05.12.2012 బుధవారము
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీసాయితో మధుర క్షణాలు - 11
పేరు చెప్పడానికిష్టపడని భక్తుడు చెప్పిన లీల - 6
ముందుగా శ్రీవిష్ణుసహస్రనామం 14వ.శ్లోకం, తాత్పర్యము
శ్లోకం: సర్వగస్సర్వ విద్భానుర్విష్వక్సేనో జనార్ధనః
వేదో వేదవిద్వ్యంగో వేదాంగో వేదవిత్కవిః ||
తాత్పర్యము: పరమాత్మను అంతట వ్యాంపించియుండు వానిగా, సమస్తమును తెలిసినవానిగా కిరణములను వెలుగు తానేయైన వానిగా, విశ్వమందలి సేనలకు నాయకునిగా, జీవులను కాలముగా తనలోనికి స్వీకరించువానిగా, జ్ఞానము తెలియు వాడుగను, వేదాంగములు తానే యగుటచే అంగలోపము లేనివానిగ పురాణములను కల్పించు కవిగ, మరియు అందలి పరమార్ధము తెలియబడువానిగను ధ్యానము చేయుము.
శ్రీసాయితో మధుర క్షణాలు - 11
ఒకసారి ఒకానొక సందర్భంలో షిరిడీలో నివసిస్తున్న నానావలి అనే సన్యాసి, బాబాగారు ఉన్న కాలంలో రోడ్డుమీద నిలబడి బాబాని చాలా అగౌరవంగా నిందించసాగాడు. బాబా అప్పుడు ఒక కార్యం మీద ద్వారకామాయినించి బయటకు వెళ్ళి అప్పుడే తిరిగి వస్తున్నారు. ఆయన భక్తులు బాబా గురించి చాలా చెడుగా, అవమానకరంగా నిందిస్తున్న నానావలిని దుడ్డుకఱ్ఱతో విచక్షణా రహితంగా బాదుతూ ఉండటం, అప్పుడే అక్కడకు చేరుకున్న బాబా చూడటం జరిగింది. బాబా కొద్ది దూరంలో నిలబడి తనకు చాలా బాధగా ఉన్నదని చెప్పారు. కొంత మంది భక్తులు ఏమిటి మీబాధ అని అడిగారు. బాబా నానావలి వైపు చూపిస్తూ పాపం, ఆ అమాయక సాధువుని మీరెందుకని కొడుతున్నారని అడిగారు. మీరతనిని కొడుతూండటం వల్ల నావీపు మీద నొప్పి కలుగుతున్నది అన్నారు బాబా.
అప్పుడు వారు నానావలిపై తాము చేసిన పనికి సిగ్గుపడి అతనిని బాధించడం మానుకొన్నారు. నానావలి తనను చెడుగా మాట్లాడినా బాధపడకుండా, నానావలి ఆ శిక్షకు అర్హుడయినప్పటికీ అతనిని తాను కాపాడవలసినదేనన్న బాబా నిర్ణయం, బాబాయొక్క గొప్పతనాన్ని చాటి చెప్పే సంఘటనలలో ఇది ఒకటి.
ఇక ముగించేముందుగా పేరు చెప్పని ఆ భక్తుడు ఈ అనుభవాలను చెప్పడానికి గల ఒకే ఒక అంశం ఏమిటంటే, ఎవరికయితే నిరాశా నిస్పృహలు ఉంటాయో, వారికి బుధ్ధి చెప్పటానికి, షిరిడీ బాబా మీద పరిపూర్ణమయిన విశ్వాసం కలిగి ఉండమని, వారికి తప్పకుండ ఉపశమనం కలుగుతుందని ఇస్తున్న హామీ అని చెప్పటానికే ఈ అంశం.
నేను భగవంతుని ప్రార్ధించేదేమిటంటే మహదీ బువా , నరసిం హస్వామీజీ, కమరుద్దీన్ బాబా లేక అబ్దుల్ బాబా గాని, మరెవరయినా గాని, ఆయన భక్తుడు ఎవరయినా గాని, నాస్నేహితులకు, నాకు , సహాయం చేసినట్లుగానే వారికి కూడా ఇదే విధమయిన సహాయాన్నందించమన్నదే నా ఒకే ఒక ప్రార్ధన.
మరికొన్ని మధుర క్షణాలు.....
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment