Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Friday, July 15, 2016

శ్రీ సాయిబాబావారి బోధనలు మరియు తత్వము - (2) ఆహారం : ౩వ.భాగమ్

Posted by tyagaraju on 5:19 AM
     
       Image result for images of shirdi saibaba with devotees distributing food


           Image result for images of roses
15.07.2016 శుక్రవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయసాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ సాయిబాబావారి బోధనలు మరియు తత్వము
(2) ఆహారం : ౩వ.భాగమ్
          Image result for images of m.b.nimbalkar
ఆంగ్ల మూలం : లెఫ్టినెన్ట్ కల్నల్ ఎమ్.బి. నింబాల్కర్
తెలుగు అనువాదం : ఆత్రేయపురపు త్యాగరాజు

ఉపవాసం :
ఉప + వాస్, అనునది సంస్కృత శబ్దం.  అనగా సమీపముగా ఉండుట.  ఉపవాసమనగా మతాచారానికి సంబంధించి భగవంతునికి సమీపముగా ఉండుట.  మరొక విధంగా చెప్పాలంటే ఉపవాసమున్న రోజున మన మనసు, ఆలోచనలు భగవంతునియందే నిలిపి ఉంచాలి.  ఆయన రూపాన్నే ధ్యానం చేయాలి.  మన మనసు, ఆలోచనలు నిర్మలంగా ఉండాలి.  చేసే పనులు కూడా భగవంతునికి సంబంధించినవై ఉండాలి. 


కాని, ఈ విధంగా మనమందరమూ ఆచరిస్తున్నామా అన్నది మనకి మనమే ఆత్మ విమర్శ చేసుకోవాలి.  ఉపవాసం ఉన్న రోజున మన దైనందిన జీవితంలో వ్యాపార వ్యవహారాలు, సాంసారిక వ్యవహారాలు మొదలయిన వాటిలో మనం నిండా మునిగిపోయి, అనైతికంగా వ్యవహారాలు నడపటం, అసత్యాలు పలకటం, ఇతరులను మోసం చేయడం, ఇటువంటి పనులన్నిటినీ చేస్తూ ఉంటాము.  మన మత గ్రంధాలలో ఉపవాసం ఏవిధంగా చేయాలో దానికి చాలా పధ్ధతులు వివరింపబడి ఉన్నాయి.  కాని ప్రస్తుతం ఈ క్రింద వివరింపబడిన పద్ధతులు వాడుకలో ఉన్నాయి. 
          Image result for images of upavasam
1)   పగలు, రాత్రి భోజనం చేయకుండా, పళ్ళు, పాలు మాత్రమే తీసుకొనుట
2)       పగలు పళ్ళు, పాలు తీసుకొని రాత్రికి భోజనం చేయుట
3)   పగలు ఒంటిపూట మాత్రమే భోజనం చేసి రాత్రికి పళ్ళు, పాలు తీసుకొనుట
                        Image result for images of upavasam

కాని వీటినయినా మనం సరిగా ఆచరిస్తున్నామా?  ఉపవాసం ఉన్న రోజులలో మనం ఏమి తీసుకున్నాగాని, ఫలహారం గాని, భోజనం గాని తక్కువ పరిమాణంలో తీసుకోవాలి.  దీనిలో ఉన్న భావం ఏమిటంటే మన జీర్ణవ్యవస్థకి కాస్తంత విశ్రాంతినివ్వాలి.  మరి మనం చేస్తున్నదేమిటి?  మనం చాలా అరుదుగా పండ్లు తింటాము.  కాని మిగిలిన పదార్ధాలని మనం కడుపారా ఎక్కువసార్లు తింటూ ఉంటాము.  మనం ఒంటిపూట భోజనం చేసినా కూడా అమితంగా తినడమే కాక, అన్ని పదార్ధాలను మక్కువతో తింటాము.  దాని ఫలితం అజీర్తి తప్ప మరింకేమీ ఆధ్యాత్మికంగా లాభంలేదు.  ఆవిధంగా మతపరంగా గాని, ఆరోగ్యపరంగా గాని ఏవిధంగా చూసినా ఎటువంటి ప్రయోజనం లభించదు.  ఇవన్నీ గ్రహించే సాయిబాబా తన భక్తులను భగవంతుని పేరుతో ఏవిధమయిన ఉపవాసాలు చేయవద్దని వారించారు.
అన్నిటికి అతీతంగా అనగా ప్రాపంచిక విషయాలపై దృష్టి పెట్టకుండా, కేవలం భగవంతుని నామాన్నే స్మరిస్తూ, పురాణాలు, సద్గ్రంధాలను పఠిస్తూ, శరీరాన్ని కష్టపెట్టకుండా చేసిన ఉపవాసం సత్ఫలితాలనిస్తుంది.  ఉపవాసం ఉండి, టి.వీ లో అనవసరమైన కార్యక్రమాలను చూస్తూ కాలక్షేపం చేసి రాత్రికి పలహారం చేసినట్లయితే ఆఉపవాసానికి అర్ధమేమయినా ఉందా?

Image result for images of  women reading novels
(నేను చదువుకునే రోజుల్లో అప్పట్లో పి.యు.సి.చదువుతున్నాను. కాలేజీలో చదివే అమ్మాయిలు ముక్కోటి ఏకాదశినాడు జాగారమ్ చేయాలనుకున్నారు.  వారు చేసిన జాగారం??... రాత్రంతా నవలలను చదివి కాలక్షేపం చేసారు. ఒకళ్ళు  చదివిన నవల పూర్తవగానే మరొకరు చదవడం. వారెంత పుణ్యం సంపాదించుకున్నారో మనం అర్ధం చేసుకోవచ్చు.) 

ఆహారమును (భోజనమును) అలక్ష్యము చేయరాదు.
భోజన సమయములో ఎవరయినా భోజనము చేసి వెళ్ళమన్నపుడు అలక్ష్యము చేసి ఖాళీ కడుపుతో బయటకు వెళ్ళవద్దని సాయిబాబా సలహానిచ్చారు.  దానిని ఒక శుభసూచకంగా భావించాలి.  మనం ఏపని చేసినా అది సవ్యంగా సాగాలంటే మనకు తగిన శక్తి కావాలి.  ఆశక్తి ఆహారం వల్లనే లభిస్తుంది.  ఇక రెండవ విషయం ఎవరయినా ప్రేమతో భోజనం చేసి వెళ్ళమన్నప్పుడు నిరాకరిస్తే వారి మనోభావాలను గాయపరచడమే కాక, ఆవిధంగా చేయడం కూడా తప్పని చెప్పారు సాయిబాబా.  నలుగురు పండితులతో కలసి భగవంతుని అన్వేషించుటకు అడవులలో తిరుగుతూ ఉండగా, ఒక బంజారా వారిని కలిసి భోజనము చేసి వెళ్లమనగా, తిరస్కరించడం వల్ల, అడవులలో దారితప్పిన తమ అనుభవాన్ని వివరించారు సాయిబాబా (అధ్యాయం – 32).  
"ఉత్త కడుపుతో నేయన్వేషణము జయప్రదము కాదు.  భగవంతుడు సంకల్పించనిదే మనకు దారిలో నెవ్వరు కలియరు.  పెట్టిన భోజనము వద్దనకుడు.  వడ్డించిన విస్తరిని త్రోసివేయకుడు.  భోజనపదార్ధములర్పించుట శుభసూచకము." (అధ్యాయం - 32)

తరువాత సాయిబాబా బంజారా పెట్టిన భోజనము స్వీకరించి, ఆతరువాత అతని మార్గదర్శకత్వంలో తమ అన్వేషణను విజయవంతంగా చేపట్టారు.  అదేవిధంగా అప్పాసాహెబ్ కులకర్ణి భోజనము చేయకుండానే హడావిడిగా ఫకీరును వెదకటానికి ఇంటినుండి బయటకు పరుగెత్తాడు (అధ్యాయం – 33).  అతని అన్వేషణ నిష్ఫలమవడంతో ఇంటికి వచ్చి భోజనము చేసిన పిమ్మట, తన స్నేహితునితో వ్యాహ్యాళికి బయలుదేరాడు.  అపుడు ఆఫకీరు తనంతతానే అతని ఎదుటకు వచ్చి దక్షిణ అడిగాడు.

ఇక్కడ నేను మీకొక విషయం కూడా చెప్పాలి.  భోజనం వడ్డించిన వెంటనే మనం తినడానికి ఉపక్రమించాలి.  కొంతమంది భోజనం వడ్డించిన వెంటనే రాకుండా వేరే వ్యాపకంలో మునిగిపోయి తరవాత తింటాను అలా ఉంచు అంటారు.  భోజనం మనకోసం ఎదురు చూడకూడదు.  ఈ విషయం గుర్తు పెట్టుకోండి.

ఇతరులకు పెట్టకుండా ఎప్పుడూ ఏదీ తినవద్దు
24వ.అధ్యాయంలో సాయిబాబా ఈ విషయం గురించి ఎంతో సమర్ధవంతంగా ,అన్నా సాహెబ్ ధబోల్కర్ ను పరిహాసం చేస్తూ చెప్పారు.  శ్రీసాయి సత్ చరిత్ర వ్రాసిన అన్నాసాహెబ్ గారి కోటు చేతి మడతలనుండి శనగగింజలు రాలి పడినవని చూపించారు.  ఈ అన్నాసాహెబ్ కు తానొక్కడే తిను దుర్గుణము కలదని హాస్యమాడారు.  మనము ఏదయినా తినునప్పుడు అందులో ప్రక్కనున్నవారికి లేక ప్రాణులకు గాని కొంత భాగము పెట్టవలెను.  
                  Image result for images of shirdi saibaba with devotees distributing food

ప్రక్కన ఎవరూగాని, ప్రాణులుగాని లేనిచో బాబాను తలుచుకొని ముందర ఆయనకు సమర్పించాలి.  దీని వలన అపరిశుధ్ధమయిన, నోటికి ఏమాత్రం రుచిని కలిగించనివే కాకుండా, ఇక ఏవిధంగాను తినడానికి సరిపోలని పదార్ధాలను భక్తుడయినవాడు విసర్జించగలుగుతాడు.

అంటే ఏమిటన్నమాట, మనం ఏది తిన్నా అది రుచికరంగా ఉంటేనే కదా తింటాము. ఒక్కొక్కసారి ప్రొద్దున వండినవి రాత్రికి,  రాత్రికి వండిన పదార్ధాలు మిగిలిపోతే ఉదయానికి పాడయిపోవచ్చు. అటువంటప్పుడు అందరూ ఏమి చేస్తారు? అన్నం పాసిపోయి ఉంటుందనుకోండి, బయట ఏకుక్కకో లేక ఏజంతువుకో పడేస్తాము. లేకపోతే పనివారలను పిలిచి ఇస్తూ ఉంటాము.?  ఇంకా వివరంగా నేను చెప్పనవసరం లేదనుకుంటాను. 

అందుచేతనే బాబా వారు ఇతరులకు పెట్టేటప్పుడు కూడా నువ్వు తినేదే వారికి పెట్టు అన్నారు. 

 (ఈ భాగం ఇంకా ఉంది)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)




Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List