

04.11.2011 శుక్రవారము
ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
సాయి - తోడూ నీడ
ఈ రోజు నెల్లూరునించి సుకన్య గారు సేకరించి పంపిన భరనిజ గారి బాబా లీలను తెలుసుకుందాము. ఇది చదివిన తరువాత, ఎటువంటి కష్టము ఎదురైనప్పటికీ మనము సాయిబాబాని మరచిపోకూడదనీ, ఓర్పుతో ఉండాలనీ గ్రహించుకోవాలి.
సాయిభక్తులందరికీ ఆనందాన్నిచ్చే ఒకటే మాట సాయిబాబా.

నేను డిగ్రీ చదివే రోజులలో హాస్టలులో ఉండేదానిని. నా పక్కనున్న గదిలో ఆంధ్ర ప్రదేశ్ నించి వచ్చిన విద్యార్థులు ఉండేవారు. వారు సాయిబాబాను పూజిస్తూ ఉండేవారు. ఇది 2001 సంవత్సరములో జరిగింది. అప్పట్లో నాకు సాయిబాబా గురించి తెలీదు. బాబా ఎంతో శక్తిమంతులనీ, మంచి దయగలవారనీ చెప్పారు. వారు తమ ఊరికి వెళ్ళినప్పుడు నాకు ఒక బాబా ఫోటో తెమ్మని అడిగాను. రెండు రోజుల తరువాత నా స్నేహితుడు నా పుట్టినరోజుకు బహుమతీ తెచ్చి, అది నాకు నచ్చుతుందో లేదో తనకు తెలియదని చెప్పాడు. నాకు తెలుపురంగులో ఉన్న చిన్న బాబా విగ్రహాన్ని చూపించాడు. అది చూడగానే నాకెంతో సంతోషమయింది. నేను బాబా ఫోటో తెమ్మని నా ఆంధ్రా స్నేహితులని అడిగినట్లు చెప్పాను. బాబా గురించి ఆలోచిస్తే చాలు ఆయనే మనవద్దకు వస్తారని నా స్నేహితుడు అన్నాడు.
రోజులు గడిచిపోయాయి. బాబా అనుగ్రహంతో నేను పీ.జీ. లో చేరాను. నేనున్న హాస్టలు గదిలో బాబా విగ్రహాన్ని పెట్టుకున్నాను. దగ్గరలో ఉన్న బాబా గుడికి వెడుతూ ఉండేదానిని. నాకు కొన్ని కోరికలు ఉన్నాయి. నేను బాబాని ప్రార్ధించేదానిని. కాని అవేమీ తీరలేదు. నాకు చాలా నిరాశ ఎదురయింది. దానినించి బయటపడటానికి నాకు చాలా కాలం పట్టింది. నా పీ.జీ. చదువు అయినతరువాత మా కుటుంబమంతా వేరే ఊరికి మారాము. మా పాతయింటిలో బాబాని వదలివేసి, సంవత్సరం న్నరపాటు బాబాని పూజించటం మానేసాను. నాకష్టాలేమీ తీరకపోవడంతో నేను చాలా విసిగిపోయాను.
2007 వ సంవత్సరములో ఒక రోజు నేను డ్రైవ్ చేస్తూ నాకీకష్టాలన్ని ఎప్పుడు తీరతాయా అని ఆలోచిస్తూ ఉన్నాను. హటాత్తుగా నాముందు బాబా కనపడ్డారు. నా కారుముందు వెడుతున్న వాను వెనకవైపు చిరునవ్వుతో ఉన్న బాబా ఫొటో ఉంది. నాకప్పుడు నా తప్పు తెలిసివచ్చింది. మా అమ్మ వారాంతములో పాత యింటికి వెడుతున్నది కాబట్టి అక్కడ నేను వదలిపెట్టిన బాబా విగ్రహాన్ని తెమ్మనమని చెప్పాను. మా అమ్మగారు బాబా విగ్రహాన్ని పాత యింటినించి తీసుకుని వచ్చారు. అదే రోజు రాత్రి ఆయన నా కలలోకి వచ్చారు. ఆ కలలో నేను మేడమెట్లమీద నుంచుని నా స్నేహితునితో మాట్లాడుతున్నాను. బాబా గారు విచార వదనంతో మెట్లుఎక్కుతూ నావైపు వస్తున్నారు. నేను వెంటనే ఆయనవైపుకు వచ్చి ఏంజరిగిందని అడిగాను. ఆయన ఒకటే మాటన్నారు, "నువ్విలా ఎందుకు చేస్తున్నావు"? అని. నేను వెంటనే నిద్రనుండి లేచి నేను చేసిన పెద్ద తప్పుకు ఆయనని క్షమించమని వేడుకున్నాను. బాబాని మరలా పూజించడం మొదలుపెట్టాను. తరువాత నాకు తీరవలసినవాటిని బాబా ఎందుకని తీర్చలేదో అర్థమయింది. నిజానికి నన్నాయన వాటినుంచి రక్షించారు.
చాల సందర్బాలలో నేనాయన ఉనికిని అనుభూతి చెందాను. ఒక గురువారమునాడు నేను బాబా గుడినించి వస్తూండగా నాకు ప్రమాదం జరిగింది. ఒక కారు నన్ను గుద్దుకుని దాదాపు 15 అడుగులవరకు నన్ను ఈడ్చుకుపోయింది. కాని నాకు భుజమువద్ద కాలి వద్ద బెణికి, ప్రమాదం నించి బయటపడ్డాను. గుళ్ళోనించి వచ్చే భక్తులంతా కూడా చాలా పెద్ద ప్రమాదం జరిగిందనీ నాకు ప్రాణం పోయే ఉంటుందని అనుకున్నారు. గుడిపూజారిగారు నాకు తీర్ధం ఇచ్చి సాయి ఫొటోని ఇచ్చారు. నేనీరోజు బతికి ఉన్నానంటే బాబా అనుగ్రహమే. గురువారమునాడు నా సమస్యలకి సమాథానం కోసం సాయిబాబా సమాథానాలు చదివాను. నా సమస్యలేమీ తీరనప్పటికీ, బాబా నాతోడుగా ఉన్నారనీ ఆయనే నా సమస్యలన్నిటినీ తీరుస్తారనే నమ్మకం నాకుంది. నాకాయనయందు నమ్మకం ఉంది. బాబా ఇప్పుడు మనందరి మధ్యనే ఉండి మనం మాటలాడేవి, మనం చేసే పనులు అన్నీ గమనిస్తున్నారు. మంచి చేయండి. ఆయన ప్రేమని పొందండి.
సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు
