Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Saturday, May 14, 2011

కమలము - ప్రత్యేకత

Posted by tyagaraju on 3:21 AM





14.05.2011 శనివారము

ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంథువులకు బాబా వారి శుభాశీశ్శులు


కమలము - ప్రత్యేకత

మనం కమలాన్ని ప్రత్యేకంగా యెందుకు గుర్తిస్తాము. ::

సత్యానికి ప్రతీక కమలం. అందానికి పవిత్రతకి చిహ్నం. (సత్యం, శివం, సుందరం) మనము కూడా భగవంతుడిని కమలంతో పోలుస్తాము. పద్మదళాయతాక్షుడు, చరణ కమలాలు, పద్మములవంటి చేతులు, హృదయ కమలం.

కమలం సూర్యోదయంతో విచ్చుకుని రాత్రి అయేటప్పటికి వాడి పోతుంది.

మన బుథ్థి, మనస్సు, అంతహ్ కరణం జ్ణానమనే వెలుగుతో వికసించాలి. యిక వాడిపోకూడదు. కమలం బురదలోనుంచైనా పెరుగుతుంది. తన చుట్టూ యెటువంటి పరిసరాలు ఉన్నా గాని అది తన అందాన్ని అందరికీ కనువిందు చేస్తూ ఉంటుంది. దాని అందం చెక్కు చెదరదు. యిది మనకి యేమని తెలియ చేసుందంటే, మనం కూడా ఆ కమలంలాగే స్వచ్చంగా, నిర్మలంగా, సౌందర్యంగా, యెటువంటి పరిస్థితులలోనయినా కూడా ఉండాలని చెబుతుంది. అంటే పైకి అందంగా ఫేస్ పౌడర్ దట్టించి మేకప్పు చేసుకుని కాదు.
హృదయ సౌందర్యం ఉంటే మన వదనం కూడా ప్రసన్నంగా ఉండి అందంగా కనపడుతుంది.

అందుచేత కమలం చుట్టూ యెంత బురద ఉన్నా చూసేవారి చూపులు కమలం యొక్క అందాన్ని వీక్షిస్తాయే గాని, బురదవైపు దృష్టి పడదు. అలా మన శరీరాకృతి కాదు, యెదటివారు చూసేది, మన మంచితనం, మాట తీరు, వినయం. ఇవన్ని ఉన్న మానవుడు అందంగా లేకపోయినా యెవరూ పట్టించుకోరు. మనసులోని మంచితనాన్ని మాత్రమే చూస్తారు. మనిషి అందంగా ఉండవచ్చు. మనసు మంచిది కాకపోతే యెంత అందంగా ఉంటే యేమి లాభం.

తామరాకు యెల్లప్పుడు నీటిలో ఉన్నాగాని దానికి నీరు అంటదు. అలాగే జ్ణానం ఉన్న మానవుడు కూడా అలాగే వాంఛలు యేమీ అంటించుకోకుండా ఉంటాడు. యెల్లప్పుడూ సంతోషంగా ఉంటాడు.

యిదే విషయం భగవద్గీతలో :

బ్రహ్మాన్యాథ్యాయ కర్మాణి
సంగం త్యాక్తవ కరోతియాహ
లిప్యతే నాసా పాపేన
పద్మపత్రం యివం భాసా

యెవడయితే కర్మలు చేసి వాటిని భగవంతునికి సమర్పిస్తాడో వానికి యెటువంటి పాపములు అంటవు. భవబంథాలనుండి విముక్తి లభిస్తుంది. అనగా నీటిలో ఉన్న తామరాకుకు నీరు యెలా అంటదో మానవుడికి కూడా యివి అంటవు.

దీనిని బట్టి మనం తెలుసుకోవలసినది యేమిటంటే ఆథ్యాత్మిక జీవనం కోరుకునే భక్తులు గాని, సాథకులు గాని జ్ణాన మార్గంలో పయనించాలి. మన శరంలో కూడా కొన్ని శక్తి కేంద్రాలు ఉంటాయి. అవే షట్ చక్రాలు. ప్రతీ చక్రం కూడా కమలంతో పోల్చబడి ఉన్నాయి. ఒక్కో చక్రానికి కొన్ని రేకలు ఉన్నాయి. ఉదా: షస్రార చక్రానికి వెయ్యి కమల రేకులు ఉన్నాయి. అత్యున్నతమైన జ్ణాన సిథ్థి పొందిన వానికి ఈ సహస్రారం తెరుచుకుంటుంది.

థ్యానం చేసేవారికి మూడవ కన్ను కూడా తెరుచుకుంటుంది.
మూడవకన్నును ప్రత్యక్షంగా కనులు మూసుకున్నప్పుడు కనపడుతుంది.

మనం థ్యానం పద్మాసనంలొ కూర్చుని చేస్తాము.

విష్ణువు యొక్క నాభినుంచి కమలం పుట్టింది. ఆ కమలమునుంచి బ్రహ్మ, ఈ ప్రపంచాన్ని సృష్టించడానికి ఉద్భవించాడు.

ఈ కమలానికి సృష్టికర్తకి లింకు. బ్రహ్మలోకానికి కూడా ఈ కమలం ప్రతీక. స్వస్తిక్ గుర్తు కూడా ఈ కమలం నుండే వచ్చింది.

అందుచేత, మన సాయి మన హృదయకమలంలో స్థిరంగా ఉండాలంటే, మనము ఉంచుకోవాలంటే యేమి చేయాలి.
సాయి బోథనలు ప్రతీసారి నెమరు వేసుకుంటూఉండాలి. యెప్పుడు సాయినామ స్మరణ మన నోటిలో నిరంతరం కదలాడుతూనే ఉండాలి.

బాగా భక్తి భావం ఉన్నవాళ్ళు ప్రతిమాట ముందు సాయి అనే పదం చేర్చి మాట్లాడతారు. ఆఖరికి మనము తినే పదార్థాలు గాని కూరగాయలు గాని వాటి ముందు భగవంతుని నామాన్ని చేర్చి పలుకుతారు. ఒకాయన రామ భక్తుడట.
రామ ములక్కాయ, రామ వంకాయ, రామ సాంబారు ఇలా పలుకుతాడట.

ఒకసారి నేను రైలులో వస్తున్నాను. యిద్దరు నా కంపార్ట్ మెంట్లో ఉన్నారు. అందులో ఒకతను సాయి భక్తుడు గావును. మరి యే సాయి భక్తుడో తెలియదు. యేది యేమైనప్పటికి , అతను తన తోటివానిని పెరుముందర సాయి అని , మిగతావారిని కూడా సాయి అని సంబోథించాడు. యింతలో టీ అమ్మే కుర్రవాడు వచ్చాడు యితను ఆ టీ అబ్బాయిని "యే సాయిరాం టీ " అని పిలిచాడు. అందుచేత యేదైనా మనం అలవాటు చేసుకుంటే చాలు. యిక ప్రతీక్షణం సాయి నామం మననోటిలో కదలాడుతూ ఉంటుంది.

కొంతమంది స్త్రీలను చూడండి. చక్కగా మడిబట్ట కట్టుకుని వంట చేసుకునేటప్పుడు కూడా, లక్ష్మీ సహస్రం గాని, విష్ను సహస్రం గాని చదువుకుంటూ వంట చేస్తారు. ఆ వంట పవత్రమౌతుంది.

యిప్పుడు మడి కట్టుకుని వంట చేసేటంతటి తీరికెక్కడ ఉంది. అంతా స్పీడు యుగం. ఎల్.కే.జీ. పిల్లవాడి నించి కూడా స్కూలుకి పంపాలంటే ఉరుకులు పరుగులు, స్నానం చేయడానికి కుడా సమయం లేకుండా వంట పనులు.

మీకు నవ్వు రావచ్చు. చెప్పేది వెర్రితనం కావచ్చు. ఒకచోట చదివాను. వంట చేసేటప్పుడు పులుసు గాని కూర గాని కలియపెట్టేటప్పుడు గరిటతో "ఓం" అని రాస్తే చక్కగా ఉంటుంది అని. మీకు తెలుసో తెలియదో గ్లాసులో ఉన్న మంచినీటిని మంత్రిస్తే అది పవిత్రమవుతుంది.

మనకు అద్భుతమైన సాయి మంత్రం ఉంది కదా. మనం వంట చేసేటప్పుడు, భోజనం చేసేటప్పుడు సాయి నామ స్మరణతోనే చేయండి. మనం యెలాగూ సాయికి సమర్పించే , భోజనం మొదలు పెడతాము. తినేముందు కొంచం అన్నం తీసి బయట గోడ మీద యేదైనా పక్షుల కోసం ఆహారంగా పెట్టండి. వాటిని ప్రత్యేకంగా పిలవనక్కరలేదు. ఆహారాన్ని వెదుకుతూ అవే వస్తాయి.

నాకు యెన్నొ సంవత్సరాలనించి అలవాటు. తినే ముందు కొంచం అన్నం ముద్ద చేసి గోడమీద పెడతాను. అక్కడ ఆసమయానికి కాలులు సిథ్థంగా ఉండి వెంటనె తినడానికి వస్తాయి. అఖరికి బయటినించి టిఫిన్ తెచ్చుకున్నా కొంచం అందులోనించి తీసి బయట కాకుల కోసం పెడుతూ ఉంటాను.
అవి తింటుంటే అదొక తృప్తి. రైలులో ప్రయాణం చేసేటప్పుడు కూడా, బిస్కట్టు తిన్నా అందులో కొంత బయటకు విసురుతాను. పిచుకలు గాని, కాకులు గాని ఆహారంగా తీసుకుంటాయని.

ఇప్పుడు నేను చెప్పినదంతా యేదో సోది అనుకోకండి. భగవంతుడికిష్టమైన పనులు. కాదంటారా?

భగవ్ద్భక్తిలో ఉన్నవాడు భగవంతునికిష్టమైనవన్నీ చేస్తాడు. అది యితరులకి పిచ్చితనంగా కనిపించినా పట్టించుకోడు.

బాబాయే చెప్పారు ఆకలిగొన్నవారికి కాస్త అన్నం పెట్టు అని. తనని అన్ని ప్రాణులలోనూ చూడమన్నారు.

అప్పుడే మనసాయి మన హృదయంలో స్థిరంగా ఉంటాడు. బాబాయే మన మనసులో ఉన్నప్పుడు మనకి నిశ్చింత


****************



ఆథ్యాత్మికతను పెంచుకునే మార్గాలు::

నిరాశా, నిస్పృహలతో బాథపడుతూ ఉన్నప్పుడు ఉన్నతమైన గ్రంథాలను పఠించాలి, లేద మహనీయులు, మహాత్ములు రాసిన ఆథ్యాత్మిక గ్రంథాలు చదవాలి. ఒక నెలకాలం కేటాయించి తీర్థయాత్రలు చేయాలి లేదా ఒక పవిత్ర స్థలంలో ఉంటూ నెలరోజులుగాని, ఒక పక్షం రోజులుగాని గడపాలి. అక్కడ సమయాన్ని జపము, భజన, థ్యానంతో గడపాలి. కొంత దూరం నడవాలి. యివి అలజడితో నిండిన మనస్సుకు, అలసిపోయన నీకూ ప్రశాంతతనిస్తాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. నమ్మకాన్ని, ఆత్య్మ విశ్వాసాన్ని పెంపొందిస్తాయి.

మనశ్శాంతిని పరిరక్షించుకోవాలంటే ఆథ్యాత్మిక చింతనలను పెంపొందించుకోవాలి. అది మన జీవితాన్ని ఒక క్రమమైన పథ్థతిలో నడవటానికి దోహదం చేస్తుంది.




ఈ రోజు బాబా లీల కాకుండా కొన్ని ఆథ్యాత్మిక విషయాలు రాయడం జరిగింది. ఒకవేళ మీకు నచ్చకపోతే నాకు మైల్ చేయండి. తరువాతనించి బాబా లీలలనే ప్రచురిస్తాను. యెందుకంటే మథ్య మథ్యలో బాబా తత్వం గురించి, కొన్ని ఆథ్యాత్మిక విషయాల గురించి నాకు తోచినంతలో వివరణ ఇద్దామనె ఉద్దేశ్యం. నా మైల్ tyagaraju.a@gmail.com )


సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు

Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List