


సాయి భక్తి పరిమళాలు
03.06.2011
ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంథువులందరికి బాబా వారి శుభాశీస్సులు
ఈ రోజు యేమి పోస్ట్ చేయడానికి యింకా నిర్ణయించుకోలేదు. కాని సాయి భక్తి ని గురించిన సమాచారం రేపు శనివారం లో సత్సంగంలో చెపుదామనే ఆలోచన వచ్చింది. ఈ సమాచారాన్నే మన సాయి బంధువులకు కూడా తెలియచేద్దామనే ఆలోచన నాలో కలిగి, బాబా అనుగ్రహంతో దీనిని మీకు అందిస్తున్నాను.
ఈ రోజు మనము సాయి భక్తి పరిమళాలను గురించి తెలుసుకుందాము.
( ఫ్రాగ్రన్స్ ఆఫ్ సాయి భక్తి లో ని విషయానికి తెలుగు అనువాదము)
ప్రేమ అనేది భక్తికి పునాది. భక్తి అనే భవనాన్ని ఘనమైన బలమైన పునాది మీదనే నిర్మించగలం. అందుచేత ప్రేమను పుట్టించాలి, ప్రేమను పండించాలి, ప్రేమను పంచాలి, ప్రేమ అనే గాలిని పీల్చాలి, ప్రేమను భుజించాలి, ప్రేమ స్వప్నాలు కనాలి, ప్రేమ గురించి ఆలోచన, ఇలా నీ శరీరమంతా ప్రేమతో నిండి పోయి నీ చుట్టూ ప్రేమ అనే పరిమళం వ్యాపించాలి. సాయికి నీకు మథ్య ఉన్న ద్వైతమనే అడ్డు తెర నిర్మూలింపబడుతుంది.(ద్వైతం అనగా జీవాత్మ, పరమాత్మ రెండు వేరు వేరు)
భక్తికి యెవరి అంతస్థు కాని, బాహ్య సంబంథమైన విషయాలతో గాని సంబంథం లేదు. అంటే భక్తికి యివేమీ అడ్డు కాదు. భక్తి అనేది మనలో ఉన్నటువంటి ఆభరణం. దానిని వెలికి తీయాలి.
భక్తి మనకి సర్వ శ్రేష్టమయిన సంతోషాన్ని కలుగ చేసి మనలో ప్రశాంతతను పుట్టిస్తుంది. నిరంతరం వుండే కనరాని ఈ ప్రశాంతత మనకి చేసే సహాయం యెంతో ఉదాత్తమయినది.
భక్తుడైనవాడు ధృఢమైన, అథికమైన నమ్మకం తనలో కలిగి ఉండాలి. యింకా తన యిష్ట దైవము మీద కూడా కలిగి ఉండాలి. సాయి భక్తి అనే దారిలో నిబ్బరంగా ఉన్నవాడు తప్పకుండా తన గమ్యాన్ని చేరతాడు. ప్రతీవాడు తన ప్రారబ్ధ కర్మకి బథ్థుడై ఉంటాడు కాబట్టి తనకి యేది ప్రాప్తమో అదే పొందుతాడు.
నీ పూర్వజన్మలో నువ్వు చేసుకున్నపుణ్యాన్ని బట్టే ఈ జన్మలో ఫలాన్ని పొందుతావు. పుణ్యాన్ని బట్టి పుణ్య ఫలం, పాపాన్ని బట్టి పాప ఫలం. కర్మని యెవరూ తప్పించలేరు. ఈ కర్మ ఫలాన్ని కొంతవరకైనా తొలగించుకోవాలంటే సాయి చరణాలను పట్టుకోవడమే మనమంతా చేయవలసినది.

అంతే మిగతాదంతా ఆయనకి వదలి వేసి నిశ్చింతగా ఉండు. అంతా ఆయనే చూసుకుంటారు. ఆయన తనని నమ్ముకున్న వారికి యేవిథమైన అన్యాయం చేయరు. కాని మనం శ్రథ్థ, సహనంతో ఉండాలి.
అందుచేత భక్తిలో శతృత్వమనె భావన ఉండకూడదు.
దేవుడు ఒక్కడే. సాయి, దేవుడు. అందరి దేవుళ్ళలోను సాయిని చూడు. సాయిలో అందరి దేవుళ్ళను చూడు. వినాయకుడి ని దర్శిస్తే సాయి వినాయక అనుకో. విష్ణువుని దర్సిస్తే సాయి విష్ణు, రాముణ్ణి దర్సిస్తే సాయి రామా శివుడిని దర్శిస్తే శివసాయి,లక్ష్మీదేవిని దర్శిస్తే సాయి లక్ష్మి, అనుకో.


మతానికి, కులానికి అతీతంగా ప్రతీ దేవాలయంలోను శిరసువంచి నమస్కరించు. భవుతికంగా బాబాను చూడాలనే కోరికకు ఆశ్రయమివ్వకు. ఆయన ఆకార రహితుడు. ఆయన ఈ భూమిమీద నివశించారు. ఆయన అన్నిటిలోనూ, ప్రతీచోటా ఉన్నారు. ఆయన యెక్కడ లేరు? ఆయనని నువ్వు చూడగోరితే నీ హృదయంలోపల చూడు.

(బాబా ఆకార రహితుడు అని చెప్పుకున్నాము కదా. మీకు నాకు కూడా ఒక అనుమానం వచ్చి ఉండాలి. బాబా ఆకార రహితుడు అన్నారు, బాబా ఫోటోలని, విగ్రహాలని చూస్తున్నాము కదా, మరి ఆకారం లేదంటారేమిటి? ఇదే కదా సందేహం? ఇక్కడ నా అభిప్రాయం: ఇక్కడ బాబా యేమని చెప్పారు, అందరిలోనూ తనని చూడమన్నారు. నేను ఈ ప్రపంచమంతా నిండి ఉన్నాను. అన్ని జీవులలోనూ నన్ను చూడు. అన్నారు. అంటే ప్రతీ మనిషిలోనూ, ప్రతీ జంతు జాలంలోనూ చూడమన్నారు. మరి ఆయన రూపాన్ని మనం మనసులో యేర్పరచుకుంటే ఒక ప్రాణిలో అంటే చిలుకలో, లేక నీ యెదుటి వ్యక్తిలో యెలా చూడగలవూ. బాబా విగ్రహాన్ని, కాని ఫోటొని కాని చూసినప్పుడు ఆయన రూపమదే అని మనసులో ముద్రించుకో. కాని యెదటివారిలో గాని యితర జంతుజాలంలో గాని సాయిని నిరాకారంగా చూడు.
అంటే సాయి ఉన్నాడు అనే భావంతో చూడు
ఇది నా అభిప్రాయం. దీనికి యింకా యెవరైనా వివరణ ఇవ్వాలనుకుంటే నాకు మైల్ పంపండి. బ్లాగులో పోస్ట్ చేస్తాను.)

నువ్వు బాబాని చూడలేదు, బాబాతో జీవించలేదు? కాని బాబా నీతో నిరంతరం ఉన్నట్టుగా కనిపిస్తాడు. యెప్పుడు? పైన చెప్పిన సాయి భక్తి అనే ప్రేమ పరిమళం నీ చుట్టూ వ్యాపించి, ఆ పరిమళాన్ని నువ్వు ప్రేమ తో అందరికి పంచినప్పుడు.
యివ్వడం అనేది జీవితంలో ఒక భాగమయిపోవాలి. అంటే యితరులకి పెట్టాలి. నీవు తినేది యితరులకి పంచాలి. బాబా సచ్చరిత్రలో కూడా చెప్పినదిదే. వంటరిగా తినకు అని. నువ్వు తినేటప్పుడు నీప్రక్క వారికి కూడా పెట్టు. ఒకవేళ యెవరూ లేకపోతే బాబాకి నివేదించి తిను. నీవు వంటరిగా ఉన్నా, అందరితో ఉన్నా ముందర బాబాకి నివేదించడం అలవాటు చేదుకో.
అవసరమయినవారికి వినయంతో పంచు.
నువ్వు పూజ చేసే చోట బాబా పఠాలు యెంత తక్కువగా వీలయితే అంత తక్కువగా ఉంచు. యెందు చేతనంటే నీ దృష్టి అన్నిటి మీద మరల కుండా ఉంటుంది. యేకాగ్రత చెడకుండా ఉంటుంది. నువ్వు యెంచుకున్న బాబా స్వరూపం మీదే నీ దృష్టి లగ్నం కావాలి. బాబా రూపం మీద చక్కటి యేకాగ్రత కుదురుతుంది.
సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.
