శరణాగతి - బాబా పాదాల వద్ద
30.04.2012
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బందువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ రోజు మరొక బాబా లీలను తెలుసుకుందాము. ఈ అనుభవం జర్మనీలోని స్వాతి గారిది. బాబామీద మనకున్న నమ్మకమే మనలనందరినీ ముందుకు నడిపిస్తుంది. ఆ నమ్మకం మనకి గొప్ప ధైర్యాన్నిస్తుంది.బా ఏరూపంలో వచ్చినా ముందర మనం గుర్తించలేము. తరువాత అనుకుంటాము, అయ్యో వచ్చినది బాబాయేనేమో అని. ముందర మన మనసుని మాయ కప్పివేస్తుంది. అందుచేత నిరంతరం మన మనసులో బాబా నామస్మరణే చేస్తూ ఉంటే మనకంతా సాయిమయంగానే కనపడుతుంది.
ఈరోజు జర్మనీనుంచి స్వాతిగారి బాబా అనుభవాన్ని తెలుసుకుందాము.
ఇది నాకు ఈమధ్యనే జరిగిన అనుభవం. నేను ప్రతీ గురువారమునాడు బాబా గుడికి వెడుతూ ఉంటాను. ఒకసారి గుడికి వెళ్ళేముందు నా స్నేహితురాలు నాకు ఫోన్ చేసి తనకు కూడా బాబా ప్రసాదం తీసుకురమ్మని చెప్పింది. నాకు కనక ప్రసాదం ఇస్తే నీకు కూడా తెస్తానని చెప్పాను. నేనిక్కడ జర్మనీలో ఉంటున్నాను. ఇక్కడ గుడిలోని పూజారిగారు బాబాకు తను తయారుచేసిన ప్రసాదం, స్వీట్లు, పళ్ళు, యింకా భక్తులు తెచ్చి సమర్పించేవి అన్ని నైవేద్యంగా పెడుతూ ఉంటారు. ఆరతి అయినతరువాత భక్తులందరూ ప్రసాదం అక్కడే తినేస్తారు, అందుచేత ఎవరూ కూడా ప్రసాదం ఇంటికి పట్టుకుని వెళ్ళే సమస్యే లేదు. నేను గుడికి వెళ్ళినతరువాత నా స్నేహితురాలు చెప్పిన విషయాన్ని పూర్తిగా మర్చిపోయాను. భజన కార్యక్రమంలో పూర్తిగా లీనమయిపోయాను.
ఆరతికి ముందు పూజారిగారు బాబాకి ప్రసాదాన్ని నైవేద్యం పెట్టారు. ఒక తల్లి తన బిడ్డకు ఎలాగయితే ఆహారాన్ని తినిపిస్తుందో, అంతే భక్తితోను, ప్రేమతోను ఆయన బాబాకి ప్రసాదం పెట్టారు. ఆయన బాబా విగ్రహానికి భుజాల చుట్టూ చిన్న తువాలును కట్టి, బాబా నోటివద్ద ప్రసాదన్ని పెట్టారు. మీరు బాబాకి ప్రత్యేకంగా తయారుచేసినదానిని అలా సమర్పించినపుడు ఒక విధమైన ఆధ్యాత్మిక భావం కలుగుతుంది. నిజంగా బాబా ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారనే భావం మనలో కలుగుతుంది. నేను బాబాకి బొప్పాయి పండును తీసుకువచ్చాను. దానిని పూజారిగారు బాబా పాదపద్మాల వద్ద ఉంచారు. ప్రసాదాన్ని నైవేద్యంగా పెడుతున్నపుడు గుడిలో హనుమాన్ చాలీసా పెట్టారు, అందరూ కూడా దానితో పాటే గొంతులు కలిపి పాడటం మొదలుపెట్టారు. నివేదన చేస్తున్నపుడు పూజారిగారు ఎవరికీ కూడా ప్రసాదాన్ని ఇవ్వడం నేనెప్పుడూ చూడలేదు. అందుచేత నేను కళ్ళు మూసుకుని హనుమాన్ చాలీసా పాడటంలో నిమగ్నమైపోయి అందులోని ఆనందాన్ని అనుభవిస్తున్నాను. ఈలోగా పూజారిగారు ఒక ఆపిల్ పండును బాబాకి నైవేద్యంగా పెట్టినప్పుడు, బాబా ఆ పండుని కొంచెం కొరికి తిని తరువాత నాకు ఇవ్వకూడదా అనే ఆలోచన నామనసులో కలిగింది. తరువాత నాకు నేనే ఎంత తెలివితక్కువదానిని అని అనుకున్నాను. అది సాధ్యం కాదనుకుని మరలా హనుమాన్ చాలీసాని ఏకాగ్రతతో పాడటం ప్రారంభించాను.
హటాత్తుగా నా ప్రక్కన కూర్చున్నామె నా కాలిమీద తట్టి, పూజారిగారు ఇచ్చే ప్రసాదం తీసుకోమని చెప్పింది. పూజారిగారు ఆపిల్ పండును బాబాకు నైవేద్యంగా పెట్టిన తరువాత నాకు ఇస్తున్నారని నాకు తెలీలేదు. నాకు నా భర్తకి కళ్ళంబట నీళ్ళు వచ్చాయి. బాబాగారు మమ్మల్ని అనుగ్రహించారు.
మేము యింటికి వచ్చేటప్పటికి రాత్రి చాలా పొద్దుపోయింది, అందుకని ఆపిల్ ని మర్నాడు ఉదయం తిందామనుకున్నాము. ఆపిల్ ని కోస్తున్నపుడు నా స్నేహితురాలు ప్రసాదం అడిగిన విషయం గుర్తుకు వచ్చింది. ఆ ఆపిల్ మనకే కాదు ఆమెకి కూడా అని నా భర్త అన్నారు. బాబా ప్రసాదం గురించి నా స్నేహితురాలి కోరిక నిజమైన కోరిక. అందుకనే బాబాగారు మాద్వారా ప్రసాదాన్ని ఆమెకు పంపించారు. ఆపిల్ పండులో కొంత ఆమెకి ఇచ్చి మొత్తం జరిగినదంతా వివరించాను. బాబా తనను అలా అనుగ్రహించినందుకు నా స్నేహితురాలు చాలా సంతోషించింది. తాను సర్వాంతర్యామినని బాబ సత్ చరిత్రలో చెప్పారు. ఆయన చెప్పిన మాట అక్షారాల సత్యమనిపించింది నాకు. ఆయన సర్వజ్ఞుడు, సర్వాంతర్యామి. ఆయనకన్నీ తెలుసు, ఆయన మనకోరికలను తీరుస్తారు. మనం చేయవలసినదల్లా ఆయన పాదాలముందు శరణాగతి చేయడమే. తరువాత మనకేది చేయాలో ఆయనే చూసుకుంటారు. నాకిప్పుడు జీవితంలో పెద్ద కష్ఠం ఎదురయింది. చిన్నవాడయిన మా అబ్బాయికి వంట్లో బాగుండలేదు. కాని బాబా నాతోనే ఉన్నారన్న విషయం నాకు తెలుసు. అంతా ఆయనే చూసుకుంటారు. బాబా నాతోనే ఉన్నపుడు నేను దేని గురించీ ఆందోళనపడనవసరం లేదు. ఆయనే నాతండ్రి. మాయోగక్షేమాలు ఆయనే చూసుకుంటారు. ఓం సాయిరాం.
ఈరోజు నాకింకొక అనుభవం జరిగింది. మా అబ్బాయికి ఒంట్లో నలతగా ఉండటంవల్ల తల్లిగా నాకు చాలా దిగులుగా ఉంది. అది సహజం. చెడు ఆలోచనలను పారద్రోలడం కోసం ప్రతిరోజు చేసే పూజల తరువాత, యూ ట్యూబ్ లో సాయి సచ్చరిత్రను పెట్టాను. ఆ చరిత్ర శ్రవణం నాకు ధైర్యాన్నిస్తుంది. పొద్దున్న అంతా కూడా బాబాని గురించే ఆలోచిస్తూ కూర్చున్నాను. మధ్యాహ్న్నం మాయింటి తలుపునెవరో కొట్టారు. మా అబ్బాయి తలుపుతీయడానికి వెంటనే పరిగుత్తుకుని వెళ్ళాడు. ముందర వచ్చినదెవరో కనుక్కోమని చెప్పాను. ఎవరదీ అని అడిగాడు మా అబ్బాయి. వచ్చినతను ఒక జర్మన్ సేల్స్ మన్. మీ అమ్మగారు ఉన్నారా అని అడిగాడు మా అబ్బాయిని. నేను మా అబ్బాయి వెనకాలే నుంచున్నాను. నేను ఏదో మాట్లాడేలోపే, అతను ఇలా అన్నాడు, "బాబా ఉన్నారు". నాకు పాపా ఉన్నారా అన్నట్లుగా వినపడింది. అతను పాపా అన్నాడేమో అనుకున్నాను. నేను దాని గురించి పట్టించుకోలేదు. అతనింకా నన్ను ఏదో అడిగాడుగానీ, నేను ఏదీ తీసుకోలేదు. అప్పుడతను మరేమీ ఫరవాలేదులెండి, నో ప్రోబ్లెం , ఓం సాయిరాం అన్నాడు. అతను ఓం సాయిరాం అనగానే నేను కొంచెం షాక్ కి గురయ్యాను. నేను కూడా అతనికి ఓం సాయిరాం అని సమాధానం చెప్పాను, అతను ముందుకు వెళ్ళిపోయాడు. నేనింకా ఆ షాక్ లో ఉండే తలుపు వేశేశాను. అప్పుడు ప్రవేశ ద్వారానికి ఎదురుగా గోడమీద బాబా పటాన్ని చూశాను. బహుశా అతను బాబా ఫోటోని చూసి ఉండవచ్చు. అందుచేతనే అతను బాబా ఉన్నారు అని అన్నాడు. కానీ నాకు మరొకలా వినపడింది. నేను అర్ధం చేసుకోలేకపోయాను. నేను, మా అబ్బాయి యింట్లో ఒంటరిగా ఉండటంతో, ఆ వచ్చినతనికి బాబా ఎలా తెలుసాని అడగనందుకు నేను చాలా బాధపడ్డాను. అతని ద్వారా బాబా తను ఉన్నానని చెప్పారు. నేను నీవద్దనే ఉన్నాను, ప్రతీచోటా ఉన్నాను చింతించకు అని బాబా చెప్పినట్లుగా అనిపించింది నాకు. మనం ఆయనకు సర్వశ్య శరణాగతి చేస్తే సర్వం సాయిమయంగానే కనపడుతుంది అన్నది సత్యం.
లేకపోతే, ఒక జర్మనీ దేశస్థుడు వచ్చి తలుపు కొట్టడమేమిటి, బాబా ఉన్నారు అని చెప్పి ఓం సాయిరాం అనడమేమిటి. అదంతా కూడా బాబా ఏర్పాటు. ఆయనకంతా తెలుసు. ఆయనెప్పుడు మన యోగక్షేమాలు చూస్తూఉంటారు. బాబా! నన్నెపుడు ఒంటరిగా వదలద్దు, ఇదే నా వినమ్రమై న అభ్యర్ధన. నన్ను నీదివ్య చరణాల వద్దనే ఉండనీ. నాతప్పులనీ, అహంకారాన్నీ క్షమించు. నన్ను నీఅధీనంలోకి తీసుకో.
ఓం సాయిరాం.
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు
0 comments:
Post a Comment