సాయి.బా.ని.స. డైరీ - 1998 (07)
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయిబంధువులకు బాబావారి శుభాశీస్సులు
02.04.1998
నిన్న రాత్రి శ్రీసాయి నాచిన్ననాటి స్నేహితుని రూపములో దర్శనము ఇచ్చి అన్నమాటలు.
1) నేడు విద్యాలయాలలో పరీక్షా అధికారులు తమ బాధ్యతలను విస్మరించి ధన సంపాదన కోసము అమ్ముడుపోయి విద్యాప్రమాణాలను దిగజార్చుతున్నారు.
2) ధన సంపాదన కోసము పురుషులు స్త్రీలను హీనాతి హీనముగా వాడుకొనుచున్నారు. ఈనాడు సమాజము స్త్రీకి ఇవ్వవలసిన కనీస గౌరవము వారికి ఇవ్వడములేదు. నీవు అటువంటివారినుండి దూరముగా జీవించు.
3) ధన సంపాదన విషయములో బురదలో కాలు వేసినపుడు ఆధన సంపాదన సంగతి భగవంతుడికి తెలుసు. కాని, ఆబురద సంగతి నీచుట్టుప్రక్కలవారికి తెలుస్తుంది. నీజీవితములో అశాంతిని ప్రసాదించుతుంది.
04.04.1998
శ్రీసాయి నిన్నరాత్రి నేను చదివిన కాలేజీలోని లెక్చరర్ రూపములో దర్శనము ఇచ్చి అన్నమాటలు.
1) నీవు ఉద్యోగములో యుండగా అహంకారముతో జీవించగలవు. మంది మార్బలముతో సుఖజీవితాన్ని పొందగలవు. కాని, నీవు ఉద్యోగమునుండి విరమణ చేసిన తర్వాత మంది మార్బలము యుండదు. కాని, ఇంకా అహంకారము మిగిలి యుంటుంది. అదే అహంకారము నీవారిని నీనుండి దూరము చేస్తుంది. ఆఖరికి నీవు హీనాతిహీనంగా నీజీవిత ఆఖరి దశ గడిపి ఈలోకమునుండి నిష్క్రమించుతావు.
2) ఎదుటివానిలో మిరపకాయల గుణములు ఉన్నాయి అని తెలిసికూడ, నీవు మంచితనము అనే పాలును అతనికి పోసిన ఆపాలు మట్టిలో పోసిన పాలుతో సమానము.
అందుచేత నీవు నీలోని మంచితనాన్ని అర్హత ఉన్నవారికి మాత్రమే పంచిపెట్టు. దుష్ఠులకు ఎల్లపుడు దూరంగా జీవించు.
07.04.1998
నిన్న రాత్రి శ్రీసాయి ఒక అజ్ఞాత వ్యక్తి రూపములో దర్శనము ఇచ్చి అన్నమాటలు.
1) చీకటిలో బయటకు వెళ్ళి ప్రమాదాలు కొనితెచ్చుకొనేకన్నా నీజీవితములోని చీకటిని తొలగించమని రాత్రివేళలో ఆభగవంతుని ధ్యానించటము మేలు కదా.
2) నీవు పదిమంది దగ్గరకు వెళ్ళి కరచాలనము చేసి అందరి దృష్ఠిలో పడటముకన్నా, నీదగ్గరకు వచ్చినవారితో నీవు కరచాలనము చేస్తు వారి ప్రేమను నీవు పొందగలగటము మిన్న.
3) ఇతర గురువులు మంచినీతి వాక్యాలను చెప్పిన వినటములో తప్పులేదు. నీకు కావలసిన మంచి, నీగురువు ఒక్కడికే తెలుసును కాబట్టి నీగురువు నిన్ను నడిపించే మంచి మార్గములో పయనించుతూ జీవితములో మంచిని అనుభవించు.
4) జీవిత ప్రయాణములో నీకు ప్రశాంతత కలిగించేది విష్ణుసహస్ర నామము, మరియు ఓంకార స్మరణ.
వాటిని సదా ఉచ్చరించుతు ఉండు.
(ఇంకా ఉంది)
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు
0 comments:
Post a Comment