

ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
గత నాలుగు రోజులుగా సాయి బా ని స అనుభవాలను అందించలేకపోయాను. హైదరాబాదు నుంచి నరసాపురం ప్రయాణం, వచ్చిన తరువాత ఇప్పటి పరిస్థితులలో కరంటు కోత వల్ల వీలు పడకపోవడం మొదలయిన కారణాలతో ఆలశ్యమయింది.
ఈ రోజు సాయి బా ని స అనుభవాలలో 11 వ అనుభవాన్ని మీకందిస్తున్నాను.
బాబాతో సాయి.బా.ని.స. అనుభవాలు. 11
శ్రీ సాయి తన భక్తుల కలలలో కనపడి కొన్ని విషయాలను చెప్పి, భవిష్యత్తు గురించి తగు జాగ్రత్తలను చెప్పేవారని మరియు వారితో తన అనుబంధాలను తెలియచేసేవారని శ్రీ సాయి సచ్చరిత్రలో అనేక చోట్ల ఉదహరింపబడింది. భవిష్యత్తులో జరగబోయే సంఘటనలు హెచ్చరికలు ఇంతకుముందు నా అనుభవాలలో మీకు నేను తెలియచేసి ఉన్నాను. ఈ రోజున బాబా నాతో పంచుకున్న ప్రేమానుభూతులను నేను మీకు తెలియచేయదలచుకున్నాను.
అది 1991 వ.సంవత్సరము శ్రీరామనవమి పర్వదినము తెల్లవారుజామున నా కలలో శ్రీ సాయి ఒక సాధువు రూపములో దర్శనమిచ్చి, తాను రామ లక్ష్మణుల రూపములో మాయింటికి వచ్చి తీర్థ ప్రసాదములు తీసుకుని వెడతానని సూచించడం జరిగింది.

ఇప్పుడు నా రెండవ అనుభవాన్ని చెపుతాను. అది మా అమ్మాయి వివాహ పనులు చేసుకునే సమయము. నేను మా అమ్మాయి కాబోయే అత్తవారింటికి 1992 మార్చ్ ఏడవ తారీకున వెళ్ళి కట్న కానుక విషయాలన్ని స్థిరము చేసుకుని, తిరిగి ఎనిమిదవ తారీకు తెల్లవారుజామున ఈష్టు కోష్టు రైలుకు హైదరాబాదుకు బయలుదేరాలని నిశ్చయించుకున్నాను. మార్చ్ ఏడవ తారీకు రాత్రి అనగా ఎనిమిదవ తారీకు తెల్లవారుజామున శ్రీ సాయి ఒక మధ్యవయస్కుడైన వ్యక్తి రూపములో సూటు, బూటు, హాటు, నల్లకళ్ళద్దాలు పెట్టుకుని నా వద్దకు వచ్చి మీ వియ్యాల వారికి పెండ్లి లాంఛనాల నిమిత్తము ధనము ఇచ్చినావే మరి నాకు అయిదు రూపాయలు దక్షిణ ఇవ్వగలవా అని అడిగినారు. నేను నిద్రనుండి లేచి విశాఖపట్నము రైల్వే స్టేషనుకు బయలుదేరినాను. ఉదయము అయిదు గంటలకు రావలసిన రైలు ఒక గంట ఆలశ్యముగా వచ్చునని రైల్వే అధికారులు తెలియచేసినారు. నేను రైలు రాక కోసము ఒకటొ నంబరు ప్లాట్పారము బెంచీ మీద కూర్చున్నాను. అది సూర్యోదయ సమయము. ప్లాట్ ఫారము చివరినుండి సూటు, బూటు, హాటు, నల్లకళ్ళద్దాలు ధరించిన వ్యక్తి నా పక్క బెంచీ మీద కూర్చున్నాడు. ఆ వ్యక్తిని చూడగానే కొద్ది గంటల క్రితము కలలో సాయి దర్శనమిచ్చి అన్న మాటలు గుర్తుకు వచ్చినవి. నా పక్క బెంచీ మీద కూర్చున్న వ్యక్తి శ్రీ సాయి అని గట్టిగా నమ్మినాను. నేను ఆయనకి అయిదు రూపాయలు దక్షిణ ఇచ్చినా ఆయన తిరస్కరించితే నేను తట్టుకోలేను. కాని నేను ఆయనకి ఏవిథంగా ఇవ్వగలను అని ఆలోచనలో నా జేబులోంచి అయిదు రూపాయల నోటు తీసుకుని ఆ వ్యక్తి కూర్చున్న బెంచీ వద్దకు వెళ్ళి ఆవ్యక్తి పాదాల వద్ద అయిదురూపాయల నోటు జారవిడిచాను. ఏమీ తెలియనట్లుగా ఆ వ్యక్తి వద్దకు వెళ్ళి, మీజేబులోంచి అయిదు రూపాయల నోటు కింద పడవేసుకున్నట్లున్నారే అని చెప్పి ఆ నోటు తీసి అతని చేతికిచ్చినాను. ఇదంతా ఒక్క క్షణంలో జరిగిపోయింది. ఆ వ్యక్తి నేనిచ్చిన నోటును స్వీకరించి నా వైపు చిన్న చిరునవ్వు విసిరి తిరిగి ప్లాట్ ఫారము చివరికి వెళ్ళి కనుమరుగైపోయినాడు. శ్రీ సాయి ఈ వ్యక్తి రూపములో వచ్చి నానుండి అయిదురూపాయల దక్షిణ స్వీకరించారనే భావనతో నా రెండు చేతులు పైకి యెత్తి ఆ వ్యక్తికి నమస్కరించాను.
సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు
0 comments:
Post a Comment