Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Sunday, June 11, 2017

శ్రీసాయి తత్త్వసందేశములు –11 వ.భాగమ్

Posted by tyagaraju on 8:25 AM
Image result for images of shirdisai smiling

   Image result for images of hibiscus


11.06.2017 ఆదివారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
బాబావారు ప్రసాదించిన మరికొన్ని సందేశాలు
శ్రీ సాయితత్త్వ సందేశములు
(voice of Sai Baba)

శ్రీసాయి తత్త్వసందేశములు –11 .భాగమ్

38.  12.12.1992 ఉదయం 9.15 గంటలకు బందరులో గుడ్లవల్లేటి వెంకటరత్నం గారి పూజా మందిరములో వచ్చిన సందేశము.

ఈ చరాచర జగత్తుకంతకు దైవమును మించిన అత్యధికుడు ఎవరునూ లేరు.  సృష్టి స్థితిలయకారకుడు ఆయన లీలలు వర్ణించుట ఎవరి తరము కాదు.
వారు ఏది ఎట్లు ప్రసాదించిననను హృదయ పూర్వకముగా స్వీకరించి తృప్తి, ఆనందము పొందండి.


ఋజుప్రవర్తన కలిగి, మంచిచెడ్డలు గ్రహించండి.  మీ విధులను శక్తివంచన లేకుండా సక్రమముగా నిర్వర్తించండి.  తొందరపాటుతో ఏ నిర్ణయము తీసుకొనకండి.  విమోహితులై మీరు చేయు కర్మలకు మీరే స్వతంత్రులమని భావించకండి.  కర్త ఆదైవమే.  మీ పారతంత్ర్యము గుర్తించి సర్వకర్మలు చేయుంచునది ఆయనే.
ఇది గ్రహించిన సకల కర్మ బంధములలో చిక్కుకొనక వాటినుండి విముక్తులయ్యెదరు.
శుధ్ధ చైతన్యమే మానవునకు పరమ గమ్యమని తెలుసుకొనండి.  దుస్సాంగత్య దోష రహితులు కండి.  శరీరముపై మమత్వము, ఆపేక్ష రాగాదులు వదలుకొనండి.  కులాభిమానము పోనంతవరకు జరామరణాత్మక దుఃఖస్థితిని పోగొట్టుకొనలేరు.  అహంకార మమకారములు నశించినప్పుడే ప్రత్యగాత్మ అనే జ్ఞానము పొందగలరు. 
        
వివేకము లేని అభ్యాసముకంటే పవిత్రమైన శాస్త్ర, శ్రవణ జ్ఞానము శ్రేష్టమైనది.  దానికంటే ధ్యానము శ్రేష్టమైనది.  ధ్యానము కంటే కర్మఫల త్యాగము శ్రేష్టమైనది.

ధ్యానమునకు కారణము భక్తి.  భక్తికి కారణము నిష్కామ కర్మ యోగము.
ఈసందేశములోని తత్త్వమును గ్రహించి ఆచరించుటకు ప్రయత్నించండి.  అపుడే మీ జన్మకు సాఫల్యత్వం కలుగుతుంది.
నేను నిర్గుణ, సగుణ స్వరూపుడను.  నన్ను ఎట్టి రూపములో ధ్యానించినను మీకు సద్గతికలుగును.  నాకు కావలసినది పవిత్రమైన భక్తి.

39.  02.01.1993 శ్రీసాయి యిచ్చిన సందేశము.

పరిశుధ్ధమైన భక్తితో ఎవరైతే నాకు ఫలముగాని, పుష్పముగాని సమర్పించెదరో, దానిని మనస్ఫూర్తిగా స్వీకరించెదను.  అంతేగాని నాకు డాంభీకములుగాని, ఆడంబరములు కాని పనికిరావు.  జ్ఞానం అనేది పురుషునివంటిది.  భక్తి అనేది స్త్రీలాంటిది కనుక మీరందరు భక్తికి ప్రాధాన్యత యివ్వండి.  సత్కార్యముల కొరకే, మీ దననమును సద్వినియోగము చేయండి.  విలాసములకు చేయరాదు.  పేరు ప్రతిష్టలకు ప్రాకులాడరాదు.  సత్కార్యములకు వెచ్ఛించిన యిహ పర సుఖములు పొందగలరు.  కుతంత్రాలకు లోనుగాక సహృదయముతో ఒక్క నిమిషము నన్ను ధ్యానించిన సాటి లేని ఫలాన్ని పొందగలరు.

వ్యాపారస్తులు తమకు కలసి రావటము లేదని నిస్పృహ చెందరాదు.  భూమిలో పడిన ధాన్యపు గింజ ఒక్కరోజులో మొలకెత్తదు.  అటులనే వ్యాపారము కూడా.  ఓర్పు, సహనము అవసరము.  నేను ప్రతినిత్యము మిమ్ములను గమనిస్తూనే యున్నాను.  ఎవరైతే నన్ను ఆత్రుతతో పిలిచెదరో వారి రక్షణకు నేను సర్వదా సిధ్ధుడనే.  గొంతు ఎత్తి అరవనవసరం లేదు.  నేను సర్వాంతర్యామిని.
దుష్కర్మలలో చిక్కుకొనకుండా, నా సాయుజ్యం కొరకు పరితపించుచూ, నా వేదాంత తత్త్వ బోధలలో ప్రచార నిమగ్నత్వంలో ఆసక్తి కల్గి, బంధనాత్మకమైన అజ్ఞానంలో కొట్టుకొనిపోకుండా, శాశ్వతమైన పరమాత్మనైన నన్నే సదా తలంచుచూ, మీ వ్యాపారములలో లోటుపాట్లును సరిదిద్దుకొనుచు, శాంతి భావముతో సదా నా నామమును ఉచ్చరించుచూ, మనసునందు మాలిన్యము తుది మాపుకొని, పవిత్ర భావముతో ఆనంద స్వరూపులై దైవ సంభూతులై, దైవ కటాక్షము సంపాదించిన మీరు ఏ వ్యాపారము తలపెట్టిన దిగ్విజయముగా నడుచును.  అప్పుడే నిజమైన పవిత్రతను, పొందగలరు.  పాపాన్ని హరించడానికి సత్సంగం సఛ్ఛింతనము, సద్భాషణం, సదాచరణం ముఖ్యము.  అప్పుడే మీ పాపపు దుంపలు యిగిరి, ఎండి చచ్చిపోవును.  మీ దినకృత్యములలో ప్రతి పొరపాటుకి సవరణ అవసరం.  జాగ్రత్త వహించిన ఆశ అణచి వేయబడును.  కుతంత్రాలకు లోను కాక, మీరు చేసే క్రియలు భక్తితో హృదయపూర్వకంగా చేసిన కర్మలు మీకు అంటవు.  హృదయములోని అజ్ఞానం వల్ల పుట్టే సంశయాన్ని జ్ఞానమనే ఖడ్గంతో ఛేదించి, నిష్కామ కర్మయోగాన్ని ఆశ్రయించండి.  మించిన ఆసక్తే సంఘర్షణకి కారణం.  ధైర్యం, మనోనిగ్రహం, శౌచం, దయ, కోమలమైన వాక్కు అలవరచుకొనండి.  దైవభక్తి కలిగి, దైవ ప్రచారమందు నిమగ్నులై, ఋజువర్తన కలవారై యుంటే భగవంతుని ఆండదండలు వుంటాయి.
     “నబుధ్ధి భేదం జనయేత్ అజ్ఞానాంకర్మ సంగినామ్
      జోష యేత్సర్వ కర్మాణి విద్వాన్ముక్త సామా చరన్

      యో జయేత్ సర్వ కర్మాణి విద్వాన్యుక్త సమాచరన్”


41.  12.02.1993 ఉదయం 5 గంటలకు శ్రీ బి.వి. సత్యనారాయణగారి పూజా మందిరములో జమ్ షెడ్ పూర్ లో బాబాగారు యిచ్చిన సందేశము.

“ఈ చరాచర జగత్తునందు మీతో చాలామంది సంసార బంధములలోను, సంతాన హీనులమని చింతనతోను, ఐహిక సంబంధమైన బాధలతోను బాధపడుచు, దేనియందో ఒక దానిలో మీ మనస్సును అర్పించుకొని, ఆ తలంపులతోనే నిద్రించుట వలన మీకు ఆ తలంపులే దుస్స్వప్నములుగా వచ్చుచూ, మిమ్ములను బాధించుచున్నవి.  మీరు నిద్రించుటకు ముందు ఆ దినము చేసిన పాపపుణ్య కర్మలను ఆ పరమాత్మకు సమర్పించుచున్నానని నిద్రించి, లేచినప్పటినుంచి మీ మనస్సును దురాలోచనలకు పోనివ్వక, నా కృపాకటాక్షమనే బీగమును మీ మనస్సునకు యిచ్చి, మిమ్ములను సన్మార్గులను చేసి, మీ పాపకర్మలను క్షమించి, సద్గతి కల్పించి మిమ్ములను నాలో ఐక్యము చేసుకొనమని నన్ను ప్రార్ధించి నిద్రకు ఉపక్రమించిన, మీకు దుస్వప్నములు రావు.  వచ్చినను ఆ స్వప్నములు సత్యములే అగును.  కాని మీకు హానిచేయవు.  మీరు నిద్రపోవు ముందు ఎడమ చేతివైపునకు తిరిగి “సో” అను మంత్రమును శ్వాసలోపీల్చి “హం” అనే మంత్రమును శ్వాసతో విడవండి.  ఆ తదుపరి నిద్రకు ఉపక్రమించండి.  ఇది నిత్యము చేయుట అలవాటు చేసుకొనండి.  “సో” అనే మంత్రములో “ఓ” అనే జీవాక్షరము “హం” అనే మంత్రములో “౦” బిందులనే జీవాక్షరము కలవు.  ఈ రెంటి కలియకయే “ఓంకార” శబ్దము ఉద్భవించినది.  “ఓంకారమును” నిత్యము పఠించిన మీ పాప దోషములు నశించును.  ఉద్యోగము చేయు సమయమందు, వ్యాపారము చేయు సమయమందు తప్ప యితరకాలములో తృణమాత్రకాలము కూడా వ్యర్ధము చేయక, ఎడతెగని ప్రవాహముతో ఓంకారమును ఉఛ్ఛరించిన మీ కోరికలు నెరవేరుటయే గాక, మరణ సమయమందు, మీ సంసార బంధములు అడ్డురాక, మిమ్ములను కృతార్ధులను చేయును.  నిత్యము మీరు చేయు వంటకములను మీ యిష్టదైవమునకు అర్పించి, గాయిత్రి మంత్రము చదివి “దైవం మానుషా రూపం” అనే మహావాక్యమును జ్ఞాపకము చేసుకొని భోజన సమయమందు వచ్చిన అతిధులకు ముందుగా భిక్ష యిచ్చి, తదుపరి మీరు భుజించవలయును.  అట్లు అతిధులు రానిచో కొంత భోజన పదార్ధమును ఏజీవరాసులకైన అర్పించవలయును.  ఈ వేదవాక్కును నూతన వధూవరులకు సలహా యిచ్చి పాటించమని చెప్పు.  అట్లు చేసిన నా కృపవారిపై ఎల్లవేళల యుండును.  ఇది వారికి కవచములాంటిది.  నా నిజస్వరూపము ఏమిటో తెలుసుకొనవలసినదని చెప్పు.

42.  20.02.1993 ఉదయం 5.00 గంటలకు వచ్చిన సందేశము.

సాధన వెనుక చాలినంత వైరాగ్యము లేకపోతే భగవన్నామము వలన భగవంతుని పొందలేరు.  పరధ్యానంగా వున్న మనస్సు నామము యొక్క ఆనందాన్ని అనుభవించలేదు.  నామమును ఏకాగ్రతతో చేసిన, మనస్సులోని మాలిన్యాలన్నిటిని పోగొట్టి పరిపూర్ణ శాంతిని యిస్తుంది.  మనస్సును నిలకడ చేసుకొనకుండా నామ సంకీర్తన చేసిన ఫలితం లేదు.  దైవముపై తీవ్ర వాంఛ తృష్ణ వున్నప్పుడే అపవిత్రత మాయమయిపోతుంది.  దైవాన్వేషణపై తీవ్ర పట్టుదల వుండాలి.  ఆత్మ స్వరూపుడవని తెలుసుకొనే వరకు నిరంతరము నామ జపము చేస్తూ వుండవలయును.  పరధ్యానం అనేది, నామజపము వలన పోతుంది.  అజ్ఞానముపోయి జ్ఞానము కలుగుతుంది.  నా నామము ఆత్మకు పర్యాయపదం.  ఆత్మను, నిరంతరము జ్ఞాపకం చేసుకోవడం వలన ఆత్మ జ్ఞానాన్ని పొందగలుగుతారు.  జ్ఞానాన్ని పొందగలిగితే తప్ప దైవానుభవము పొందలేరు.  నామజపము పరా భక్తి స్థితిలో ప్రపంచ సృష్టిని తెలియచేసే దృష్టిని ప్రసాదిస్తుంది.  శరీర భావంనుండి వేరుచేసుకొని ఆత్మ భావంతో అభేదము కలిగి యుండండి.  దైవం గురించి వెదకటం అంటే ఆత్మను గురించె వెదకుటయే.  ఆ విధముగా అన్వేషణ చేసిన మీరు ఆత్మ ఒక్కటియే అని గ్రహించగలరు.  ద్వైతంలో మొదలయి అద్వైతంలో అంతము అయ్యెదరు.  చివరికి ఆత్మ మీరు ఒక్కటే అని తెలుసుకుంటారు.  పరిపూర్ణ దైవత్వమును అనుభవము పొందితే, చంచలుడుగాను, అచంచలుడుగాను అవుతారు.  లోక సంగ్రహార్ధమైన ప్రపంచ కార్యములకు, మానవ శ్రేయస్సు కొరకై పనిచేయుచున్న ఆత్మగా మార్పులేని సాక్షిగా ఉంటారు.
(ఇంకా ఉన్నాయి)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)

Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment