17.03.2013 ఆదివారము
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీవిష్ణు సహస్రనామం 48అ.శ్లోకం, తాత్పర్యం
శ్లోకం: యజ్ఞ ఇజ్యో మహేజ్య శ్చక్రతున్నత్రం సతాంగతిః |
సర్వదర్శీ విముక్తాత్మా సర్వజ్ఞో జ్ఞానముత్తమం ||
తాత్పర్యం: యజ్ఞమనగా అందరికీ ఉపయోగించు మంచిపనిని ఔదార్యముతో ఫలాపేక్ష లేక ఇతరుల యందలి అంతర్యామిని చూచి, చేయుట. ఇట్లు యజ్ఞార్ధము ప్రపంచమునందు జీవించు సజ్జనుల, మహర్షుల రూపమున వారియందలి యజ్ఞస్వరూపముగా నారాయణుడే యున్నాడు.
పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి -
13వ.అధ్యాయం
18.01.1992
ప్రియమైన చక్రపాణి,
హేమాద్రిపంతు ఈ అధ్యాయములో ఎక్కువగా బాబా దయ వలన అనారోగ్యమునుండి విముక్తి పొంది పూర్ణ ఆరోగ్యము పొందిన భక్తుల అనుభవాలను వివరించినారు.
శ్రీసాయి స్వయముగా తన భక్తులతో అన్న కొన్ని మాటలను హేమాద్రిపంతు ఈ విధముగా శ్రీసాయి సత్ చరిత్రలో వివరించారు. "పూజా తంతుతో నాకు పని లేదు. షోడశోపచారములుగాని, అష్టాంగ యోగములు గాని నాకు అవసరము లేదు. భక్తి యున్న చోటనే నా నివాసము". బాబాకు పూర్తిగా శరణాగతులైన వారి క్షేమము కొరకు ఏమి చేసినది హేమాద్రి పంతు వివరముగా శ్రీసాయి సత్ చరిత్రలో వ్రాసినారు. నేను అన్ని వివరాలు వ్రా యకపోయినా కొన్ని విషయాలు మాత్రము నీకు తెలియపరచాలి. భీమాజీ పాటిలు విషయములో శ్రీసాయి ముందు ఏమి శ్రధ్ధ చూపించరు. కారణము అతను గత జన్మలో చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తము అనుభవించి తీరాలి అంటారు. అటువంటి సమయములో భీమాజీ పాటిలు తనకు వేరే దిక్కు లేదు. దిక్కులేని వాడికి దేవుడే దిక్కు. తన పాలిట దేవుడు శ్రీసాయి అని నమ్మి శిరిడీకి వచ్చినాను అని బాబాతో మొర పెట్టుకొంటే బాబా మనసు మార్చుకొని భీమాజీ పాటిలు ఆరోగ్యము కొరకు తన తపశ్శక్తి ధారపోసి అతనికి ఆరోగ్యము ప్రసాదించుతారు. బాల గణపతి షింపి యొక్క మలేరియా జ్వరమును నల్ల కుక్కకు పెరుగు అన్నము తినిపించి జ్వరమును తగ్గించెను. యిది విచిత్రముగా లేదా! యిక్కడ అర్ధము చేసుకోవలసినది బాబా ఎవరి దగ్గర ఏమి ఊరికే తీసుకోరు.
బాలగణపతి చేతితో పెరుగు అన్నము తిని విశ్వాసమునకు మారుపేరు "సాయి" అని నిరూపించినారు. ఇక బాపూ సాహెబు బుట్టె విషయము ఆలోచించెదము. అతడు ఆ రోజులలో కోటీశ్వరుడు. అతనికి డబ్బుకు కొదవ లేదు. అతని చుట్టు డాక్టర్ లకు లోటు లేదు. అతను వాంతులు, విరోచనాలు, కలరాతో బాధపడుతూ ఉంటే ఏమందులు యివ్వకుండ అతనిలోని అహంకారమును తన చూపుడు వ్రేలితో అతనికి చూపించి, దానిని తొలగించి అతని అనారోగ్యము తొలగించటానికి బలమైన ఆహారమును స్వీకరించిచమని ఆదేశించి, అతనికి పూర్ణ ఆరోగ్యమును ప్రసాదించెను. యిక అళందిస్వామి చెవిపోటు నోటి మాటతోను, కాకా మహాజని వంటి బీద భక్తుని విరో చనాల బాధను బీదవాటి పాలిట బాదాము పప్పు అయిన వేరుశనగ గింజలను తినిపించి ఆవ్యాదులను నిర్మూలించెను. యింక దత్తోపంతు కడుపు నొప్పి, శ్యామా మూలశంఖ వ్యాధి, నానా సాహెబు చందోర్కరు మరియు గంగాధర పంతుల కడుపు నొప్పిలను మందులతో కాకుండ తన ఆశీర్వాదము వలనే బాగు చేసెను. యిన్ని విషయాలు తెలుసుకొన్న తర్వాత మనకు శ్రీసాయిపై నమ్మకము కుదరకపోతే అది శ్రీసాయి తప్పుకాదు. అది మనలోని మూర్ఖత్వము. 1990 లో నీవు ఎం. సెట్. పరీక్షకు చదువుతున్నపుడు మలేరియా జ్వరముతో బాధపడ్డావు. శ్రీసాయి నీపై దయ చూపించి పరీక్షలముందు ఆవ్యాధిని నిరోధించి, నీవు పరీక్ష వ్రాయటానికి వీలు కలిగించినారు. యిది నీవు నమ్మినా నమ్మకపోయిన నేను మాత్రము నమ్ముతాను.
శ్రీసాయి పై తిరుగు లేని నమ్మకముతో
నీతండ్రి
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment