Monday, February 23, 2026

శ్రీ సాయిమహరాజ్ ప్రసాదించిన అధ్భుత అనుభవాలు… 8 వ.భాగమ్


24.02.2026 మంగళవారమ్

ఓం సాయి శ్రీ సాయి జయయయ సాయి

సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

శ్రీ సాయిలీల ద్వైమాస పత్రిక నవంబరు, డిసెంబరు, 2025 సంచికలో ప్రచురింపబడిన బాబా లీలలు. (సెప్టెంబరు, అక్టోబరు, 2025 సంచికలో ప్రచురింపబడినవాటికి కొనసాగింపు)

శ్రీ సాయి మహరాజ్ ప్రసాదించిన అధ్బుత అనుభవాలు

శ్రీ సాయిబాబా వారి పవిత్రమయిన ఊదీ యదార్ధ సంఘటనల ఆధారంగా జరిగిన ఆధ్యాత్మిక గాధ.

శ్రీ సాయిమహరాజ్ ప్రసాదించిన అధ్భుత అనుభవాలు 8 .భాగమ్

మరాఠీ నుండి ఆంగ్లానువాదం..  షంషాద్ మీర్జా

తెలుగు అనువాదం .. ఆత్రేయపురపు త్యాగరాజు,

నిజాంపేట, హైదరాబాద్,

ఫోన్ --  9440375411 & 81436267

 మెయిల్.. tyagaraju.a@gmail.com

బయలుదేరేముందుగా సూచనలు, ఆలోచనలు

తిరుగు ప్రయాణంలొ గుఱ్ఱం బండి ఎక్కాము.  ఎక్కి కూర్చున్న తరువాత నా మనసులో రెండు ఆలోచనలు కలిగాయి.

1. ఈ రోజు బుధవారం.  కొంతమంది నమ్మకం ప్రకారం బుధవారమునాడు బయలుదేరితే తిరిగి రావడం గాని, కలుసుకోవడం గాని జరుగదు అని---

2. నేను కన్నోడ్ కి చేరుకుంటే నేను ప్రతిరోజు సాయిబాబాను పూజిస్తాను…

నా మనసులో మెదిలిన మొదటి ఆలోచన ఎంత త్వరగా ప్రవేశించిందో అంత త్వరగానే మాయమైపోయింది.  సమర్ధ సద్గురు సాయినాధుని దృష్టిలో అన్ని రోజులూ మంచివే.  రెండవ ఆలోచన నా మనసులో వ్రేళ్లతో మొలకెత్తింది.


మేము షిరిడీ నుండి బయలుదేరాము.  ప్రయాణంలో చిన్న చిన్న అడ్దంకులు ఎదురయినప్పటికీ అడుగడుగునా బాబాగారి అనుగ్రహం మా వెంట వస్తూనే ఉంది.  గురువారం ఉదయానికి మేము హార్దా చేరుకొన్నాము.

షిరిడీకి తిరిగి రమ్మని పిలుపు … తీసుకురావడం మరచిన ఊదీని తీసుకునివచ్చుట


                                                 (సాధూ భయ్య)

మా కుటుంబాన్ని నెమావర్ కి పంపించి నేను సాధూభయ్యా గారిని కలవడానికి వెళ్ళాను.  ఆయన నాకు తినుబండారాలను పెట్టి తినమని బలవంతం చేశారు.  నేను నా షిరిడీ అనుభవాలను ఆయనతో పంచుకున్నాను.

ఇక నేను ఆయన వద్దనుండి శలవు తీసుకుని వెళ్ళబోతుండగా అకస్మాత్తుగా ఆయన “మాకోసం మీరు ఊదీ తీసుకురాలేదా?” అని అడిగారు.

ఆయన ప్రశ్నకు ఒక్కసారిగా ఉలిక్కిపడి, నా జేబులోనుండి ఊదీ పొట్లాన్ని తీసి ఆయనకిచ్చాను.

ఆయన తనకు అంతా తెలుసునన్నట్లుగా నవ్వుతూ “అందువల్లనే సాయిబాబా తిరిగి మిమ్మల్ని షిరిడీకి వెళ్ళేలా చేసారు”.

అప్పుడే నా కర్ధమయింది.  మేము షిరిడీకి బయలుదేరడం ఎందుకని ఆలశ్యమయిందో, రైలు ఎందుకని తప్పిపోయిందో, సైకిల్ ఎందుకని పంక్చర్ అయిందో.  సాధూభయ్యా గారికి ఊదీని అందచేయడానికే అంతా సాయిబాబా గారు చేసిన దివ్యమయిన ప్రణాళిక.

నర్మదానది ఒడ్డున పూజా ప్రారంభం…

నేను నెమావర్ కి చేరుకొన్నాను.  అక్కడ నర్మదా నదిలో స్నానం చేసి నది ఒడ్డున మవునంగా నిల్చుని ఉన్నాను.

నదిలో నీటిపై తేలియాడుతూ ఉన్న తెల్లని పూలని గమనిస్తూ ఉన్నాను.  షిరిడీని విడిచి వెళ్ళేటప్పుడు నాలో కలిగిన భావోద్వేగాలు గుర్తుకు వచ్చాయి.  నదిలో తేలుగున్న తెల్లని పూలను సేకరించాను.  బాబా ఫోటోను తీసి నది ఒడ్డున పెట్టి ఆ పూలను భక్తితో ఆయనకు సమర్పించి పూజించాను.

నేను నామనసులో బాస చేసుకున్న ప్రకారం ఆ మరుసటిరోజునుండి కన్నోడ్ లో సాయిబాబాకు ప్రతిదినం పూజ చేయడం ప్రారంభించాను.

చివరగా న మనసులో ప్రతిబింబిస్తున్న విషయాలు…..

దారిలో ఎదురయ్యే ప్రతి అడ్డంకికి, ప్రతి మలుపుకి ఒక అర్ధం ఉంది.

ప్రయాణంలో కలిగిన ఆలశ్యం సాయిబాబా గారి నిర్ణయం ప్రకారమే జరిగిందనటంలో ఎటువంటి సందేహం లేదు.

ఆయన జ్వరంతో బాధపడుతున్నా గాని మాకు దర్శనం ఇచ్చారు.  ఆయన ఊదీ ద్వారా స్వస్థత కలిగించారు.

పాలుపోసే వ్యక్తి ద్వారా ప్రసాదం సమర్పించుకునేలా చేసారు.

ఊదీని మరచి ప్రయాణమయినపుడు తిరిగి వెనుకకు వచ్చేలా చేసి ఊదీని అందచేసారు.

అంతా సద్గురు సాయిబాబావారి లీల. ఆయన లీలలు చాలా సూక్ష్మంగాను, ఎవ్వరూ ఊహించని విధంగాను ఉండి నిరంతరం పొంగి పొర్లుతూ ఉంటాయి.

ఆయన ప్రేమ అనంతం.

షిరిడీని వీడడమంటే ఇంటికి తిరిగి రావడం.

ఆయనను దర్శించుకోవడానికి చేసే ప్రయాణం మన మనసులోను, ఈ విశ్వంలోను, ఆత్మలోను ముందుగానే లిఖింపబడి ఉంటుంది.

నారాయణ్ పురుషోత్తం అవస్థి…పూనా.

శ్రీ సాయిలీల సం.8 సంచిక 4

(తరువాతి సంచికలో ఇంకా కొనసాగింపు)

సూక్ష్మంగా చూపించిన లీల ....  మా స్వీయానుభవమ్ (త్యాగరాజు)

ఈ నెల తొమ్మిదవ తారీకునాడు మేము షిరిడీని దర్శించినపుడు జరిగిన సూక్ష్మమయిన లీల వివరిస్తాను.  అవి మనం ఊహించని విధంగా ఉండి పదే పదే ఆయన మహిమలను గుర్తుకు తెస్తూ ఉంటాయి.

మేము ఈ నెల అనగా ఫిబ్రవరి తొమ్మిదవ తారీకున షిరిడీ చేరుకుని ఉదయం పది గంటలకు బాబాను దర్సించుకోవడానికి నేను, నా భార్య, మా పెద్ద కుమార్తె, మా మనవరాలు అందరం బాబా మందిరం వద్దకు చేరుకొన్నాము. అక్కడ బాబాకు సమర్పించడానికి గులాబీ పూల గుత్తులను కొన్నాము.   క్యూ వరసలోకి ప్రవేశించాము.  భకులందరం క్రమ పద్ధతిలో వెడుతూ ఉండగా, మా అమ్మాయి పూల గుత్తిని పైకి ఎత్తి పట్టుకుని నడవసాగింది.  మా మనవరాలు పూలగుత్తిని ఎందుకలా పైకి ఎత్తి పట్టుకుని నడుస్తున్నావు అని అడిగింది.  అప్పుడు మా అమ్మాయి ఆ పూలు ఎవరి తలకైనా గాని జుట్టుకి గాని తగిలితె బాబాకి ఇవ్వడానికి నాకు ఇష్టం ఉండదు, అందుకనే అలా పట్టుకున్నాను అంది.  ఆ తరవాత వెనకాల ఒకాయన చిన్న పిల్లని చంకలో ఎత్తుకుని ఉన్నారు.  ఆయన చంకలో ఉన్న చిన్నపిల్లకు మూడు సంవత్సరాలు ఉంటాయి.  ఆ పిల్ల తన తలను మా అమ్మాయి పైకి ఎత్తి పట్టుకున్న పూల గుత్తి మీద తాకించింది.  ఇది బాబా చూపించిన లీల కాదా?  ఇప్పుడు నాకు పూలగుత్తిని సమర్పిస్తావా లేదా అని పరీక్ష పెట్టడమే.  మనం ఇంకొక విధంగా కూడా భావించవచ్చు.  ఆ పిల్లలో ఉన్నది కూడా నేనే కదా అని.  బాబా సత్ చరిత్రలో అందరిలోను, అన్ని జీవులలోను నన్ను చూడు అని చెప్పారు కదా!  ఇటువంటివే సూక్ష్మ లీలలు అంటే.  వినడానికి అనుభవించడానికి చాలా చిన్నవే గాని అందులో బాబా లీలలను మనం గ్రహించుకోవాలి.  

(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)

 

No comments:

Post a Comment