Sunday, June 21, 2026



22.06.2026  సోమవారమ్

ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

శ్రీ సాయి లీల ద్వైమాస పత్రిక మార్చ్, ఏప్రిల్, 2026, సంచికలో ప్రచురింపబడిన బాబాలీలలు. (నవంబరు, డిసెంబర్, 2025, సంచికలో ప్రచురింపబడినవాటికి కొనసాగింపు)

శ్రీ సాయిమహరాజ్ ప్రసాదించిన అధ్బుత అనుభవాలు … 13 వ.భాగమ్

మరాఠీనుండి ఆంగ్లానువాదం … షంషాద్ మీర్జా

తెలుగు అనువాదం …  ఆత్రేయపురపు త్యాగరాజు,

నిజాంపేట, హైదరాబాద్

ఫోన్ --- 9440375411 & 8143626744

ఈ మెయిల్ …  tyagaraju.a@gmail.com

శ్రీ సాయిబాబావారి పవిత్రమయిన ఊదీ – మాహాత్మ్యమ్

నమ్మకము ముందు ఓడిన డిఫ్తీరియా - 2 చివరి భాగమ్

ఆస్పత్రిలో డా.ఖనోల్కర్ గారు పాప గొతును పరీక్షించి వ్యాధి నిర్ధారణను ధృవీకరించారు.  ఆయన ముఖంలో ఆందోళన కనిపించింది.  “వెంటనే పాపకి యాంటీ టాక్సిన్” ఇంజక్షన్ ఇవ్వండి అని అధికార స్వరంతో ఆదేశించారు.

అయితే ఒక సమస్య వచ్చి పడింది.  ఆ ఇంజక్షన్ కనక ఆస్పత్రిలో ఇచ్చినట్లయితే, పాపని వెంటనే ఆర్ధర్ రోడ్ లో ఉన్న అంటువ్యాధుల ఆస్పత్రికి తరలించాల్సి ఉంటుంది.  పాపయొక్క చిన్న వయసు, సున్నిత స్వభావాన్ని దృష్టిలో పెట్టుకుని, అటువంటి భయానక పరిస్థితిలో కుటుంబ సభ్యులనుండి పాపని వేరుగా ఉంచినట్లయితే పాపయొక్క మనోధర్యం మరింతగా బలహీన పడవచ్చు.


అందువల్ల ఒక నిర్ణయానికి వచ్చారు.

ఇంటిలోనే ప్రత్యేకంగా ఒక గదిలో పాపని విడిగా ఉంచి వైద్యం చేయించడం.  అప్పుడు కుటుంబ సభ్యులందరూ దూరంగా ఉంటూ చాలా జాగ్రత్తగా ఉంటారు.  పాపని తిరిగి ఇంటికి తీసుకువచ్చారు.  పాప మేనమామ ఆస్పత్రినుండి ఇంజక్షన్ తీసుకువచ్చాడు.  మధ్యాహ్నానికి పూర్తి స్థాయిలో వైద్యం మొదలయింది.

వ్యాధి చాలా వేగంగా ముదిరింది.  గొంతునిండా విశాలమయిన పసుపురంగు పొర ఏర్పడింది.  అది శ్వాసను అడ్డుకునేంతగా పెరిగింది.  అయినా అనుకున్న రీతిలో వైద్య పర్యవేక్షణ, బాబా పాదాలవద్ద నిరంతరం  చేసిన ప్రార్ధనల వల్ల కాస్త మార్పు ప్రారంభమయింది.

మూడవరోజు బుధవారం గొంతులో భయంకరంగా ఉన్న పొర వదులై పూర్తిగా బయటకు వచ్చేసింది.  వెంటనే దానిని మంటపెట్టి కాల్చేసారు.  భయంకరమయిన వ్యాధికి అది ఒక ముగింపు.

ఆ తరువాత అందరూ ఆశ్చర్యపడే విధంగా అప్పటినుండి పాప ఆరోగ్య పరిస్థితి త్వరగానే మెరుగయింది.  ఎటువంటి విషమ పరిస్థితినయినా ఎదుర్కోవడానికి సిధ్ధంగా ఉండమని చెప్పిన డా.ఖనోల్కర్ గారు కూడా ఊరట చెంది సంతోషించారు.

పాప బతుకుతుందనే ఆశ చాలా తక్కువని తాను భావించానని డాక్టర్ నిజాయితీగా ఒప్పుకున్నాడు.  అయినా గాని పాప ప్రాణాలతో బయట పడిందంటే దానికి కారణం కేవలం మందులవల్లనే కాదనీ, శ్రీసాయిబాబా వారి కరుణాసాగరం వాటి ద్వారా ప్రవహించడం వల్లేననీ మాకు తెలుసు.

అదే సమయంలో వ్యాధి మరింతగా వ్యాపించకుండా ముందు జాగ్రత్తగా ఇంటిలోని వారందరూ రోజుకు రెండు సార్లు చికిత్సలో భాగంగా మందులు వాడాల్సి వచ్చింది.

బాబా అనుగ్రహం వల్ల కుటుంబంలోని ఏఒక్కరికీ వ్యాధి సోకలేదు.  గతం గుర్తు చేసుకుంటే ఆ జ్ఞాపకాలు, వేదన అనుభవించిన క్షణాలు ఇప్పటికీ నాకు భీతి గొలుపుతూ ఉంటాయి. 

కాని, భయంతోపాటు అపారమయిన కృతజ్ఞత కూడా ఉంది.  అంధకారంలో కొట్టుమిట్లాడుతున్న మాకు సాయి అడుగడుగునా మార్గం చూపారు.  మంచి పరిజ్ఞానం గల వైద్యుల ద్వారా తన ఊదీని రక్షణ కవచంగా పాపను కాపాడి, అంతర్గతంగా మాలో తట్టుకునే శక్తిని నింపారు.

నేను ఈ విషయాలన్నీ పూర్తి వివరాలతో పాఠకుల ప్రయోజనం కోసం, నాతోటి సాయిభక్తుల కోసం వ్రాస్తున్నాను.  లౌకిక మార్గాలన్నీ అనిశ్చితంగా కనిపించినపుడు బాబా తన పిల్లలని ఎన్నడు విడిచిపెట్టరని వారు తెలుసుకోవాలి.  ఆయన సంరక్షణ ఎప్పుడూ ఉరుములు ఉరిమినట్లుగా అధ్భుతాల రూపంలో ఉండదు.  కాని బాబా మనలను అటువంటి సంకట పరిస్థితులు ఎదురయినపుడు మనలను రక్షించడానికి సరైన వ్యక్తుల వద్దకు, సరైన పనుల వద్దకు సరైన సమయానికి మనలను పయనింపచేస్తారు.  ఆయన మనకు చేసే దిశానిర్దేశం చాలా సున్నితంగా ఉంటుంది.  ఈ సందర్భంలో ఆధునిక వైద్యం, బాబా కృప రెండూ చేతులు కలిపి పనిచేసాయి.  కాని నిజం చెప్పాలంటే పాప ప్రాణాలను కాపాదింది కేవలం ఆయన సంకల్పమే.  మాకు ఈ ఫలితం ఒక అద్భుతంకంటే తక్కువేమీ కాదు.  ఒక విషాదకరమయిన సంఘటన జరగవలసినదానినుండి శ్రీ సాయిబాబా మా కుటుంబాన్ని రక్షించారనడంలో నా మనసులో ఎటువంటి సందేహం లేదు.  ప్రతి భక్తుడు ఆయనపై ధృఢమయిన విశ్వాసాన్ని ఉంచుకోవాలి.  ఎందుకంటే ఆయనే అత్యంత భారమయిన బరువులను కూడా తేలికపరిచే నిరంతర సంరక్షకుడు.

The Old Man

బాంద్రా – సెప్టెంబరు, 1, 1931

శ్రీ సాయిలీల, 8 సం.భాద్రపద్

మరాఠీనుండి ఆంగ్లంలోకి అనువాదం శ్రీ షంషద్ మీర్జా.

(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)


No comments:

Post a Comment