

14.08.2011 ఆదివారము
ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంథువులకు బాబావారి శుభాశీస్సులు
మేఘుడు శివునికి స్నానము చేయించుట
షిరిడీలో స్థిర నివాసం యేర్పరచుకున్న గొప్ప సాయి భక్తుడు మేఘ. అతను గొప్ప శివ భక్తుడు. బాబాకు అది తెలుసు. అందుచేత బాబా అతనికి ప్రతిరోజూ తన దేవుడికి పూజ చేసుకోవడానికి శివలింగాన్ని బహూకరించాడు. బాబా కూడా మేఘుడిని అమితంగా ప్రేమిస్తూఉండేవాడు. అదే, షిరిడీలో అతని అంతిమయాత్రలో కూడా పాల్గొనేలా చేసింది. బాబా ఆ అంతిమయాత్రలో కలిసి అతని శవం మీద స్మశానం వరకూ పూలు జల్లుతూ వెళ్ళారు. తన నిజమైన భక్తునిమీద దుఃఖాన్ని, ప్రేమను తెలియచేస్తూ సాథారణ మానవ మాత్రునివలె కన్నీరు కార్చారు.
మేఘుడు బాబానే తన శంకరుడిగా యెంచుకున్నాడు. దానివలననే ఆయన, మేఘునికి తన నుదిటిమీద త్రిశూలం గీయాలనే కోరికకి అనుమతినిచ్చారు. ఒక మహాశివరాత్రినాడు మేఘుడికి, బాబాని గంగాజలంతో (గోదావరీ జలం) స్నానం చేయిద్దామనే కోరిక కలిగింది. బాబా అంత తేలికగా ఒప్పుకోరని తెలిసి అతను బాబాని ముందుగానే తనకి అనుమతినివ్వమని వేడుకోవడం మొదలుపెట్టాడు. ఆఖరికి యెంతో వేడుకొనగా మేఘుని చేత స్నానం చేయించుకోవడానికి ఒప్పుకున్నారు.
అనుమతి లభించినందుకు మేఘుడు చాలా సంతోషించాడు. ఒకరోజు ముందరే మేఘా తన సన్నిహితులందరినీ అభిషేక ఉత్సవం తిలకించడానికి ఆహ్వానించాడు. ముందురోజు రాత్రే మేఘ, షిరిడీకి 11 కి.మీ.దూరంలో ఉన్న గోదావరికి, గంగాజలం తీసుకురావడానికి షిరిడీనించి బయలుదేరాడు.

మేఘాలాంటి నిజమైన భక్తునికి దూరం సమస్య కాదు. అతను గంగాజలం తీసుకుని మధ్యాహ్నా న్నానికి ముందే షిరిడీకి తిరిగి వచ్చాడు. మధ్యాహ్నం ఆరతి అయిన తరువాత మేఘుడు బాబాని అభిషేకానికి రమ్మని కోరాడు. బాబా అతనితో సరదాగా అన్నానని తనలాంటి ఫకీరుకు అటువంటి పనులు ఒప్పవని చెప్పారు.
బాబా అతనితో షిరిడీలోని శివుని గుడిలో శివలింగానికి ఆ గంగాజలాన్ని పోయమని చెప్పారు. అప్పుడు మేఘుడు బాబాతో, తాను లింగానికి ప్రతిరోజూ అభిషేకం చేస్తున్నాననీ, బాబానే తను శివునిగా భావిస్తున్నందువల్ల, శివ భక్తులందరికీ శివరాత్రి పర్వదినం కాబట్టి తనను నిరాశపరచవద్దని చెప్పాడు.


అక్కడ బాబా యెప్పుడూ స్నానానికి ఉపయోగించే ప్రత్యేకమయిన రాయి ఉంది. ఆయన దాని మీద కూర్చున్నారు. తన శిరసు ముందుకు వంచి మేఘునికి నీరుపోయమని సంజ్ఞ చేశారు. మేఘుడు బాబా శిరసు మీద నెమ్మదిగా నీరు పోయడం ప్రారంభించాడు కాని అతనికావిథమైన స్నానం తృప్తి కలిగించలేదు. అందుచేత తానన్ని రోజులుగా తన మనసులో ఆలోచించుకున్న విథంగా చేయడానికి నిర్ణయించుకున్నాడు. అతను హటాత్తుగా బకెట్లో మిగిలి ఉన్న నీటిని "హర హర మహాదేవ్" అంటూ బాబా శరీరం మొత్తమంతా పోశాడు. తన కోరికను పూర్తిగా తీర్చుకున్నందుకు మేఘుడు ఉల్లాసంతో నాట్యం చేయడం మొదలు పెట్టాడు. కాని యిది యెంతోసేపు నిలవలేదు. తాను బాబా శరీరం మొత్తమంతా నీరు పోసినప్పటికీ, ఆయన తలమాత్రమే తడిసి మిగిలిన శరీరభాగం కఫ్నీతో సహా పొడిగా ఉందని అతనికి వెంటనే అర్థమయింది. అపుడు బాబా అతనితో "హే ! గంగ శివుని శిరసునుండి ప్రవహిస్తుందనీ, ఆయన మిగిలిన శరీరాన్ని తాకదనీ నీకు తెలుసా" అన్నారు. మా నాన్నగారు ఈ వినోదాన్నంతా యితర ఆహ్వానితులతో కూడా కలిసి వీక్షిస్తూ ఉన్నారు. బాబా తను చెప్పిన మాటే ఆఖరి నిర్ణయమని దానిని థిక్కరించే థైర్యం యెవరికీ లేదని తనకి తెలియచెప్పాలనే ఆయన ఉద్దేశ్యమని మేఘునికి అర్థమయింది.
బాబా కూడా మేఘునికి తానే ప్రత్యక్షంగా శివుడినని తెలుసుకునేలా చేయాలని కోరుకున్నారు. అప్పుడు మానాన్నగారికి బాబా చేసే అనేకములైన పనులు పూర్తిగా అర్థం చేసుకున్నారు. ఆయన ఉద్దేశ్యం ప్రకారం, కొంత కాలం గడిచేటప్పటికి బాబా తన చుట్టూ ఆదర్శప్రాయమైన భక్తులని పెంపొందించుకున్నారు. భగవంతుని అస్తిత్వాన్ని ఆయన అఖండమైన శక్తులగురించి, ప్రజలు వాటికి తమ అనన్యమైన భక్తి ద్వారా గౌరవమివ్వాలని వారు తమ నిగూఢమైన చర్యల ద్వారా ప్రజలని ప్రభావితం చేస్తూ ఉండేవారు. అలాంటివారిలో కొందరు మేఘా (లార్డ్ శివ), నానావలి (లార్డ్ హనుమాన్), యిక దాసగణు (లార్డ్ విఠోబా). నిజానికి దాసగణు తన ఆరతిలో ఒక దానిలో యేమి చెబుతున్నారంటే "షిరిడీ మాఝే పండరిపుర సాయిబాబా రమావర్ (షిరిడీయే నా పండరిపురము సాయిబాబాయే నా విఠోబా) అని. బాబా సంతోషంగా ఉన్న సమయంలో "హే భావూ ! నేను దేవత లక్ష్మీదేవిని తప్ప మరెవరినీ కాదు, నేను ద్వారకామాయిలో కూర్చుని నేనెన్నడూ అబథ్థం చెప్పను" అని అంటూ ఉండేవారు. ఆయన జీవితకాలమంతా తనకి తాను దేవుని దూతననే చెప్పుకున్నారే కాని దేవుడినని చెప్పుకోలేదు. ఆయన యేది ఉఛ్ఛరిస్తే అది తప్పకుండా జరిగేది. మా నాన్నగారు బాబా చెప్పినవాటిని తిరిగి గుర్తు చేసుకుంటూ ఉండేవారు. "హేయ్ భావూ ! ఈ మానవ శరీరాన్ని వదలివెళ్ళిపోయిన తరువాత షిరిడీకి ప్రజలు పంచదారకోసం వచ్చిన చీమల బారుల్లా రావడం నువ్వు చూస్తావు".
ఈ రోజు మీరు సంవత్సరంలో ఏ రోజునైనా షిరిడీని దర్శించండి, సంవత్సరాల క్రితం బాబా చెప్పిన మాటకి ఋజువు మీకు లభిస్తుంది.
సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు
