Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Sunday, May 26, 2013

పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 38వ. అధ్యాయము

Posted by tyagaraju on 8:36 AM
        
           
26.05.2013 ఆదివారము
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
          
ముందుగా శ్రీవిష్ణుసహస్రనామం 71వ.శ్లోకం, తాత్పర్యం

శ్లోకం:  బ్రహ్మణ్యో బ్రహ్మకృద్భ్రహ్మా భ్రక్మ భ్రమ వివర్ధనః    |

         బ్రహ్మ విద్బ్రాహ్మణో బ్రహ్మీ బ్రహ్మజ్ఞో బ్రాహ్మణ ప్రియః  ||

తాత్పర్యం:  పరమాత్మను బ్రహ్మ ననుసరించువానిగా, సృష్టికర్తను పుట్టించినవానిగా, సృష్టికర్తగా, శ్వాసను జయించినవానిగా, అన్నిటిని అధిగమించి పరమాత్మయొక్క అస్తిత్వమును ఎరిగినవానిగా, తెలుసుకొను వానిగా, యజమానిగా, పరమాత్మను గూర్చి తెలుసుకొనువానిగా, భగవంతుని అనుసరించువారికి ప్రియమయిన వానిగా ధ్యానము చేయుము.  

  పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 38వ. అధ్యాయము

ప్రియమైన చక్రపాణి, 

ఈ అధ్యాయములో శ్రీహేమాద్రిపంతు శిరిడీలో శ్రీసాయి చేసిన అన్నదానం విషయాలు - ఆ అన్నదానములో ఉపయోగించిన వంటపాత్రల వివరాలు - నైవేద్యము తయారు చేసే విధానము, హేమాద్రిపంతుపై శ్రీసాయికి ఉన్న ప్రేమ, వివరించుతారు. 



 శ్రీసాయి సత్ చరిత్రలో అన్నదానం  గురించి విపులముగా వ్రాయబడి యుంది.  "దానములన్నిటిలోను అన్నదానము శ్రేష్ఠమైనది" ఈ విషయము ప్రస్థావించవలసినపుడు నాకు తెలిసిన రెండు పేర్లు  ఉదహరించుతాను.  ఒకటి కోనసీమలో నాస్వగ్రామమునకు దగ్గరలో వక్కలంక గ్రామ వాస్తవ్యురాలు శ్రీమతి డొక్క సీతమ్మగారు, ఆమె ఆస్తి మొత్తము అన్నదానానికి ఖర్చు చేసి, కోనసీమలో అన్నపూర్ణ అని పేరు గడించినది.  ఆమె స్వయముగా వంట చేసి తన పర అనే భేదము లేక ఆగ్రామానికి వచ్చిన అతిధులకు భోజన సదుపాయాలు చూస్తూ ఉండేది.  తను అనారోగ్యముతో బాధ పడుతున్న తన ఆరోగ్యము లెక్క చేయకుండ వంట చేసి అన్నదానము చేసిన పుణ్యాత్మురాలు.  యిక రెండవ వ్యక్తి నా పినతల్లి భర్త శ్రీ ఉపాధ్యాయుల పేరేశ్వర సోమయాజులు, ఆయనకు పిల్లలు లేకపోయిన ఆయన తన బంధువర్గములోని అనేక మంది పిల్లలను తన యింట ఉంచుకొని విద్యాదానము, అన్నదానము చేసినారు.  అటువంటి పిల్లలలో నేను ఒకడిని అని వినయముగా చెప్పుకొంటాను. 

శ్రీ సోమయాజులు బాబయ్యగారు 29.01.1992 నాడు మరణ శయ్యపై మృత్యువుతో పోరాడుతు తన యింట (గృహప్రవేశము సందర్భముగా) 200 మందికి అన్నదానము చేయించుతు వచ్చిన అతిధులు అందరు భోజనము చేసినారా లేదా అని తెలుసుకొంటు 30.01.1992 గురువారమునాడు శ్రీసాయి మధ్యాహ్న హారతి విన్న తర్వాత 1.20 నిమిషాలకు (ఏకాదశి ఘడియలలో ) శ్రీసాయిలో ఐక్యము చెందినారు.  మరి యిది అన్నదాన ఫలితము కాదా!  నా జీవితములో నేను అన్న దానము చేస్తున్నపుడు జరిగిన సంఘటన నీకు తెలియపర్చుతాను విను.  ఆరోజు అంటే 17.10.1992 విజయదశమి ఉదయము శ్రీసాయికి హారతి యిచ్చిన తర్వాత మనసార "బాబా ఈరోజు నాయింట పదిమంది భోజనము చేసే భాగ్యము ప్రసాదించు.  పదిమంది భోజనము చేసిన తర్వాతనే నేను భోజనము చేస్తాను" అని ఆయన ముందు ప్రమాణము చేసినాను.  మధ్యాహ్న్న హారతి పూర్తి అయినది.  నేను పిలిచిన అతిధులు భోజనానికి రాసాగారు.  మూడు గంటలకు తొమ్మిది మంది భోజనము చేసినారు.  నేను యింకా భోజనము చేయలేదు.  శ్రీసాయి ముందు నేను ప్రమాణము చేసిన ప్రకారము పదిమంది భోజనము చేసిన తర్వాతనే నేను భోజనము చేయాలి.  సాయంత్రము నాలుగు గంటలు  అయినది.  పదవ వ్యక్తి భోజనానికి రావటములేదు.  యింటిలో మీ అమ్మకూడా భోజనము చేసి వేసినది.  నాలో పట్టుదల ఎక్కువ కాసాగినది.  శ్రీసాయి నాయింటికి పదిమందిని భోజనానికి పంపలేరా అనే భావన కలిగినది. 

ఉదయమునుండి ఉపవాసము.  కడుపులో ఆకలిబాధ, పదవ వ్యక్తి రాలేదు అని మనసులో బాధ.  ఏమి చేయాలి తోచక శ్రీసాయినాధుని వైపు చూసాను.  ఆయన చిరునవ్వు నాలో సహనాన్ని పరీక్షించుతున్నది.  శ్రీసాయి ఏనాడు తన భక్తులను ఉపవాసము చేయనీయలేదు అనే మాట నిజమైతే మరి ఈనాడు నాకు ఉపవాస బాధ ఏమిటి.  నేను ఉపవాసము బాధతో ఉంటే శ్రీసాయి చిరునవ్వునకు అర్ధము ఏమిటి? ఈ ప్రశ్నలకు సమాధానం నాకు కావాలి.  ఎవరిని అడగాలి, అనే ఆలోచన రాగానే 16.10.91 నాడు నేను కొన్న యింగ్లీషు పుస్తకము సాయిబాబా ఆఫ్ షిరిడీ , ఎ యూనిక్ సైంట్ ..ఎం.వీ.కామత్, వీ.బీ.ఖేర్ వ్రాసినది ఎదురుగా ఉన్న షోకేసు లో కనిపించినది.  అద్దాలు ప్రక్కకు జరిపి ఆపుస్తకము చేతిలో పట్టుకొని శ్రీసాయిని మనసారా ప్రార్ధించి నీవు ఈ కొత్త పుస్తకము రూపములో నిన్నటిరోజున నాయింటికి వచ్చినావు.  ఈ పుస్తకములో నిన్ను చూడగలుగుతున్నాను.  నీవు నా బాధకు సమాధానము యివ్వాలి.  యిది నాకు పరీక్ష కాదు యిది నీకు పరీక్ష.  నీ భక్తుడు ఉపవాసముతో బాధపడటము నీకు యిష్ఠమయితే నేను ఒక రోజు పూర్తిగా భోజనము చేయకుండ ఉండగలను.  నాయింట పదవ వ్యక్తి భోజనానికి యింకా రాలేదు.  పదవ వ్యక్తి భోజనము పూర్తి అయితేనే నేను భోజనము చేసేది.  యింక సలహా యివ్వవలసినది నీవు అని ఆకొత్త పుస్తకము చేతిలో పట్టుకొని కండ్లు మూసుకొని 135వ.పేజీ తీసినాను.  ఆపేజీలో శ్రీసాయి సమాధానము గురించి వెతకటము ప్రారంభించినాను. 

శ్రీసాయి ఆపేజీ ఆఖరిలో దర్శనము యిచ్చి వాక్యరూపములో తన సలహాను ఈవిధముగా యిచ్చినారు "నన్ను యింకా ఎక్కువగా తినమంటావా! నీవు పోయి భోజనము చేయి".  నాలో ఏదో తెలియని సంతోషము కలిగినది.  శ్రీసాయి సాక్షాత్తు నాయింట పదవ వ్యక్తిగా భోజనము చేసినారా ?  నేను నమ్మలేకపోతున్నాను.  నేను కళ్ళతో ఆపదవ వ్యక్తిని చూడలేదు.  కనీసము జంతు రూపములో నైన రాలేదే.  మరి ఏరూపములో వచ్చి తినియుంటారు అని ఆలోచించుతుంటే శ్రీసాయికి పెట్టిన నైవేద్యము పళ్ళెము దగ్గర ఒక గండు చీమ ప్రదక్షిణాలు చేస్తున్నది.


  శ్రీసాయి సత్ చరిత్ర 9వ.అధ్యాయములో శ్రీసాయి అన్నమాటలు " అట్లనే పిల్లులు, పందులు, ఈగలు, ఆవులు మొదలుగా గలవన్నియు నాయంశములే.  నేనే వాని ఆకారములో తిరుగుచున్నాను."   గుర్తుకు వచ్చినవి. మనసులో శ్రీసాయికి నమస్కరించి శ్రీసాయి తన భక్తులను ఏనాడు ఉపవాసము ఉండనీయరు అని భావించి సంతోషముతో నేను పదునొండవ వ్యక్తిగా సాయంత్రము 4.45 నిమిషాలకు భోజనము చేసినాను.  దీనిని బట్టి ఒక విషయము నీవు గ్రహించాలి.  శ్రీసాయికి అన్నదానము అంటే చాలా యిష్టము.  అన్నదానము జరుగుతుంటే శ్రీసాయి ఏదో ఒక రూపములో అక్కడ ఉంటారు.  తన భక్తులను ఆశీర్వదించుతారు. 

శ్రీసాయి భగవంతునికి నైవేద్యము ఏవిధముగా పెట్టినారు చూడు.  భక్తులు పిండివంటలు అన్ని తెచ్చి ద్వారకామాయిలో శ్రీసాయి ముందు ఉంచితే శ్రీసాయి ఆ పిండివంటలనుండి కొంచము కొంచము తీసి ఒక పాత్రలో వేసి భగవంతునికి నైవేద్యము సమర్పించేవారు.  దీనిని బట్టి మనము తెలుసుకోవలసినది ఏమిటి?  భగవంతునికి నీవు సమర్పించే పిండివంటల రుచులు కాదు కావలసినది - నీవు భక్తితో ఆపిండివంటలను సమర్పించినది లేనిది చూస్తాడు.  అందుకే శ్రీసాయి ఏనాడు తన భోజనములో రుచులకోసము తాపత్రయ పడలేదు. ఆయన తాపత్రయపడినది భక్తుల ప్రేమకోసము.   ప్రేమతో ఏదైన తినటానికి ఆయనకు సమర్పించు.  ఆయన సంతోషముగా తింటారు.ఒక రోజున నేను శ్రీసాయితో ధ్యానములో ఉండగా శ్రీసాయి అంటారు "అందమైన పంపర పనసపండు కంటే అందము లేని తియ్యటి సపోటాపళ్ళు అంటే నాకు యిష్టము."  శ్రీసాయి మన అందరికి భగవంతుడు.  ఆభగవంతునికి యిష్టమైనది ప్రేమ అనే తియ్యటి సపోటాపండు.  మనము సాయిని ప్రేమించితే మనకు తెలియకుండానే మనము మన తోటివానిలో ఉన్న సాయిని గుర్తించి మన తోటివానిని కూడా ప్రేమించుతాము.

ప్రేమకు మారుపేరు సాయి అని గుర్తు ఉంచుకో.

శ్రీసాయి సేవలో

నీతండ్రి 
 (సర్వం శ్రీసాయినాధార్పణమస్తు) 


Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List