ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి
కొన్ని అనివార్య కారణాల వల్ల బాబా ఫోటో, గులాబీ అందించలేకపోతున్నాను.
మరువరాని బాబా దర్శనానుభూతి
ఈ రోజు బెంగళూరు శ్రీ సతీష్ గారిని బాబా వారు యెలా అనుగ్రహించారో తెలుసుకుందాము. శ్రీ సతీష్ గారు తమ బాబా లీలానుభవాన్ని సుకన్యగారికి పంపించగా, దానిని మీకు తెలుగులో మీకు అందిస్తున్నాను
ఈ రోజు నాకొక అద్భుతం జరిగింది. నేను బాబాని చూశాను. వారి అనుగ్రహం నాకు కలిగింది.
కొన్ని వారాలు, నెలల క్రితం నించి నాకు కొన్ని వ్యక్తిగత సమస్యలు ఉండి నన్ను చాలా చికాకు పరుస్తున్నాయి. నిన్న రాత్రి నేను బాబాని, ఈ కష్టాలు, బాథలు యెందుకని నన్ను వదలివెళ్ళిపోవటల్లేదు అని అడిగాను. రాత్రంతా నాకు నిద్ర లేదు. ఈ రోజు ఉదయం నేను యెప్పుడూ దర్శించే బాబా మందిరానికి వెళ్ళాను. నేనెప్పుడు వారాంతములలోనే బాబా గుడికి వెడుతూ ఉంటాను. కాని ఈ రోజు యెందుకు వెళ్ళానో నాకే తెలియదు. నేను బాబాతో, నువ్వే కనక నన్ను నిజంగా ప్రేమిస్తుంటే నువ్వు వున్నట్లుగా నాకు నీ దర్శనం కావాలి అన్నాను.
బాబా మీద నాకు బొత్తిగా కోపంగా ఉంది. బాబాని ప్రార్థించిన వెంటనే నేను గుడినించి బయటకు వచ్చాను. బయట ధోతీ పైజామా (మాసిన బట్టలు) థరించి ఉన్న ఒక ముసలి వ్యక్తిని చూశాను. అతను "నాకు ఒక కప్పు టీ ఇప్పించగలవా" అని అడిగాడు. రెండు నిమిషాలు నేను షాక్ తిన్నాను, తరువాత అతనితో "అలాగే" అని చెప్పాను. దగ్గరలో ఉన్న టీ స్టాల్ కి తీసుకునివెళ్ళి టీ ఇప్పించాను. ఈలోగా నేను ఆ ముసలి వ్యక్తిని, అతని వివరాలు, అతను యెక్కడనించి వస్తున్నాడు అని అన్ని వివరాలు అడగడం మొదలుపెట్టాను. అతను తన పేరు "సంత్ రాం" అనీ, తాను భిక్షమీదే అథారపడి జీవిస్తున్నట్లు చెప్పాడు. నేను అతని కళ్ళల్లోకి చూసి, "బాబా" నిన్ను గుర్తించాను."అన్నాను. అతను ఒక చిన్న నవ్వు నవ్వి "అవును" అన్నాడు. అతను నా కళ్ళల్లోకి చూసి, ఒక కన్నీటిని రాల్చాడు. నేను గట్టిగా "బాబా, బాబా " అని యేడిచాను.
ఆ ముసలి వ్యక్తి కూడా నాతోపాటుగా యేడిచాడు. అతను నాతో " నీ విథి నువ్వు నిర్వర్తించు, మిగతాది నేను చేస్తాను" అన్నాడు. నేనతనితో నాకు కొన్ని సమస్యలున్నాయని చెప్పాను. "యేమీ చింతించద్దు, దేవుడు రక్షిస్తాడు అని చెప్పాడు.
నేను బాబా ని డబ్బేమన్నా కావాలా అని అడిగాను. అతను వద్దన్నాడు. తను అన్ని దేవాలయాలని దర్శిస్తానని బిక్షగా యేది లబిస్తే అదే తింటానని చెప్పాడు. నేనతనితో కొన్ని బిస్కట్స్ కొని ఇస్తానన్నాను. అతను వద్దన్నాడు.
అతను, "ప్రపంచంలో చాలా మంది పేదవారున్నారు. కొంతమందికి సరైన తిండి కూడా లేదు" అన్నాడు. నేనతనిని నా నుంచి కొంత డబ్బు తీసుకోమని బలవంతం చేశాను. కాని అతను నిరాకరించాడు. అతను " నువ్వు నాకిప్పుడు టీ ఇప్పించావు, అలాగే మథ్యాహ్నం యెవరోఒకరు తినడానికి యేదోఒకటి ఇస్తారు." అన్నాడు. అతని కళ్ళు చూడటానికి చాలా ఆకర్షణీయంగానూ, ఆనందకరంగానూ ఉన్నాయి. నేనతనికి ఒక సాయి ఫొటో ఇస్తానన్నాను, దానికతను సమ్మతించాడు. అతనా ఫోటోని పరీక్షగాచూసి, తీసుకున్నాడు. "ఇప్పుడతను వెళ్ళాలి" అన్నాడు. నేనతని పాదాలను ముట్టుకున్నాను. "అంతా సరి అవుతుంది" అన్నాడు.
నేను నా కారువద్దకు వెళ్ళి లోపల కూర్చున్నాను. కారు లోపల పెద్దగా యేడిచాను. శశికళా సిస్టర్ కి ఫోన్ చేసి, నేను బాబాని చూశాను అని యేడిచాను.
నేను మరొకసారి అనుగ్రహింపబడ్డాను. నా అనుభూతులని నేను మాటలలో వర్ణించలేను. నా జీవితంలో యింత గట్టిగా నేనెప్పుడూ యేడవలేదు. సాయి భక్తులందరికి నేను చేసే విన్నపం యేమిటంటే మనకెప్పుడు సాయి ఉన్నాడు. మనం శ్రథ్త సహనంతో ఉండాలి అంతే.
నాకు చాలా సంతోషంగా ఉంది.
సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు
సాయిరాం
సతీష్
