Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Wednesday, March 16, 2016

శ్రీసాయి లీలామృత ధార – నీటి గండంనించి గట్టెక్కించిన బాబా

Posted by tyagaraju on 10:07 AM
      Image result for images of shirdisaibaba
             Image result for images of rose hd

16.03.2016 బుధవారం
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయిబంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ రోజు శ్రీసాయి లీల మాసపత్రిక జూలై 1975 వ.సంవత్సరంలో ప్రచురింపబడిన ఒక అద్భుతమైన లీల మనందరం చదివి ఆనందిద్దాము.  ఆర్తితో పిలిస్తే పలకకుండా ఉంటాడా మన సద్గురువు?  ఆపదలనుంచి గట్టెక్కించి తనెవరో తెలుసుకునేలోపులోనే అంతర్ధానమయిపోతారు.

శ్రీసాయి లీలామృత ధార – నీటి గండంనించి గట్టెక్కించిన బాబా

1949వ. సంవత్సరం ఆషాఢ మాసంలో భక్తుల బృందం ఒకటి హైద్రాబాదునుండి షిరిడీ కి బయలుదేరింది.  వర్షాకాలం కావడం వల్ల ప్రయాణం ఒక అగ్ని పరీక్షలా ఉంది.  20 గంటల సుదీర్ఘ ప్రయాణం తరువాత రైలు కోపర్ గావ్ స్టేషన్ కు చేరుకుంది.  అప్పటికే దుమ్ము ధూళిలో రైలు ప్రయాణం సాగించిన భక్త బృందం అలసిపోయి, ఎడ్లబండిలో పట్టణానికి బయలుదేరేముందు, కూడా తెచ్చుకున్న ఫలహారాలు కానిచ్చారు. ఆ రోజుల్లో కోపర్ గావ్ స్టేషన్ నుంచి షిరిడీ వెళ్ళడానికి బస్సులు లేవు.  షిరిడీకి బస్సులో వెళ్ళాలంటే మధ్యలో ఉన్న గోదావరి దాటి అవతలి ఒడ్డునుంచి  బస్సెక్కి వెళ్ళాలి. 


ఇప్పుడు నది మీద ఉన్న వంతెన ఆ రోజుల్లో  ఇంకా నిర్మాణ దశలోనే ఉంది.  నదీ తీరానికి చేరుకోవాలంటే మూడు మైళ్ళు ప్రయాణం చేయాలి.  దారి అంతా కూడా తారు రోడ్డు కాదు, సిమెంటు రోడ్డూ కాదు. మట్టి రోడ్డవడం వల్ల రోడ్డు ప్రయాణం చాలా ప్రయాసతో కూడుకున్నది.  నల్లటి మట్టిరోడ్డు వర్షానికి బురద బురదగా ఉండి అడుగు వేస్తే జారిపోయేలా ఉంది.  ఎద్దులు కూడా ఆరోడ్డు మీద పాపం చాలా కష్టంతో బండిని లాగుతున్నాయి.  
                        Image result for images of bullock cart on the road

యాత్రికుల బృందం నదిఒడ్డుకు చేరుకొంది.  గోదావరి నది మీద బాగా తక్కువ ఎత్తులో(వాగుల మీద నీటికి దగ్గరగా వంతెన ఉంటుంది అలాంటి వంతెన) ఉన్న వంతెన ఇంక నీటిలో మునగడానికి సిధ్ధంగా ఉంది.  నదిలో బోటు ఒకటి ప్రయాణీకులను ఒడ్డు ఇవతల నుంచి అవతలికి, అవతలి ఒడ్డునుంచి ఇవతలి ఒడ్డుకి చేరవేస్తూ ఉంది.  
                              
                                  Image result for images of boat in godavari river

యాత్రికుల బృదంలోని వారందరూ కూడా బోటులోనే నదిని దాటుదామనుకున్నారు.  కాని ఎడ్లబండి తోలే అతను, తాను వారినందరినీ తన బండిలోనే నదిమీద ఉన్న చిన్న వంతెన మీదనుంచి అవతలి ఒడ్డుకు తీసుకుని వెడతానన్నాడు.  సరే  నది దాటడానికి బోటుకి డబ్బులు ఖర్చు చేయడం ఎందుకని సరే అన్నారు అందరూ.  అందరూ మళ్ళీ బండిలో ఎక్కి బయలుదేరారు.  బండి నెమ్మదిగా వంతెన మీదనుంచి వెడుతూ  ఉంది. బండి వంతెన మధ్యలోకి వచ్చేటప్పటికి విపరీతంగా వర్షం ప్రారంభమయింది.  నది పరవళ్ళు తొక్కుతూ ప్రవహించసాగింది.  వేగంగా నీటిమట్టం పెరగసాగింది.  ఎద్దులు స్వాధీనం తప్పిపోవడంతో బండి తోలుతున్నవాడు వాటిని అదుపు చేయలేకపోయాడు.  బండిని లాగుతున్న ఎద్దులకి అడుగు పడటంలేదు.  దాదాపుగా అవి నీటిలో తేలుతున్నాయి.  నీటి ప్రవాహం చాలా ఉధృతంగా ఉంది. బండి చక్రం ఒకదానికి  ఒక పెద్ద బండరాయి అడ్డు పడింది. నదిపై తక్కువ ఎత్తులో ఉన్న వంతెనకి పిట్టగోడ కూడా లేదు.  నదీ ప్రవాహం ఎడ్లబండిని నీటిలోకి తోసేసేంతగా పరవళ్ళు తొక్కుతూ  ఉంది.  అందరూ గొంతెత్తి  శ్రీసాయిబాబా అంటూ ఆయన నామస్మరణ చేయసాగారు.  వారందరికి బ్రతుకుతామనే ఆశకూడా పోయింది.  పెదవులపై సాయినామ స్మరణ జరుగుతుండగానే జలసమాధి అవడం ఖాయమనుకున్నారు.  ఉచ్చ స్వరంతో బిగ్గరగా వారు చేసే సాయినామం గాలిలో ప్రతిద్వనిస్తూ ఉంది.  హటాత్తుగా ఎక్కడినుండి వచ్చాడో, ఒక మధ్య వయస్కుడు ఎద్దుల ముందుకు వచ్చి బండిని అదుపు చేశాడు.  బండితోలే అతను చక్రానికి అడ్డుపడ్డ బండరాయిని తొలగించాడు.  అపరిచితుడు మెల్లగా బండిని అవతలి ఒడ్డుకు చేర్చాడు.  అందరూ సాయినామస్మరణ కొనసాగిస్తూనే ఉన్నారు.    అపరిచితుడు జాగ్రత్తగా బండిని అవతలి ఒడ్డుకు చేర్చగానే నీరు తగ్గిపోయింది.  మబ్బులు తొలగిపోయి ఎండ వచ్చింది.  ఒడ్డున నిలబడి ఉన్నవారు, యాత్రికుల బృందం ఎడ్లబండిలో నదిని సురక్షితంగా దాటుకుని రావడం చూసి ఆనందంతో కేరింతలు కొడుతూ “సాయిబాబాకి జై” అని బిగ్గరగా అరిచారు.

యాత్రికుల బృందానికి సారధ్యం వహిస్తున్న శ్రీ బాలయ్య చాలా సంతోషించి, తమందరిని ప్రమాదాన్నుండి కాపాడి ఒడ్డుకు చేర్చిన అపరిచితునికి ఇద్దామని పదిరూపాయల నోటు తీశాడు.  కాని, ఎక్కడ? ఆ అపరిచితుడు ఎక్కడా కనబడలేదు.  బాలయ్యతో సహా అందరూ చుట్టుప్రక్కలంతా వెతికారు.  అతనెక్కడా కనబడలేదు. కలవర పడ్డ బాలయ్య తనలో తానే ఇలా అనుకున్నాడు. “ అపరిచితుడిగా వచ్చి సహాయం చేసినది మరెవరో కాదు. ఖచ్చితంగా బాబాయే”

సాయంత్రం బాబాను దర్శించుకున్న తరువాత అందరూ బసకు చేరుకున్నారు.  బాలయ్య నిద్రపోయాడు.  అతనికి కలలో ఒక వ్యక్తి కనపడి, "షిరిడీ క్షేత్రంలో హుండీ లో వేయవలసిన సొమ్ముకు సంబంధించిన లెక్కలో తప్పు చేశావు నువ్వు” అన్నాడు.  బాలయ్య ఆతృతగా నిద్రనుండి లేచాడు.  కాగితం మీద లెక్కలన్నీ వేశాడు.  కలలో ఆవ్యక్తి చెప్పినట్లుగానే లెక్కలో తప్పు జరిగినట్లుగాను,  ఎంత సొమ్ముకు తేడా జరిగిందో కూడా కనుగొన్నాడు. కలలో కనిపించిన వ్యక్తి ఎంతసొమ్ముకు తేడా జరిగిందని  చెప్పాడో సరిగా అంతే సొమ్ముకు తను పొరబాటు చేసినట్లు  గుర్తించి ఆశ్చర్యపోయాడు.  
ఇది ఒక అపూర్వమైన సంఘటన…


(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)

Kindly Bookmark and Share it:

2 comments:

jagan on March 18, 2016 at 8:35 AM said...

జై సమర్థ సద్గురు సాయినాథునికి జై

jagan on March 18, 2016 at 8:36 AM said...

జై సమర్థ సద్గురు సాయినాథునికి జై

Post a Comment