Wednesday, April 1, 2026

శ్రీ సాయిమహరాజ్ ప్రసాదించిన అధ్భుత అనుభవాలు… 10 వ.భాగమ్



 



02.04.2026 గురువారమ్

ఓం సాయి శ్రీ సాయి జయయయ సాయి

సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

తెలుగు నూతన సంవత్సర శుభా కాంక్షలు

శ్రీ సాయిలీల ద్వైమాస పత్రిక జనవరి, ఫిబ్రవరి, 2026 సంచికలో ప్రచురింపబడిన బాబా లీలలు. (నవంబరు, డిసెంబరు, 2025 సంచికలో ప్రచురింపబడినవాటికి కొనసాగింపు)

శ్రీ సాయి మహరాజ్ ప్రసాదించిన అధ్బుత అనుభవాలు

శ్రీ సాయిబాబా వారి పవిత్రమయిన ఊదీ యదార్ధ సంఘటనల ఆధారంగా జరిగిన ఆధ్యాత్మిక గాధ.

శ్రీ సాయిమహరాజ్ ప్రసాదించిన అధ్భుత అనుభవాలు 10 వ.భాగమ్

మరాఠీ నుండి ఆంగ్లానువాదం..  షంషాద్ మీర్జా

తెలుగు అనువాదం .. ఆత్రేయపురపు త్యాగరాజు,

నిజాంపేట, హైదరాబాద్,

ఫోన్ --  9440375411 & 81436267

ఈ మెయిల్.. tyagaraju.a@gmail.com

శ్రీ సాయిబాబా వారి పవిత్రమయిన ఊదీ – మాహాత్మ్యమ్

 భావూ సాహెబ్ సన్నిహితులకి, బాబా భక్తులకి ఒక విషయం బాగా అర్ధమయింది.  అదేమిటంటే వ్యాధి నయమయిందంటే దానికి కారణం గురువు మీద ఉన్న ప్రగాఢమయిన భక్తి ఒక్కటే వ్యాధిని నయం చేయడం కాదు, గురువుయొక్క అనుగ్రహం వారికి రక్షణగా ఉంటూ అనుకోని ఆపదలనుండి కాపాడుతూ ఉంటుందని. 


ఇది చిన్న సంఘటనే కావచ్చు.  కాని ఇది మట్టుకు మనలో నిరంతరం గుర్తుండిపోయే ఒక  పెద్ద  సంఘటనలాగ మనలో ఉండిపోతుంది.  నమ్మకం పూర్తిగా ఉన్నట్లయితే అంధకారంలో ఏమి చేయాలో తెలియని పరిస్థితులలో గురువు అనుగ్రహం వల్లనే మనలో వివేకం, శక్తి మేల్కొంటాయి.

చాలా మంది తమకు తామే గురువులమని చెప్పుకొంటూ ఉంటారు.  కాని అరుదయిన గురువు మాత్రమే తనను అనుసరించే వారిలో ఉన్న బాధల బరువుని తేలికయేలా చేస్తారు.

అటువంటి అరుదయిన గురువు లభించడం చాలా చాలా అరుదు.  సాయిబాబా భక్తులు బాబాయే తమను బాధలనుండి తప్పించుకునేలా మార్గదర్శకత్వం చేస్తారనీ, సంశయాలనుండి ప్రమాదాలనుండి వెలకట్టలేని ప్రేమతో కాపాడుతూ ఉంటారనే విషయాన్ని గ్రహించుకోగలరు.

సహస్రబుద్ధే (పూనే)

తేదీ. 29.04.1931

శ్రీ సాయిలీల సంచిక.8, సం.4

నాసిక్ లో పిల్లవాడి ప్రాణం ఊదీ వల్లనే రక్షింపబడుట

దశాబ్దాల తరబడి సాయిబాబా వారి అనుగ్రహం ఆయన భక్తులు నిస్సహాయ స్థితిలో ఉన్న సమయంలో అందుతూనే ఉంది.  ఆయన అదృశ్యంగా ఉండి తన భక్తులను కాపాడిన సంఘటనలు లెక్కలేనన్ని సజీవ సాక్ష్యాలుగా ఇప్పటికీ మనకు కనబడుతూనే ఉన్నాయి.  నిరాశలో కూరుకుని పోయి ఉన్న స్థితిలో, నమ్మకం ఒక్కటే తనకి రక్షణ అనే ఆశతో ఉన్న వ్యక్తికి అటువంటి సంఘటన ఒకటి నాసిక్ లో జరిగింది.

నేను ఎప్పటినుండో సాయిభక్తునిగా ఉన్నాను.  ఆయన అనుగ్రహంతో నాసిక్ లో నేనొక ఇంటిని కొనుక్కోగలిగాను.  క్రిందటి వేసవికాలంలో కీ.శే. మాధవరావు (లాయర్) చితలే కుటుంబం, వారు నివసించే ప్రాంతంలో ఎండవేడిమి చాలా ఎక్కువగా ఉండటం వల్ల ఉపశమనం కోశం ఆయన భార్య శ్రీమతి గంగుతాయి, వారి అబ్బాయి గజానన్, అమ్మాయి సుశీల దర్యాపూర్ నుండి మాయింటికి వచ్చారు.

కాని కొద్ది రోజులలోనే ఒక దురదృష్టకర సంఘటన జరిగింది.  అమ్మాయి సుశీలకు హటాత్తుగా బాగా సుస్తీ చేసింది.  ఆమెకు జ్వరం 106 డిగ్రీల వరకు ఉంది.  అందరూ ఎంతగానో ఖంగారు పడ్డారు.

వైద్యులను పిలిపించారు.  వారు మందులు ఇచ్చారు గాని ఎటువంటి గుణం కనిపించలేదు.  కుటుంబమంతా అమ్మాయి పరిస్థితి దిగజారుతూ ఉండటంతో ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో పడిపోయారు.  అమ్మాయి కోలుకుంటుందనే ఆశ కూడా అడుగంటింది.

అటువంటి సమయంలో నాకు తెలుసున్న వైద్యం ఒకే ఒక్కటి కనిపించింది.  అదే బాబా ఊదీ.  చిటికెడు ఊదీ ఆమె నోటిలో వేసి ధూపం వేశాను.  బాబా ఫొటో ఒకటి ఆమె తలగడ ప్రక్కన పెట్టాను.

చేతులు జోడించి మనసులోనే బాబాను ప్రార్ధించాను.

“ఓ! సాయినాధా! మా ఇంటికి విశ్రాంతి కోసం వచ్చిన ఈ పాప ఎటువంటి పాపమెరుగదు.  ఈ అమ్మాయిని కాపాడు.  అమ్మాయిని  నువ్వు మాత్రమే రక్షించగలవు.”

బాబావారి స్పందన ఆయన ఊదీ చేసిన  అధ్బుతం ఏమాత్రం తక్కువకాదు.  హెచ్చుగా ఉన్న జ్వరం రెండు గంటలలోనే తగ్గడం మొదలయింది.  రాత్రి అయేటప్పటికి అమ్మాయిలో కదలిక వచ్చి మెల్లగా స్పృహలోకి వచ్చింది.

ఆ తరువాత కొద్ది రోజులలోనే సుశీల పూర్తిగా కోలుకుంది.  చాలా రోజులుగా ఎటువంటి నయం చేయని మందు బాబా అనుగ్రహం కొద్ది గంటలలోనే నయం చేసింది.  ఇక అమ్మాయి మామూలు స్థితిలోకి వచ్చి మంచి ఆరోగ్యంతో హుషారుగా ఉంది.

అ కుటుంబం క్షేమంగా వారి స్వస్థలమయిన దర్యాపూర్ కి బయలుదేరారు.  వారి కృతజ్ఞత చెప్పనలవికానిది.  బాబాగారి శాశ్వత నిధి కోసం వారు నాకు అయిదు రూపాయలు దక్షిణగా ఇచ్చారు.  ఆ సొమ్ము మనీ ఆర్డర్ ద్వారా శాశ్వత నిధిలో జమ చేయడానికి మీకు పంపించాను.                                           

                        (లక్ష్మణ్ గోవింద్ ముంగి)

లక్ష్మణ్ గోవింద్ ముంగి 

ఇండి నెం.43, మెయిన్ రోడ్, నాసిక్

శ్రీ సాయిలీల, సంచిక, 8 శ్రావణమాసమ్

(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)

(ఇంకా ఉంది)

No comments:

Post a Comment