Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Tuesday, November 1, 2011

శిఖరాలు - లోయలలో శ్రీ సాయి

Posted by tyagaraju on 8:51 AM

01.11.2011 మంగళవారము

ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంధువులకు బాబావారి శుభాసీస్సులు

శిఖరాలు - లోయలలో శ్రీ సాయి

మానవ జీవితము గురించి శ్రీ షిరిడీ సాయి ఆలోచనలు

కూర్పు : సాయి. బా. ని.స.

46. జీవితములో గతించిన కాలము నిన్ను పగ పట్టిన పాములాగ వెంటాడుతూ ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన గలవారిని ఆ పాము ఏమీ చేయలేదు. నీ బరువు బాధ్యతలను నీవు నిర్వర్తించటము ఆధ్యాత్మిక చింతనలో ఒక భాగమే! నీ బరువు బాధ్యతలను నీవు నిర్వర్తించకపోతే నీ గత చరిత్ర అనే పాము నిన్ను కాటు వేస్తుంది జాగ్రత్త.

19.04.96

47. జీవితములో గతించిన కాలపు వాసనలును వదిలించుకొని ప్రశాంతముగా వర్తమానములో జీవించు. పునర్జన్మ గురించి ఆలోచించవద్దు. నీ గురువు మీద నీకు నమ్మకము ఉన్ననాడు ఆయన నీవర్తమానాన్ని నీ పునర్జన్మను చూసుకొంటారు.

07.11.96

48. జీవితములో నీ వారినుండి నీవు ప్రేమను పొందలేనినాడు బాధపడటము సహజమే. ఇటువంటి బాధలలో ఇతరుల ఓదార్పును మాత్రము కోరవద్దు. నీవు పొందలేకపోయిన ప్రేమను ఏదో రూపములోనైన ప్రసాదించమని భగవంతుని వేడుకో.

12.12.96

49. జీవితములో విద్యాదానము, అన్నదానము చేసిన వ్యక్తి మరణించితే ఆ వ్యక్తి కుటుంబ సభ్యులు కన్నీరు కార్చకపోవచ్చు - కాని, ఆ వ్యక్తినుండి విద్యాదానము, అన్నదానము స్వీకరించినవారు తప్పక కన్నీరు కార్చుతారు.

17.12.96

50.జీవితములో ధనము ఉన్నవారు, ధనము లేనివారు కూడా సంతోషముగా జీవించుతున్నారు. జీవించటానికి ధనము ఒక్కటే ప్రధానము కాదు. సంతోషముగా జీవించాలి అనే పట్టుదల ముఖ్యము.

24.01.97

51. జీవితములో సుఖశాంతులు కావాలి అంటే ఆ బీద యింట పుట్టి చిరునవ్వుతో ఏ చీకు చింత లేకుండ ఉన్న ఆ చిన్నపిల్లలను చూడు. నీ మనసు కూడా ఆ చిన్న పిల్లల మనసులాగ ఉన్న రోజున సుఖశాంతులు వాటంతట అవే వస్తాయి.

28.01.97

52. జీవితములో శతృత్వము మంచిది కాదు. అది వచ్చే జన్మకు ప్రాకుతుంది అని తెలిసికూడా, ఈ జన్మలో తోటివాడితో శతృత్వము పెంచుకొని నరక బాధపడటములో అర్థము లేదు. ఈ జన్మకు సార్ధకత లేదు.

28.01.97

53. జీవితములో అన్నీ సవ్యముగా జరుగుతూ ఉంటే చికాకులు ఉండవు. కాని విధివ్రాత వలన ఏమాత్రము తేడా వచ్చిన మనసులో చికాకులు కలుగుతాయి. చికాకులు కలగకుండ ఉండాలి అంటే అనుక్షణము భగవంతుని నామస్మరణ చేస్తూ జీవించాలి.

07.07.97

54. జీవితములో పాత జ్ఞాపకాలు పాడుబడిన భవనాలవంటివి. అవి నివాసయోగ్యము కావు. అలాగే పాత జ్ఞాపకాలు భవిష్యత్తుకు పనికిరావు. అందుచేత పాత జ్ఞాపకాలను మరచిపోవటము మంచిది.

26.07.97

55. జీవితములో మనము వదలివేసిన ఆస్తి పాస్తులు మనము మిగిల్చే జ్ఞాపక చిహ్నాలు. కాల చక్రములో ఈ జ్ఞాపక చిహ్నాలు కూడా మరుగున పడతాయి. అందుచేత ఎన్నటికీ మరుగుపడని ఆ భగవంతుని జ్ఞాపకము ఉంచుకోమని నీ భావితరాలవారికి తెలియచేయటము మంచిది.

09.03.93

56. జీవితములో స్నేహము అనేది సమ ఉజ్జీగలవారితో చేయాలి. నీకంటే గొప్పవారితో (ధనవంతులతో) స్నేహము చేసి వారి చేత అవమానింపబడటముకంటే వేరే దౌర్భాగ్యము ఉండదు అని గ్రహించు.

02.08.97

57. జీవితములో ప్రతి మనిషి ఒక సమయములో ఉన్నత స్థితిని చవిచూస్తాడు. తర్వాత అక్కడనుండి సాధారణస్థితికి చేరుకొంటాడు. అటువంటిసమయములో నిజమును అంగీకరించటమే ఆధ్యాత్మిక శక్తి.

08.08.97

58. జీవితములో ఒకసారి ఆధ్యాత్మిక రంగములో అడుగుపెట్టిన తర్వాత తిరిగి ప్రాపంచిక రంగములో వెనుకకు అడుగువేయటము అంటే పతనానికి నాంది అని అర్థము.

08.08.92

59. జీవితము అనే రైలు ప్రయణములో సాయి పేరిటగల టికెట్టుతో ముందుకు సాగిపోతున్న సమయములో నీపేరిట టికెట్టులేదని ఆలోచనలు ఎందుకు? శ్రీ సాయి నీలోను ఉన్నారు అనే ధైర్యముతో ముందుకు సాగిపో.

21.08.97

60. జీవితములో ఒడిదుడుకులు అనే వరద రావటము సహజము. ఆ వరదలో ఈదటానికి కావసిన శక్తిని ప్రసాదించమని భగవంతుని వేడుకోవాలి. అంతేగాని, ఆ ఒడిదుడుకుల వరదలో జీవించటానికి ప్రశాంతత ఇవ్వమని వేడుకోరాదు. జీవితములో కష్టాలను ధైర్యముగా ఎదుర్కోవాలి. అంతేగాని కష్టాలతో రాజీ పడరాదు.

19.08.97


సర్వం శ్రీ సాయినాదార్పణమస్తు

(ఇంకా ఉంది)


Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment