Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Monday, July 20, 2020

నల్ల కుక్కకు పెరుగన్నమ్

Posted by tyagaraju on 8:42 AM

    Shri Shirdi Sai Baba Temple, West Mambalam - Temples in Chennai ...
              Pink Rose - Pink Love - Pink - Roses | Flower Muse | Pink rose ...

20.07.2020  సోమవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయిబంధువులకు బాబా వారి శుభాశీస్సులు
ఈరోజు మరొక అధ్భుతమయిన సాయిలీలను ప్రచురిస్తున్నాను. మనకు బాబామీద ఎంత నమ్మకం ఉంటుందో అంతగా ఆయన అనుగ్రహం      మనమీద ఉంటుంది.  శ్రీమతి వందనా కామత్ గారి ఈ లీల సాయిలీల ద్వైమాసపత్రిక సెప్టెంబర్ – అక్టోబర్, 2009 వ.సంవత్సరంలో ప్రచురించినదానికి తెలుగు అనువాదమ్.
తెలుగు అనువాదమ్ : ఆత్రేయపురపు త్యాగరాజు
నిజాంపేట, హైదరాబాద్
ఫోన్  : 9440375411 & 8143626744
(ఈరోజు 20.07.2020 నాడు బాబా ఇచ్చిన సందేశం – నిరుద్యోగి అయిన కుమారునికి తను పనిచేస్తున్న కార్యాలయంలో ఉద్యోగం  వేయించడం కోసం స్వఛ్చంద పదవీ విరమణ చేయవద్దన్నారు.)

నల్ల కుక్కకు పెరుగన్నమ్

శ్రీమతి వందనా కామత్ గారు బెంగళురులో ఒక అద్దె ఇంటిలో తన కుటుంబంతో నివసిస్తున్నారు.  వారికి ఎన్నో ఆర్ధికపరమయిన ఇబ్బందులు ఉన్నాయి.

వారికి బాబా గురించి అసలు తెలియదు.  కాని బాబా అనుగ్రహం వారియందు ఉండటంవల్ల, వారు అద్దెకు ఉంటున్న ఇంటి యజమాని కోడలు వారికి శ్రీసాయి సత్ చరిత్ర ఇచ్చి అంతా బాబాయే చూసుకుంటారని చెప్పింది.

ఒకరోజు ఇంటి యజమాని వచ్చి వారిని ఇళ్ళు ఖాళీ చేయమని చెప్పాడు.  ఆమాటలు వినగానే వారంతా చాలా సంకటంలో పడ్డారు.  తాము ఉంటున్న అద్దె ఇంటిని ఖాళీ చేసి వెంటనే మరొక క్రొత్త ఇంటికి మారాలంటే డబ్బు సమస్య.  ఏమిచేయాలో పాలుపోని స్థితిలో పడ్డారు.  అటువంటి పరిస్థితులలో వారికి షిరిడీ వెళ్ళే అవకాశం లభించింది.  షిరిడీనించి తిరిగి రాగానే శ్రీమతి వందన తన కుటుంబానికి పరిచయం  ఉన్న తన స్నేహితురాలిని కలుసుకొని పరిస్థితినంతా వివరించింది.

ఆమె ఒక క్రొత్త ఇంటిని కొనుగోలు చేయమని సలహా ఇచ్చింది.  శ్రీమతి వందనకి తన ఆర్ధికపరిస్థితిని తలచుకుంటే క్రొత్త ఇంటిని కొనడం అసాధ్యమయిన పని.  ఇపుడు ఉంటున్న ఇంటికే అద్దె కట్టలేని స్థితిలో ఉంటే ఇక క్రొత్త ఇల్లు కొనడమనే ప్రసక్తే కనిపించడంలేదు.  కాని, ఆమె స్నేహితురాలు ఆమెకు రూ.75,000/- ఇచ్చి బాబామందిరం ప్రక్కనే ఉన్న ఒక ఖాళీ స్థలాన్ని కొనుక్కోమని చెప్పింది.  వందన కుటుంబం ఆమె చేసిన సహాయానికి ఎంతో సంతోషించారు.  కాని వచ్చిన చిక్కు ఆ స్థలం ధర లక్షల్లో ఉంది.  స్థలం కొనడానికి తగిన ధనం కూడా లేదు.

ఇలా ఉండగా వందన మామగారు మరణించారు.  ఆయన రాసిన విల్లుప్రకారం వారికి లక్షరూపాయలు వచ్చాయి.  వెంటనే కొన్ని ఏర్పాట్లు చేసుకుని ఆ స్థలం కొన్నారు.

అప్పటినుండి కుటుంబమంతా బాబాని పూజించడం ప్రారంభించారు.  స్థలంకొని శంకుస్థాపన చేసారు.  ఆర్ధిక ఇబ్బందుల వల్ల సంవత్సరం దాటినా ఇల్లు కట్టడం ప్రారంభం కాలేదు.  ఇదే సమయంలో శ్రీమతి వందనకి శ్రీ సాయి సత్ చరిత్రలోని ఒక అధ్యాయంలోని విషయం గుర్తుకు వచ్చింది.  అందులో ఒక భక్తుడు తన కోరిక తీరడానికి నల్లకుక్కకు పెరుగన్నం పెట్టడమ్ అతని కోరిక తీరడం గురించిన ప్రస్తావన ఉంది.
       Sai Is Helping Hand In Our Times Of Need ~ Mahaparayan Experiences
(Why did Baba give me this chapter of Sai Satcharitra?
 I could find a right solution at last)
అపుడామె  ఏడు గురువారాలపాటు నల్లకుక్కకు పెరుగన్నం పెడతానని, తనకు ఇల్లు కట్టుకునే భాగ్యాన్ని కలిగించమని బాబాని ప్రార్ధించుకుంది.

మొట్టమొదటి గురువారమునాడు ఆమె పెరుగన్నం కలిపి ఒక ప్లేటులో ఇంటి బయట పెట్టి నల్లకుక్క కోసం ఎదురు చూడసాగింది.  కొంతసేపటి తరవాత ఒకనల్ల కుక్క వచ్చింది.  కాని దాని శరీరం మీద అక్కడక్కడ తెల్లటి మచ్చలు ఉన్నాయి.  వచ్చిన కుక్క పూర్తిగా నలుపురంగులో లేకపోవడం వల్ల దానికి ఆపెరుగన్నం పెట్టవచ్చా లేదా అనే సందేహంలో పడింది.  ఆశ్చర్యకరంగా ఆకుక్క అన్నంప్లేటు వద్దకు రావడం, వాసన చూసి వెనకకు వెళ్ళడం ఇలా 10 -15 నిమిషాలపాటు చేసి ఆఖరికి అన్నం తినకుండానే వెళ్ళిపోయింది.  శ్రీమతి వందన చాలా సేపు ఎదురు చూసింది.  నల్లకుక్క ఏదీ రాకపోవడంతో చాలా నిరాశకు గురయ్యింది.

కొంతసేపటి తరువాత అదేకుక్క మరొక కుక్కను వెంటబెట్టుకుని వచ్చింది.  ఆకుక్క పూర్తిగా నల్లటి రంగులో ఉంది.  ఆనల్ల  కుక్క ఎంతో ఆత్రంగా పెరుగన్నాన్ని తిని కాస్త అన్నం తెల్లమచ్చలు ఉన్న కుక్కకి వదిలి పెట్టింది.  ఆ కుక్క మిగిలిన అన్నాన్ని తిన్న తరువాత రెండు కుక్కలు సంతోషంగా తోకాడించుకుంటూ వెళ్ళిపోయాయి.  ఈ దృశ్యం చూసిన తరువాత ఇల్లు కట్టుకోవడానికి బాబా తనకు సహాయం చేస్తారన్న పూర్తి నమ్మకం కలిగింది.  నిజానికి వారికెంత ఆర్ధిక ఇబ్బందులున్నా ఈ సంఘటన జరిగిన అయిదు నెలలలోనే  బాబా ఆశీర్వాద బలంతో వారు ఇల్లు కట్టుకోగలిగారు.

అప్పటినుండి శ్రీమతి వందనకి ఆమె కుటుంబానికి సాయియందు ప్రగాఢమయిన భక్తివిశ్వాసాలు ఏర్పడి తమ జీవితాలని బాబాకి అంకితం చేసారు. ‘సాయిస్మరణ్’ పేరుతో ఒక బృందంగా ఏర్పడి గత పదకొండు సంవత్సరాలనుండి బెంగళురులోని ప్రతి సాయిభక్తుని ఇంటిలో సాయిభజనలు చేయసాగారు.  అంతే కాకుండా ప్రతిసంవత్సరం సభ్యులందరూ కలిసి (150 నుండి 300 మంది వరకు) షిరిడీ వెళ్ళి అక్కడ భజనలు పల్లకీ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.

ఈరోజున వారు మరొక మూడు అంతస్థులు వేసి ఒక అంతస్థుని పూర్తిగా బాబాకోసమే కేటాయించారు.  అందులో బాబా విగ్రహాన్ని, బాబా ఫోటొలను పెట్టి ప్రతిరోజు పూజలు నిర్వహిస్తున్నారు.  ప్రతి గురువారం భజనలు, రామనవమి, గురుపూర్ణిమ, విజయదశమి రోజులలో వందలాది మంది భక్తులు అక్కడికి వచ్చి ఆధ్యాత్మిక సాగరంలో మునిగి తేలుతూ ఉంటారు.

(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)


Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List