Monday, May 6, 2024

సాయి అనుగ్రహం అపారమ్ – 11 వ.భాగమ్

 



06.05.2024 సోమవారమ్

ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బందువులకు బాబావారి శుభాశీస్సులు

 శ్రీ సాయిలీల ద్వైమాస పత్రిక నవంబరు, డిసెంబరు 2023 సంచికనుండి గ్రహింపబడినది.

ఆంగ్ల మూలం :  డా.క్షితిజ రాణే

తెలుగు అనువాదం ఆత్రేయపురపు త్యాగరాజు, నిజాంపేట, హైదరాబాద్

ఫోన్. 9440375411,  8143626744

సాయి అనుగ్రహం అపారమ్ – 11 వ.భాగమ్

జాదవ్ గారు హాయిగా ఊపిరి పీల్చుకున్నారు.  ఆయనలో అంతవరకు ఉన్న ఆందోళనంతా మటుమాయమయిపోయింది.  ఈ వార్త భావూ మహరాజ్ గారితో ఎప్పుడెప్పుడు చెబుదామా అని పట్టరాని సంతోషంతో ఇంటికి చేరుకున్నారు.  ఇంటికి చేరుకోగానే ఆయన మొట్టమొదటగా భావూ మహరాజ్ గారి పాదాలకు సాష్టాంగపడ్డారు.  భావూ మహరాజ్ ఆయనను ఎంతో వాత్వల్యంతో పైకి లేవనెత్తి ఆయన చెప్పిన విషయమంతా జాగ్రత్తగా ఆలకించారు. 


అపుడాయన ఎంతో కరుణతో జాదవ్ గారితో, “సాయిబాబా నీ మెడలో ‘విజయమాల’ను వేసి ఎపుడోనే ఆశీర్వదించారు.  మొదటగా ఆయనకి నమస్కారం చేసుకో’ అన్నారు.  గుండెలనిండా ఎంతో భక్తిని, వినయాన్ని నింపుకుని సాయిమహరాజ్ పాదాలకు సాష్టాంగ దండ ప్రణామాలను అర్పించుకుని ధన్యవాదాలు తెలుపుకున్నారు.

జాదవ్ గారి కోసం భావూ మహరాజ్ గారి ప్రార్ధనలకు స్పంధించి సాయిబాబా తన అనుగ్రహాన్ని చూపడానికి కారణం జాదవ్ గారు అవినీతిపై చేసే పోరాటం, అందుకు ఆయన తగిన వ్యక్తి కావడమే.

తన అంకిత భక్తులు కోరిన వెంటనే భగవంతుడు వారికి సహాయపడటానికి సిధ్ధంగా ఉంటాడు.

తన మీద అచంచలమైన, సంపూర్ణ విశ్వాసం ఉన్నవారి భక్తుల ప్రార్ధనలకు శిరసావహించి అనుగ్రహిస్తారు.     శ్రీ సాయి సత్ చరిత్ర

భావూ మహరాజ్ 26.02.1998 వ.సం.లో పరమపదించారు.  ఆ తరువాతి రోజు 27.02.1998 న ఆయన పార్ధివ దేహాన్ని అంత్యక్రియలకోసం జగదీష్ జాదవ్ గారి గృహంనుండి సి.బి.డి బేలాపూర్ లోని స్మశానానికి తీసుకువెళ్ళే సమయం.

తమ ప్రియతమ సద్గురువుకు ఆఖరి వీడ్కోలు తెలుపడానికి జాదవ్ గారి గృహమంతా భక్తులతో నిండిపోయింది.  భావూ మహరాజ్ గారిని చివరి సారిగా దర్శించుకోవడానికి వచ్చిన భక్తులందరూ బరువెక్కిన హృదయాలతో  కళ్ళంబట కన్నీరు కారుస్తూ విచార వదనాలతో నిలబడి ఉన్నారు.   ఇంటివద్ద జరగవలసిన కార్యక్రమాలన్నీ పూర్తయిన తరువాత శవయాత్ర ప్రారంభమయింది.  ఆ సమయంలో విశ్రాంత లెఫ్టినెంట్ కల్నల్, ఎప్పటినుండో ఆయన భక్తుడయిన శ్రీ జై సింగ్ సావంత్ గారికి ఒక అధ్భుత దృశ్యం కనడింది.  శ్రీ సాయిబాబా, శ్రీ స్వామి సమర్ధ ఇద్దరూ తమ తమ సగుణ రూపాలతో భావూ మహరాజ్ గారి శవయత్రలో భక్తులందరితోపాటు అనుసరిస్తూ కనిపించారు.  దైవసంబంధమయిన ఈ అధ్బుత దృశ్యం శ్రీ సావంత్ గారికి స్మశానవాటిక గేటు వరకు కనిపించింది.  బహుశ ఆ మహాత్ములు ఇద్దరూ భావు మహరాజ్ గారి పార్ధివ దేహాన్ని అంత్యక్రియలకు వదలి, ఆయన పవిత్రాత్మను ఇక్కడినుంచే మరొక అత్యుత్తమమయిన కార్యానికి వినియోగించే నిమిత్తం తమతో తీసుకుని వెళ్ళి ఉండవచ్చు.  ఈ అసాధారణమయిన అధ్బుతమయిన దృశ్యం ఆధ్యాత్మిక ప్రపంచంలో భావూ మహరాజ్ గారియొక్క ఉన్నతస్థితి ఎటువంటిదో తెలియచేస్తుంది.

భావూ మహరాజ్ తన స్వంత కొడుకులా అభిమానించే శ్రీ జాదవ్ గారు, భావూ మహరాజ్ గారి భార్య శ్రీమతి లీలావతి వాల్కర్, ఆయన కుమార్తె, శ్రీమతి స్మితా మాత్రే, వీరు ముగ్గురూ ఆయన ప్రేమను, ఆయన సాన్నిధ్యాన్ని కోల్పోయారు. ఆయన లేకపోవడం వారికి తీరని లోటు.

(తరువాతి సంచికలో ఆఖరి భాగం)

(సర్వం శ్రీ సాయినాధార్పణమాస్తు)

 

No comments:

Post a Comment