21.06.2013 శుక్రవారము
ఓం సాయి శ్రీసాయి జయజయసాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
గత పదిహేనురోజులుగా, కాశీ యాత్ర వలన ప్రచురణకు సాధ్యపడలేదు..మా కాశీ యాత్ర విశేషాలను మీకందరికీ త్వరలోనే అందిస్తాను.కాశీ యాత్ర ముగించుకొని 18వ.తారీకున క్షేమంగా చేరుకొన్నాము..బాబాగారు ముందునుంచీ తను ఉన్నానని నిరూపించారు.తను మాయాత్ర కు ఆమోదం తెలుపుతూ ప్రతిక్షణం మాకు యాత్రలో కనపడుతూనే ఉన్నారు..ఆవిశేషాలన్నిటినీ త్వరలోనే అందిస్తాను..కొన్ని అనివార్య కారణాలవల్ల విష్ణుసహస్రనామం శ్లోకాన్ని అందించలేకపోతున్నాను..
పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 40 వ.భాగము
12.02.1992
ప్రియమైన చక్రపాణి,
ఈ అధ్యాయములో హేమాద్రిపంతు శ్రీసాయి లీలలను చక్కగా వర్ణించినారు. ఆ లీలలు చదువుతు ఉంటే అటువంటి సంఘటనలు శ్రీసాయి మనకు కలిగించితే ఎంత బాగుండును అనే కోరిక కలుగుతుంది.
ఆకోరికను శ్రీసాయి కార్యాచరణలో పెట్టి తన భక్తునికి సంతోషము కలిగించుతారు. శ్రీసాయి చూపిన లీలలతో సంతోషము పొందిన సాయి భక్తులలో నేను ఒకడిని. ఈ ఉత్తరములో నేను శ్రీసాయితో పొందిన అనుభవాన్ని వ్రాస్తాను. శ్రీ సాయి సత్ చరిత్రలో శ్రీ హేమాద్రిపంతు అంటారు, "సాయి తన హస్తమును భక్తుల తలపై పెట్టి తమ శక్తులను వారిలోనికి పంపించి భేద భావమును నశింపచేసి, అప్రాప్యమును ప్రాపింప చేయును". ఈ విధమైన అనుభవాన్ని నేను పొందినాను. 29.01.1992 నాడు సాయి భక్తుడు, నా పినతల్లి భర్త అయిన శ్రీఉపాధ్యాయుల సర్వేశ్వర సోమయాజు గారు శ్రీసాయి యొక్క మధ్యాహ్న్న హారతి పూర్తి అయిన పిదప తను మరణ బాధ పడుతూ నన్ను ప్రేమతో దగ్గరకు తీసుకొని నాతలపై చేయి పెట్టి నన్ను ఆశీర్వదించినట్లు అనుభూతి చెందినాను. శ్రీహేమాద్రిపంతు శ్రీసాయితో తనకు కలిగిన సాయి లీలను వర్ణించినారు.
సత్ ఛరిత్రలో శ్రీ హేమాద్రిపంతు పొందిన అనుభూతి కూడా వర్ణించబడినది. "హేమాద్రిపంతు కాగితము విప్పి చూచుసరికి అందులో పెద్దదియగు చక్కని సాయిబాబా పటముండెను. అతడు మిగుల ఆశ్చర్యపడెను. అతని మనసు కరిగెను. కండ్లనుండి నీరు కారెను. శరీరము గగుర్పాటు చెందెను. అతడు వంగి పటములోనున్న బాబా పాదాలను నమస్కరించెను". యిటువంటి అనుభూతి నాజీవితములో పొందినాను. 1990 సంవత్సరము విజయదశమి రోజున మనయింటిలో కొత్తగా శ్రీసాయి పటము పెట్టి అన్న సంతర్పణ చేయాలని నిర్ణయించుకొని ఒక వారము రోజులు ముందుగా ఒక చక్కటి సాయిబాబా పటమును కొని, దానికి పటము కట్టి యివ్వమని చెప్పి యింటి దగ్గరలో ఉన్న పటాల వ్యాపారికి 50 రూపాయలు ఎడ్వాన్స్ కూడా యిచ్చినాను. అతను రెండు రోజులలో పటము కట్టి యిస్తానని మాట యిచ్చినాడు. అతను తన మాటను నిలబెట్టుకోలేదు. తెల్లవారితే విజయదశమి. అపటాల వ్యాపారి సాయిబాబా పటమునకు ఫ్రేం కట్టలేదు. అతనిని నిలదీసి అడిగితే "మీరు ఎందుకు కంగారు పడతారు. రాత్రి పటమునకు ఫ్రేం కట్టి మీపూజ సమయమునకు మీ యింటికి తెచ్చి యిస్తాను అని మాట యిచ్చినాడు.నేను నమ్మినాను. తెల్లవారినది. విజయదశమి పూజ సమయము అయినది. యింటిలో సాయి సమాధి విగ్రహము కలసియున్న పటములేదు. బయట దుకాణములలో కొత్త పటము కొనాలంటే చాలా దూరము వెళ్ళాలి. మధ్యాహ్న్న హారతి సమయము అయినది. ఏమి చేయాలి తోచలేదు. శ్రీసాయిని మనసారా తలచుకొన్నాను. ఈ సమస్యకు పరిష్కారము చూపించమని వేడుకొన్నాను. నాదగ్గర సాయి సత్ చరిత్ర పుస్తకము కూడా లేదు. అప్పటికి నేను యింకా శ్రీసాయి సత్ చరిత్ర చదవలేదు. మనసు పరిపరి విధాల పోతున్నది. నేను కోరుకొన్న పటము లేదు. మరి మధ్యాహ్న హారతి ఏవిధముగా చేయాలి అనే ఆలోచనలలో మునిగి నాకు తెలియకుండానే 1989 సంవత్సరములో మొదటిసారి శిరిడీ వెళ్ళినపుడు అక్కడ కొన్న ఒక బొమ్మల పుస్తకము తీసినాను. అట్ట మీద శ్రీసాయి పటము నన్ను పెద్దగా ఆకర్షించలేదు. మొదటి పేజీ తీసినాను. నేను కోరుకొన్న రీతిలో ఉన్న సాయిబాబా పటము కనిపించినది. ఆనాడు హేమాద్రిపంతు పొందిన అనుభూతిని నేను పొందినాను. వెంటనే పటమును టేబిల్ మీద పెట్టి హారతి యిచ్చినాను. ఆపుస్తకములో నేను కోరుకొన్న రీతిలో ఉన్న సాయిబాబా పటము ఉంటుంది అని నాకు తెలియదు. విజయదశమికి ముందు ఆపటాల వ్యాపారిని నమ్మినాను. అతను తన మాట తప్పినాడు. ఆఖరి క్షణములో అంటే మధ్యాహ్న్న హారతి సమయమునకు ముందు శ్రీసాయిని పూర్తిగా నమ్మినాను. శ్రీసాయి తను స్వయముగా ఆపుస్తకములోని పటము రూపములో నాయింటికి వచ్చి నామనసులోని బాధను తొలగించినారు. క్లిష్ఠ పరిస్థితిలో నీవు మాధవుడిని అంటే భగవంతుని మనసారా నమ్ముకో అంటే శ్రీసాయిని మనసార నమ్ముకో. ఆయన ఏదో ఒక రూపములో నీకు సహాయము చేయడానికి నీముందుకు వస్తారు. యిది నమ్ము.
యిట్లు
నీతండ్రి
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment