Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Tuesday, October 23, 2012

సగుణ్ మేరు నాయక్

Posted by tyagaraju on 5:42 PM

                                             
                                                
 24.10.2012  బుధవారము
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీశ్శులు
విజయదశమి శుభాకాంక్షలు



ఈ రోజు శ్రీ సాయిబాబాగారు పంపిన సగుణమేరు నాయక్ గురించి తెలుసుకుందాము.  సగుణ మేరునాయక్ గురించిన ప్రస్తావన మనకు శ్రీసాయి సత్ చరిత్రలో కనపడుతుంది.  సగుణ హొటల్ నడిపేవాడు అని మాత్రమే మనకందరకూ తెలుసు.  సగుణగురించిన మరింత సమాచారాన్ని మనము ఈ రోజు తెలుసుకుందాము. 

శ్రీ చాగంటి సాయిబాబావారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. 


            సాయి బోధనల నిలువెత్తు చిత్రం - సగుణ్ మేరు నాయక్

బోధనలకు నిలువెత్తు వుదాహరణగా చెప్పవలసిన సగుణ మేరు నాయక్ గురించి తెలిసుకునే చిన్న ప్రయత్నమిది. 2001 లో వెలువడిన సాయి సాగర్ దీపావళి ప్రత్యేక సంచిక నుండి షిరిడి లో వుంటున్న శ్రీమతి విన్నీ చిట్లూరి సేకరించి ప్రచురించిన ఆంగ్ల పుస్తకం “బాబా’స్ వాణి” నుండి తెలుగు పాఠకుల కోసం అనువదించబడింది (అనువాదం లో తప్పొప్పులకు అనువాదకునిదే సంపూర్ణమైన భాద్యత, మూలకర్తది ఎంతమాత్రం కాదు అని పాఠకులు దయయుంచి గమనించగలరు).




                              

సగుణ్ గొప్ప ధనవంతుడు. ఆయన మార్మగోవా నివాసి, అక్కడ ఆయనకు ఇల్లూ, భూములూ, పొలాలూ, పశువులూ వున్నాయి. పశువుల్ని ప్రతి రోజూ మేతకి తీసుకొని వెళ్ళడం, దగ్గరలోని నీటిగుంట లో నీరు త్రాగించడం సగుణ్ కి అలవాటు. అలా ఒకరోజు తన పశువుల మందని మేత కి తీసుకొని వెళ్ళినప్పుడు సగుణ్ తలకి గుడ్డ చుట్టుకుని కఫ్నీని ధరించి మర్రిచెట్టు కింద కూర్చుని వున్న ఒక ఫకీరు ని చూసాడు. సగుణ్ ఆ ఫకీరు ని చూస్తూ వున్నప్పుడు, ఆయన తన కళ్ళతో సగుణ్ ని దగ్గరకు రమ్మని సైగ చేసారు. సగుణ్ ఆ సైగ ని అర్ధం చేసికోలేక పోవడమే కాదు, అది మామూలు సైగ కాదు,ఆ ఫకీరు తనకు దృష్టి పాతం ప్రసాదించారని కూడా తెలిసికోలేక పోయాడు. దృష్టిపాతం అంటే కళ్ళద్వారా దివ్య శక్తిని ప్రసారం చేయడం. అప్పటి నుండి సగుణ్ కి ప్రాపంచిక విషయాలమీద ఆసక్తి నశించింది.

దక్షిణాదిన వున్న గాణుగాపూర్, పండరిపురం మరియూ నర్సోబావాడి వంటి అన్ని పుణ్యక్షేత్రాలనీ దర్శించుకున్నాడు. నర్సోబావాడి లో సుమారుగా నాలుగు నెలలు వున్నాడు. శ్రీ సాయి సఛ్ఛరిత్ర యాభై ఒకటవ అధ్యాయం లో టెంబె స్వామి గా ప్రస్తావించబడిన శ్రీ వాసుదేవానంద సరస్వతి వారిని కలిసాడు. వారు సగుణ్ తో "నువ్వు పెద్ద ఇంటి కి చెందిన వాడివి’ అన్నారు. ఇక్కడ వారు ఉపయోగించిన ’పెద్ద’ అను పదం షిరిడి సాయిబాబా ని వుద్దేశించి అన్నది. 

అక్కడనుండి సగుణ్ హైదరాబాద్ కి దక్షిణం వైపుగా వెళ్ళాడు, కానీ ఆయన సన్యాసి రూపం వలన పోలీసులు పీడించారు. ఆయన ప్రమాదకరమైన వ్యక్తికాదని గుర్తించిన తర్వాత పోలీసులు ఆయనకు వసతి, భోజనం ఏర్పాట్లు చేసారు. చివరికి సగుణ్ షిరిడి కి చేరుకున్నాడు. 

ఒకరోజు ధనవంతుడయిన ఒక పెద్దమనిషి షిరిడీకి వచ్చినప్పుడు, సగుణ్ ఆయన వెంట వెళ్ళడం తటస్థించింది. వారు ఇరువురూ దర్శనానికి వెళ్ళినప్పుడు, బాబా లెండిబాగ్ నుండి తిరిగి వస్తున్నారు. చాలామంది భక్తులు బాబా దర్శనానికి యెదురుచూస్తూవున్నారు, సగుణ్ కూడా అక్కడే నిల్చున్నాడు, కొద్ది దూరంలో. బాబా వస్తూనే సగుణ్ ని సరాసరి చూసారు, వెనువెంటనే సగుణ్ ని కన్నడ భాషలో ఈ విధంగా మూడు ప్రశ్నలు అడిగారు:

1 నువ్వు ఎందుకు వచ్చావు?

2 నువ్వు ఏమి చేయబోతున్నావు?

3 ఎక్కడకు వెళ్ళబోతున్నావు?

ఈ ప్రశ్నలు సగుణ్ పై అపారమైన ప్రభావం చూపాయి, వాటి ప్రాముఖ్యతను సగుణ్ తప్ప ఎవరూ తెలిసికోలేక పోయారు. అప్పటికప్పుడే సగుణ్ ఇక షిరిడి వదలి వెళ్ళరాదని నిర్ణయించుకున్నాడు.

ఆకలి ఎవరినీ వదలదు, సగుణ్ కి ఇది అనుభవైకవైద్యం, అందువలన ఆయన షిరిడిలో వున్నంతకాలం ఎన్నో వ్యాపారాలు చేసారు, ఆయన చేసిన వ్యాపార వివరాలు తెలిసికోవడంకన్నా అప్పటి బాబా పలుకులూ మరియూ ఆశీస్సుల గురించి తెలిసికునేప్రయత్నం చేద్దాం. సగుణ్ ద్వారకామాయి ఎదురుగా టీ మరియు తినుబండారాలనమ్మే ఒక దుకాణం తెరిచాడు. దుకాణం తెరిచేరోజు సగుణ్ ఒక లడ్డూ మరియూ కొంచెం చివ్ డా (మరాఠి వంటకం) ఓ పళ్ళెం లో వేసి బాబా కి సమర్పించాడు. బాబా కొంత రుచి చూసి “బాగుంది. ఖాళీగా కూర్చోకుండా ఏదో ఒక పని చేస్తూనే వుండాలి. చింతపడకు, నేను నీ దుకాణంలోనే వుం(న్నా)టాను” అని సగుణ్ ని ఆశీర్వదించారు.

షిరిడీకి భక్తులు రావడం ఎక్కువ కావడంతో, సగుణ్ ’భోజనావళి’ (భోజన హొటల్) ని ప్రారంభించాడు. బాబా కి ప్రసాదం భోగం గా సమర్పించడం సగుణ్ ఎప్పుడూ మర్చిపోలేదు. సగుణ్ దయాగుణం ఎంతటిదంటే షిరిడీలో ఎవరూ ఆకలితో బాధ పడకుండా చూసాడు. దారిని పోయే వాడయినా, సాధువయినా, బిక్షగాడయినా, లక్షాధికారయినా సగుణ్ వారికి భోజనం పెట్టేవాడు. బాబా ఒకసారి సగుణ్ తో “భుకేల్యా జీవాచీ భుక్ జాణావి! రిక్తహస్తె దారాతూన్ కుణాలా పాఠవూ నయే!” (ఇతరుల ఆకలిని నీ  ఆకలిగా భావించుకో, ఎవరినీ రిక్తహస్తాలతో నీ గుమ్మం ముందునుండి పంపవద్దు).
“శ్రీ సాయి సఛ్ఛరిత”  గ్రంధంగా వెలువడినపుడు, ఆ గ్రంధాలను తన దుకాణం లో వుంచి అమ్మేవాడు సగుణ్. చివరికి షోలాపూర్ కి చెందిన ఫొటొగ్రాఫర్ నుండి బాబా ఫొటో ప్రింట్ లు సంపాదించి ఫ్రేం కట్టించి అమ్మేవాడు.

సగుణ్ మేరు నాయక్ సుమారుగా 1908 లో షిరిడీకి వచ్చాడు, 56 సంవత్సరాలపాటు ఒకే ఇంట్లో నివశించాడు. ఆయన జీవిత కాలంలో ఏరోజూ బాబాకి నైవేద్యం తీసికుని రాకుండావుండలేదు. బాబా మహాసమాధి చెందిన తర్వాతకూడా ద్వారకామాయికి నైవెద్యం ప్రతిరోజూ తీసికుని వస్తూనేవుండేవాడు. కేవలం ఉపాహారం (ఉదయపు ఆహారం) వదిలి పెట్టేవాడు.

బాబా సగుణ్ ని ’టక్కీ’ (మోసగాడు) అని పిలిచేవారు, అయితే ఈ అద్భుతమైన భక్తుడ్ని అలా ఎందుకు పిలిచేవారో బాబాకే తెలియాలి. బాబా మహాసమాధి తర్వాత కూడా సగుణ్ విష్ణుదేవుని పూజని కొనసాగించాడు.  బాబా ఎందరో భక్తులకు ఎంతో డబ్బుని ఇచ్చేవారు, కానీ సగుణ్ కి ఎప్పుడూ ఎమీ ఇవ్వలేదు, సగుణ్ ఎన్నడూ ఫిర్యాదూ చేయలేదు, బాబా ని ఎప్పుడూ ఎందుకు తనకి డబ్బు ఇవ్వడం లేదని అడగనూలేదు. సగుణ్ ది నిష్కామ సేవ (ప్రతిఫలాపేక్షలేని సేవ).

తనకి విపత్తులెదురయినప్పుడు కూడా సగుణ్ “మంచైనా, చెడైనా అది బాబా నిర్ణయం” అనేవాడు. బాబా బోధనాపద్దతిలోని శ్రద్ద కి సగుణ్ ప్రత్యక్ష్య వుదాహరణ.

బాబా బోధనలు:

1. దేనినీ ఆశించకు; ఎవరినుండీ ఏమీ ఆశించకు.

2. వున్నదానితో తృప్తి పడు.

3. నీ శక్తికొలదీ ఇతరులకు సహాయపడు.

4. ఇతరులకి సహాయపడిన తర్వాత ప్రతిఫలాన్ని కానీ, బహుమానాన్ని కానీ ఆశించకు.

5. ఇతరుల ఆకలిని నీ ఆకలి గా భావించి, వారికి ఆహారం అందించు.

6. నీ గుమ్మం నుండి ఎవరినీ ఉత్తి చేతులతో పంపవద్దు.

బాబా మహసమాధి తర్వాత ఒకసారి సగుణ్ చాలా జబ్బుపడ్డాడు, మరణం అంచుకి చేరుకున్నాడు. షిరిడీ గ్రామస్తులు ఎంతో వ్యాకులపడ్డారు, ఆయన కి నయమవుతుందని అనుకోలేదు. కానీ ఇంతటి విపత్కర పరిస్థితి లో కూడా సగుణ్ కి బాబా పట్ల వున్న విశ్వాసం అణువంతయినా తగ్గలేదు. సగుణ్ కోలుకుని, నడవగల్గిన స్థితి కి వచ్చినప్పుడు, సరాసరి ద్వారకామాయి లోపలికి వెళ్ళి కంటినిండుగా నీటి తో బాబా చిత్రపటం ముందు నిలబడి, “నాధా, దేవా, నాకోసం ఎంతటి బాధని అనుభవించావు, నా బాధల్ని నువ్వుస్వీకరించి ఎన్ని కష్టాలు పడ్డావు” అని బిగ్గరగా ఏడ్చాడు. సగుణ్ దుఖాన్ని చూసిన వారందరికీ కళ్ళ నీళ్ళు తిరిగాయి. సగుణ్ తన 85 వ ఏట షిరిడీలో సమాధి చెందారు, దురదృష్టవశాత్తూ సగుణ్ మేరు నాయక్ సమాధి షిరిడి లో నిర్మించబడలేదు.

ఒకసారి సగుణ్ కి తన తల్లిగారిని చూడాలని అపరిమితమైన కోరిక కలుగడం తో బాబా అనుమతి కోసం వెళ్ళినప్పుడు బాబా “నీ తల్లీ, తండ్రీ ఇతరులు అందరూ ఇక్కడే వున్నారు. అరే, టకియా నేను నీ ఇంటికి వెళ్ళినప్పుడు మీ తల్లి గారు నాకు ’శిడా’ (ధాన్యం, పచ్చికూరగాయలు) ఇచ్చారు” అని చెప్పారు. వెంటనే సగుణ్ కి తన గ్రామం లో మర్రి చెట్టు క్రింద దర్శనమిచ్చిన ఫకీరు మరియూ బాబా ఒక్కరే అన్న స్పృహ కలిగింది.

చివరికి బాబాలో ఐక్యమైన ఈ అద్భుతమైన భక్తుని సంక్షిప్త చరిత్ర ఇది.

సి.సాయిబాబా
లవ్ సాయి; లివ్ ఇన్ సాయి,
సాయి దయాల్ విహార్, 6-3-72, బాలి చక్ సాహి,
ఖుర్దారోడ్, పోస్ట్: జట్ని – 752050, ఖుర్దా జిల్లా, ఒడిషా.
9178265499, 9658939740, 8763114011, 8270077374. 

csaibaba@gmail.com, csai@saimail.com.


రేపు నానాసాహెబ్ నిమోన్ కర్ గురించి తెలుసుకుందాము.



(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)

Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List