

02.08.2011 మంగళవారము
ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ రోజు జ్యోతీంద్ర గారి మరొక అనుభవాన్ని తెలుసుకుందాము.
మాయి ఆయి దేవత భయంకర దృశ్యం
ప్రియ సాయి భక్త పాఠకులారా ! మనం 21 వ శతాబ్దంలో పయనిస్తున్నాము. నేను కొద్ది సేపటిలో మీకు వివరించబోయే జ్యోతీంద్ర గారి అనుభవంలో నమ్మకముంచమని మిమ్మలిని సవినయంగా కోరుతున్నాను. ఒకసారి షిరిడీలో కలరా వ్యాపించిందని సాయి సచ్చరిత్ర చదివినవారికందరకూ తెలుసు. అటువంటి అంటువ్యాథి ప్రబలినపుడు, మరణాలని అదుపులో వుంచాలంటే మారి ఆయి (అమ్మవారిని) ప్రార్థించాలని గ్రామస్థులు నమ్మేవారు. ఆ రోజుల్లో వైద్య సదుపాయాలు అప్పటికింకా రాలేదు, యిప్పటిలాగా అభివృథ్తి చెందలేదు. అందుచేత గ్రామాల్లో అంటువ్యాథులనేవి సాథారణ విషయం. ప్రచార సాథనాలు కూడా అభివృథ్థి చెందలేదు. ఆ కారణం చేత మా నాన్నగారు షిరిడీ చేరుకునేటప్పటికి షిరిడిలో కలరా అంటువ్యాథి ఉందని తెలీలేదు. అప్పటికీ ఆయనకు బాబా మీద నమ్మకం యేర్పడినందు వల్ల, షిరిడీలో వుండటం చాలా ప్రమాదకరమయితే బాబాగారే వెంటనే బొంబాయికి వెళ్ళమని చెప్పి తన గురించి జాగ్రత్తలు తీసుకుంటారని తెలుసు. అందుచేత ఆయన భయం లేకుండా మామూలుగానే పూజాదికాలు నిర్వర్తించారు. తరువాత రెండు, మూదు రోజులలో మరణాల రేటు పెరిగిపోవడం, షిరిడీ చుట్టుప్రక్కల గ్రామలలో కలరా భయంకరంగా విజృంభించడం ఆయనకు అనుభవమయింది. ఆయన మనస్సులో బాగా భయపడిపోయారు. ఒక సాయంత్రం తన విథి నిర్వహణ ప్రకారం పెట్రోమాక్స్ లైట్లు వెలిగించి ద్వారకామాయిలో పెడుతున్నారు.

యెప్పుడయితే ఆయన, బాబా గారు సాథారణంగా థుని ముందు కూర్చునే ప్రదేశంలోని మెట్లు యెక్కారో అప్పుడు ఆయన మీద బాబా గారు బాగా ఉగ్రుడయ్యారు. ఆయన బాగా తిట్టడం మొదలుపెట్టారు. జ్యోతీంద్రగారి కది కొత్త అనుభవం. బాబా గారి కోపం తారాస్థాయికి చేరుకుంటోంది. విపరీతమయిన కోపంతో ఆయన మానాన్నగారిని ఏడు ముక్కలుగా నరికి మసీదులో పాతిపెట్టేస్తానని అన్నారు. జ్యోతీంద్ర బాగా భయపడిపోయారు. ఆయన బాబా కాళ్ళమీద పడి, తాను ఏదో తెలియక తప్పు చేసి ఉండవచ్చని అదే బాబా కోపానికి కారణమయి ఉంటుందని తలచి, క్షమించమని అర్థించడం మొదలుపెట్టారు. బాబా గారు అదే స్థితిలో ఉండి ఆయనని అక్కడే కూర్చుని తన కాళ్ళు నొక్కమని ఆదేశించారు. మా నాన్నగారు వెంటనే ఆయన ఆజ్ఞను శిరసా వహించి ఆయన పాదాల వద్ద కూర్చుని కాళ్ళు నొక్కసాగారు. బాబా యింకా ఏదో గొణుగుతూ ఉండటం, యింకా అదే కోప స్వ్వభావంలో ఉండటం గమనించారు. కొంతసేపటి తరువాత జ్యోతీద్రగారికి చెమటలు పట్టడం మొదలైంది. కారణం తనముందు భయంకరమైన రూపంతో కాళికాదేవిని చూశారు. ఆమె రూపం నాలికంతా రక్తంతో తడిసి భయంకరంగా ఉంది.

ఈ దృశ్యం చూసేటప్పటికి మా నాన్నగారికి పూర్తిగా స్ప్రుహ పోయింది. యాంత్రికంగా ఆయన తన శరీరంలో ఉన్న శక్తినంతా కూడదీసుకుని బాబా కాళ్ళు గట్టిగా పట్టుకున్నారు. ఆయన తనను రక్షించమని బాబాకి చెబుదామని ప్రయత్నిస్తున్నారు కాని, నోటంబట మాట రాకుండా వుండేటంతగా విపరీతమయిన భయంతో మాటలురానివాడిగా అయిపోయారు. ఆయన మొహం రెండు వైపుల మాత్రమే తిరుగుతోంది, బాబా మీంచి కాళీ మీదకి, కాళీమీదనించి బాబా మీదకి. ఏదో గొణుగుతున్న బాబాని చూస్తున్నారు. వినపడకుండా అర్థం కానట్లుగా ఉంది. వెంటనే అచేతనంగా అయిపోయారు. మెలకువ వచ్చేటప్పటికి బాబా తనని కుదుపుతూ లేపి అడుగుతున్నారని తెలిసింది.

తిరిగి తెలివి తెచ్చుకుని పూర్తిగా చెమటతో తడిసిపోయారు. బాబా ఆయనతో "ఏయ్ భావూ ! నేను నీకు నా కాళ్ళు నొక్కమని చెప్పాను. నువ్వు వాటిని యెంత గట్టిగా పట్తుకున్నావంటే నీ గోళ్ళు నన్ను బాథిస్తున్నాయి" అన్నారు. మా నాన్నాగారికి బాగా దాహంగా ఉండి మంచినీళ్ళు అడిగారు. బాబా , ద్వారకామాయిలో యెప్పుడూ ఉంచబడే కుండ (కొళంబే) లోని నీరు కొంచెం ఇచ్చారు. మా నాన్నగారు మంచినీళ్ళు తాగి యథాస్థితికి వచ్చారు. ఆయన వెంటనే తనకు అటువంటి భయానక దృశ్యాలను చూపవద్దని, చూసి తట్టుకునే ఢైర్యం తనకు లేదని బాబాతో చెప్పారు. తరువాత నాలుగు రోజులు తను తిండి కూడా తినలేనని షిరిడీ రావాలా వద్దా అని కూడా తిరిగి అలోచించవలసివస్తుందని బాబాతో అన్నారు. అప్పుడు బాబా "హే భావూ! నువ్వు సరిగ్గా యేమి చూశావో చెప్పు" అన్నారు. మా నాన్నగారికి యింకా బాగా గుర్తుంతుండటం వల్ల జరిగినదంతా పూస గుచ్చినట్లు చెప్పారు. ఆయన బాబాతో అన్నారు "మీరు ఆ భయంకరంగా ఉన్నామెతో ఏదో గొణుగుతున్నారు. కాని నేను స్ప్రుహ లేకుండా ఉండటంతో నేనేమీ వినలేక పోయాను."
బాబా సమాథానం చెప్పారు " ఏయ్ ! బావూ! నువ్వు చెబుతున్న ఆ భయంకరంగా ఉన్నామె అమ్మవారు తప్ప మరెవరూ కాదు. ఆవిడ నీ ప్రాణాన్ని అడుగుతోంది. నేను తిరస్కరిస్తున్నాను. ఆమె వెళ్ళిపోవడానికి నిరాకరిస్తోంది. నేనప్పుడామెతో కావాలంటే మరొక అయిదు మందిని తీసుకుని వెళ్ళు, నేను నా భావూనివ్వను" అన్నాను. ఆఖరికి ఆవిడ విరమించుకుని ద్వారకామాయిని వదలి వెళ్ళిపోయింది. బాబా యింకా చెప్పడం మొదలు పెట్టారు, "భావూ, గుర్తుంచుకో నువ్వు చావడానికి నిన్ను నేను షిరిడీకి రప్పించను. నువ్వు నా పాదాల వద్ద ఉన్నపుడు యెవరూ కూడా నిన్ను నా వద్దనుంచి లాక్కుని వెళ్ళలేరు."
మా నాన్నగారికది పునర్జన్మ అనిపించింది. ఆయన బాబా పాదాల మీద పడి, తనకటువంటి భయానక దృశ్యాలను చూపించవద్దని, తట్టుకోవడం తన శక్తికి మించిన పని అని మరొకసారి అర్థించారు. మా నాన్నగారు ఆ సంఘటన గురించి వివరించినపుడెల్లా, ఆ భయంకర దృశ్యాన్ని గుర్తు చెసుకున్నపుడు రాత్రి ఆయనకి నిద్ర పట్టేది కాదు.
ప్రియమైన సాయి భక్తులారా, ఈ ఉపాఖ్యానాన్ని చదివిన తరువాత మీకుకొన్ని అనుమానాలు కలుగుతాయని నాకు బాగా తెలుసు. మీ అనుమానాలను నివృత్తి చేసుకోవాలనుకుంటున్నారనీ నాకు తెలుసు. కాని ముందరే నేను చెప్పినట్లు మీరు నమ్మండి. షిరిడీ సాయిబాబా భగవంతుని అవతారం తప్ప మరేమీ కాదు. అందుచేత ఆయనకి మానవాతీత శక్తులున్నాయి. అవసరమయినపుడు భక్తులను రక్షించడానికి వాటినాయన ఉపయోగిస్తూఉంటారు. అటువంటి ప్రాణ భిక్ష పెట్టబడిన అనుభవాలు కలిగినవారు యెంతోమంది ఉండవచ్చని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. దుష్ట శక్తులనుంచి తన భక్తులను రక్షించడం తన ముఖ్య కర్తవ్యమని బాబా చెబుతూ ఉండేవారు.
ఆయన మానాన్నగారితో "భావూ ! షిరిడీనుంచి నేను నా భౌతిక దేహాన్ని విడిచిన తరువాత, షిరిడీకి ప్రజలు చీమల బారులా వస్తారు. యింకా గుర్తుంచుకో ఈ ద్వారకామాయినుంచి మాటలాడేటప్పుడు నేను అసత్యం పలుకను".
ప్రియమైన పాఠకులారా ఈ 21 వ.శతాబ్దంలో షిరిడీలో ఏమి జరిగిందన్నది మనమంతా చూస్తున్నాము, అనుభూతి చెందుతున్నాము, ఈ ప్రపంచం అంతమయేంత వరకు యిదిలా జరుగుతూనే ఉంటుందని నాకు తెలుసు.
సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.
0 comments:
Post a Comment