04.06.2020 గురువారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ రోజు దామూ అన్నా - నానాసాహెబ్ రాస్నే గురించి మరికొంత సమాచారమ్ తెలుసుకుందాము. ఈ సమాచార సేకరణ shirdisaisevatrust.org చెన్నై వారినుండి గ్రహింపబడింది.
సాయిలీల - మరాఠీ రచయిత్రి - శ్రీమతి ముగ్ధ దివాద్కర్
ఆంగ్లానువాదమ్ - శ్రీ సుధీర్
తెలుగు అనువాదమ్ - ఆత్రేయపురపు త్యాగరాజు
నిజాంపేట, హైదరాబాద్
దామూ అన్నా – నానాసాహెబ్ రాస్నే - 3 వ.భాగమ్
దామూ అన్నాకు పుట్టబోయే ఇద్దరు కుమారులకి ఏమేమి పేర్లు పెట్టాలో బాబా చెప్పారు. దామూ బాబా సూచించిన పేర్లు తన డైరీలో రాసుకున్నాడు. సంవత్సరమయిన
తరువాత దామూ అన్నాకి మొదటి కుమారుడు జన్మించాడు. దామూఅన్నా తనకు జన్మించిన
కుమారుడు పసిబిడ్డగా ఉన్నపుడె షిరిడీకి తీసుకునివెళ్ళి బాబా పాదాల వద్ద
పడుకోబెట్టాడు.
అపుడు బాబా దామూని మందలిస్తున్నటుగా, “దామ్యా, నేను నీకు చెప్పినది అంత తొందరలోనే మర్చిపోయావా? నీ డైరీ మూడవపేజీలో రాసుకున్నావు చూడు. నీకుమారునికి ‘దౌలత్ షా” అని పేరుపెట్టమని చెప్పాను కదా?” అన్నారు.
దామూఅన్నా బాబా చెప్పిన ప్రకారం తన కుమారునికి దౌలత్ షా (దత్తాత్రేయదామోదర్ అనే నానాసాహెబ్ రాస్నే) అని నామకరణం చేసాడు.
కొన్ని సంవత్సరాల తరువాత రెండవకుమారుడు జన్మించాడు. వాడికి ‘తానాషా’ అని నామకరణం చేసాడు.
దౌలత్ షాకి అయిదేండ్లు వచ్చాయి. వాడికి అక్షరాభ్యాసం చేయించడానికి
దామూ షిరిడీకి తీసుకుని వెళ్ళాడు.
బాబా పిల్లవాడి చేతిని తన చేతితో పట్టుకుని పలకమీద ‘హరి’ అనే అక్షరాలను దిద్దించారు.
దౌలత్ షా అనబడే నానాసాహెబ్ రాస్నే కి పెండ్లి సంబంధం కుదుర్చుకునే సమయంలో దిశానిర్దేశం చేసారు. బాబా అతనికి పెండ్లీడు రాగానే గొప్ప గొప్ప ధనికుల ఇండ్లనుండి పెండ్లి సంబంధాలు ఎన్నో వచ్చాయి. వాటిలో ఒకటి అతనికి స్వయానా మేనమామ నించి కూడా వచ్చింది. ఆయన రూ.2000 నుంచి 3000 వరకు కట్నం ఇస్తానని చెప్పాడు. పండరీపూర్ నుంచి పేదింటి సంబంధం ఒకటి వచ్చింది. వాళ్ళు ఏమీ లేనివాళ్ళవడం చేత కట్నం కూడా ఏమీ ఇచ్చుకోలేమని చెప్పారు.
దామూసేఠ్, తన కొడుకుకు వచ్చిన పెండ్లి సంబంధాల తాలుకు ఆడపిల్లలందరి జాతకాలు తీసుకుని షిరిడీ వెళ్లాడు. శ్యామాను తోడు తీసుకుని బాబా దర్శనం చేసుకున్నాడు. మాధవరావు ఆ జాతకాలనన్నిటినీ బాబాకు చూపించి, “వీటిలో ఏసంబంధం ఖాయం చేసుకోమంటారు?” అని అడిగాడు. బాబా ఆ జాతకాల కాగితాలన్నిటినీ చేతితో పట్టుకొని వాటిలోనుండి పేదింటి పిల్ల సంబంధాన్ని ఎంపిక చేసారు. బాబా నిర్ణయం ప్రకారమే దామూసేఠ్ ఆసంబంధాన్నే నిశ్చయం చేసాడు.
వివాహం పండరీపూర్ లో జరిగింది. దామూసేఠ్ బాబాని కూడా వివాహానికి ఆహ్వానించాడు. “నేనెప్పుడూ నీచెంతనే ఉన్నాను. భయపడకు. నువ్వు నన్ను తలుచుకున్న ప్రతిక్షణం నేను నీతోనే ఉంటాను. ఈవిషయం మర్చిపోకు” అని బాబా అతనికి మాటిచ్చారు. బాబా ఆవిధంగా మాటిచ్చినా కూడా, దామూసేఠ్ బాబాని వివాహానికి స్వయంగా రమ్మని పదేపదే వేడుకొన్నాడు. అపుడు బాబా ‘ఆ దేవుని ఆజ్ఞలేకుండా నేనేమీ చేయలేను. నా ప్రతినిధిగా శ్యామాను పంపిస్తాను” అన్నారు.
మాధవరావు (శ్యామా) దామూసేట్ కుమారుని వివాహానికి పండరీపూర్ వెళ్ళాడు.
కట్నం బాగా ఇస్తామని గొప్ప గొప్ప సంబంధాలు వస్తే నిరాకరించి పేదింటి పిల్లను ఇంటికి కోడలిగా తెచ్చుకున్నాడని ప్రజలందరూ దామూసేఠ్ ని విమర్శించారు. ఏమయినాగాని అధికమొత్తం కట్నం ఇస్తామని ఎన్నిసంబంధాలు వచ్చినా, దామూఅన్నా బాబా ఇచ్చిన సలహాకే కట్టుబడ్డాడు. దౌలత్ షా తన భార్యతో చాలా సంతోషంగా జీవితాన్ని కొనసాగించాడు.
బాబా అంతర్ జ్ఞాని
బొంబాయిలో ఉండే దామూసేఠ్ స్నేహితుడు కమీషన్ వ్యాపారి. ఒకసారి అతను దామూకి ఒక వ్యాపారం గురించి సలహా ఒకటి ఇచ్చాడు. “నువ్వు ఇపుడు రూ.50,000 నుండి 60,000 వరకు పెట్టుబడి పెట్టి ప్రత్తిని కొని నిల్వ చేయి. కొద్దికాలం తరువాత ధరలు పెరుగుతాయి. అపుడు అమ్మినట్లయితే నీకు కనీసం ఒక లక్షరూపాయల దాకా లాభం వస్తుంది. అందుచేత నామాటవిని నువ్వింక ఏమాత్రం ఆలస్యం చేయకు” అని బాగా నమ్మకంగా చెప్పాడు.
బాబా సలహా లేకుండా దామూసేఠ్ ఏపనీ చేయడు. ఈ సందర్భంగా దాము మాధవరావుకి ఉత్తరం వ్రాస్తూ, ఈ వ్యాపారం గురించి బాబాకు వివరంగా చెప్పి ఆయన అనుమతి తీసుకోమన్నాడు. మాధవరావు దామూనించి వచ్చిన ఉత్తరాన్ని బాబాకు చదివి వినిపించాడు. అపుడు బాబా “వాడికీ ఏమైనా పిచ్చిపట్టిందా? ఆ ప్రత్తి వ్యాపారం చేసి కోట్లకి పడగలెత్తచ్చని భావిస్తున్నాడా? అధికంగా ఆశలుపెట్టుకొని లక్షల వెంట పడవద్దని చెప్పు. అతని ఇంటిలో ఇపుడు ఏమి లోటుందని అటువంటి అనవసరమయిన విషయాలలో తలదూరుస్తున్నాడు” అన్నారు.
బాబానించి ఆ విధమయిన సమాధానం చదివాక దామూసేఠ్ కాస్త నిరాశకు గురయ్యాడు. షిరిడీ వెళ్ళి బాబాకి స్వయంగా ఈవిషయం గురించి చర్చిద్దామనే నిర్ణయానికి వచ్చాడు. షిరిడీ వెళ్ళినపుడెల్లా దాము బాబాకాళ్లను వత్తుతూ ఉండటం అలవాటు. దామూ షిరిడీ వెళ్ళి బాబా దగ్గర కూర్చుని ఆయన కాళ్ళను మెల్లగా నొక్కసాగాడు. ఆవిధంగా సేవ చేస్తూ మనసులో “వ్యాపారంలో వచ్చిన లాభంలో కొంత బాబాకు ఎందుకివ్వకూడదు? ఇస్తే బాగుంటుంది కదా” అని ఆలోచించాడు. కాని అతను ఆమాట పైకి అనకుండానే బాబా వెంటనే అతని మనసులోని ఆలోచనను గ్రహించి, “దామ్యా, నేను ఎటువంటి వ్యవహారాలలోను తలదూర్చను” అన్నారు. ఇక దామూ ఆ ప్రత్తివ్యాపారం గురించిన ఆలోచనను పూర్తిగా విరమించుకున్నాడు.
మరొక సందర్భంలో ధాన్యం వ్యాపారం గురించి బాబాతో సంప్రదించి ఆయన అనుమతి కోరాడు.
“ధరలు పడిపోతాయి. అమ్మే ధరకన్నా కొనే ధరలు ఎక్కువగా
ఉంటాయి.” అన్నారు.
దామూ అన్నా ఈవిషయాన్ని వ్యాపారం చేస్తున్న తన స్నేహితులకి చెప్పాడు. “నిజం చెప్పాలంటే ఇపుడున్న పరిస్థితులు
నువ్వు అనుకున్నదానికన్నా విరుధ్ధంగా ఉన్నాయి” అన్నారు స్నేహితులు.
అయితే వర్షాకాలం వచ్చేటప్పటికి వర్షాలు అధికంగా కురిసి పంటలు బాగా సమృధ్ధిగా పండాయి. దాని ఫలితంగా ధరలన్నీ పడిపోయాయి. పంటను అధికధరకు అమ్ముదామని ముందే కొని నిలవ ఉంచినవాళ్ళందరికీ విపరీతమయిన నష్టాలు వచ్చాయి.
దామూసేఠ్ స్వయంగా తన వ్యాపారం గురించిన ఈ విషయాలను నరసింహస్వామిగారికి వివరంగా చెప్పాడు.
ఒకసారి దామూసేఠ్ ఒక కేసు నిమిత్తం బొంబాయి
హైకోర్టుకి వెళ్ళాల్సి ఉంది. అతని
లాయరు బొంబాయికి రమ్మన్నాడు. దామూసేఠ్ బాబా అనుమతి కోసం షిరిడీ వెళ్లాడు. కాని బాబా అతనిని బొంబాయి వెళ్లడానికి
అనుమతివ్వలేదు. అంతే కాదు అతనిని తనదగ్గరే ఉంఛుకున్నారు. బొంబాయి కోర్టులో దామూసేఠ్ కేసు నెగ్గాడు.
దామూసేఠ్ మొట్టమొదటిసారి షిరిడీ వెళ్ళినపుడు నెవాస్కా గ్రామస్థుడయిన బాలాజీపాటిల్ మసీదును
తుడిచి, శుభ్రం చేస్తూ ఉండేవాడు. మసీదులో దీపాలు వెలిగిస్తూ ఇంకా ఇతర
పనులను కూడా చేస్తూ ఉండేవాడు. దామూసేఠ్ బాబా అనుమతితో ఆపనులలో పాలుపంచుకునేవాడు.
బాబా సశరీరంతో ఉన్నపుడు, దామూ అన్నా స్వయంగా బాబానుంచి సలహాలు తీసుకొంటూ ఉండేవాడు. ఆయన మహాసమాధి చెందిన తరువాత దామూ అన్నా తనకు ఏదయినా సలహా కావలసివచ్చిపపుడు, చిన్న కాగితాలమీద ‘అవును’ – ‘కాదు’ అని వ్రాసి బాబా ఫొటోముండు వేసేవాడు. అందులో ఒక చీటీని తీసి అదే బాబా సమాధానంగా భావించేవాడు.
(ఇంకా ఉంది)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
No comments:
Post a Comment