13.12.2025 శనివారమ్
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ సాయిలీల ద్వైమాసపత్రిక సెప్టెంబరు – అక్టోబర్, 2025 సంచికలో ప్రచురింపబడిన బాబా లీలలకు తెలుగు అనువాదం ఈ రోజు మీకు అందిస్తున్నాను.
ఆంగ్ల రచయిత ; శ్రీ ధనేష్ జుకార్
తెలుగు అనువాదం ; ఆత్రేయపురపు త్యాగరాజు
నిజాంపేట, హైదరాబాద్,
ఫోన్. 9440375411, 8143626744
శ్రీ సాయిబాబా వారి ప్రేరణతో --- ఆయన లీలల రచన - 2 భాగమ్
08.12.2025 గురువారమునాడు ప్రచురించిన సాయిబాబా వారి పవిత్రమయిన ఊదీ రెండవ భాగం సమాప్తం చేశాను. కాని బాబా ఊదీని గురించే కాకుండా మరొక అధ్బుతమయిన బాబా లీల కూడా అందులోనే ఉంది. అది ప్రచురితం కాలేదు. నా వల్ల జరిగిన ఈ పొరపాటు రెండు రోజుల క్రితం అంటే ఇపుడు మీరు చదువుతున్న దానికి మొదటి భాగం ప్రచురించకముందు బాబా స్వప్నం ద్వారా తెలియ చేసారు. నేను ఒక విషయం గురించి ఆలోచిస్తూ పడుకున్నాను. నాకు వచ్చిన స్వప్నం వివరాలు ….
“స్వప్నంలో నేను ఒక సాయి భక్తురాలి నివాసానికి వెళ్ళాను. అక్కడినుండి తిరిగి వెళ్ళేటప్పుడు అక్కడ గదిలో బల్ల మీద సాయిబాబా మాసపత్రికలు తెలుగువి ఉన్నాయి. సాయి భక్తులందరికీ పంచగా మిగిలినవి అక్కడ ఉన్నాయి. బల్ల మీద ఆగస్టు, సెప్టెంబరు సంచికలు.
నేను ఆగస్టు, సెప్టెంబరు, రెండు సంచికలు తీసుకుని ఇంకా కొంతమంది సాయిభక్తులతో కలిసి రోడ్డు మీద నడుస్తూ ఉన్నాను.” ఇంత వరకే వచ్చింది స్వప్నం. నేను ఆలోచిస్తూ ఉన్న విషయానికి సమాధానం సాయిలీల మాసపత్రికలలో బాబా ఏమన్నా సూచించారేమోనని మొన్న అనగా పదకొండవ తారీకు నాడు కొన్ని పేజీలు తిరగేసి చూసాను. నా దగ్గిర వున్న శ్రీ సాయిలీల ద్వైమాస పత్రిక జూలై - ఆగస్టు సంచిక చూసాను. ఏమీ కనపడలేదు. తరువాత సెప్టెంబరు - అక్టోబరు సంచిక రెండు మార్లు చూసాను. నేను ఆలోచించిన విషయానికి సమాధానం దొరకలేదు గాని, బాబా ఊదీకి సంబంధించిన విషయానికి కొంత భాగం కనిపించింది. దీనిని నేను అనువాదం చేసినట్లు లేదే అనుకుని నేను వ్రాసిన పుస్తకం చూసాను. దానిని నేను అనువాదం చేయలేదు. బాబా కనక స్వప్నంలో చూపించకపోయి ఉంటే అది మరుగున పడిపోయి ఉండేది. మరి అతి ముఖ్యమయిన బాబా చూపించిన లీల సాయి భక్తులకు అందించాలిగా. అదేమిటంటే సాయి అంటే నమ్మకం లేని ఒక విద్యార్ధి సాయితో చేసిన చాలెంజ్. బాబా నా చేత ఆవిధంగా మాసపత్రికలను మరొకమారు పరిశీలించేలా చేసారు. అందుచేత ఈ వ్యాసం పూర్తయిన తరువాత దానిని ప్రచురిస్తాను. ధన్యవాదాలు సాయి. ఓమ్ సాయిరామ్.
బాబా నా నిర్లక్ష్యాన్ని ఎలా సరి చేసారో తరువాతి సంచికలో వివరిస్తాను,
ఇక బాబా లీల రచన రెండవ భాగమ్
నా భార్య మహారాష్ట్రలో పుట్టింది. ఆమె ఢిల్లీలో పెరిగి అక్కడే తన చదువంతా కొనసాగించింది. ఆమెకు భగవంతుడి పైన భక్తి. విష్ణువు, శివుడు, దేవి, గణపతి దేవాలయాలంటే ఎంతో పూజ్యభావం ఉంది. కాని ఒక గురువు మానవ రూపంలో ఉంటాడనే ఆలోచన ఆమె మనసులో ఒక సంఘర్షణగా ఉండేది. మానవుడినే భగవంతునిగా పూజించడమంటే ఎప్పుడూ వినని విషయం. మానవ రూపంలోఉన్న గురువుని భగవంతుడు అనడం ఆమెకు కొత్తగా అనిపించేది. నేను ముంబాయిలోని సాయి మందిరాలకు వెడుతున్నా గాని నా భార్య ఎప్పుడూ నాతో వచ్చేది కాదు.
అప్పుడే మా జీవితంలో ఒక మలుపు తిరిగిన సంఘటన జరిగింది.
మా వివాహమయిన కొద్ది రోజులకు వేసవికాలంలో షిరిడికి బయలుదేరి మధ్యాహ్న సమయంలో షిరిడికి చేరుకొన్నాము. ముందుగా హోటల్ లో గది తీసుకొని స్నానాలు కానిచ్చి బాబా దర్శనానికి వెడదామనుకున్నాము. హోటల్ కి చేరుకుని స్నానం చేసి గదినుంచి వచ్చిన వెంటనే అకస్మాత్తుగా శరీరంలో విపరీతమయిన వణుకు వచ్చింది. అంత వేడి వేసవి కాలంలో విచిత్రంగా చలి, వణుకు ఎటువంటి కారణం లేకుండానే బాధించసాగాయి. ఇంతకు ముందెప్పుడూ ఆ విధంగా జరగకపోవడం వల్ల మేమిద్దరం చాలా భయపడిపోయాము. ఏమి జరుగుతోందో నా భార్యకు ఏమీ అర్ధం కావడంలేదు. నాతోపాటుగా తను కూడా సాయిబాబాను తీవ్రంగా ప్రార్ధించడం మొదలుపెట్టింది. పది నిమిషాలలోనే నేను మామూలు స్థితికి చేరుకొన్నాను. పూర్తిగా మామూలు మనిషినయ్యాక వేడి వేడి టీ త్రాగిన తరువాత ప్రశాంతంగా మా మనస్సులు ఉత్తేజభరితమయ్యేంతగా బాబా దర్శనం చేసుకొన్నాము. ఆక్షణంనుండి ప్రతీ విషయంలోనూ మాలో మార్పు మొదలయింది. సర్వశ్య శరణాగతి అంటే ఏమిటో అర్ధమయింది. అప్పటినుండి మేమిద్దరం సాయిబాబాను మనస్ఫూర్తిగా, ప్రగాఢమైన విశ్వాసంతో నమ్మసాగాము.
(ఇంకా ఉంది)
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)




0 comments:
Post a Comment