08.09.2012 శనివారము
ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ రోజు శ్రీమతి ప్రియాంకా రౌతేలాగారి బ్లాగులో నుండి బాబా గారు ఒక భక్తునికి విష్ణుసహస్ర నామం చదవమని చెప్పిన బాబా అనుభవాన్ని ప్రచురిస్తున్నాను. బహుశా ఈ అనుభవం ఆయన ఆగస్టు నెలకు ముందే పంపిఉండవచ్చు.
ఈ సందర్భంగా సాయి బంధువులందరికీ , బాబా శ్యామాకు విష్ణుషస్రనామం చదవమని చెప్పిన ఉందంతాన్ని , శ్రీ ఎక్కిరాల భరద్వాజగారు వ్రాసిన "శ్రీ సాయి లీలామృతము" లోని కొంత భాగాన్ని ఇక్కడ పొందుపరచడం తగిన విధంగా ఉంటుందనిపించి, ఆ భాగాన్ని కూడా మీకు అందిస్తున్నాను. బాబా అంతటి సద్గురువే చెప్పినపుడు మనం కూడా ఆచరించూదాము . ఈరోజునుండే విష్ణుసహస్రనామ పారాయణ కనీసం రోజుకొక్క శ్లోకమైనా అర్ధంతో సహా చదవడానికి ప్రయత్నిద్దాము.
శ్రీమతి ఎం.ఎస్. సుబ్బలక్ష్మి గానం చేసిన శ్రీ విష్ణుసహస్రనాం లింక్ కూడా ఇస్తున్నాను. వినండి.
http://www.youtube.com/watch?v=5NkfF3ZVCIo
నిత్య సంతోషిని గానం చేసిన అన్నమాచార్య కీర్తన కూడా వినండి.
http://www.youtube.com/watch?v=HWVz-UFKbiY
" శిరిడీలో ఒక రామదాసి రోజూ స్నానం చేసి మశీదులో విష్ణుసహస్ర నామ పారాయణ చేసేవాడు. బాబా ఒకరోజు తమకు కడుపు నొప్పిగా ఉందని, బజారునుండి 'సోనాముఖీ అనే మూలిక తెమ్మని అతనిని పంపారు. అతడు వెళ్ళగానే, బాబా అతని విష్ణు సహస్రనామం పుస్తకం శ్యామాకిచ్చి "యిదెంతో శక్తివంతమైనది. ఒకప్పుడు నాకు గుండెదడ వచ్చి, మరణం తప్పదనిపించింది. అపుడు దీనిని హృదయానికి హత్తుకోగానే, భగవంతుడే దిగివచ్చి వ్యాధి తగ్గించినట్లనిపించింది. యిది తీసుకొని రోజుకొక్క నామమైనా భావయుక్తంగా నెమ్మదిగా చదువు. ఎంతో మేలు చేస్తుంది" అన్నారు.
****
షిరిడీ సాయి విష్ణుసహస్రనామం చదవమని చెప్పుట.
సాయి భక్తుని స్వీయానుభవం
భక్తుల స్వీయ అనుభవాలను ప్రచురించడానికి మరలా సమయం వచ్చింది. ఆ అనుభవం మనకు మన సద్గురు సాయినాధ్ మీద ఉన్న నమ్మకాన్ని మరింతగా ధృఢ పరుస్తుంది. మనలని నడిపించే గురువు ఆయనే. అంతమాత్రం చేత నీ బాధ్యతలన్నిటినీ ఆయనే వహిస్తారని కాదు. నీకు ఒక గురువు ఉన్నంత మాత్రాన నీ లక్ష్యం నెరవేరినట్లు కాదు. నీ గురువు ఆశీర్వాదములు నీకు లభించాలంటే నీవు చేయవలసిన కర్మ కూడా నువ్వు చేయాలి.
నేనిప్పుడు ఉదాహరణతో
చెపుతాను (ఇది ప్రత్యేకంగా బాబా తమని ప్రేమించడంలేదు, తమ ప్రార్ధనలని వినిపించుకోవటంలేదు అనుకునే సాయి భక్తుల
కోసం).
సాయికి, భక్తునికి మధ్య ఉన్న అనుబంధం, తోటమాలికి, తోటలోని
మొక్కలమీద ఉన్న పుష్పాల మధ్య ఉన్న సంబంధంలాంటిది. తోటమాలి పుష్పాలను సృష్టించడు.
అతను వాటికి సరిగా నీరు పోసి, తగినంతగా ఎండ,నీడ ఉండేలాగ చూస్తాడు. పూలమొక్కలలోనుంచి పువ్వులు
తమంతతాముగా వస్తాయి. అప్పుడే తోటమాలి పాత్ర ప్రారంభమవుతుంది.
ఏ తోటమాలి కూడా మొగ్గ
వికసిస్తుందనే గ్యారంటీ ఇవ్వలేడు. అది తనంత తానుగా మొక్కలోనించి పుట్టి
వికసించాలి. అలాగే గురువుకూడా. మనలోని అహంకారం
ఎప్పుడయితే పోతుందో అప్పుడే మనకు గురువుయొక్క రక్షణ ఆశీర్వాదములు లభిస్తాయి .
ఎప్పుడయితే మీలోని అహంకారం తొలగిపోతుదో మీకు గురువుతో (సాయి) తొ బంధం ఏర్పడుతుంది.
ఇక ఈ రోజు ప్రచురింపబోయే
ఒక సాయి భక్తుని వాస్తవమైన బాబా అనుభవాన్ని చదవండి.
సాయి సోదరుడు తన పేరును
వెల్లడించడానికి ఇష్టపడలేదు. కాని ఈ
అనుభవాన్ని చదివి మీరు కూడా బాబావారి
ప్రేమానుభూతులని పొందండి. ఈ అనుభవాన్ని మనకందించిన మన తోటి సాయి సోదరునికి
కృతజ్ఞతలు.
నాతో సహా మా కుటుంబమంతా
దశాబ్దాలనించీ బాబాని పూజిస్తూ ఆయన దయని పొందుతున్నాము. 2011 వ. సంవత్సరములో అమెరికాలో ప్రముఖ యూనివర్సిటీలో చదువుతున్న
మా అమ్మాయికి బాబా దయవల్ల ఎన్నో కాంపస్ జాబ్ యింటర్వూలు వచ్చాయి. కాని ఎందుకనో
విచిత్రంగా, గ్రహస్థితి బాగుండక
కావచ్చు, బాగా చేసినా గాని 10 యింటర్వ్యూలలో కూడా సెలెక్ట్ అవలేదు. తనకి నమ్మకం
సడలిపోయింది. కాని తల్లిడండ్రులుగా మేము
మా అమ్మాయికి ఉద్యోగం వచ్చేలా చేయమని బాబాని ప్రార్ధించాము.
అమెరికాలో ఇంటర్నేషనల్
విధ్యార్ధికి ఉద్యోగం రావాలంటే కాంపస్ యింటర్వ్యూలు ఒక్కటే మంచి అవకాశమని నాకు తెలుసు.
ప్రతీరోజు సాయి సత్ చరిత్ర ఒక అధ్యాయం చదవడమే కాదు, సాయి వ్రతాన్ని కూడా మొదలుపెట్టాను.
ఇక అక్టోబరు 29 న ప్రారంభమవబోయే యింటర్వ్యూ తప్ప మిగిలిన అన్నిటిలోనూ
అపజయమే ఎదురైంది. ఆఖరిగా యింటర్వ్యూకి హాజరయే కంపెనీ ప్రపంచంలోనే ఉత్తమమైన
కంపెనీ. ఇందులో పోటీ చాలా ఎక్కువగా
ఉంటుంది. సహజంగా ఈ యింటర్వ్యూ తట్టుకోవడం
చాలా కష్టం. కాలేజీలో చదివే ఉత్తమమైన, తెలివిగల విద్యార్ధులంతా కూడా ఎప్పుడూ ఈ కంపెనీలోనే ఉద్యోగం చేయడానికి
పోటీపడుతూ ఉంటారు. అందుచేత ఏమీచేయలేని నిస్సహాయ స్థితిలో నాకు చాలా అందోళనగా ఉంది.
బాబా పై నా ప్రార్ధనలని ఇంకా ఢృఢతరం చేశాను. ధైర్యంగా యింటర్వ్యూకి వెళ్ళమని మా
అమ్మాయికి ప్రోత్సాహాన్నిచ్చాను.
వ్రతం మధ్యలో ఉండగా
యింటర్వ్యూ మొదలవడానికి కొద్ది రోజుల ముందు బాబా స్వప్నం ద్వారా నన్ను ప్రతీరోజూ
విష్ణుసహస్ర నామం చదవమని సూచించారు.
నేను నా అలమారలో
ఆధ్యాత్మిక పుస్తాకాలన్నిటిని కావలసినప్పుడు తీసుకోవడానికి వీలుగా ఒక క్రమ
పధ్ధతిలో పెట్టుకున్నాను. వీటిలో
విష్ణుసహస్రనామం పుస్తకం ఉందని నాకు గుర్తు. కాని ఒక గంటసేపు వెదికినా కూడా నాకా
పుస్తకం కనపడకపోవడంతో ఆశ్చర్యం వేసింది, ఏమయింది పుస్తకం అని. నాకుచాలా నిరాశ కలిగింది.
అమెరికా వెళ్ళి అక్కడ రెండునెలలు ఉండి తిరిగి
వచ్చేటప్పుడు మా అమ్మాయిని శీతాకాలం శెలవులకు యిండియాకు తీసుకురావడానికి, అక్టోబరు, 29, 2011 న బెంగుళూరు
మీదుగా నేను అమెరికాకు బయలుదేరే రోజు. ఆరోజే మా అమ్మాయికి
యింటర్వ్యూ కూడా జరగబోతోంది.
ఇంతకుముందు చెప్పినట్లుగా
మా అమ్మాయి అదేరోజు నేనింతకుముందు వివరించిన కంపెనీలో యింటర్వ్యూకి ముందు జరగబోయే
స్క్రీనింగ్ టెస్ట్ కి తయారవుతోంది. నేను అమెరికాకు వెళ్ళే సమయం లోనే మా అమ్మాయికియింటర్వ్యూ జరిగే రోజు . నేను చాలా
అస్థిమితంగా ఉన్నాను. అట్లాంటిక్ మీదుగా అమెరికాకి చాలా సేపు విమాన ప్రయాణం చేస్తున్నంతసేపు నామనసును నా అధీనంలో ఉంచుకోవాలి.
బెంగళూరు స్టేషన్లో రైలు
ఎక్కడానికి సాయత్రం 5 గంటలకు టాక్సి యింటి
దగ్గరకు వచ్చింది. వెళ్ళేముందు పూజా గదిలోకి వెళ్ళి బాబాకు నమస్కరించాను. నుదిటిమీద ఊదీ పెట్టుకుందామని, అలమారలో ఉన్న బాక్స్ తీద్దామని వెళ్ళాను. ఆశ్చర్యంగా నా దృష్టి అలమారులో ఉన్న
రెండుపుస్తకాల మీద పడ్డాయి. నా చేతులు
సరిగా అందులో ఉన్న ఒకపుస్తకం మీద పడ్డాయి.
అది నేను వెతుకుతున్న నా మాతృభాష తమిళంలో ఉన్న విష్ణు సహస్రనామం పుస్తకం. బాబా
తనే స్వయంగా, సరైన సమయంలో నాకా పుస్తకాన్నిచ్చి ఆశీర్వదించారనిపించింది.
నాలో ప్రేమ భక్తి ఉప్పొంగాయి. బాబా మీద నా నమ్మకం మరింతగా ఢృఢపడింది. ఇక మా
అమ్మాయి యింటర్వ్యూ అంతా అనుకూలంగానే అవుతుందనే ఆశ కలిగింది. క్రితం క్షణంలో
జరిగిన సంఘటన తలచుకున్నపుడు, అలా కనక జరిగిఉండకపోతే, నాకా పుస్తకం దొరికి
ఉండేది కాదు. నేను నిరాశతోను, విచారంతోను,
కొంత అపనమ్మకంతో అమెరికాకి వెళ్ళవలసి వచ్చేది.
రైలులో ఆనందంగా విష్ణుసహస్రనామం చదువుకోవడం మొదలుపెట్టాను. మరునాడు బెంగళురులోను, సాయంత్రం విమానంలో కూడా చదవడం కొనసాగించాను. ఈ సమయంలో మా అమ్మాయికి యింటర్వ్యూలో మూడు స్టేజెస్ అయాయి. కానీ ప్రతీసారి, తను ఇంతకుముందు చేసిన వాటికన్న చాలా ఘోరంగా ఈసారి చేసానని మరలా తరువాత స్టేజికి అవకాశం ఉండదేమో అనుకుంది . కాని బాబా ద్వారా నా అంతరాత్మ ఆమెకంతా దివ్యంగా జరుగుతుందని చెపుతూనే ఉంది.
మా అమ్మాయి అన్ని
స్టేజెస్ లోను విజయం సాధించడం ఒక అద్భుతం.
ఇది ముమ్మటికీ నిజం. కంపేనీవారు తరువాత మరొక రెండు స్టేజెస్ ను జనవరి 2012 దాకా కొనసాగించారు. బాబా ఆమెపక్కన ఉన్నారు. తనకి బాగా
నమ్మకం కుదిరింది. ఆఖరికి ఉద్యోగానికి
ఎంపిక కాబడ్డ ముగ్గురిలో మా అమ్మాయికుడా ఉంది విష్ణుసహస్రనామం చదువున్నంత సేపు,
నాకు సంస్కృత భాష రాని కారణంగా దాని అర్ధం తెలియకపోవడంతో చాలా
అస్సంతృప్తిగా ఉండేది. బాబా అధ్బుతంగా ఈ సమస్యను తీర్చారు. యిండియాకి డిసెంబరు, 2011 లో తిరిగి వస్తున్నపుడు, నాకు కలలో, చనిపోయిన నా తండ్రిగారు కనిపించి విష్ణుసహస్రనామం
చదవమని చెప్పారు. మానాన్నగారు సేకరించి ఉంచిన ఆధ్యాత్మిక పుస్తకాలని వెతకడానికి
నాకెందుకు ప్రేరణ కలిగిందో నాకిప్పటికీ తెలీదు.
తన తరువాత తన పిల్లలు చదువుతారనే ఉద్దేశ్యం అయివుందవచ్చు. ఆయనమీద గౌరవంతోను, నాకు కూడా ఆధ్యాత్మిక పుస్తకాలమీద పెరుగుతున్న
ఆసక్తి కారణంగా కొన్నిపుస్తకాలను ఉంచాను. ఆరోజు నాకెందుకనో ఆపుస్తకాలను
వెతకాలనిపించింది. వెతకగానే, స్వామి
చిన్మయానంద గారు ఆంగ్ల భాషలో వ్రాసిన విష్ణుసహస్రనామం కనిపించింది.
పుస్తకం తెరవగానే పుస్తకం లోపల మానాన్నగారి పాతఫొటో నలుపు తెలుపులలో ఉన్నది కనపడటంతో నాకు ఆనందాశ్చర్యాలు కలిగాయి. ఇది కేవలం కాకతాళీయంగా జరిగిన సంఘటన అని అనుకోవడానికి లేదు.
పుస్తకం తెరవగానే పుస్తకం లోపల మానాన్నగారి పాతఫొటో నలుపు తెలుపులలో ఉన్నది కనపడటంతో నాకు ఆనందాశ్చర్యాలు కలిగాయి. ఇది కేవలం కాకతాళీయంగా జరిగిన సంఘటన అని అనుకోవడానికి లేదు.
నా అనుభవాన్ని ఇంతటితో
ముగిస్తూ తీర్పును పాఠకుల కే వదలివేస్తున్నాను.
ప్రతిరోజు
విష్ణుసహస్రనామం చదివిన తరువాత, ఒక శ్లోకానికి
ఆంగ్లంలో అర్ధాన్ని, చాలా మెల్లగా
చదువుతూ దానిలోని భావాన్ని అర్ధం
చేసుకుంటూ ఉంటాను . అలా చేయడంలో నేనెంతో
ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాను.
మా అమ్మాయి ఈ సంవత్సరం
ఆగస్ట్ మొదటివారంలో ఉద్యోగం లో ప్రవేశిస్తుంది. మా అమ్మాయి తన ఉద్యోగ ధర్మాన్ని సక్రమంగా నిర్వర్తించేలా చూడమని, ఆమెకు జీవితంలో
అన్ని విధాలా సహాయపడుతూ ఉండమని బాబాని వినమ్రంగా ప్రార్ధిస్తున్నాను.
ఓం సాయిరాం
సర్వం శ్రీ సాయినాదార్పణమస్తు
0 comments:
Post a Comment