ధన్యవాదాలు బాబా ధన్యవాదాలు.  ఈ విధంగానే ప్రపంచ మానవాళినందరినీ అనుగ్రహిస్తు ప్రతిచోటా సుఖము, శాంతి, ప్రేమ వెల్లివిరిసేలాగా అనుగ్రహిస్తూ ఉండు బాబా.

(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)

 

 

 

 

 

 

 

 

No comments:

Post a Comment