Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Friday, August 11, 2017

శ్రీ సద్గురు సాయినాధ్ మందిర్ – శివాజీ నగర్ పూనా – 5 (తాయెత్తు)

Posted by tyagaraju on 8:29 AM
11.08.2017  శుక్రవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ రోజు పూనాలోని శివాజీ నగర్ ప్రాతంలో ఉన్న శ్రీసాయిబాబా మందిరం గురించిన ఆసక్తికరమయిన విషయం తెలుసుకుందాము.









             Image result for saibaba with child

         2   Image result for images of rose hd

శ్రీ సద్గురు సాయినాధ్ మందిర్ – శివాజీ నగర్ పూనా – 5
(తాయెత్తు)
(మూల రచన మరాఠీ భాషలో శ్రీ ఎస్.ఎమ్. గార్జే గారు రచించారు.  ఆయన రచన సాయిలీలా మాసపత్రిక జనవరి 1976 లో ప్రచురింపబడింది)
ఆంగ్ల భాషలో ఏప్రిల్, 1977 వ.సంవత్సరంలో ప్రచురింపబడిన శ్రీసాయిలీలా మాస పత్రిక నుండి గ్రహింపబడింది.

ప్రస్తుతం పూనాలో మూడు సాయి మందిరాలు ఉన్నాయి.  ఒక మందిరం, స్వర్ గేట్, ఇంకొకటి ఖడ్ కీ, మూడవది శివాజీ నగర్ లోను ఉన్నాయి.  వీటిలో శివాజీ నగర్ లో ఉన్న మందిరం చాలా పురాతనమయినది.  


Image result for images of baba mandir shivaji nagar pune



Image result for images of baba mandir shivaji nagar pune

(శివాజీ నగర్, పూనె, శ్రీసాయిబాబా)

ఈ మందిరానికి ఎక్కువ మంది భక్తులు వస్తూ ఉంటారు.  ఈ మందిరం చరిత్ర కూడా ఎంతో అధ్బుతంగాను, ఆసక్తికరంగాను, ఉద్వేగభరితంగాను ఉంటుంది.  ఈ మందిరం శివాజీనగర్ లో ముత్తా నది ఒడ్డున రసానె సత్రం ప్రాంతంలో ఉంది. ఈ మధ్యనే  నదికి ప్రక్కగా రోడ్డు వేసి నదికి పటిష్టంగా గట్టు కూడా కట్టడంవల్ల నదికి వరదలు వచ్చినపుడు మందిరంలోనికి నీరు రాకుండా గట్టు రక్షణగా ఉంది. 
          Image result for mutha river pune
       (ముత్తా నది, పూనే)
లేకపోతే ప్రతిసంవత్సరం వర్షాకాలంలో నదికి వరద వచ్చి మందిరంలోనికి నీళ్ళు వచ్చేసేవి.  క్రొత్తగా వేసిన రోడ్డునుంచి ఎడమప్రక్కకు తిరగగానే మొట్టమొదటగా రసానే సత్రం వస్తుంది.  కొద్దిగ ముందుకు వెళ్ళి కుడివయిపు తలతిప్పి చూస్తే మనకు శ్రీసాయిబాబా వారు దర్శనమిస్తారు.  ఆయన దర్శనం కలిగిన వెంటనే మందిరానికి చేరుకోవడానికి కలిగిన ఇబ్బందులన్నిటినీ మర్చిపోతాము.  మనసుకి ఎంతో సంతోషం కలుగుతుంది.  
                  Image result for images of baba mandir shivaji nagar pune

శ్రీదామోదర్ పంత్ రసానే సాయి భక్తుడు.  ఆయన తన జీవితకాలంలో సాయిబాబాతో గడిపిన అదృష్టశాలి.  రసానె సత్రం దామోదర్ పంత్ కు సంబంధించినది.  దామోదర్ కుమారుడు శ్రీనానాసాహెబ్ రసానే 1945 సంవత్సర ప్రాంతంలో రసానే సత్రంలోని రెండు గదులని సాయిమందిరంగా మార్పు చేసి అందులో శ్రీసాయిబాబావారికి పూజాదికాలను నిర్వహించడం మొదలుపెట్టారు.  అప్పటినుండి ఇక్కడ క్రమం తప్పకుండా నేటికీ శ్రీసాయిబాబావారికి పూజలు జరుగుతూ ఉన్నాయి.  ఈ మందిరంలో ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఆరతులు జరుగుతూ ఉండటంతో అధిక సంఖ్యలో భక్తులు రావడం మొదలుపెట్టారు.  ఈ మందిరానికి వచ్చే భక్తులలో ప్రముఖులయినవారు పూనా సెషన్స్ జడ్జీ గారయిన శ్రీ పాటిల్, బెల్గాం జడ్జిగారయిన శ్రీ చౌగులె, శ్రీ వి.శంకర్ ముదలియార్, శ్రీ పి.ఎస్.రావ్, శ్రీరంగనాధన్, శ్రీ బెంద్రే, శ్రీ గైక్వాడ్, శ్రీ తకవానె గురుజి, మొదలైన వారున్నారు.  శ్రీనికమ్ గారు ఖేడ్ లో పోలీస్ శాఖలో జమాదార్.  ఆయన మంచి వినయవిధేయతలు కలిగిన సాయిభక్తుడు.  ఆయన భక్తిశ్రధ్ధలను గమనించి శ్రీనానాసాహెబ్ రసానే ఆయనకు శ్రీసాయిమందిర నిర్వహణ బాధ్యతలను అప్పగించారు.  శ్రీనానాసాహెబ్ మాటమీద గౌరవభావంతో తన ఉద్యోగానికి రాజీనామా చేసి, తన జీవితాన్నంతా మందిర నిర్వహణకే అంకితం చేసుకున్నారు.  శ్రీనికమ్ గారు ఈ మందిరంతో ఎంతగానో అనుబంధాన్ని పెంచుకొన్నారు.  ఆయన చేసుకున్న అదృష్టంవల్ల సాయిబాబా ఆయనకు ఒక తాయెత్తును ఇచ్చారు.  ఆయన ఈ తాయెత్తుని ఈ మందిరానికి కానుకగా ఇచ్చేశారు.  ఈ తాయెత్తు శ్రీనికమ్ గారికి ఏవిధంగ లభించిందో దాని చరిత్ర సాయిభక్తులందరికీ చాలా అధ్బుతంగాను, ఆసక్తికరంగాను ఉంటుంది.

షిరిడీ గ్రామస్థురాలయిన కాశీబాయికి నిఫాడ్ గ్రామ యువకునితో వివాహం జరిగింది.  కాని, దురదృష్టవశాతు వివాహమయిన కొద్ది సంవత్సరాలలోనే కాశీబాయి భర్త మరణించాడు.  భర్త మరణించేనాటికి ఆమె గర్భవతి.  తరువాత ఆమెకు కుమారుడు జన్మించాడు.  అతనికి ‘మాధవ్’ అని పేరుపెట్టింది.  మాధవ్ కు ఒక ఏడాది వయసు రాగానే కాశీబాయి నిషాడ్ నుంచి షిరిడీ వచ్చి తండ్రితోనే నివసించసాగింది.  కాశీబాయికి జీవనాధారం ఏమీ లేకపోవడంతో ఇతరుల పొలాలలో కూలీపని చేసేది.  అందువల్ల కొడుకు ఆలనాపాలనా ఒక సమస్యగా తయారయింది.  ఆమెకి వాడిని కనిపిట్టుకుని ఉండటానికి ఇంటిలో ఎవరూ లేరు.  చివరికి ఆమెకి ఒక పరిష్కారం దొరికింది.  ఆమె పొలానికి పనిలోకి వెళ్ళేటప్పుడు ఉదయాన్నే కొడుకుని మసీదులో వదలి వెడుతూ ఉండేది. 
                  Image result for saibaba with child

సాయంత్రం పొలంనుండి ఇంటికి తిరిగి వెళ్ళేటప్పుడు మసీదుకు వెళ్ళి కొడుకుని తీసుకొని వెళ్ళేది.  ఆవిధంగా యింటికి తిరిగి వెళ్ళేటప్పుడు శ్రీసాయిబాబాకు నమస్కరించుకుని వెళ్ళేది.  కాశీబాయి తన కుమారుడిని పగలంతా మసీదులోనే వదిలి వెడుతుండంతో కొడుకు గురించి ఎటువంటి చింతా పెట్టుకోలేదు.  అందుచేత నిశ్చింతగా ఉదయాన్నే పొలానికి పనికి వెడుతూ సాయంత్రం తన కొడుకుని తీసుకొని యింటికి తిరిగి వెడుతూ ఉండేది.  ఈవిధంగా నాలుగు సంవత్సరాలు గడిచాయి.  మాధవ్ కి అయిదు సంవత్సరాలు వచ్చాక సాయిబాబా ఆపిల్లవాడికి ప్రతిరోజు ఒక రూపాయి ఇస్తూ ఉండేవారు.  మాధవ్ బాబాకు చిన్న చిన్న పనులు చేసి పెడుతూ ఉండేవాడు.

సాయిబాబా చాలా మందికి కొంత డబ్బు యిస్తూ ఉండటం కాశీబాయికి తెలుసు.  ఒకరోజు కాశీబాయి మశీదుకు వచ్చి బాబాతో “బాబా, మీరు ప్రతిరోజు కొంతమందికి, రూ.50/-  మరికొందరికి, 30, 25, 15 ఈవిధంగా ఇస్తున్నారు.  మా అబ్బాయి మీకు ఎన్నో చిన్న చిన్న పనులు చేసిపెడుతున్నాడు.  కాని మీరు మాధవ్ కు మాత్రం ప్రతిరోజు ఒక్క రూపాయి మాత్రమే ఇస్తున్నారెందుకని?” అని అడిగింది.  అపుడు బాబా, “కాశీబాయీ! నీకుమారునికి చాలా తక్కువ యిస్తూ కొంతమందికి ఎక్కువ ఇస్తున్నాననే విషయం నాకు తెలుసు.  కాని ఒక్క విషయం గుర్తుంచుకో.  నేను యికమీదట వారికి యివ్వడం మానివేసినా గాని, నీకొడుకుకి మాత్రం యివ్వడం మానను.  అతనికి ప్రతిరోజూ యిస్తూనే వుంటాను.  నీవంటి నిరాధారులయినవారికి నేనే యజమానిని” అన్నారు.  కాశీబాయికి బాబా అన్నమాటలు అర్ధం కాలేదు. “నాభర్త అయిదు సంవత్సరాల క్రితమే గతించారు.  అప్పటినుండి నేను భర్తలేనిదానను” అంది కాశీబాయి.
                 Image result for images of saibaba in angry mood
ఈమాటలు వినగానే బాబాకు చాలా కోపం వచ్చింది.  ఆమెపై బిగ్గరగా అరవసాగారు.  సాయిబాబా కోపానికి భయపడి కాశీబాయి మెల్లగా మశీదునుంచి జారుకుని యింటికి వెళ్ళిపోయింది.  అప్పటినుండి కొంతకాలంపాటు మసీదుకు వెళ్లడం మానుకుంది. రెండు మూడు రోజుల తరువాత సాయిబాబా ఆమె మసీదుకు రావటంలేదని గుర్తించి ఆమెకోసం కబురు పంపించారు.  కాశీబాయి మాధవ్ ని తీసుకుని మశీదుకు వచ్చింది.  బాబాతో మాట్లాడటానికి ధైర్యంలేక భయపడుతూ నుంచుంది.  బాబా ఆమెతో మృదువయిన స్వరంతో ప్రేమగా మాట్లాడారు. 
             Image result for images of shirdi sai
బాబాగారికి ఒక దంతం కదులుతూ ఉంది.  బాబా తన దంతాన్ని బయటకు పీకి చిన్న వస్త్రంలో చుట్టి ఊదీతోపాటుగా కాశీబాయికిచ్చి, ఆ తాయెత్తును భద్రంగా దాచుకోమని చెప్పారు.  ఆ తాయెత్తు ఆమెకు శుభం కలిగిస్తుందని చెప్పారు. 

కాలంగడుస్తూ ఉంది.  మాధవ్ పెరిగి పెద్దవాడయాడు.  అతను ఇపుడు మాధవరావుగా అందరికి పరిచయిస్థుడయాడు.  తన తల్లి కాశీబాయి మరణించిన తరువాత షిరిడీ విడిచిపెట్టి నిఫాడ్ లో స్థిరపడ్డాడు.  ఒకసారి మాధవరావుకు చాలా తీవ్రంగా అనారోగ్యం చేసింది.  ఆ అనారోగ్య పరిస్థితిలో ఒక రోజు బాబా అతనికి కలలో కనిపించి “తొందరలోనే నీవద్దకు ఒక వ్యక్తి వస్తాడు.  నువ్వు నీచేతికి కట్టుకున్న తాయెత్తును అతనికి ఇవ్వు” అని ఆదేశించారు.  అదేరోజు నికమ్ గారు నిఫాడ్ లో ఉన్న మాధవరావు ఇంటికి వచ్చారు.  మాధవరావు, నికమ్ గారు ఇద్దరూ షిరిడీలో చాలా సార్లు కలుసుకున్నారు.  మాధవరావుకి వచ్చినట్లే నికమ్ గారికి కూడా అదేవిధమయిన కల వచ్చింది.  ఆ కలలో బాబా, మాధవరావు దగ్గరనుంచి తాయెత్తును తీసుకోమని నికమ్ గారికి చెప్పారు.  ఇద్దరూ తమకు వచ్చిన కల ఒక్కటేనని తెలుసుకున్నారు.  మాధవరావు తన చేతికి ఉన్న తాయెత్తును నికమ్ గారికి ఇచ్చాడు.  నికమ్ గారు ఈ తాయెత్తుని తన వద్దనే చాలా సంవత్సరాలు భద్రంగా దాచుకున్నారు.  ఆ తరువాత ఆ తాయెత్తునును శివాజీనగర్ లో ఉన్న బాబా మందిరానికి అప్పగించి భద్రపరచమని చెప్పారు.  ఈ మందిరంలో ఉన్న బాబా పాదుకల క్రింద ఈ తాయెత్తును మందిర నిర్వాహకులు భద్రపరచారు.  1950 వ.సంవత్సరంలో పూజ్యశ్రీ నరసింహస్వామీజీ గారు ఈపాదుకలని ప్రతిష్టించారు. ఈ విధంగా బాబా పవిత్ర దంతం కాశీబాయి నుండి ఆమె కొడుకు మాధవరావుకు, మాధవరావు నుండి నికమ్ కు, నికమ్ నుండి శివాజీనగర్ మందిరానికి వచ్చింది.  అనగా తిరిగి తిరిగి అది బాబా చెంతకే వచ్చిందన్నమాట. బుధ్ధునియొక్క ప్రార్ధనా స్థలాలలోను, ప్రత్యేకించి స్థూపాలవద్ద గౌతమ బుధ్ధునియొక్క దంతం ఉంచబడుతుంది.  బౌధ్ధులందరూ ఆయన దంతాన్ని పూజించుకుంటూ ఉంటారు. అదేవిధంగా ఈమందిరానికి కూడా అంతటి ప్రత్యేకత ఉంది.  గౌతమ బుధ్ధునియొక్క మందిరాలలో బుధ్ధునియొక్క దంతం ఉన్నట్లుగానే ఈ శివాజీనగర్ మందిరంలో కూడా బాబావారి దంతంతో ఉన్న తాయెత్తు ఉండటం వల్ల సాయిభక్తులందరికీ కూడా ఈ బాబామందిరం ఎంతో ప్రత్యేకమయిన దర్శనీయస్థలంగా ప్రసిధ్ధి చెందింది.


(రేపటి సంచికలో వరదనీటిలో పూర్తిగా మునిగిపోయిన ఈ మందిరంలోని బాబా చిత్రపటం పరిస్థితి ఎలా ఉంది)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు) 

Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List