17.02.2012 శుక్రవారము
ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ రోజు సాయి.బా.ని.స. డైరీ - 1994 29 వ. భాగము చదువుకుందాము
సాయి.బా.ని.స. డైరీ - 1994 (29)
10.10.1994
నిన్న రాత్రి శ్రీ సాయికి నమస్కరించి నిద్రపోయినాను. శ్రీ సాయి అజ్ఞాత వ్యక్తి రూపములో యిచ్చిన సందేశములు.
1) సంసారము - బరువు బాధ్యతలు శాశ్వతము కాదు. శాశ్వతమైనది (భగవంతుడు) ఏమిటి? అనేది తెలుసుకొని జీవించు.
2) జీవితంలో అప్పు చేసి బహుమతులను ఎవరికి ప్రదానము చేయకు. వాళ్ళ "మెహర్బాని" మాట భగవంతునికి తెలుసు. అప్పులవాళ్ళనుండి వచ్చే బాధ నీకు మాత్రమే తెలుసు. - శ్రీ సాయి -
12.10.1994
నిన్నటిరోజున మా కుటుంబమునకు ఆత్మీయులు అయిన శ్రీ నాగరాజరావు గారి మరణవార్త విన్నాను. మనసులో చాలా బాధ కలిగినది. జననము - మరణము గురించి చాల ఆలోచించినాను. రాత్రి నిద్రకు ముందు శ్రీ సాయికి నమస్కరించి సాయినాధ పునర్జన్మ గురించి వివరాలు చెప్పు తండ్రి అని వేడుకొన్నాను. శ్రీ సాయి దృశ్యారూపములో తెలిపిన వివరాలు. 1) ఆత్మ శరీరాన్ని వదలిన తర్వాత శరీరము పంచభూతాలలో కలసిపోతుంది. 2) ఆత్మ పదిరోజుల తర్వాత ఋణానుబంధాను సారముగా గర్భవతి అయిన స్త్రీ మూర్తి గర్భములోని పిండములో ప్రవేశించి నూతన జన్మకు నాంది పలుకుతుంది. 4) ఆతల్లి గర్భాన్ని నవమాసాలు మోసిన తర్వాత నూతన ప్రాణికి జన్మ యిస్తుంది. అదే పునర్జన్మ. 5) కొంతమంది స్త్రీలు అవివాహితులుగా యుండిపోతారు. కొంతమంది స్త్రీలు వివాహము చేసుకొన్నా గర్భవతి కాలేరు. ఆత్మ అటువంటి స్త్రీలనుండి దూరముగా తిరుగుతుంది. 6) ప్రమాదాలలో మరణించినవారికి ఈ ఋణానుబంధాల సిద్ధాంతాలు వర్తించవు. ప్రమాదములో మరణించినవారు ఆసమయములో దగ్గరలో ఉన్న గర్భవతి గర్చములోగాని, జంతు గర్భములో గాని ప్రవేశించి పునర్జన్మ పొందుతారు. చనిపోయినవారి గురించి శోకించటములో అర్ధములేదు పుట్టిన ప్రతివాడు ఒకరోజున మరణించక తప్పదు. మనిషి చనిపోయిన తర్వాత అతని ఆత్మ తిరిగి గర్భవతి గర్భములో ప్రవేశించిన రోజే నిజమైన పుట్టినరోజు. ఈ నిజమైన పుట్టినరోజు ఎంతమందికి తెలుసు, ఆలోచించు.
13.10.1994 సమయం 1500 (అవర్స్) (3.00 పీ.ఎం.)
ఈరోజు మధ్యాహ్న్నము నిద్రలోని కలలో శ్రీ సాయి నామిత్రుడు శ్రీ బీ.ఎన్. మూర్తి రూపములో దర్శనము యిచ్చి అన్నారు.
"నేను మైన్ రోడ్డుదగ్గర యిల్లు కట్టుకోవటానికి స్థలము కొన్నాను.ఒకసారి చూడటానికి వచ్చి వెళ్ళు." నిద్రనుండి మెలుకువ వచ్చినది. సాయంత్రము ఏడుగంటలకు నేను నాయింటి ముందు నిలబడినాను. సాయి బంధువు శ్రీ సుందరరావు గారు నాదగ్గరకు వచ్చి అన్న మాటలు "నేను కమలానగర్ మైన్ రోడ్డు ప్రక్కన ఫ్లాట్ కొన్నాను. ఈరోజు ఉదయమే గృహప్రవేశము చేసినాను. దయచేసి మా నూతన గృహములో ఈ రోజు రాత్రి జరిగే శ్రీ సాయి హారతికి వచ్చి శ్రీ సాయికి మీ చేతుల మీదగా హారతి యివ్వమని కోరుతున్నాను." ఈ మాటలు వింటూ యుంటే మధాహ్న్నము కలలో శ్రీ సాయి అన్నమాటలు గుర్తుకు వచ్చినవి. రాత్రి శ్రీ సుందరరావుగారి నూతన గృహమునకు వెళ్ళి రాత్రి హారతి యిచ్చినాను.
ఈ సంఘటన శ్రీ సాయి సత్ చరిత్ర 30వ. అధ్యాయములోని రహతా కుశాల్ చంద్ స్వప్నమును గుర్తు చేసినది. శ్రీ సాయిబాబా స్వప్నములకు కాలనియమములు లేవు అని మరొక్కసారి నిర్ధారణ జరిగినది.
14.10.1994 విజయదశమి : సమయం 11.30 ఏ.ఎం.
శ్రీ సాయి నిరాకారుడు అనే ఉద్దేశముతో శ్రీ సాయి సత్ చరిత్రలో 28 వ. అధ్యాయములో శ్రీ సాయి మేఘశ్యామునితో అన్నమాటలను ఒక కాగితముపై వ్రాసి పటము కట్టించినాను. ఆ మాటలు "నాకు రూపములేదు. నేను అన్ని చోట్ల నివసించుచున్నాను." ఆపటమును హాలులోని టీ.వీ. వెనుక వ్రేలాడదీసి నమస్కరించి, టీ.వీ.ని ఆన్ చేసినాను (ప్రారంభించినాను.) టీ.వీ.తెరమీద కనిపించిన బొమ్మ నన్ను ఆనందములో ముంచివేసినది. ఆ బొమ్మ నాయిష్ఠ దైవము శ్రీ సాయినాధునిది. ఆ బొమ్మ క్రింద అక్షరాలు "శ్రీ సాయికృష్ణ క్రియేషన్స్ సమర్పించు" అన్నవి. శ్రీ సాయి అన్ని చోట్ల నివసించుచున్నారు అనుటకు నిదర్శనము.
21.10.1994
నిన్నటిరోజున ఆధ్యాత్మిక రంగములో ముందుకు పయనించటానికి తెలుసుకోవలసిన విషయాలపై ఆలోచించినాను. రాత్రి నిద్రకు ముందు శ్రీ సాయికి నమస్కరించి ఆధ్యాత్మిక రంగములో అభివృధ్ధికి తెలుసుకోవలసిన మంచి విషయాలు తెలియచేయమని వేడుకొన్నాను. శ్రీ సాయి చూపిన దృశ్యాల సారాంశము.
"ఉన్నత భావాలతో ఉన్నతమైన పదవులు అలంకరించి, పదవి విరమణ తర్వాత సంకుచిత భావాలతో బ్రతకటము అంటే తన్నుతాను మోసగించుకోవటమే. అటువంటి బ్రతుకు బ్రతికినా బతకకపోయినా ఒకటే. అటువంటివారు ఆధ్యాత్మిక జీవనానికి అర్హత లేనివారు అని గుర్తుంచుకోవాలి. -శ్రీ సాయి -
(యింకా ఉంది)
సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు
0 comments:
Post a Comment