

ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాసీస్సులు
ఈ రోజు సాయి.బా.ని.స. డైరీ 1993 4 వ. భాగాన్ని చదువుకుందాము.
సాయి.బా.ని.స. డైరీ 4 వ. భాగము
03.03.1993 బుధవారము
శ్రీ సాయి దత్తాత్రేయుని అవతారము అని శ్రీ సాయి సత్ చరిత్రలో హేమాద్రిపంతు ఉపోద్ఘాతములో చక్కగా వివరించినారు. అయినా నా మనసులో ఎక్కడో ఒక మూల ఫకీరు అనే భావన నిలిచిపోయింది. ఈ భావనను తొలగించటానికి నిన్నరాత్రి శ్రీ సాయి చూపించిన దృశ్యము నాలోని భావాలను మార్చి వేసినది. నేను పని చేస్తున్న అతుకు లేని తుప్పు పట్టని (స్టైన్ లెస్ స్టీలు) గొట్టాల తయారీ కర్మాగారాన్ని చూపించినారు. మా ఫ్యాక్టరీకి లారీలలో స్టైన్ లెస్ స్టీలు మూల పదార్థముగా యున్న ఉక్కు దిమ్మలు వస్తున్నాయి.

05.03.1993 శుక్రవారము
నిన్నటి రాత్రి శ్రీ సాయి చక్కని దృశ్యాన్ని ప్రసాదించినారు. ఆదృశ్యములో ఒక ముసలివాడు తిరగలిలో గోధుమలు పిండిగా విసరుతున్నాడు. అతనికి తినటానికి కావలసినదాని కంటే కొంచము ఎక్కువ గోధుమ పిండిని విసరినాడు. ఆయన నన్ను ఉద్దేశించి అన్నారు, "నీవు సంఘము అనే తిరగలిలో గోధుమలులాగ విసరబడి - పిండిగా మారి నా భక్తులకు రొట్టెగా మారాలి". ఒక్కసారి ఉలిక్కిపడి లేచినాను. ఆ మాటలు చెవిలో యింకా వినిపించుతున్నాయి. శ్రీ సాయి సత్ చరిత్రలో 1 వ. అధ్యాయములో గోధుమలు విసరుట దాని వేదాంత భావమును చక్కగా వివరించబడినది. శ్రీ సాయి నిన్నరాత్రి కలలో స్వయముగా గోధుమలు విసరుటలోని వేదాంత భావమును స్వయముగా నాకు వివరించినారు అని నా నమ్మకము.
06.03.1993 శనివారము
నిన్న రాత్రి శ్రీ సాయి నా జీవిత పరిస్థితి చక్కగా కలలో దృశ్య రూపములో చూపించినారు. నేను రిక్షా తొక్కుతున్నాను. నా రిక్షాలో నా భార్య పిల్లలు కూర్చుని యున్నారు. వాన విపరీతముగా పడుతున్నది. రోడ్డుమీద గోతులు అన్నీ నీళ్ళతో నిండిపోయి రోడ్డు సరిగా కనిపించటములేదు. నేను రిక్షాను అతి కష్టము మీద త్రొక్కుతున్నాను.


సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు
(ఇంకా ఉంది)
0 comments:
Post a Comment