

14.06.2011 మంగళవారము
కొంచెం ఇష్టం -- కొంచెం కష్టం
కొంచెం సేపు సత్సంగం చేసుకుందాము
యేమిటండీ ఈ శీర్షిక ఇలా సినిమా కి పెట్టినట్టు పెట్టారు. దారి తప్పారా అనుకుంటున్నారా. యింకొక పేరు కూడా పెట్టచ్చు. కాని మనసుకి సూటిగా హత్తుకునేలా ఉంటుందనే ఉద్దేశ్యంతో పెట్టడం జరిగింది. యెందుకంటే కొన్ని కొన్ని విషయాలు చదవడానికి చాలా బాగుంటాయి. చాలా సులువు మనం చేయవచ్చు అనుకుంటాము. కాని ఆచరణలోపెట్టడానికి కొంచెం కష్టంగా ఉంటుంది.
మనం యితరులకి వారి అవసరాలను తీరడానికి సహాయ పడితే అది గొప్పది. ఆ సాయం ఇంకా గొప్పది. అవసరాన్ని బట్టి చేసే సహాయం మాటలకందనిది. మనస్సుకు యెంతో తృప్తినిస్తుంది. దానికి వెలకట్టలేము. ఉదాహరణకి మీ స్నేహితుడి కొడుకుకో కూతురికో యింజనీరింగ్ కి కౌన్సిలింగ్ లో కట్టడానికి సమయానికి అనుకున్న విథంగా డబ్బు సమకూరలేదనుకోండి. మిమ్మల్ని సహాయం అడిగాడు. మీకు తెలుసు అతను మంచి వ్యక్తి అప్పుఇచ్చినా వెంటనే తీర్చెస్తాడని. మీరు సమయానికి ఆదుకున్నారనుకోండి. ఆ చేసిన సహాయం యెంత గొప్పది? ఒక జీవితాన్ని నిలబెట్టినావారవుతారు.
ఒక మంచి సహాయం ఒక జీవితాన్ని నిలబెడుతుంది.
సహాయానికి ప్రతిగా డబ్బు తీసుకున్నామనుకోండి. అది అంతటితో సరి. కాని నిస్వార్థంగా, ప్రతిఫలాన్ని ఆశించకుండా చేసే సహాయం మన మనస్సుకి యెంతో తృప్తినిస్తుంది. కాని మనం చేసిన సహాయాన్ని మనం వెంటనే మర్చిపోవాలి. యెందుకంటే అది మన మనస్సులో ఉండి అహంకారాన్ని కలిగించవచ్చు. నేనే కదా వాడికి సహాయం చేశాను. నేను కనక సాయం చేయకపోతే వాడీపాటికి యేమైపోయేవాడో అనే అహంకారం మనలో ప్రవేశించి మన వల్లే అంతా జరిగిందని గర్వంతో విర్రవీగి పది మందికీ మన గొప్ప తనాన్ని చాటుతాము. కాని సహాయం పొందినవాడు మాత్రం సహాయం చేసినవాడిని యెప్పటికి గుర్తుంచుకోవాలి.
యెవరికైనా మనం సహాయ పడితే అదంతా భగవంతుని వల్లే జరుగుతుంది కాని నిజానికి మనకా శక్తి యెక్కడిది ఆయన ఇవ్వకపోతే. మనం భగవంతుని వద్ద యేజెంటులం మాత్రమే. యెవరికి యే సందర్భంలో యేసహాయం కావాలో భగవంతుడు నిర్ణయించి మనలని వినియోగించుకుంటాడు. అందుకనే ఒకోసారి చూడండి, మనవల్ల సహాయం పొందినవాడు, అబ్బ దేవుడిలా వచ్చారండీ, మీరే కనక సహాయం చేయకపోతే యేమై ఉండేదో అంటాడు. ఇక్కడ దేవుడిలా రావడమంటే భగవంతుడే స్నేహితుడు , లేకపోతే సహాయం చేసిన వ్యక్తిమదిలో ప్రవేశించి సహాయ పడటానికి ప్రేరేపిస్తాడు. ఇది మనకి యెలా గ్రహింపుకొస్తుంది? ఆథ్యాత్మిక జ్ణానం వున్నప్పుడు మనకి ఇది తెలుస్తుంది. అథ్యాతిమిక జగత్తులో పయనించేవాడికి అంతా భగవంతుడే చేయిస్తున్నాడు అనే భావం ఇమిడి ఉంటుంది.
ఇలాగ ఒక మనిషి అవసరాలని ఒక గంట సేపు తీర్చి వేశామనుకోండి అది నిజమైన సహాయం. అదేకనక ఒక సంవత్సరంపాటు అతని కోరికలని తీర్చామనుకోండి అది ఇంకా అతనికి చేసే గొప్ప సహాయం. కాని కోరికలని యెప్పటికీ తీర్చివేశామనుకోండి అది అతనికి చేసిన అతి గొప్ప సహాయం.
మన కష్టాలని శాశ్వతంగా నిర్మూలించేది ఆథ్యాత్మిక జ్ణానం ఒక్కటే. యిక యే జ్ఞానమైనా మన కోరికలని కొంతవరకూ తృప్తిపరుస్తాయి. ఆథ్యాత్మిక శక్తి ఉంది చూశారా, ఆ జ్ణానం మాత్రమే మన కోరికలన్నిటినీ సమూలంగా నిర్మూలిస్తుంది. అంటే యేమిటి మనకి దేనిమీదా కూడా కోరికన్నది కలగదు. యేది శాశ్వతమో యేది అశాశ్వతమో తెలుసుకునే జ్ణానం మనకి అబ్బుతుంది. యిక్కడ మీకొక అనుమానం రావచ్చు. యేమండీ మా వయస్సు యింకా చిన్నది యెదర ఇంకా అనుభవించవలసినది యెంతో ఉంది, కోరికలు లేకుండా సన్యాసిగా బ్రతకమంటారా అని. అంటే ఇక్కడ సన్యాసిగా ఉండమని కాదు. కోరిక వుంటే తీర్చుకునే శక్తి ఉంటే తీర్చుకోవచ్చు కాని ఆ కోరిక తీరడానికి విపరీతమైన కష్టాలు కొని తెచ్చుకోకూడదు. ఒక కోరిక తీరితే మరొక కోరిక వరస క్రమంలో యెదర నించుని వుంటుంది. దానిని కూడా తీర్చుకుంటే గాని మనశ్శాంతి ఉండదు. ఉదాహరణకి చూడండీ. మామూలు రంగుల టీ.వీ.ఉంది ప్రస్తుతం మీదగ్గిర . మార్కెట్లొ కొత్తగా ప్లాస్మా టీ.వీ. వచ్చింది. మనసు లాగేస్తుంది. దానిని కొనాలి. కొనుక్కునేదాకా మనశ్శాంతి ఉండదు. పాత టీ.వీ అమ్మేసి లేక ఎక్స్చంజ్ లో ఇచ్చేసి వాయిదాల పథ్థతిలో లేకపోతే అప్పో సొప్పో చేసి ప్లాస్మా టీ.వీ. కొంటాము. అమ్మయ్యా అనుకునేలోపులో 3డ్ టీ.వీ. వస్తుంది. మనసు కొన్నాళ్ళు ఊరుకుంటుంది. కొంచెం ధరలు తగ్గాయనుకోండి. యిక మనసు మాట వినదు. అదికొనే దాకా పోరు పెడుతూనే ఉంటుంది. అందు చేత ఇంకా పెద్ద అప్పుచేసి కొంటాడు. కోరి కష్టాలని కొని తెచ్చుకుంటాడు. మరి చేసిన అప్పు తీర్చాలి కదా. అంటే యిక్కడ కొనే తాహతు లేకపోయినా అతి కష్టం మీద తనకోరికని తీర్చుకున్నాడు. ఆథ్యాతిమిక జ్ణానం ఉన్నవాడికి విచక్షణా జ్ణానం ఉంటుంది కాబట్టి ఆ కోరిక తీర్చుకోగలవచ్చా లేదా అనె గ్రహింపుతో ఉంటాడు.
అందుచేత ఆథ్యాత్మికంగా చేసే సహాయం యెప్పటికీ మరువలేనిదీ, యెంతో గొప్పది. ఆథ్యాత్మిక జగత్తులో ఉన్నవాడికి మనసు యెప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. ఆథ్యాత్మిక జ్ణానం ఉన్నవాడు కోరుకుంటే కనక అన్ని విషయాలలోనూ కూడా అత్యంత శక్తిమంతుడు. దేనికీ భయపడడు. ఆథ్యాత్మిక శక్తి లేనంతవరకూ మనషికి భౌతిక అవసరాలు కూడా తృప్తినివ్వవు. పైన చెప్పిన ఉదాహరణ చూడండి. ఆథ్యాత్మికం తరువాత వచ్చేది వివేకం. మనకి తిండి, బట్టకన్న గొప్ప బహుమతి వివేకం అదే జ్ణానం. యెంతో ధనం ఉండచ్చు, తిండికి లోటు లేకపోవచ్చు, కాని జ్ణానం లేకపోతే ఇవన్ని శుధ్ధ దండగ. యెంత ధనం ఉంటే యేమి, యితరుల యందు వివేకంతో ప్రవర్తిచడం యెలాగో తెలియనప్పుడు. పది వేళ్ళకి పది బంగారు ఉంగరాలు పెట్టుకోవచ్చు, పెద్ద పదవిలో ఉండవచ్చు. యివన్నీ కూడా వివేకం ముందు యెందుకూ కొరగావు.
అందుచేత యితరులకి సహాయం చేయడమంటే వాళ్ళ భవుతిక అవసరాలు తీర్చడమే మనకు చేతనైయన చేస్తున్న సహాయం అనే తప్పుడు ఆలోచనలో ఉండకుడదు. ఆథ్యాతిమికంగా చేసే సహాయమే యెంతో ఉన్నతికి దోహద పడుతుంది. అందుచేత మనం ఆథ్యాత్మిక జ్ఞానంలో పయనిస్తూ యితరులకి కూడా మనం వారి ఆథ్యాత్మికోన్నతికి సహాయ పడాలి.
మనకి అతి సులభంగా, సరళంగా జ్ఞానాన్ని లభింపచేసే అద్భుత గ్రంధం "శ్రీ సాయి సచ్చరిత్ర". యిందులో ఉన్నవన్నీ అత్యంత విలువైన రత్నాలు, మణులు, మాణిక్యాలు. వీటికి వెలకట్టలేము. ఇవన్నీ మనవద్ద ఉన్నంత కాలం మనం అత్యంత ధనికులం. ఈ సంపదని యెవరూ అపహరించలేరు. మనం యితరులకి యెంత పంచిపెట్టినా మనవద్ద తరిగిపోని సంపద.
యోగి అనేవాడు యేపనైనా సరే నేర్పుగా చేస్తూఅందులో ఫలితాన్ని ఆశించకుండా ఉండేవాడు. అటువంటి స్థితి రావాలంటే చాలా కష్టంతో కూడు కున్నది కాబట్టి, పూర్వకాలంలో వాన ప్రస్థాశ్రమం, సన్యాసాస్రమం అనేవి మానవుడిని ఈ భవబంథాలనుండి విముక్తుణ్ణి చేయడానికి యేర్పాటు చేశారు. ఇప్పుడు మనం చెప్పుకునే కథలో వైరాగ్యం అంటే యేమిటో తెలుసుకుందాము.


పూర్వకాలంలో ఒక సన్యాసి ఉండేవాడు. ఆయన అన్ని రాజ్యాలు తిరుగుతూ, మోక్షం పొందటానికి యేమిచేయాలో ప్రజలకి వివరిస్తూ ఉండేవాడు. మోక్షాన్ని కోరుకునేవాడు తనకు సంబంధించినవన్నిటిని వదలివేసుకోవాలనీ, దేనిమీదా వ్యామోహం, కోరికా ఉండకూడదనీ, మరునిమిషం గురించి ఆలోచించకూడదనీ, రేపటి కోసం యేమీ దాచుకోకూడదనీ, వివరించి చేప్పేవాడు. యింకా తాను యెవరో యెవరికి చెప్పకూడదనీ కోరిక లేకుండా ప్రశాంతంగా ధ్యానం చేసుకోవాలనీ అప్పుడే మోక్షం లభిస్తుందనీ చెప్పేవాడు ఆ సన్యాసి. ఈ సన్యాసి చెప్పే మాటలు అందరికీ వినడానికి బాగానే ఉన్నాయి, కాని ప్రజలకి అర్థం చేసుకోవడానికి కొంచెం కష్టంగా ఉండేది.
ఒకసారి మగథ దేశపు రాజుకి ఈ సన్యాసి మాటలకి ఆసక్తి కలిగి ఆయనలో ప్రేరణ కలిగింది. రాజ్యాన్ని వదలివేసి దైవ థ్యానం చేసుకోవడానికి అడవులకి వెళ్ళిపోయాడు. ఆ విథంగానే కాంభోజ రాజుకి కూడా ప్రేరణ కలిగి దైవ థ్యానానికి అడవులకి వెళ్ళాడు. ఆయన కూడా అన్నిటినీ వదలివేశాడు.
యిద్దరు రాజులూ అడవిలో కలుసుకున్నారు. కాని ఒకరికొకరు తాము రాజులమని చెప్పుకోలేదు. వారిద్దరూ తిండికోసం బిక్షకు వెళ్ళేవారు.
వారి నియమం ప్రకారం వారు ఆ రోజు దొరికిన ఆహారాన్ని ఆరోజే భుజించి మరునాటికి దాచుకునేవారు కాదు. ఒకరోజున వారికి గంజి మాత్రమే దొరికింది. కాంభోజ రాజు మగథ రాజుతో రుచికి కొంచెం ఉప్పు ఉంటే బాగుండేది అన్నాడు. అప్పుడు మగథ రాజు తన వద్ద కొంచెం ఉప్పు ఉందని చెప్పాడు. అప్పుడు కాంభోజ రాజు "నీకు ఉప్పు యెక్కడనించి వచ్చింది? అని ఆశ్చర్యంతో ప్రశ్నించాడు. అప్పుడు మగథ రాజు తనని విందు భోజనానికి పిలిచారనీ అందులోనించి కొంత ఉప్పు తెచ్చుకున్నానని చెప్పాడు. ప్రయాణంలో అవసరం ఉంటుందేమోనని కొంత తీసుకున్నానని చెప్పాడు. మగథ రాజు తాను ఒక రాజుననీ రాజ్యాన్నంతా వదలి వచ్చాననీ, చెప్పి మరుసటి రోజుకు యేమీ దాచుకోకూడదన్న నియమాన్ని ఉల్లంఘించానని చెప్పాడు. కాంభోజరాజు తాను కూడా రాజ్యాన్ని తృణప్రాయంగా వదలి వచ్చాననీ కాని జిహ్వ చాపల్యాన్ని అణచుకోలేకపోయాననీ చెప్పాడు. యిద్దరూ కూడా తాము నియమాన్ని అతిక్రమించినట్టు తెలుసుకుని ఉలిక్కి పడ్డారు.
అప్పుడు వారు సన్యాసి చెప్పిన బోథనలోని నిజమైన సత్యాన్ని గ్రహించుకుని, తిరిగి రాజ్యానికి వచ్చి, చక్కగా, చల్లగా ప్రజలని కన్నబిడ్డలుగా పరిపాలన సాగించారు. తాము అడవిలో నేర్చుకున్న జ్ణానం వల్ల వారు రాజులుగా యెప్పుడు భోగాలలో మునిగిపోలేదు. వాటియందు పూర్తి వైరాగ్యాన్ని అలవరచుకున్నారు. ఆఖరికి వారు మోక్షాన్ని పొందారు.
నీతి : మోక్షం కోసం దైవ థ్యానం చేసుకోవడానికి అడవులకే వెళ్ళనక్కరలేదు. మామూలుగా అన్ని కర్మలను ఆచరిస్తూ విరాగిగా ఉంటూ మోక్షాన్ని పొందవచ్చు. అంటే సంసారంలో ఉంటూనే మోక్షాన్ని పొందచ్చు. సన్యాసం తీసుకోనక్కరలేదు.
మీకొక చిన్న ఉదాహరణ చెపుతాను. పొద్దున్నే కాఫీ తాగే భర్తకి ఒకరోజు కొంచెం చక్కెర తక్కువ వేసి భార్యకాఫీ ఇచ్చిందనుకోంది, వెంటనే భర్త, "యేమిటీ ఇవాళ కాఫీలో పంచదార తక్కువ వేశావు. నీ బుర్ర యెక్కడో ఉంది ఇవాళ. కొంచం పంచదార ఇందులో తగలెయ్యి అని గావు కేక పెడతాడు. యేం... ఒక్కరోజు కాఫీలో పంచదార తక్కువైతే తాగకూడదా ..... అంటే ఒకరోజు పొనీలే అనుకుని తాగగలిగితే మిగతావాటిలో కూడా అంటీ ముట్టనట్టు నిమిత్తమాత్రంగా ఉండగలగాలి. అప్పుడే సంసారంలో ఉంటూ కూడా మోక్షాన్ని పొందవచ్చు. ఇక్కడ ఇంకొక ఉదాహరణ కూడా చెప్పుకుందాము. ఇది యెవరినీ విమర్శించడానికి కాదు, నొప్పించడానికీ కాదు. మథుమేహం ఉన్నవారు ఉన్నారనుకోండి.
వారు కాఫీలో పంచదార వేసుకోరు. కాని తీపి కావాలి. మరి యేమిచేస్తారు. కృత్రిమ తీపి వాడతారు. అంటే జిహ్వ చాపల్యం వదులుకోలేక. ఈ విషయంలో యెవరికైనా బాథ కలుగుతే మన్నించండి. ఇక్కడ మీరనుకోవచ్చు. ఆ చెప్పారులెండి. మీరు అల్లాగే ఉంటున్నారా అని. నేను కాఫీలో చక్కెర వేసుకోను, కృత్రిమ తీపి వాడను, కాఫీ చల్లగా ఉన్నా వేడిగా ఉన్నా తాగేస్తాను. అంటే నేనేదో గొప్పవాణ్ణి అనుకుని చెప్పడం కాదు. కొంచెం చిన్న చిన్న విషయాలలోనైనా నిమిత్తమాత్రంగా ఉండచ్చని నా అభిప్రాయం.
భగవద్గీతలో శ్రీ కృష్ణ పరమాత్మ "యెవరైతే ఫలితాన్ని ఆసించకుండా కర్మలను చేస్తాడొ అతనే సన్యాసి, యోగి రెండూను అని చెప్పాడు.
అందుచేత నువ్వు యేది చేసినా కూడా అది భగవంతుడికే అర్పించు, అందుచేత వాటి ఫలితాలు అవి మచివైనా, చెడువైనా నిన్నంటవు.
సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు
0 comments:
Post a Comment