10.05.2020 ఆదివారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
నిన్నటితో బాబాగారి అయిందిండ్ల భిక్ష గురించిన వివరణ పూర్తయింది. నిన్న ప్రచురించినదానికి రాజమహేంద్రవరం నుంచి శ్రీ యెఱ్ఱాప్రగడ ప్రసాద్ గారు చాలా అధ్భుతమయిన వివరణ పంపించారు. దానిని కూడా రేపు ప్రచురిస్తాను.
కొంతమందికి కొన్ని సందేహాలు కలిగాయి. మనం భుజించిన తరవాత భిక్ష వేస్తే అది మన ఎంగిలి పెట్టినట్టవుతుంది కదా అని. కాని మన బాబా విషయంలో అధ్బుతాలు జరుగుతాయి. 2016 లో చెన్నైలో శ్రీమతి కృష్ణవేణి గారికి బాబా చూపించిన లీలను ఈ సందర్భంగా మరలా ప్రచురిస్తున్నాను. చాలా అధ్బుతమయిన లీల.
'మేరే సాయి" మొదటిభాగం రేపు పోస్ట్ చేస్తాను.
18.03,2016 శుక్రవారం
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
భక్త శబరి…???భక్తి పరీక్షా???
చెన్నై నుండి శ్రీమతి కృష్ణవేణిగారు 15వ. తీరీకున ఒక అనుభవాన్ని ఈ మెయిల్ ద్వారా పంపించారు. చాలా అద్భుతమైన అనుభవం. ఇంకా విచిత్రమేమంటే ఈ రోజు ప్రచురిస్తున్న ఈ అధ్బుతమైన లీలకు బాబా వారు మరికొంత సమాచారం కూడా ఇమ్మని నాకు సూచించారు. అది ఏవిధంగా ఇచ్చారన్న విషయాన్ని ఈ లీల పూర్తయిన తరువాత వివరంగా ఇస్తున్నాను.*** అది కూడా చదవండి. ఈ లీల ప్రచురించడానికి కూడా బాబావారి అనుగ్రహం ఏ విధంగా ఇచ్చారో మనం గ్రహించుకోవచ్చు.
శ్రీమతి కృష్ణ వేణిగారు పంపిన అనుభవం :
ఈ మధ్యనే జరిగిన ఒక లీల గురించి మీకు చెబుతాను. ఈ అధ్బుతమైన లీల క్రిందటి గురువారం జరిగింది. మా ఇంటిలో మేమంతా ప్రతిరోజు రాత్రి కూడా మామూలుగానే భోజనాలు చేస్తాము. కొంత మంది గురువారాలలో ఫలహారాలు చేస్తారు. నేను గత మూడు వారాలుగా రాత్రి చపాతీలు చేయడం మొదలు పెట్టాను. మొదటి చపాతీ బాబా గారికి నైవేద్యంగా సమర్పించవచ్చని నా ఉద్దేశ్యం. కాని క్రిందటి వారం చపాతీలు చేద్దామని చూస్తే పిండి అయిపోయింది. నేను ముందర గమనించలేదు. అప్పటికే రాత్రి 7 గంటలయింది.
మా అత్తగారు యోగా క్లాసులకి వెళ్ళారు. మా వారు ఇంటికి వచ్చేసరికి ఆలశ్యమవుతుందని ఫోన్ చేశారు. రాత్రి వేళ కావడం వల్ల పాపతో నేను బయటకు వెళ్ళలేక ఆ రోజుకి అన్నం వండేశాను. అపుడే బయట అరటి పండ్లు అమ్మే అతను వచ్చాడు. వెంటనే నేను అరటిపళ్ళు కొని బాబాకి చపాతీ బదులుగా రెండు అరటిపళ్ళను నైవేద్యంగా సమర్పించాను. ఆ రోజు రాత్రి మా మామయ్య గారు, అత్తయ్యగారు 8.30 కల్లా భోజనాలు చేసేశారు. రాత్రి 9-15 కి నేను, మావారు ఇద్దరం భోజనాలు చేస్తున్నాము. ఇంతలో ఒక ముసలాయన ఆకలిగా ఉంది అన్నం పెట్టమని పిలిచారు. అప్పటికే మేమిద్దరం సగం అన్నం తినేశాము. ఆ ముసలాయన ఒక స్టీలు కంచం కూడా తెచ్చుకున్నారు. ఆ సమయానికి మేము అన్నం తినేశాము. ఇంకా కొద్ది అన్నం మిగిలితే పారవేయడం ఎందుకని ఇద్దరం చెరి సగం పెట్టుకున్నాము. ఆ సమయంలోనే ఆ ముసలాయన అన్నం పెట్టమని అడగడం జరిగింది. మా ఇంటి వెనకాలే మా తోడికోడలు కూడా ఉన్నారు. ఆవిడని పిలిచి అడుగుదామనుకుంటే తలుపు వేసి ఉంది. వెంటనె నేను చేయి కడుక్కుని నేను కంచంలో పెట్టుకున్న అన్నాన్ని ఆముసలాయన కంచంలో వేశాను. మావారు కూడా తన కంచంలోని అన్నాన్ని కూడా అతని కంచంలో వేశారు. ఆ ముసలాయన అన్నంలోకి ఏదయినా వేయమని అడిగాడు. అప్పటికే మేము చాలా మట్టుకు భోజనాలు కానిచ్చేయడం వల్ల కేవలం పచ్చడి మాత్రమే మిగిలింది. మేము రాత్రి వేళల్లో మజ్జిగ అన్నం తినము. కూర, పచ్చడితో మాత్రమే తింటాము. పచ్చడి తీసుకుని వచ్చి అతని కంచంలో వడ్డించాను. ఆ ముసలతను గుమ్మం బయటే కూర్చుని అన్నం తిన్నాడు. మా వారు అతనికి త్రాగడానికి మంచి నీరు ఇచ్చారు. అయన అన్నం అంతా తిన్న తరువాత ఆఖరుగా ఒక పెద్ద అన్నం ముద్దను చేతిలోకి తీసుకుని ఇలా అన్నారు “నేను ఆఖరి ముద్దను కాకులకో లేదా పక్షులకో వేస్తాను నేను క్రింద వేసానని బాధపడకండి” అని ఒక విధంగా నవ్వి క్రింద వేశారు. వేసిన తరువాత మళ్ళీ వస్తానని చెప్పి వెళ్ళిపోయారు.
నేను బాబా దగ్గిర పెట్టిన అరటిపండ్లు రెండూ తెచ్చి ఒకటి మావారికి రెండోది నేను తిన్నాను. అపుడు నాకొక ఆలోచన వచ్చింది. ముసలాయన రూపంలో వచ్చి అన్నం పెట్టమని అడిగినది బాబాయేనేమోనని. వెంటనే వెబ్ సైట్ లో బాబా ప్రశ్నలకు జవాబులలో ప్రశ్న తలచుకుని సమాధానం చూశాను. “ప్రతి జీవిలోను నన్నే చూడు” అని సమాధానం వచ్చింది.
ఇక్కడ నేను మీకు మరొక విషయం చెప్పాలి. అతనికి అన్నం సరిపోలేదేమోనని, అరటిపండు ఇస్తే వద్దన్నాడు. కారణం ఆ అరటిపండు అంతకు ముందే బాబావారికి నైవేద్యం రూపంలో చేరింది కనుక. జరిగినదంతా అర్ధం చేసుకునేసరికి నా కళ్ళల్లో నీరు వచ్చింది. దివినుండి భువికి దిగి వచ్చి మా ఎంగిలి మెతుకులు తిన్నారు బాబా అని చాలా బాధ కలిగింది. తరువాత మావారిని అడిగాను ఇతనిని ఇంతకు ముందు ఎప్పుడయినా ఈప్రాంతంలో చూసారా అని. గత 30 సంవత్సరాలుగా నేనితనిని ఇంతవరకు చూడలేదని చెప్పారు. కాని నాకు ఎక్కడో చూసిన విధంగా అనిపించింది. మళ్ళీ వస్తాను అని చెప్పారు కాబట్టి బాబా వారి రాక కోసం ఎదురు చూస్తున్నాను.
ఆరోజు ఉదయం భక్తి టీ.వీ. లో ఉదయం 6.30 నుండి 7 గంటల వరకు ప్రసారమవుతున్న విజయేశ్వరీదేవిగారి ఆధ్యాత్మిక ప్రసంగం, పని చేసుకుంటూనే వింటు ఉన్నాను. ఆ రోజు ఆవిడ చెప్పిన ఉపన్యాసంలోని ఒక కధ కూడా చెపుతాను.
అతనికి నేను మిగిలిన అన్నం పెట్టినపుడు పొద్దున్న విన్న ఈ ప్రసంగం గుర్తుకు వచ్చింది.
(శ్రీమతి కృష్ణవేణి గారు ఈ రోజు ఉదయమ్ ఫోన్ లో ఆవిడ చెప్పిన కధను చెప్పడం జరిగింది. నేను గూగుల్ లో వెతికి ఆ కధను చదివాను. కధ మూడు విధాలుగా ఉన్నా గాని భావమ్ మాత్రం ఒకటే. విజయేశ్వరీ గారు చెప్పిన కధకి, నేను చదివిన ఈ కధకి చాలా మట్టుకు ఒకటే కనుక తేడా లేదు. ఆ కధను కూడా ఇక్కడ ఇస్తున్నాను. చదవండి.)
మహాభాతర యుధ్ధం తరువాత యుధిష్టిరుడు సింహాసనాన్నదిష్టించి లోక కళ్యాణం కోసం యజ్ఞం చేసాడు. ఎంతో ధనం ఖర్చు చేసి వచ్చిన వారందరినీ లేదనకుండా దాన ధర్మాలు, విలువైన కానుకలతో సత్కరించాడు. గొప్ప అన్నదానాలు జరిపించుతున్నాడు. వచ్చిన వారందరూ తృప్తిగా భోజనాలు చేసి రాజును దీవించి వెడుతున్నారు. ఆ సమయంలో అక్కడికి ఒక ముంగిస వచ్చింది. దాని శరీరం ఒకవైపు భాగం బంగారంగా మారి ఉంది. అక్కడ అన్నదానం జరిగిన చోట క్రింద పడ్డ మెతుకులలో పొర్లడం మొదలు పెట్టింది.
దాని శరీరం మరొక వైపు భాగం సహజంగా ఉంది. రాజుతో సహా అక్కడున్నవారందరూ ఆశ్చర్యంతో దానినే గమనించసాగారు. ఆ ముంగిస పొర్లుతూ తన శరీరాన్ని చూసుకోవడం, మళ్ళి మళ్ళి పొర్లడం ఈ విధంగా చేయసాగింది. ఆ ముంగిసకు మాటలాడే శక్తి కూడా ఉంది. ఆ విచిత్రాన్ని గమనించిన యుధిష్టురుడు దాని ప్రవర్తనకి కారణమడిగాడు. అపుడా ముంగిస ఒక కధను ఈ విధంగా చెప్పింది.
“రాజా! ఒక రాజ్యంలో ఒక గ్రామంలో కడు బీదవాడు తన భార్య, కొడుకు కోడలితో నివసిస్తున్నాడు. వారికి పూటగడవని స్థితి. తినడానికే ప్రతిరోజూ కష్టంగా ఉండేది. ఆ కుటుంబంలోనివారంతా ఎంతో భక్తి తత్పరులు. ఒకసారి ఆ రాజ్యంలో కరువు సంభవించింది. ఇక వీరి కుటుంబంలో ప్రతిరోజూ పస్తులుండవలసి వచ్చింది. ఒకరోజు ఆ కుటుంబ పెద్ద బయటకు వెళ్ళి అతి కష్టంమీద కాసిని బియ్యం తెచ్చాడు. భార్య అన్నం వండి నలుగురికి సమాన భాగాలు చేసింది. సరిగా వారు ముద్ద నోటిలో పెట్టుకోబోతుండగా తలుపు తట్టిన శబ్దమయింది. ఇంటి యజమాని తలుపు తీసి చూశాడు. బయట ఒక బాటసారి నిలబడి ఉన్నాడు. బాగా నీరసంతో ఆకలికి తాళలేక శోషవచ్చి పడిపోయేలా ఉన్నాడు. అపుడా యజమాని “అయ్యా! మీరు చాలా ఆకలితో ఉన్నట్లు కనబడుతున్నారు. లోపలికి రండని” ఆహ్వానించాడు. అపుడా బాటసారి తల ఊపి “అవును చాలా రోజులుగా నాకు తిండి దొరకలేదు. చాలా ఆకలితో ఉన్నాను” అన్నాడు. అపుడా యజమాని “అయ్యా! మీరు సరైన సమయానికి వచ్చారు. ఇపుడే మేము భోజనానికి కూర్చోబోతున్నాము” అని అతనిని భోజనానికి ఆహ్వానించి, తన భాగం అతనికి వడ్డించాడు. మిగిలినవారు ఇంకా అన్నం ముట్టకుండా ఆ అతిధినే చూస్తూ ఉన్నారు. ఆ బాటసారికి ఆకలి తీరకపోవడంతో మిగిలిన వారు కూడా ఒక్కొక్కరుగా తమ భాగాన్ని కూడా ఆయనకు వడ్డించి ఆయన ఆకలిని తీర్చారు. తృప్తి చెందిన ఆ బాటసారి లేచి బయటకు రాబోతుండగా ఇల్లంతా చాలా ప్రకాశవంతమయిన వెలుగుతో నిండిపోయింది. ఆ బాటసారి రూపంలో వచ్చిన భగవంతుడు వారితో “ మీరు ఈరోజు లోకంలో అన్నిటికన్నాఉత్తమమైన యజ్ఞం చేశారు. మీకు మోక్షాన్ని ప్రసాదిస్తున్నాను” అన్నాడు.
ఆ సమయంలో నేను ఆవైపు వెళ్ళడం, వారందరికీ మోక్షం కలగడం చూశాను. అక్కడ ఆ బాటసారి భుజించగా నేల మీద పడ్డ మెతుకులలో నేను పడటం జరిగింది. వాటిమీద పడ్డ నా శరీరం బంగారంగా మారిపోయింది. పడని భాగం సహజంగానే ఉంది. అప్పటినుండి మిగిలిన శరీరభాగం కూడా బంగారంగా మారుతుందనే ఆశతో ఎక్కడ యజ్ఞాలు జరిగినా అక్కడికి వెడుతూనే ఉన్నాను. కాని ఇంతవరకు ఫలితం కనపడలేదు. ప్రజలంతా నువ్వు ఎంతో గొప్ప యజ్ఞం చేస్తున్నావని పొగుడుతూ ఉంటే ఇక్కడకు వచ్చి, అన్నదానం జరిగిన చోట పడిన మెతుకులలో పొర్లుతూ ఉన్నాను. అయినా నా మిగిలిన శరీరభాగం బంగారంగా మారలేదు. ఆ బీదవాడు చేసిన యజ్ణం కంటే నీ యజ్ఞం గొప్పది కాదు” అని ముగించింది. యుధిష్టురుడు మాట్లాడే లోపే ఆ ముంగిస అక్కడినుండి అదృశ్యమయింది.
యుధిష్టురునికి జ్ణానోదయమయింది. యజ్ఞం చేయడానికి కావలసినది ధన కనక వస్తు వాహనాలు కాదు. ముఖ్యంగా కావలసినది స్వచ్చమయిన మనస్సు. మంచి దయార్ద్ర హృదయం. అంతే గాని విధి విధానాల ప్రకారం చేసిన యజ్ణ యాగాదులు కాదు. కీర్తి కోసం, యశస్సు కోసం చేసిన యజ్ణ యాగాదులు సత్ఫలితాలనివ్వవనీ, అన్ని దానాలకన్నా అన్నదానం మహత్తరమయినదని గ్రహించుకొన్నాడు.
ఆమె అనుభవాన్ని చదివిన తరువాత నాకు భక్త శబరి కధ గుర్తుకు వచ్చింది. భక్తురాలయిన శబరి విషయంలో శ్రీరామ చంద్రమూర్తి వారు మనకి ఏమని బోధించారో చూడండి.
“ముఖ్యంగా కావలసినది భక్తి. అంతేగాని కులం, మతం కాదు. మనం ఏమి సమర్పిస్తున్నాము అన్నది కూడా కాదు. శబరి రాములవారికి పండ్లను సమర్పించింది. పండ్లు పుల్లగా ఉన్నవేమోనని కాస్త కొరికి రుచి చూసి తియ్యటి పండ్లను ఆయనకు సమర్పించింది. శ్రీరామ చంద్రులవారు ఆమె ఎంగిలి చేసిన పండ్లను ప్రీతితో ఆరగించారు. ఆయన ఆమెలోని భక్తిని మాత్రమే చూశారు గాని, ఎంగిలి పండ్లను సమర్పించిందనే విషయాన్ని ఏమాత్రం పట్టించుకోలేదు. భక్తుడు భక్తితో సమర్పించినది ఏదయినా భగవంతుడు ప్రీతితో స్వీకరిస్తాడు.”
అనుకోని అతిధిగా వచ్చి అన్నం పెట్టమని అడిగినవానికి ఎంగిలి మెతుకులు పెట్టామే అని బాధ పడినా, 38 వ.అధ్యాయంలో బాబా వారు చెప్పినట్లుగా సమయా సమయాలు చూడకుండా అతిధిని ఆదరించడం గృహస్థ ధర్మం. ఆ ధర్మాన్ని ఆవిడ పాటించారు. ఎంగిలి పెట్టకూడదనే విషయాన్ని పక్కన పెట్టి ఆయన ఆకలిని తీర్చారు.
బాబాయే ఆ రూపంలో వచ్చారని భావిస్తే ఆయన ఆమెలోని భక్తిని పరీక్షించారని నాకనిపించింది. ఆయన పెట్టిన పరీక్షలో ఆమె నెగ్గిందని నేను భావించాను.
శ్రీ సాయి సత్ చరిత్ర 9వ.అధ్యాయం కూడా గమనించండి. బాలారాం కొడుకు గోవింద్ తన తండ్రికి క్రియా కర్మ చేయటానికి వెడుతున్నానని, తరువాత షిరిడీకి వెడతానని తర్కడ్ వద్దకు వచ్చి చెప్పాడు. అతనితో బాబాకు ఏదైనా పంపాలని తర్కడ్ భార్యకు తోచింది. కాని ఇది వరకే బాబాకు నైవేద్యంగా అర్పించిన పేడా తప్ప ఇంట్లో వేరే ఏదీ లేదు. ప్రేమతో పెట్టితే ఏదైనా సాయి సంతోషంగా తిటారని ఆమె ఆ పేడాను ఆ అబ్బాయి సూతకంలో ఉన్నా అతని చేతికిచ్చి పంపింది. కాని గోవిందు షిరిడీలో బాబా దర్శనానికి వెళ్ళినప్పుడు పేడా గదిలోనే మర్చిపోయాడు. కాని బాబా అతనికి తర్ఖడ్ భార్య ఇచ్చిన పేడాను గుర్తు చేసి, అతని చేత తెప్పించుకుని ప్రీతితో ఆరగించారు.
***సాయి బంధువులయిన పాఠకులందరికి ఇక్కడ మరొక విచిత్రం చెప్పాలి. ఈ లీలకు మరికొంత సమాచారం ఇమ్మని బాబా వారు సూచించారు.
నేను ప్రతిరోజు మణెమ్మగారు వ్రాసిన శ్రీసాయి సత్ చరిత్రను ఒక అధ్యాయం పారాయణ చేస్తూ ఉంటాను. చదివిన తరువాత ఆ గ్రంధాన్ని ఒకసారి ముద్దు పెట్టుకుని, ఈ రోజు మీరిచ్చే సందేశం ఏమిటి అని అడిగి కళ్ళు మూసుకుని ఏదో ఒక పేజీ తీసి ఒక చోట వేలు పెట్టి చూస్తాను. అక్కడ ఏమి ఉందో చూసి చదువుతాను. ఈ రోజు కూడా అదే విధంగా చూశాను. ఈ రోజు చదివిన అధ్యాయం 38. ఈ అధ్యాయం నిన్న కొంత చదివి ఈ రోజు పూర్తి చేశాను. ప్రతి రోజు లాగే ఈ రోజు కూడా ఎప్పటిలాగే పుస్తకం మూసేసి కళ్ళు మూసుకుని బాబా ఈ రోజు మీరిచ్చే సందేశం ఏమిటి అని ఒక పేజీ తెరచి వేలు పెట్టిన చోట కళ్ళు తెరచి ఏమి వచ్చిందో చూశాను. ఆశ్చర్యం -- బాబాగారు ఇచ్చిన సందేశం ఇక్కడ ఇస్తున్నాను. చదవండి.
కళ్ళుమూసుకుని పుస్తకం తెరిచన తరువాత 38 వ.అధ్యాయంలోని పేజీలో వచ్చిన సందేశం .. “సమయా సమయాలలో అతిధులు వచ్చినపుడు వారిని అన్నదానంతో సుఖ పెట్టడం గృహస్థుల ధర్మం. అన్నం పెట్టకుండా వారిని పంపి వేయడం అధోగతిని ఆహ్వానించుకున్నట్లే. వస్త్ర పాత్రాది దానంలో పాత్రతను చూచి ఆలోచించి ఇవ్వాలి. కాని అన్నదానంలో ఆ ఆలోచన అవసరం లేదు. ఇంటి ముందు ఎవరు ఎప్పుడు వచ్చినా అన్నం పెట్టకుండా వారి ననాదరం చేయటం ధర్మం కాదు.”
దీనిని బట్టి మన గ్రహించవలసిన విషయం ఆవిడ చేసిన అన్నదానానికి బాబావారు సరియైన అర్ధాన్ని తెలియ చేసి మనకందరికీ హితబోధ చేశారు.
ముందు రోజు కొంత వరకు తయారు చేశాను. బాబావారు ఈ సందేశాన్ని ఈ రోజే ఇవ్వడం చేత, ఈ అనుభవాన్ని ఈ రోజే పూర్తి చేసి ఈ రోజే ప్రచురిస్తున్నాను.
ఓమ్ సాయిరామ్
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
1 comments:
������chala adbhutamaina leela
Post a Comment