Friday, May 3, 2024

సాయి అనుగ్రహం అపారమ్ – 10 వ.భాగమ్

 




03.05.2024 శుక్రవారమ్

ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బందువులకు బాబావారి శుభాశీస్సులు

 శ్రీ సాయిలీల ద్వైమాస పత్రిక నవంబరు, డిసెంబరు 2023 సంచికనుండి గ్రహింపబడినది.

ఆంగ్ల మూలం :  డా.క్షితిజ రాణే

తెలుగు అనువాదం ఆత్రేయపురపు త్యాగరాజు, నిజాంపేట, హైదరాబాద్

ఫోన్. 9440375411,  8143626744

సాయి అనుగ్రహం అపారమ్ – 10 వ.భాగమ్

కోర్టులో జాదవ్  గారు హాజరు  కావలసిన రోజు.  ఆరోజే జడ్జిగారు విచారణ చేసి తీర్పు చెప్పే రోజు.  జాదవ్ గారు కోర్టుకు వెళ్లడానికి పోలీస్ యూనిఫారం ధరించి సిధ్ధంగా ఉన్నారు.  బయలుదేరేముందు ఆయన సద్గురు భావు మహారాజ్ (భావూ మహరాజ్ తన జీవితంలో గత ఏడు సంవత్సరాలుగా జాదవ్ గారి ఇంటిలోనే ఉన్నారు) ముందు కూర్చున్నారు.  


జాదవ్ గారిలోని ఆందోళనను గమనించి కారణం ఏమిటని ప్రశ్నించారు భావు మహరాజ్.  భావు గారికి విషయమంతా పూర్తిగా వివరించారు జాదవ్ గారు.  అంతా విన్న తరువాత భావుగారు కళ్ళు మూసుకుని ధ్యాన స్థితిలోకి వెళ్ళి ఏదో గొణుగుకోవడం మొదలుపెట్టారు.  జాదవ్ గారు కూర్చున్న చోట గోడ మీద సాయిబాబా పటం తగిలించి ఉంది.  

అదే క్షణంలో బాబా ఫోటోకి వేసి ఉన్న పూలదండ జాదవ్ గారి మెడలో పడింది. భావూ మహరాజ్ కండ్లు తెఱచి జాదవ్ గారిని దీవిస్తూ, “వెళ్ళు, ఆ ఫైలు ఎక్కడయితే ఉంటుందని అనుకుంటున్నావో అక్కడే వెతుకు.  ఖచ్చితంగా నీకాఫైలు అక్కడే దొరుకుతుంది.  కోర్టువారు  నీమీద ఎటువంటి చర్య తీసుకోరు” అన్నారు.  అంతవరకు ఎంతో ఆందోళనతో ఉన్న జాదవ్ గారికి ఒక్కసారిగా హృదయ భారం తీరిపోయింది.  భావూ మహరాజ్ గారి పాదాల మీద సాష్టాంగపడి నమస్కారం చేసుకుని వెంటనే సాక్ష్యం సేకరించడానికి బయలుదేరారు.

జాదవ్ గారు త్వరత్వరగా ప్రధాన క్రైం బ్రాంచ్ కార్యాలయానికి చేరుకున్నారు.  లోపలికి వెళ్లగానే ఆయన ఆశ్చర్యానికి అంతులేదు.  తనకు అంతకు ముందువరకు ఏ విధంగానూ సహకరించని ఆఫీసర్ మరొక కార్యాలయానికి బదిలీ అయి వెళ్ళిపోయాడు.  ఆయన స్థానంలో తన చిన్ననాటి స్నేహితుడు చార్జి తీసుకున్నాడు.  తన స్నేహితుడిని చూడటం వల్లనే ఆయనకి అంతగా ఆశ్చర్యం కలిగింది.  ఖాద్రీయే అసలయిన దోషి అని నిరూపించే సాక్ష్యాన్ని ఎంత తొందరగా వీలయితే అంత తొందరగా కోర్టులో సమర్పించాల్సిన అవసరం ఉంది.  అది దృష్టిలో పెట్టుకుని జాదవ్ గారు, ఆయన స్నేహితుడు ఇంకా ముగ్గురు కానిస్టేబుల్స్ అందరూ రికార్డు రూములో కావలసిన ఫైల్ గురించి వెతకడం మొదలుపెట్టారు.  అక్కడ ముఫై  సంవత్సరాల నాటి రికార్డులు భద్రపరచబడి ఉన్నాయి.  ఎంతో శ్రమించి వెతికిన మీదట అదృష్టవశాత్తు సాక్ష్యానికి సంబంధించిన ఫైల్ దొరికింది.  బాగా దుమ్ముపట్టి ఉన్న రికార్డులన్నిటినీ తిరగేసి వెదికిన కారణంగా అందరి మీదా బాగా దుమ్ము పడిపోయింది.  అయినా గాని వారి పెదవుల మీద సంతోషంతో కూడిన చిరునవ్వువులు నాట్యమాడ సాగాయి.  అందరి వదనాలలో ఒక విధమయిన వెలుగు.  అనుకున్నది సాధించామన్న ఆనందమ్.  వారు పడిన శ్రమ నిజంగా మెచ్చుకోదగ్గది.

జాదవ్ గారు  ఆలశ్యం చేయకుండా వెంటనే పైలు పట్టుకుని కోర్టుకు చేరుకున్నారు.  కోర్టులో అప్పటికే విచారణ మొదలయింది. జాదవ్  గారు కోర్టుకు రానందువల్ల కేసుని మూసివేయబోతూ ఉన్న సమయం.    సరిగా అదే క్షణంలో జాదవ్ గారు వేగంగా పరుతెత్తుకుంటూ వచ్చి తన అడ్వకేట్ కి ఫైలుని అందించారు.  అడ్వొకేట్ ఆ ఫైలుని జడ్జిగారి ముందు పెట్టారు.  ఒక్క ముంబాయిలోనే ఖాద్రీ మీద నలభై కేసులు రిజిస్టర్ అయి ఉన్నాయనడానికి ఆ ఫైలే ఋజువు.  తిరుగులేని సాక్ష్యాధారం.  దాని ఆధారంగా శ్రీ జాదవ్ గారు ఎటువంటి తప్పిదం చేయలేదని నిర్ధారిస్తూ సాక్ష్యాలను పరిశీలించిన మీదట ఖాద్రీని అరెస్టు చేయాలని జడ్జీ  తీర్పు చెప్పారు.

(ఇంకా ఉంది)

(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)


No comments:

Post a Comment