17.09.2015 గురువారం
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి
సాయిబంధువులకు బాబావారి శుభాశీస్సులు
తాత్యాసాహెబ్ నూల్కర్ (రెండవభాగం)
ఆంగ్లమూలం : లెఫ్టినెంట్ కల్నల్ ఎం.బీ.నింబాల్కర్
తెలుగు అనువాదం : సాయిబానిస శ్రీరావాడ గోపాలరావు
తాత్యాసాహెబ్ నూల్కర్ గురించి మరికొంత సమాచారాన్ని ఈరోజు తెలుసుకుందాము.
కళ్ళజబ్బును బాగుచేయుట :
పండరీపురములో ఉన్న తాత్యాసాహెబ్ భరింపలేని నొప్పితో కళ్ళజబ్బుతో బాధపడసాగాడు. అతను గొప్ప గొప్ప కంటివ్యాధి నిపుణులకు తన కళ్ళను చూపించాడు. వారందరు తమ అశక్తతను ప్రకటించగానె, తనకు వేరే మార్గము లేక షిరిడీకి ప్రయాణమయ్యాడు. షిరిడీకి చేరుకొని సాఠేవాడాలో బస చేసి సాయినామ జపము చేయడం ప్రారంభించాడు. మూడవరోజున ద్వారకామాయిలో ఉన్నా శ్రీసాయి శ్యామాను పిలిచి "ఈరోజు నాకళ్ళలో భరింపరాని నొప్పి కలుగుతోంది, నన్ను కొంచము విశ్రాంతి తీసుకోని" అన్నారు. అదే క్షణమునుండి సాఠేవాడాలో బసచేసిన తాత్యాసాహెబ్ నూల్కర్ కళ్ళలోని నొప్పి తగ్గి వ్యాధి నయం అయింది. ఈసంఘటన సూచనప్రాయముగా శ్రీసాయి సత్ చరిత్ర 21వ.అధ్యాయములో ఈవిధంగా చెప్పబడింది, "పండరీపురము సబ్ జడ్జియగు తాత్యాసాహేబ్ నూల్కర్ తన ఆరోగ్యాభివృధ్ధి కొరకు షిరిడీకి వచ్చెను".
శ్రీసాయి సాంగత్యములో తాత్యాసాహెబ్ పొందిన మేలు:
1908 సంవత్సరమునకు ముందు శ్రీసాయి తనను పూజించటానికి ఎవరిని అనుమతించలేదు. ఎవరైన ఒక పూలమాల తెచ్చి తన మెడలో వేయదలచినా అంగీకరించేవారు కాదు. కాని, భక్తుల కోరికను కాదనలేక వారి ప్రేమకు తలవంచి తనను పూజించటానికి, హారతి యివ్వటానికి అంగీకరించారు. 1908 వ.సంవత్సరంలో మొదటిసారిగా తాత్యాసాహెబ్ నూల్కర్ శ్రీసాయికి హారతి ఇచ్చారు. 1908వ.సంవత్సరము గురుపూర్ణిమ రోజున తన భక్తులకు తనను పూజించటానికి అనుమతిని ఇచ్చారు శ్రీసాయి.
తాత్యాసాహెబ్ నూల్కర్ ప్రారంభించిన ఆరతి పధ్ధతిని, మేఘశ్యాముడు, బాపూసాహెబ్ జోగ్, శ్రీసాయిబాబా మహాసమాధి అయిన రోజువరకు కొనసాగించారు. శ్రీసాయి మహాసమాధి అనంతరము కూడ సాయిభక్తులు నేటికి ఆయన సమాధిమందిరములో నిత్యము నాలుగు హారతులు ఇస్తున్నారు. శ్రీసాయికి తాత్యాసాహెబ్ నూల్కర్ పై ఎనలేని ప్రేమ ఉండేది. వారు తాత్యాసాహెబ్ ను ముద్దుగా "తాత్యాబా" లేదా "మహటరా" (ముసలివాడ) అని పిలిచేవారు. మధ్యాహ్న ఆరతి తర్వాత శ్రీసాయికి అనేకమంది నైవేద్యము పంపేవారు. ఆవిధముగా వచ్చిన పిండివంటలలో శ్రీసాయి ఎవరిని ఏమీ అడగకుండా తాత్యాసాహెబ్ ఇంటినుండి వచ్చిన పిండివంటలను ఏరి, ఇవి "తాత్యాబా" పంపిన పిండివంటలు, ఈరోజు నేను వీటినే భోజనము చేస్తాను అనేవారు.
శ్రీసాయినుండి ఉపదేశము పొందాలని తాత్యాసాహెబ్ కు చిరకాల కోరిక ఉండేది. తాత్యాకోరిక నెరవేర్చటానికి శ్రీసాయి కొన్ని పవిత్రమైన పదాలను ఆయనకు చెప్పారు. శ్రీతాత్యా సాహెబ్ తన అంతిమశ్వాస తీసుకొనేవరకు ఆపవిత్ర పదాలను ఉచ్చరించుతూ ఉండేవారు. శ్రీసాయినుండి ఏదయినా పూజవస్తువును స్వీకరించి తన పూజామందిరంలో ఉంచి ఆవస్తువును పూజించాలి అనే కోరిక ఉండేది. దత్తజయంతి రోజు రాత్రి తొమ్మిది గంటలకు శ్రీసాయి ద్వారకామాయినుండి ఒక భక్తుని సాఠేవాడాకు పంపించి తాత్యాను తొందరగా రమ్మనమని కబురు చేశారు. తాత్యాసాహెబ్ హడావిడిగా రాగానే బాబా ప్రేమతో అతనికి తను ధరించి విడిచిన కఫనీ బహుమతిగా ఇచ్చారు. తాత్యాసాహెబ్ కళ్ళలో ఆనంద భాష్పాలు రాసాగాయి. శ్రీసాయి పాదాలపై తన శిరస్సు ఉంచి, ఆనంద భాష్పాలతో శ్రీసాయి పాదాలను కడిగారు.
(షిరిడీలో శాశ్వత నివాసము ఏర్పరచుకోవాలనే కోరిక - రేపటి సంచికలో)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment