01.03.2020 ఆదివారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి భక్తులందరికి బాబావారి శుభాశీస్సులు
ఈ వారం నుండి మరలా బాబా వారు తెలియచేసిన శ్రీ సాయి సత్ చరిత్రకు అందని రహస్యాలు 3 వ.భాగాన్ని ప్రచురిస్తున్నాను. చదివిన తరువాత మీ అభిప్రాయాలను తెలపండి.
శ్రీ సాయి సత్ చరిత్రకు అందని రహస్యాలు - 3 వ.భాగమ్
14.01.2020 ఋణానుబంధ విముక్తి
నీవు ఎవరినుండినయినా ధన సహాయము గాని, మాట సహాయము గాని పొందినచో, వారికి కృతజ్ఞతాభావంతో ఉండు. వారికి తిరిగి సహాయము చేయలేకపోయినా కనీసం వారు మరణించిన రోజున వారి పార్ధివశరీరముపై ఒక పూలమాలను వేసి వారిపట్ల నీకృతజ్ఞతా భావమును తెలియచేయి.
శ్రీ సాయి సత్ చరిత్ర 31వ. అధ్యాయాన్ని ఒక సారి గమనిద్దాము.
“మేఘా చనిపోయినప్పుడు భక్తులు, గ్రామస్థులు శ్మశానానికి వెళ్ళారు. బాబా కూడా వెళ్ళి మేఘాపై పుష్పాలు చల్లారు. ఉత్తరక్రియలు జరుగుతుంటే భక్తసఖుడైన బాబా, మాయలో ఉన్న మానవునివలె కళ్ళనీరు కార్చి శోకించారు. తమ చేతులతో ప్రేమగా శవాన్ని పూలతో కప్పారు. దుఃఖిస్తూ వెనుకకు మరలారు.”
15.01.2020 స్నేహము – స్నేహితులు
నేటి సమాజములో మూడు రకముల స్నేహితులు ఉన్నారు. వారిలో ఉత్తములతోనే నీవు స్నేహము చేయి.
వివరణ : 1. ఉత్తములు - వీరు తమవద్ద ఉన్న జ్ఞానమును నిస్వార్ధముగా ఇతరులకు పంచిపెడతారు.
2. మధ్యములు - వీరు తమకు ఉన్న జ్ఞానమును అహంకారముతో ఇతరుల ముందు ప్రదర్శించి వారికి పంచుతారు.
3. అధములు - వీరు తమవద్ద ఉన్న జ్ఞానమును సంకుచిత భావంతో తమ వద్దనే ఉంచుకుని సమాజానికి పనికిరానివారిగా మిగిలిపోతారు.
16.01.2020 ధనవంతులతో స్నేహము - మాటల వరకే
నీవు వారి ఇండ్లకు వెళ్ళినా, వారి ఇంట పనిచేస్తున్నవారు మాత్రమే నిన్ను పలకరించి, నీకు అతిధి సత్కారాలు చేస్తారు. ఆ తరవాతనే ఆ ఇంటియజమాని మేడపైనుండి దిగి వచ్చి, నిన్ను పలకరించి, నిన్ను నీఇంటికి సాగనంపుతాడు. అందుచేతనే ధనవంతులతో స్నేహము ఉన్నా వారినుండి ఏమీ ఆశించరాదు. స్నేహము ఎల్లపుడూ సమ ఉజ్జీగలవారితోనే చేయవలెను.
(శ్రీ సాయి సత్ చరిత్ర 47 వ. అధ్యాయములోని వీరభద్రప్ప – చెన్న బసప్పల విషయం మనం గుర్తుచేసుకుందాము)
17.01.2020 - ధనసంపాదనలో అత్యాశ
నా భక్తుడు ఒకడు జీవనోపాది కోసం నా ఆశీర్వచనాలతో కిరాణా దుకాణము పెట్టుకుని సంతృప్తిగా జీవించసాగాడు. కొంతకాలానికి అతను ధనవ్యామోహంతో నామాట వినకుండా అప్పులు చేసి వజ్రాలవ్యాపారము ప్రారంభించాడు. వ్యాపారములో భాగంగా అద్దాలగదిలో వజ్రాలను ప్రదర్శించి తన ఆడంబరత్వాన్ని సమాజానికి చూపించాడు.
కొందరు దొంగలు అతను దుకాణములో లేని సమయంలో ప్రవేశించి, ఆ అద్దాలగదిని పగలగొట్టి వజ్రాలను దొంగిలించి వెళ్ళిపోయారు. ఆ బాధను తట్టుకోలేక నా భక్తుడు ఆత్మహత్య చేసుకున్నాడు. నేను వానిని వారించినా నామాట వినకుండా ధన వ్యామోహమునకు పోయి తన ప్రాణాలను పోగొట్టుకున్నాడు.
విశ్లేషణ - దామూ అన్నా కాసార్
ఇటువంటి సందేశము మనము శ్రీసాయి సత్ చరిత్ర 25 వ. అద్యాయములో చూడగలము.
దామూ అన్నా కాసార్ ధనముపై అత్యాశతో జట్టీ వ్యాపారం చేయడానికి బాబా అనుమతి కోరినపుడు బాబా వానిని ధనవ్యామోహంతో అత్యాశకు పోవద్దని చెప్పి, ఉన్న సగము రొట్టిని తిని ప్రశాంతముగా జీవించమని ఆదేశించారు.
ఈ విషయమును మనము సదా గుర్తుంచుకొనవలెను. --- త్యాగరాజు
(మరలా వచ్చే గురువారమ్)
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment