12.10.2012 శుక్రవారము
ఓం సాయి శ్రీసాయి జయజయసాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
సాయి.బా.ని.స. చెప్పిన రామాయణంలో శ్రీసాయి
రామాయణంలో శ్రీసాయి 6వ. భాగము
కైకేయి దశరధ మహారాజుతో రామునికి బదులుగా భరతునికి పట్టాభిషేకం చేయమని కోరింది.
దశరధ మహారాజు దానికి అంగీకరించారు. దశరధ మహారాజు రాముని వియోగం భరించలేక మరణించారు.
ఆసమయంలో ఆయన ప్రక్కన, రాముడుగాని, లక్ష్మణుడు గాని, భరతుడు గాని, శతృఘ్నుడు గాని లేరు.
భరతుడికి జరిగిన విషయాలన్నీ కూడా తన తాతగారి ఇంటినించి అయోధ్యకు తిరిగి వచ్చిన తరువాత తెలిసాయి. తనకు పట్టాభిషేకం జరగాలని తన తల్లి కోరినా భరతుడు అంగీకరించలేదు. తన తండ్రి తన తల్లి కైకేయికి ఇచ్చిన మాట ప్రకారం శ్రీ రాముడు అడవులకు వెడుతూ తన సిరిసంపదలన్నిటినీ ప్రజలకు దానం చేసి వెళ్ళినాడని తెలుసుకొన్నాడు. శ్రీరాముడు సంతోషంగా తన సిం హాసనాన్ని భరతునికి ఇచ్చిన సంఘటన రామాయణంలో వివరంగా చెప్పబడింది. ఇటువంటి సంఘటన మనము శ్రీ సాయి సత్చరిత్ర 10వ. అధ్యాయములో చూడగలము.
ద్వారకామాయిలో బాబా వద్ద భక్తులంతా చేరి ఆయన కూర్చోవడానికి మంచి ఆసనం తయారు చేసి అందులో మెత్తటి దిండ్లు అమర్చారు. ఆయనకు దండ వేసి ఆ సుందర మనోహర దృశ్యాన్ని చూసి అందరూ ఆనందించేవారు.
నానావలి అనే భక్తుడు వచ్చి బాబాని ఆ ఆసనం తనదని చెప్పి బాబా ని లేవమని చెప్పినపుడు, శ్రీరాముడు తన సిం హాసనాన్ని భరతునికి త్యాగం చేసిన విధంగానే బాబా తన ఆసనాన్ని సంతోషంగా నానావలికి ఇచ్చారు.
మనము ఇక్కడ మరొక విషయాన్ని తెలుసుకుందాము. అయోధ్యకాండలో దానం గురించి ప్రముఖంగా చెప్పబడింది. అరణ్యానికి పయనమవుతున్నపుడు దారిపొడవునా ఉన్న ప్రజలకు శ్రీరాములవారు తన నగలనన్నిటిని స్వచ్చందంగా దానం చేశారు.
ఆసమయములో ఒక బ్రాహ్మణుడు ముందుకు వచ్చి రాముడితో తనకు గోవులను దానం చేయమని అడిగాడు. నీకెన్ని గోవులు కావాలి అని శ్రీరాములవారు అడిగినపుడు ఆబ్రాహ్మణుడు "నేను నా చేతిలో ఉన్న కఱ్ఱను ఇక్కడినుంచి విసురుతాను. ఆ కఱ్ఱ ఎంత దూరమయితే వెళ్ళి పడుతుందో అంత దూరమువరకు వరసలో నిలబడిన గోవులు కావలెను అన్నాడు"
శ్రీరాములవారు ఆ సమయంలో అయోధ్య పొలిమేరలుదాటలేదు కనక మంత్రి సుమంతుడిని పిలిచి యువరాజుగా తన ఆజ్ఞ ప్రకారము ఆబ్రాహ్మణుడికి గోవులను దానం చేయమని చెప్పినారు.
1909 - 1918 సంవత్సరాల మధ్య కాలంలో బాబా తన భక్తుల వద్దనుండి ప్రతీరోజు సుమారు 500 రూపాయలను దక్షిణగా తీసుకొంటు ఉండేవారు. మరలా వచ్చిన ఆ డబ్బునంతా తన భక్తులందరకూ పంచిపెడుతూ ఉండేవారు. ఈ రోజుల్లో మనకంతటి ఉదార స్వభావం ఎక్కడ ఉంది? సాయంత్రమయేటప్పటికి ఆయన వద్ద ఏమీ మిగిలి ఉండేది కాదు. మరలా మరునాడు ఉదయాన్నే భిక్షా పాత్ర పట్టుకొని భిక్షకు బయలుదేరేవారు.
మన సాయిరాముడు కూడా రామాయణంలోని శ్రీరాముడు అరణ్యానికి వెళ్ళేటప్పుడు తన దగ్గిర ఉన్నదంతా దానం చేసినట్లుగానే బాబా తన భక్తులకు దానం చేసేవారు.
రామాయణకాలంలో కొంతమందికి జంతువులు, పక్షులు, క్రిమికీటకాదుల భాషలు తెలుసు. ఒకరోజున కైకేయి మహారాజు, తన రాణితో కలసి తోటలో విహరిస్తున్నారు. ఇప్పుడు మనము మన పెంపుడుజంతువులకు పేర్లు పెట్టుకున్నట్లు గానే ఆకాలంలో కూడా జంతువులకు పేరు పెట్టి పిలిచేవారేమో. అప్పుడు అక్కడ జృంభకము అనే మగ చీమ ఆడచీమతో మాట్లాడుతూ ఉండటం వాటిని కైకేయి మహారాజుచూడటం, ఆరెండు చీమల సంభాషణ విన్న తరువాత కైకేయ మహరాజు చిన్న చిరునవ్వు నవ్వినారు.
ఎందుకు నవ్వుతున్నారని మహారాణి అడిగింది. "అది ఒక మగ చీమ ఆడ చీమ మాట్లాడుకుంటున్నాయి. ఆవిషయం గురించి తరువాత చెపుతాను" అన్నారు కైకేయ మహారాజు. అందుచేత రామాయణంలో జరిగిన ఇటువంటి సంఘటనలు చూసిన తరువాత ఆకాలంలో క్రిమికీటకాలు, జంతువులమధ్య కూడా సమాచార సంభాషణా వ్యవస్థ ఉందనే విషయం మనకి అర్ధమవుతుంది.
ఇప్పుడు నేను చెప్పిన విషయానికి శ్రీసాయి సత్చరిత్రకు ఉన్న సంబంధం ఏమిటన్నది మీకు ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు. శ్రీ సాయి సత్చరిత్రలోని 15 వ. అధ్యాయాన్ని ఒక్కాసారి గుర్తుకు తెచ్చుకుందాము. ద్వారకామాయిలోఒక బల్లి వింతగా శబ్దం చేయసాగింది.. అప్పుడక్కడ ఉన్న భక్తుడొకదు ఆ బల్లి శబ్దం శుభానికి సంకేతమా లేక అశుభానికా అని కుతూహలంతో బాబాని అడిగాడు.
ద్వారకామాయిలోని బల్లి, ఔరంగాబాదునుంచి తన చెల్లెలు రాక కోసం ఎదురు చూస్తోందని బాబా సమాధానమిచ్చారు. రామాయణకాలంలో వలేనే,బాబాకు కూడా క్రిమికీటకాలు, జంతువుల భాష తెలుసు.
ఈ కలియుగంలో మన సాయిరాముడికి క్రిమికీటకాదులు జంతువులభాష తెలుసుకొనే శక్తి ఉందనే విషయం శ్రీసాయి సత్ చరిత్ర చదివేవారికందరకూ తెలుసు.
(రామాయణంలోకి మనము మరికాస్త ముందుకు వెడదాము)
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు
0 comments:
Post a Comment