

19.09.2011 సోమవారము
ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
గత రెండు రోజులుగా కొన్ని స్వంత పనుల వల్ల ప్రచురించడానికి వీలు చిక్కలేదు. ఈ రోజు బాబాతో సాయి.బా.ని.స. అనుభవాలలో 9 వ అనుభవాన్ని మీకి అందిస్తున్నాను.
బాబాతో సాయి బా.ని.స. అనుభవాలు 9
బాబా తన భక్తులకిచ్చిన హామీల గురించి 'సాయి సచ్చరిత్ర 15 వ అధ్యాయం లో ప్రముఖంగా చెప్పబడింది. ఒక్కసారి కనక యెవరినైనా బాబా తన భక్తునిగా స్వీకరిస్తే, అతను సప్త సముద్రాల అవతల యెక్కడ ఉన్నా సరే, బాబా ఆ భక్తునివెంట నీడలా నిరంతరం అనుసరిస్తూ ఉంటారు. ఒకసాయి భక్తునిగా నేనీ విషయాన్నిబలపరుస్తూ, నా జీవితం లో జరిగిన ఒక సంఘటనను మీకు తెలియపరుస్తున్నాను.
నా విదేశ యాత్రమొదటి అనుభవంలో దక్షిణ కొరియా ప్రయాణం గురించి వివరించాను. దానిని మరొక్కసారి తిరిగి గుర్తుకు తెచ్చుకుందాము. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ సంఘటన దానికి అనుబంధం. 06.05.1991 చాంగ్వాన్ పట్టణములోని హొటలు గదిలోకి ప్రవేశించగానె ఒక పెద్ద పరిమాణంలో ఉన్నకందిరీగ ఒకటి నాచుట్టూ రెండు సార్లు ప్రదక్షి ణాలు చేసి గదిద్వారమునుండి బయటికి వెళ్ళిపోయింది. నేను సియోల్ నుండి పుసాన్ పట్టణానికి విమానములో ప్రయాణిస్తూ "బాబా నేను చాంగ్వాన్ పట్టణానికి చేరే సమయానికి నాకంటె ముందుగా నీవక్కడకు చేరుకుని నాకు దర్శనమివ్వగలవా" అని బాబాని కోరాను. ఇప్పుడు ఈ గది తలుపు తెరవగానే నా చుట్టూ రెండు ప్రదక్షిణాలు చేసి గది ద్వారముగుండా బయటకు వెళ్ళిన కందిరీగ, బాబా కాదు కదా అని ఆలోచించాను. ఇదంతా నా భ్రమ అని భావించాను. ఈ విషయము ఒక సాధారణ వ్యక్తికి హాస్యాస్పదముగా అనిపించవచ్చును. సాయి భక్తులకి మాత్రము ఇందులోనిజం ఉన్నదని గ్రహించగలరు. సాయి సచ్చరిత్ర 46 వ అధ్యాయంలో యిటువంటి సంఘటన వివరింపబడింది. నానా సాహెబ్ చందోర్కర్, కాకా సాహెబ్ దీక్షిత్ బాబాను తమతోపాటు నాగపూరు, గ్వాలి యర్, గయ పట్టణాలకి రమ్మని కోరినప్పుడు బాబా అన్న మాటలను (46 వ అధ్యాయం 379 పేజీ) ఒక్కసారి గుర్తు చేసుకుందాము. "నా తరఫున మీరు శ్యామాను మీతో తీసుకుని వెళ్ళండి. కాశీ ప్రయాగ యాత్రలు ముగియుసరికి నేను శ్యామాకంటే ముందుగానే అతనిని గయలో కలుసుకుంటాను. " ఈ మాటలను గుర్తుంచుకొనవలయును. ఏలనన అవి బాబా సర్వవ్యాపి అని నిరూపించును.
చాంగ్వాన్ పట్టణములో నా ఆఫీసు వ్యవహారలన్నిటినీ ముగించుకుని 16.05.1991 నాడు తిరిగి భారత దేశానికి వచ్చే ప్రయత్నంలో ఉన్నాను. 16.05.1991 తెల్లవారుజామున 5 గంటలకు నేను కాకడ ఆరతి చదవడం పూర్తి అయిన తరువాత నేను చాంగ్వాన్ పట్టణములో హొటలు గదిలో ప్రవేసించిన సమయములో (ఆరోజున 06.05.1991) నా చుట్టూ ప్రదక్షిణాలు చేసిన కందిరీగ తిరిగి మరలా కాకడ ఆరతి పూర్తయినవెంటనే నాచుట్టూ రెండు ప్రదక్షిణాలు చేసి కిటికీ ద్వారా బయటికి వెళ్ళిపోయింది. ఈ సంఘటనకు నేను నిశ్చేస్టుడినయ్యాను. ఆనాడు శ్రీ సాయి గయలోని పాండా యింటిలో సాయి పటము రూపములో శ్యామాకు దర్శనమిచ్చి తనన్న మాటలను ఋజువు చేసుకున్నారు. చాంగ్వాన్ పట్టణము హొటలు గదిలో నా కంటె ముందుగా శ్రీ సాయి కందిరీగ రూపములో వచ్చి తిరిగి నాకంటె ముందుగా 16.05.1991 నాడు యిండియాకు బయలుదేరారని గట్టి నమ్మకమేర్పడింది. శ్రీ సాయి అన్ని జీవులలోనూ ఉన్నారనే మాటలు నాలో ప్రతిధ్వనించాయి. సాయి సర్వ వ్యాపి అని నిరూపించుకున్నారు.
సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు
0 comments:
Post a Comment