Monday, April 15, 2024

సాయి అనుగ్రహం అపారమ్

 




15.04.2024  సోమవారం

ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

ఈ రోజు మరొక అధ్బుతమయిన సాయిబాబా అనుగ్రహం గురించి ప్రచురిస్తున్నాను.  శ్రీ సాయిలీల

ద్వైమాస పత్రిక నవంబరు, డిసెంబరు 2023 సంచికనుండి గ్రహింపబడినది.

ఆంగ్ల మూలం :  డా.క్షితిజ రాణే

తెలుగు అనువాదం ఆత్రేయపురపు త్యాగరాజు, నిజాంపేట, హైదరాబాద్

ఫోన్. 9440375411,  8143626744


సాయి అనుగ్రహం అపారమ్


“శ్రీ గోవింద రఘునాధ్ ధబోల్కర్ అనగా హేమాద్రిపంత్, సుగుణాల రాశి.  

ఆయన వేదాంత సారాన్ని క్షుణ్ణంగా అవగాహన చేసుకున్న పుణ్యశాలి.  

హేమాద్ పంత్ తాను రచించిన శ్రీ సాయి సత్ చరిత్రలో   అగాధమయిన జ్ణాన 

సారాన్ని మనకి అందించారు.  దాని ఫలితమే సద్గురు శ్రీ సాయిబాబా 

అనుగ్రహంతో ఆయన మనకు అందించిన పవిత్రమయిన గ్రంధం శ్రీ సాయి 

సత్ చరిత్ర”



శ్రీ బాలా సాహెబ్ దేవ్ గారు శ్రీ సాయి సత్ చరిత్ర గ్రంధానికి ముందుమాటలో హేమాద్ పంత్ గారిని పైన ఉదహరించినట్లుగా కీర్తించారు.  దేవ్ గారు కవులలో మాణిక్యంవంటి వారు.  ఆయన నా సద్గురువయిన భావూ మహరాజ్ అనబడే శ్రీ గజానన్ వలవాల్కర్ గారి తాతగారు.  అందుచేత సహజంగానే వలవాల్కర్ గారి కుటుంబమంతా సాయి భక్తిలో లీనమయి ఉండేవారు.

1950 వ.సంవత్సరంలో హేమాద్ పంత్ గారి మూడవ కుమార్తె కృష్ణాబాయిని గొప్ప విఠల్ భక్తుడయిన శ్రీ రాజారాం వలవాల్కర్ గారికి ఇచ్చి వివాహం చేశారు.  వివాహమయిన తరువాత కృష్ణాబాయి పేరు సీతాబాయిగా మారింది.  దంపతులిద్దరిలోను హరిభక్తి,, శక్తి ఉపాసన రెండు మేళవించి ఉన్నాయి.

దంపతులు ఇద్దరూ ఎల్లప్పుడు భగవద్భక్తి కలిగిన సాధువులు, భక్తులతో కలిసి ఉండటానికే ఇష్టపడేవారు.  తమకు మంచి భక్తి, ధర్మాన్ని ఆచరించే ఉత్తమ సంతానం కలగాలని  దేవునికి మనఃస్ఫూర్తిగా ప్రార్ధించుకుంటూ ఉండేవారు.  ఆ దంపతుల ప్రార్ధనలు వారి భక్తి భావనా తరంగాల ఫలితంగా మహిమాన్వితులయిన దేవ్ బాబా అనబడే పరమపూజ్య అనంత ప్రభుగారు, భావూ మహరాజ్ అనబడే పరమపూజ్య గజానన్ గారు జన్మించారు. 

13.04.1918 న హేమాద్ పంత్ గారి గృహం ‘సాయి నివాస్’ లో శ్రీ రాజారాం, శ్రీమతి సీతాబాయి దంపతులకి అనంత ప్రభుగారు జన్మించారు.  సీతాబాయి గర్భవతిగా ఉన్న సమయంలో గర్భానికి సంబంధించిన అనేకమయిన ఆరోగ్యసమస్యలతో బాధపడసాగింది.  సీతాబాయి ప్రాణాలు దక్కాలంటే గర్భస్రావం చేయడం ఒక్కటే మార్గమని గైనకాలజిస్టు సలహా ఇచ్చింది.  గైనకాలజిస్టు పదేపదే పట్టుబట్టి చెబుతూ ఉండటంవల్ల హేమాద్ పంత్ గారు చాలా ఆందోళనతో తీవ్రమయిన ఒత్తిడికి గురయ్యారు.  అందుచేత ఆయన రాజారాం గారిని, సీతాబాయిని షిరిడీ తీసుకువెళ్ళి సాయిబాబా పాదాలకు నమస్కరింప చేసారు.  తన బాధనంతా బాబాకు చెప్పుకున్నారు.

గర్భస్రావం చేయించవద్దని సాయిబాబా చాలా స్పష్టంగా చెప్పారు.  బాబా సీతాబాయిని ఆమె గర్భంలో ఉన్న పిండాన్ని ఆశీర్వదిస్తూ హేమాద్ పంత్ తో, “ఆందోళన చెందకు, ఎటువంటి ప్రతికూల పరిస్థితులు ఎదురవకుండా సుఖప్రసవం అవుతుంది.  తల్లి, బిడ్డ క్షేమంగాను, ఆరోగ్యంగాను. ఉంటారు.  పిల్లవాడు అపారమయిన తెలివితేటలు కలిగి, నా అవతారంగా కీర్తిపొందుతాడు” అన్నారు.

బాబా ఇచ్చిన మాట ప్రకారం ఎటువంటి కష్టం లేకుండా సీతాబాయికి సుఖప్రసవం అయింది.

(ప్రసవ సమయంలో జరిగిన అధ్బుత దృశ్యం, ఏమి జరిగింది? భయపడిన తల్లి  )

రేపటి సంచికలో

(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)

No comments:

Post a Comment