10.05.2013 శుక్రవారము
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీశ్శులు
పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి -
36 వ. అధ్యాయము
(సాయి.బా.ని.స. తన కుమారుడు చక్రపాణికి సాయి తత్వముపై వ్రాసిన లేఖలు)
ముందుగా శ్రీవిష్ణు సహస్రనామం 69వ.శ్లోకం, తాత్పర్యం
శ్లోకం: కాలనేమినహా వీర శ్శౌరిశ్శూర ర్జనేశ్వరః |
త్రిలోకాత్మా త్రిలోకేశః కేశవః కేశిహా హరిః ||
తాత్పర్యం: పరమాత్మను కాలనేమి మరియు కేశి అను రాక్షసులను సం హరించువానిగా, జనుల కధిపతియై ప్రకాశించు నాయకునిగా, మరియు శూరునిగా ధ్యానము చేయుము. ఆయన మూడు లోకములకు ఆత్మ మరియు అదిపతి. ఆయన దుష్టశక్తులను, పాపములను నాశనము చేయువాడు.
పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 36 వ. అధ్యాయము
08.02.1992
ప్రియమైన చక్రపాణి
ఈ అధ్యాయములో శ్రీసాయి కోరే దక్షిణ వివరాలు, శ్రీసాయి తన భక్తుల కోర్కెలు తీర్చే విధానము చాలా వింతగా యుంటాయి. వాటిని అర్ధము చేసుకోవటానికి ఆధ్యాత్మిక రంగములో అనుభవము ఉండాలి అనేది తేటతెల్లమగుతుంది.
ఇద్దరు గోవా పెద్దమనుషులు కథలో శ్రీసాయి ఒక పెద్దమనిషి నుండి దక్షిణ స్వీకరించి, రెండవ పెద్దమనిషి దక్షిణ యిస్తే దానిని నిరాకరించటము చాలా ఆలోచనలు రేకెత్తించుతుంది. నాజీవితములో కుడా అటువంటి సంఘటన జరిగినది. 1990 వ.సంవత్సరములో ఒక రోజు ఉదయము సికంద్రాబాద్ స్టేషన్ దగ్గర ఉన్న గణేష్ మందిరానికి వెళ్ళి దర్శనము చేసుకొని బయటకు వచ్చి అక్కడ శ్రీసాయి రూపములో ఉన్న ఒక పెద్ద మనిషి చేయి చాచితే కాదనకుండ ఒక రూపాయి దక్షిణ యిచ్చినాను. అక్కడనుండి దగ్గరలో ఉన్న శ్రీపాండురంగ విఠల్ గుడికి దర్శనానికి బయలుదేరినాను. దారిలో శ్రీసాయి నామ స్మరణ చేస్తు శ్రీసాయికి ఎప్పుడూ ఒక రూపాయి మాత్రమే దక్షిణగా యిస్తున్నాను. శ్రీసాయి నానుండి ఎందుకు ఎక్కువ దక్షిణ కోరటములేదు. ఎప్పుడైన అడిగితే యింకొక రూపాయి దక్షిణ యిచ్చేవాడిని అని అహంకారముతో నాలో నేను ఆలోచించుతు నడుస్తున్నాను. దారిలో గోకుల్ లాడ్జి దగ్గరకు వచ్చినాను. అక్కడ 30 సంవత్సరాల యువఫకీరు నాకేసి చూసి కోపముతో నన్ను పిలచి హిందీలో అన్నమాటలు.."ఏమిటి నేను నీకంటికి బికారివాడిలాగ యున్నానా! తిండిలేక భిక్ష అడుగుతున్నానా! ఏమిటి ఆలోచించుతున్నావు. శ్రీశిరిడీసాయి పేరిట నాకు దక్షిణ ఇయ్యి" అని గట్టిగా మాట్లాడుతుంటే నాకు చాలా భయము వేసినది. నాతప్పును క్షమించమని వేడుకొంటు నాజేబులోనుండి రెండు రూపాయల నోటు తీసి ఆయువ ఫకీరుకు యిచ్చినాను. మనసులో శ్రీసాయికి నమస్కరించి భయముతో వేగముగా నడుస్తు శ్రీపాండురంగ విఠల్ గుడికి చేరుకొన్నాను. ఈసంఘటన నాలో చాలా ఆలోచనలు రేకెత్తించినది. శ్రీసాయికి మన మనసులోని మాట సులువుగా తెలిసిపోతుంది. ఆయన సర్వాంతర్యామి. ఆయన అందరి హృదయాలను పాలించువాడు అని నిర్ధారణ చేసుకొన్నాను. నాజీవితములో జరిగిన ఈసంఘటన శ్రీసాయి బంధువులలో చాలా ఆలోచనలును, ఆనందమును కలిగించుతుంది అని నమ్ముతున్నాను. శ్రీసాయి ఏనాడు ఎవరి దగ్గరనుండి ధనమును భిక్షగా స్వీకరించలేదు. ధనమును దక్షిణ రూపములోనే స్వీకరించినారు. నీవు శ్రీసాయికి ఎక్కువ ధనము దక్షిణ రూపములో యిచ్చిన వారు స్వీకరించరు. నీనుండి బాకీ యున్న ధనము మాత్రమే స్వీకరించుతారు అనే విషయాన్ని నేను నమ్ముతాను. శ్రీసాయి ఆశీర్వదించుతే నాకు కూడా ఎవరినుండి ధనాన్ని ఆశించకుండ బ్రతకాలి అని యుంది. మరి ఈ నా ఆశను నెరవేర్చవలసినది శ్రీసాయినాధుడు.
యిక ఔరంగాబాదు కరి భార్యకు 27 సంవత్సరాల తర్వాత శ్రీసాయి ఆశీర్వచనాలతో పుత్ర సంతానము కలగటము అనే విషయానికి శ్రీసాయి సత్ చరిత్ర సాక్షి. ఇక ఈనాడు మన బంధువులలో నాచెల్లెలు మరిదికి వివాహము అయిన పది సంవత్సరాల తర్వాత శిరిడీయాత్ర అనంతరము శ్రీసాయి ఆశీర్వచనాలతో పుత్ర సంతానము కలగటము, మరియు నాస్నేహితుని కుమార్తెకు వివాహము అయిన ఎనిమిది సంవత్సరాలకు శిరిడీసాయినాధుని సత్ చరిత్ర పారాయణ అనంతరము పుత్ర సంతానము కలగటమునకు నేను సాక్షునిగా నిలబడగలను. ఈ విషయాలు నీకు ఎందుకు వ్రాస్తున్నాను అంటే శ్రీసాయి మన మధ్య శరీరముతో లేకపోవచ్చును. ఆయన పవిత్ర ఆత్మ మన మధ్యయున్నది. ఆయనను మనస్పూర్తిగా శరణు వేడుకొన్నవాడికి జీవితములో సుఖశాంతులకు లోటుయుండదు. యింట అన్నవస్త్రాదులకు లోటుయుండదు. శ్రీసాయి భక్తులు లక్ష్మీపుత్రులు మాత్రము కారు అనేది నేను చూసిన నిజము. నీకు జీవితములో సుఖశాంతులు - నీయింట అన్నవస్త్రాలకు లోటు లేకుండ యుండటము కోరుకొన్నవాడివి అయితే శ్రీసాయి పాదాలకు నమస్కరించి - శ్రీసాయి శరణు వేడుకో.
శ్రీసాయి సేవలో
నీతండ్రి
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
పాఠకులకు ఒక గమనిక: రేపు హైదరాబాదు వెడుతున్నందువల్ల 4 రోజులపాటు ప్రచురణ సాధ్యపడకపోవచ్చును. వీలు చిక్కితే కనక బాబా గురించిన లీల ఏదైనా ప్రచురించడానికి ప్రయత్నిస్తాను.
0 comments:
Post a Comment