01.11.2012 గురువారము
ఓం సాయి శ్రీసాయి జయజయసాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీకృష్ణునిగా శ్రీసాయి - 5వ. భాగము
ఈ రోజు సాయి బా.ని.స.చెపుతున్న శ్రీకృష్ణునిగా శ్రీసాయి వినండి.
శ్రీకృష్ణునిగా శ్రీసాయి
తనను మశ్చీంద్రఘడ్ లో పూజించమని బాబా బలరాం మాన్ కర్ తో చెప్పారు. ఆయన అక్కడ ప్రత్యక్షంగా బాలారాం మాన్ కర్ కు దర్శనమిచ్చి, తాను షిరిడీకి మాత్రమే పరిమితం కాదనీ సర్వత్రా నిండి యున్నానని నిరూపించారు.
మరొక సంఘటనలో చందోర్కర్ కు పండరీపురానికి బదిలీ అయింది. చందోర్కర్ తనతో కూడా బాబాను పండరీపూర్ కు తీసుకొనివెడదామనుకొన్నాడు. అతను బాబా అనుమతి తీసుకోవడానికి షిరిడీ వచ్చాడు. ఆసమయములో బాబా మనమందరమూ పండరీపూర్ వెళ్ళవలెను అని భజన్ పాట పాడుతూ ఆ భజనలో మునిగిపోయి ఉన్నారు. భక్తులందరూ బాబా చుట్టూ కూర్చొని వున్నారు. దూరం నుంచే బాబా, చందోర్కర్ మనసులో ఏముందో తెలుసుకొని దానికి అనుగుణంగా బాబా తన భక్తులందరితో కలిసి పాడుతున్నారు.
ఒకసారి బాబా తన దర్బారుకు అతిధులు, శ్రేయోభిలాషులు వస్తారని ముందుగానే చెప్పారు. తరువాత దురంధర్ సోదరులు ద్వారకామాయికి వచ్చినప్పుడు, ఉదయం వారి గురించే తాను చెప్పానని బాబా అన్నారు. ఈ ఉదాహరణల వల్ల వివేక వైరాగ్యాలను పొందిన తరువాత బాబాకు అష్టసిధ్ధులు లభించాయని మనకు అర్ధమవుతుంది.
చిత్రకేతు మహారాజుకు అనేక మంది భార్యలున్నప్పటికీ ఆయనకు సంతానం లేదు.
అంగీరస మహాముని మహారాజు చేత పుత్రకామేష్టి యాగం చేయించిన తరువాత, పుత్రుడు జన్మించాడు. ఇటువంటిదే మనకు సాయి సత్చరిత్రలో కనపడుతుంది. నానాసాహెబ్ డేంగ్లే కి కూడా సంతానం లేదు. రతంజీ షాపూజీ వాడియా కు 12 మంది కుమార్తెలు, కాని మగ సంతానం లేదు. బాబా ఆయనకు పుత్రుడిని ప్రసాదించారు. దాము అన్నా కాసర్ కు ఇద్దరు భార్యలున్నా గాని సంతానం కలగలేదు. బాబా అతనికి రెండు మామిడిపళ్ళను ఇచ్చి ఒకటి చిన్నభార్యకు ఇమ్మని చెప్పారు.
బాబా అనుగ్రహంతో ఆమెకు సంతానం కలిగింది.
1896 లో గోపాల్రావ్ గుండు అనే సబ్ యిన్ స్పెక్టర్ కు కూడా ఇద్దరు భార్యలున్నా సంతానం లేదు. బాబా అనుగ్రహంతో అతనికి సంతానం కలిగింది. ఈనాడు వైద్య శాస్త్రం ఎంతగానో అభివృధ్ధి చెందడంవల్ల, గైనకాలజిస్టుల రూపంలో బాబా ఎంతో మంది సంతానం లేనివారిని అనుగ్రహిస్తున్నారు.
ఔరంగాబాద్కర్ భార్య బాబా దర్శనానికి వచ్చి, తాను తనకన్న వయసులో బాగా పెద్దయిన వ్యక్తిని వివాహం చేసుకొన్నాననీ తనకు సంతానాన్ని అనుగ్రహించమని వేడుకొంది. మొదట బాబా ఒప్పుకోలేదు, కాని శ్యామా కలుగచేసుకొన్న తరువాత ఆమెకు ఒక కొబ్బరిచిప్ప నిచ్చి తినమని చెప్పారు. ఆతరువాత ఆమెకు పుత్ర సంతానం కలిగింది.
హిరణ్యకశిపుని కుమారుడు ప్రహ్లాదుడు నవవిధ భక్తి యొక్క ప్రాముఖ్యాన్నితన వివరించాడు. ప్రహ్లాదుడు తనతండ్రికి విష్ణువును పూజించమని ఆయనకు విధేయుడై ఉండమని చెప్పాడు.ఇక్కడ మనకు ఒక కుమారుడు, కల్మషాలను తొలగించుకొని పరిశుధ్ధుడవమనీ, నవవిధ భక్తి గురించి ప్రాముఖ్యాన్ని తన తండ్రికి వివరించడం మనకు కనపడుతుంది. కాని హిరణ్యకశపుడు రాక్షసుడు.
సహజంగా అతనిది రాక్షస ప్రవృత్తి. ఈ కారణంవల్లే అతను విష్ణుమూర్తికి బధ్ధ విరోధి. కాని అతని కుమారుడు విష్ణుమూర్తికి అత్యంత ప్రియతమ భక్తుడు.
21వ. అధ్యాయంలో బాబా కూడా నవవిధ భక్తి గురించి చెప్పారు. ఆయన పాటంకర్ ను పిలిచి 9 గుఱ్ఱపు లద్దెలను ఏరుకొన్నావా అని అడిగారు. అతనికి ఒక్క ముక్క కూడా అర్ధంకాక, కేల్కర్ ను పిలిచి దానిలోని అంతరార్ధమేమిటని అడిగాడు. అశ్వము భగవంతుని అనుగ్రహానికి గుర్తు అని కేల్కర్ చెప్పాడు. శ్రీమహావిష్ణువు అవతారాలలో హయగ్రీవ అవతారం, (ముఖం అశ్వపు ముఖము.)
ఆవిధంగా బాబా భగవంతుని అనుగ్రహాన్ని సంపాదించుకున్నావా అని పాటంకర్ ని అడిగారు. బాబా మహాసమాధి చెందడానికి ముందు లక్ష్మీబాయ్ షిండేకి 9 నాణాలనిచ్చారు.
తొమ్మిది నాణాలు నవవిధభక్తికి ప్రతీక. ఆవిధంగా బాబా మనకు వాటియొక్క ప్రాముఖ్యాన్ని చెప్పి మనమందరమూ కూడా వాటిని ఆచరించవలసిన అవసరాన్ని గురించి తెలిపారు.
(యింకా ఉన్నాయి పోలికలు)
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు
0 comments:
Post a Comment